బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

221 - సదాచార వర్ణనమ్‌

ఇట్లు గృహస్థు దేవతలను పితృ దేవతలను హవ్య కవ్యముల చేతను అతిథులను బంధువులను భూతములను నౌకరులను పశు పక్ష్యాదులను జీమలను బిచ్చగాండ్రను సన్యాసులను యాచకులను బాటసారులను సదాచార వంతులను అన్నాద్యాహారములచే పానీయములచే బూజించి నిత్య ములయిన సంధ్యావంద నాదులను నైమిత్తికము లయిన యా యా పర్వాదులందు విహితము లైన క్రియలను నిర్వర్తించి తీర వలెను. వీని నతిక్రమించిన యెడల పాప మనుభవించును. అన మునులిట్లనిరి.

ఓ విప్రుడా! నీవలన నిత్యము నైమిత్తకము కామ్యము (ఏదేని కోరిక సఫలము కావలెనని చేయు కర్మ) అను త్రివిధమైన పురుష కర్తవ్యము (కర్మను) తెలిసి కొన్నాము. ఇక సదాచార మనగా నేమో ఇహ మందు బరమందు మానవు డాచరించి సుఖపడు దానిని గురించి వినగోరు చున్నామన మునులకు వ్యాసుండిట్లనియె.

గృహస్థు నిరంతరమును అచార రక్షణము సేసికొన వలెను. ఆచార హీనుని కిహపరము లందు క్షేమము లేదు. సదాచారము నుల్లంఘించి ప్రవర్తించు వానికి యజ్ఞదాన తపస్సులు సుఖ మీయవు. దురాచారుడు ఇక్కడ పూర్ణా యుర్దాయము పొందడు. సదాచార సంపన్న మైన ధర్మమును జేయ వలెను. అట్టి ఆచారము యొక్క లక్షణము స్వరూపమును దెల్పెద వినుండు. తానేకాగ్ర మనస్కుడై దానిని పరిపాలింప వలెను. (నిర్వహింప వలె నన్నమాట) గృహస్థు త్రి వర్గమును (ధర్మ అర్ధ కామములను పురుషార్థము లను) సాధించు ప్రయత్నము సేయ వలెను. అది సిద్ధించిన యెడల ఇహపర సిద్ధియు గల్గును. ఈ త్రివర్గ మందు నాల్గవ భాగమేని జరిపిన పరలోక శ్రేయస్సు చేకూర్చును. సగము నిర్వర్తించిన చోదన్ను దాను భరించు కొన గల వాడగును. నిత్య నైమిత్తికముల జేయ గల్గును. నాల్గవ వంతు సదాచారస మాచరణమున ధర్మమూలమును వృద్ధి గావింప గలడు. ఈ ధర్మా చరణముచే అర్ధము సిద్ధించును. అట్లే పాపమును నిషేధించుటకు దెలిసిన వాడు ధర్మ మాచరింప నగును. పరమందర్ధము దాని తరువాతిది కామము ఫలప్రదము లగుటకు వాని నిహ మందనుష్ఠింప వలయును. ప్రత్యవాయ భయముతో (పొరపాటుగ జేసిన పాపము వచ్చునను భయముతో) కామము గాని మఱి యే పురుషార్థమునకు విరుద్ధము గాకుండను (రెండు విధములు గాను) గావించిన కామ పురుషార్థము గూడ త్రివర్గ సాధన మందు విరోధకరము గాదు. ఈ పురుషార్థము నొకదాని నొకటి యనుబంధింప బడునవిగా నున్నవా? విపరీతాను బంధములుగా నున్నవా? అను విషయము తెలిసికొన వలయును. ధర్మము ధర్మాను బంధియైన అర్ధమును బాధింపని ధర్మము అట్లే ధర్మార్దాను బంధియైన కామము ఆ రెండిటిని బాధింపని కామము దానిచే (కొమముచే) బాధింప బడని ధర్మార్థములును ఆత్మ బాధకములు గావు. అనగా దనకు కృతార్ధతను గల్గించి తీరునన్న మాట. పురుషార్థము లొకదాని కొకటి యనుబంధ పడి పరస్పర విరుద్ధములు గాకుండ జాగరూకుడై చేసిన యెడల మానవుడు అన్నింటి ఫలమును బూర్తిగ పొందునని భావము.

బ్రాహ్మ ముహూర్తమున (తెల్లవారు జాము) మేలుకొని తా నానాడు సేయ వలసిన ధర్మము అర్థము నను పురుషార్థ సాధనను గురించి యాలోచన సేయ వలెను. అటుపై లేచి యాచమము నేసి స్నానము చేసి నియమ వంతుడై శుచియై సంధ్యా వందనమును నక్షత్రము లుండగా నొనరింప వలెను. సాయం సంధ్యను సూర్యుడుండగా గావింప వలెను. ఈ సంధ్యో పాసనను ఆపద యేమియు లేనప్పుడు తప్పక సేసితీర వలసినది. చెడ్డ ప్రేలాపనను అనృతమును పరుష భాషణమును వదల వలెను. అట్లే ఆసచ్ఛాస్త్రమును (నాస్తికాది మతములను) అసద్వాద మును (దుష్ట నాదము) అసత్సెవను (అధర్మ పరుల సేవించుటను) మాన వలెను. నియమ వంతుడై సాయం ప్రాతః కాల మందు హోమము సేయ వలెను. సూర్యుని యుద యాస్తమయములను జూడరాదు. తల దువ్వు కొనుట అద్దము చూచుట దంత ధావనము కాటుక వెట్టు కొనుటయు పూర్వాహ్ణ మందే చేయ వలెను. దేవ తర్పణము కూడ నప్పుడే కావింప నగును. గ్రామములు ఇండ్లు తీర్థములు క్షేత్రములు నను వానికేగు దారు లందు దున్నిన పొలములో గోశాల లందు విణ్మూత్రములు సేయ రాదు. దిగంబరమై యున్న పరస్త్రీని తన పురీషమును జూడరాదు. బహిష్ఠ మైన స్త్రీని చూచుట తాకుట పలకరించుట గూడదు! నీళ్ళలో మూత్ర పురీషములు సేయుట మైధునము పనికి రాదు. మూత్ర పురీషములు వెంట్రుకలు బూడిద పొల్లు బొగ్గులు తెగి పోయిన త్రాళ్ళు గుడ్డ పీలికలు దారిలో పడియున్న చింపి గుడ్డలు మొదలగు వానిని ద్రొక్కరాదు.

పితృదేవ మనుష్యులను భూతములను అర్చించి అటుపై గృహ యజమాని భోజనము సేయ వలెను. తూర్పు ఉత్తరము దిశల వైపున కున్ముఖుడై ఆచమనముసేసి మౌన మూని శుచియై మనసుం దాను దిను నాహారము వైపు నిలిపి మోకాళ్ళ లోపల చేయి యుంచి భోనము సేయ వలెను. తెలిసిన వాడు చెడిన యన్న మొక్కటి తప్ప మఱి యే యన్న దోషము లను తెలుప రాదు. కేవల లవణము తినరాదు. ఉచ్ఛిష్టాన్నమును (ఎంగిలిని) విడిచి పెట్ట వలెను. నడుచుచు లేక నిలువ బడి మూత్ర పురీషములు విడువ రాదు. ఎంగిలి నే కొంచము తినరాదు. ఎంగిలి నోటితో మాటలాడ రాదు. వేదము చెప్ప గూడదు. సూర్య చంద్ర నక్షత్రములను బుద్ధి పూర్వకముగ జూడరాదు. విరిగిన ఆసనము మంచము పగిలిన పాత్రమును వాడు కొనరాదు. పెద్దలు వచ్చి నపుడు తాను లేచి నిలువ బడుట యెదు రేగుట మొదలగు సత్కారములు చేసి యాసనము (పీట కుర్చీ చాప మొద లయినవి) వేయ వలెను. అనుకూలముగ సంభాషణము సేయ వలెను. వారు వెడలి చను నపుడు కొంత దూరము వెంబడింప వలెను. ప్రతికూలముగ సంచరింప రాదు. ఒంటి గుడ్డతో భోజనము దేవతార్చనము బ్రాహ్మణా హ్వానము అగ్ని యందు హోమము సేయరాదు. నగ్నుడై (దిన్పమొలతో దిగంబరియై) స్నానము సేయరాదు. పండు కొనరాదు. రెండు చేతుల తోను నెత్తిని గోకు కొనరాదు. నిష్కారణముగ మాటి మాటికి తలనిండ స్నానము సేయ రాదు. శిరః స్నానము చేసి తైలముతో అంగ స్పర్శ చేయ రాదు. అనధ్యయన దినములం దన్నిట వేదా ధ్యయనము మాన వలెను. బ్రాహ్మణులను అగ్నిని గోవులను సూర్యుని ఎన్నడు నవమానింప రాదు.

పగలు ఉత్తరాభి ముఖముగను రాత్రి దక్షిణాభి ముఖముగను సంకట సమయము లందు యదేష్టముగను మూత్ర పురీషోత్సర్జన మొనరింప నగును. గురువు తప్పును జెప్పరాదు. ఆయన కోపించిన యెడ బ్రతిమాలి క్షమాపణ సెప్పికొని ప్రసన్నునిం జేసికొన వలెను. ఇతరులు చేయు నపవాదమును వినరాదు. బ్రాహ్మణులకు రాజునకు దుఃఖా తురునికి విద్యాధికునికి గర్భిణికి రోగికి పూజ్యునకు మూగ గ్రుడ్డి చెవుటి వాండ్రకు మత్తెక్కిన వానికి ఉన్మత్తునికి దారి యిచ్చి తొలగి నడువ వలెను. దేవాలయమును చైత్య వృక్షమును (ఆలయాది పుణ్య స్థానము లందు నాటించిన పుణ్య వృక్షము రావి మొదలయిన వానిని) నాల్గు దారులు గలిగిన కూడలిని ప్రదక్షిణము సేసి వెళ్ల వలయును. అప్రదక్షిణముగా బోరాదన్న మాట. ఇంకొకడు వాడిన చెప్పులు బట్టలు పూల మాలలు మొదలయిన వానిని దాను ధరింప రాదు. చతుర్దిశి అష్టమి పూర్ణిమ పర్వములు నయిన నాడభ్యంగము స్త్రీ సంభోగము గూడదు. బాహువులు పిక్కలు పైకెత్తి నిలుచుండ రాదు. పాదము లిట్టట్టు నాడింవ రాదు. ఒక కాలితో నింకొక కాలు త్రొక్కరాదు. జారిణిని తప్పు జరిగి పోయిన తరువాత బాలుని జాతి భ్రష్టుని మర్మాఘాత ముగ దిట్టుటను దెప్పి పోవుటను (సాధించుటను) మాన వలెను. వివేకి డాంభికత్వము (డంబములు పలుకుట) నేనే ఘనుడనను దురభిమానము తీక్షణ త్వమును జూపరాదు. మూర్ఖులను పిచ్చి వాండ్రను వ్యసనములలో నుండు వారిని (కష్టము లలో నున్న వారిని) విరూపులను అంగ వైకల్యము గల వారిని నిర్ధనులను బరిహసించి కించ పఱుప రాదు శిష్యులను పుత్రులను శిక్షించుట కింకొకని చేతికి దండమును (కఱ్ఱను)ఈయ రాదు. కాలితో నాసనము దగ్గరగా నీడ్చికొని దానిపై కూర్చుండ రాదు. తనకు దాను దినుటకు సంయావము గోధుమ పిండితో చేయు కృశరము (పులగము) మాంసమును సేకరింప రాదు. సాయం ప్రాతః కాలములం దతిథులను బూజించి భుజింప వలెను. తూర్పు ఉత్తరము మొగమై మౌనియై పండ్లు తోముకొన వలెను. నిషిద్ధము లయిన దంత కాష్ఠములను వాడరాదు. ఉత్తర దిశగా పడమరగా తలపెట్టి పండుకొనరాదు. దక్షిణ దిశగా గాని తలపెట్టి పండు కొనవలెను. పరిమ ళోదకములతో నిద్ర పోరాదు. ఉషఃకాల మందు నిదురింప రాదు. గ్రహణము నందు విడుపు స్నానము రాత్రియే చేయవలెను. విడుపు కాగానే రాత్రియే చేయవలెను గాని మరునాడు పగలు చేయ రాదని యర్థము. ఉప్పును దినరాదు. నిలువ యున్నది తడియారి నది పాసినదియు నగు నన్నము తినరాదు. పిండి కూరలు చెఱకు పాలు అను వాని యొక్కయు మాంసము యొక్కయు వికారములు అనగా వాని వానితో దయారైన పదార్థములను చిరకాలము నిలువ యున్న వైనను దిన వచ్చును. సూర్యోద యాస్తమయ కాలము లందు పండు కొనరాదు. స్నానము చేయక కూర్చుండక మనస్సు నిలుపక మంచము మీద వట్టి నేలమీద కూర్చుండి చప్పుడు చేయుచు లేక మాట లాడుచు బోజనము సేయ రాదు. సేవకులకు పెట్టకుండ తినరాదు. సాయం ప్రాతః కాలము లందు స్నానము సేసి భోజనము సేయ నగును. పరదార సంగము కూడదు. ఆ దోషము ఇష్టా పూర్తముల వలన గల్గు ఫలమును ఆయుర్దాయ మును నాశము సేయును. ఇష్ట మనగా యజ్ఞము, వాపీ కూప తటాకాది నిర్మాణము సత్రము పెట్టుట గోడ కట్టించుట తోటలు వేయించుట మొదలయిన ధర్మ కార్యములు పూర్తములు పరదారగ మనమంత ఆయుర్దాయమును హరించు తప్పిదము మఱి యొకటి లేదు.

ఆచమనము చేసియే దేవాగ్ని పితృ కార్యములు గురు వందనము భోజనమును జేయ వలెను. ఆచనమున కుపయోగించు జలము నురుగు వాసన లేనివిగా నుండవలెను. చప్పుడు కాగూడదు. తూర్పుగ ఉత్తరముగ దిరిగి యాచమనము సేయవలెను. నీళ్ళ నుండి తీసినది ఇంటిపెరటిలో నున్నది పుట్ట లోనిది ఎలుక కలుగులోని శౌచక్రియ యందు పయోగింపగా మిగిలినది యునుగా నీయైదు విధముల మన్ను శౌచవిధి కుపయోగింప రాదు. కాలు సేతులు గడిగికొని వానిని ప్రోక్షణము సేసికొని స్థిర మనస్కుడై మూడు సార్లు గాని నాల్గుసార్లు గాని యాచమనము సేసి రెండుసార్లు పెదవులను దుడిచి కొని యింద్రియము లను రెండుసార్లు స్పృశించి శుచియై సంధ్యా వందనాది క్రియలను జేయ వలెను. తుమ్మునందు నాకుట యందు అపాన వాయువు నందు ఉమ్మి వేయుట మొదలగు పనులందు ఆచమనము సేయ వలెను. అంటరాని వాని నంటినపుడు సూర్య దర్శనము సేయ వలెను. మఱియు కుడిచెవి స్పృశింప వలెను. ఈ చెవిని స్పృశించుట యింతకు మున్ను చెప్పిన ఆచమన సూర్య దర్శనముల కవకాశము లేప్పుడే. మున్ను చెప్పినది యున్నప్పుడు తరువాత జెప్పిన పనులు సమ్మతములు గావు. పండ్లు కొఱుక రాదు. తన దేహమును గ్రుద్దు కొనరాదు. పండుకొ న్నపుడు దారి నడచు నపుడు భుజించు నపుడు స్వాధ్యాయము పనికి రాదు. సంధ్య లందు మైథునము ప్రయాణమును జేయ గూడదు. అపరాహ్ణమున (కుతపకాల మందు) పగటి కాలమును మూడు భాగములు సేయగా మూడవ భాగమున పితృ తర్పణము సేయవలెను. దేవ పితృ కార్యముల ముందు శిరఃస్నానము సేయ నగును. తూర్పు ఉత్తర దిశమొగమై క్షురకర్మ చేయించు కొనవలెను. వికలాంగిని వివాహ మాడరాదు. ఉత్తమ కులమున బుట్టినది రోగములు లేనిది యగు కన్యను బెండ్లాడ వలెను. తండ్రి వైపున నేడవ తరము దానిని తల్లి వైపున నైదవ తరము దానిని మాత్రమే స్వీకరింప నగును. భార్యను సత్ప్రవృత్తివ యందు బెట్ట వచ్చును. శిక్షణయీయ వచ్చును గాని యీర్ష్య పనికిరాదు. పగటి యందు నిద్రా మైథునములు గూడవు. ఇతరులకు తాపము గల్గించు పని జంతు పీడయు సేయరాదు.

ముట్టయిన స్త్రీని అన్ని వర్ణముల వారు నాల్గు రాత్రులు వెలుపల నుంచ వలెను. అయిదవ రోజు కూడ దూరముగ నుంచినచో నామెకు మఱి స్త్రీ జన్మము రాదు. ఆఱవ రాత్రి యామెను బొంద వచ్చును. మఱియు జ్యేష్ఠ యుగ్మాసు అనగా ఋతు దినము లయిన మొదటి పదియారు దినములలో సరిరాత్రు లందు బొంద నగును. సరిరాత్రు లందు గూడిన పుత్రులు బేసి రాత్రులందు గూడిన ఆడు పిల్లలు గల్గుదురు. పర్వదినము లందు బొందిన నధర్మ పరులు సంధ్యాకాల మందు గూడిన నపుంసకులు పుట్టుదురు. రిక్తాతిథి క్షురకర్మ నిషిద్ధము. వినయము లేని వాండ్రేదేని చెప్పుచుండ నది వినరాదు. నీచున కున్నత స్థాన మీయరాదు. క్షురకర్మ సేసి కొన్నపుడు, స్త్రీ సంభోగా నంతరము, సంతకు వెళ్ళి నపుడు సచేల స్నానము చేయ వలెను. దేవతలను వేదములను ద్విజులను సాధువులు సత్య వంతులు మహాత్ములు నైన వారిని గురువును పతివ్రతలను బ్రహ్మ యజ్ఞములు తపస్సు సేయు వారిని దూషించుట (అప్రతిష్ఠ పాలు చేయుట) పరిహసించటము కూడదు.

అచ్చపు తెలుపు వస్త్రములను దెల్లని పువ్వులను దాల్చి ఎపుడును మాంగల్య వేషియై శుభ వేషము గొన్నవాడై యుండ వలెను. అట్టి వాని కమంగళములు గల్గవు. తల బిరుసు గలవారితో ఉన్మత్తులతో మూఢులతో వినయ హీనులతో నీచ శీలురలో వయస్సుచే జాతిచే దూషితు లైన వారితో డబ్బు దుబారా చేయు వాండ్రతో శత్రువులతో కార్య దక్షులుగాని వారితో నింద్యులతో జారులతో జేరిన వాండ్రతో నిరు పేదలతో వాద పరులతో మఱి పెక్కు తెఱగు లయధములతో చెలిమి సేయరాదు.

మిత్రుడు దీక్షితుడు (యజ్ఞము సేసిన వాడు) భూపాలుడు స్నాతకుడు (గురుకుల మందు విద్య పూర్తి సేసిన వాడు) మామగారు అనువారితో గూడ తానును వేచి వారు వచ్చి నపుడు ప్రత్యుత్దానము చేసి యాసన పాద్యాదులీయ వలెను. వీరు తన యింటికి వచ్చి నపుడు తన కున్నంతలో (యథా విభవ ముగ) లోటు సేయకుండ పూజింప వలెను. ప్రతి సంవత్స రోషితాన్‌ = సంవత్సరమున కొకసారి వచ్చి యున్న వారిని అనగా ఆబ్దికము నందు యథా స్థానముగ అనగా వైశ్వే దేవ స్థానము పితృ స్థానము అనువాని యందర్చన సేయ వలెను. అవ్వల అగ్నికి ప్రజా పతికి గృహ దేవతలకు వరుసగా మూడాహుతు లీయవలెను. మఱొకటి కశ్యపున కీయ వలెను. అటుపైని అనుమతి కొక యాహుతి నీయ వలెను. పిమ్మట గృహ బలి నీయ వలెను. నిత్యకర్మ విధాన మందు నేనింత మున్ను జెప్పిన వైశ్వ దేవ క్రియను సేయ వలెను. ఆ విధానము తెలుపు చున్నాను వినుడు.

పర్జన్య దేవతకు (వరుణునికి) అబ్దేవతకు భూ దేవతకు మూడు స్థానము లందు విడివిడిగా బలి వేయ వలెను. ఆ వేయుట మణిక మందు, (మణిక మనగా మట్టిపాత్ర) వాయువునకు అన్ని దిశలందు దిగ్ధేవతలకు వరుసగా తూర్పు నుండి బ్రహ్మ అంతిరిక్షము సూర్యుడు విశ్వే దేవులు విశ్వ భూతములు ఉషస్సు భూతపతి అనువారికి ఉత్తరము వైపు బలి వేయవలెను. “స్వధాయై నమః అని పలుకుచు పితరులకు దక్షిణము నను ప్రాచీనా వీతిగ వేయ వలెను. యక్ష్మై తత్తే అను మంత్రము పఠించుచు వాయవ్య మూలలో అన్నావశేషలతో గూడిన యుదకము యథా విధిగ వదల వలెను. అటుపై దేవతలకు బ్రాహ్మణులకు నమస్కారము సేయ వలెను. కుడిచేతి అంగుష్ఠ మునకు (బొటన వ్రేలికి) కుత్తరము వైపున నున్న రేఖ బ్రాహ్మ తీర్థమన బడును. అచమనము సేయవలసిన తీర్థమిది. తర్జనికి (చూపుడు వేలు) అగుష్ఠమునకు నడిమిది పితృ తీర్థము. నాందీ ముఖము లోగాక మఱి యెల్ల విధు లందును పితరులకు తర్పణాదు లీ తీర్థమున జేయవలెను. వేళ్ళ అగ్రము దైవ తీర్థము. దేవత లనుద్దేశింతి చేయు తర్పణాది విధులా తీర్థమున జేయవలెను. చిటికెన వ్రేలి మొదలు ప్రజాపతి తీర్థము. అక్కడ ప్రజాపతికి జేయ వలయును. ప్రజాపతి కాండర్షిగా వున ఋషి తీర్థమున జేయవలె నన్నమాట. బ్రాహ్మ తీర్థమునం దాచమనము ప్రశస్తము. పితృ క్రియ పితృ తీర్థమున, దేవతలకు దేవ తీర్థమున, ప్రజాపతికి నాందీముఖ దేవతలకు పిండ తర్పణాదులు ప్రజాపతికి వలె ప్రాజాపత్య తీర్థమున (చిటికెన వ్రేలి మొదట) చేయ వలెను.

నీటిని అగ్నిని ఒక్కసారి కలిపి పట్టుకొన రాదు. గురువులు దేవతలు తల్లి దండ్రులు బ్రాహ్మణుల వైపు పాదములు చాచరాదు. పాలు గుడుపు చున్న గోవును జూడ రాదు. దోసిలితో నీరు త్రావ రాదు. చిన్న పెద్ద శౌచకాలము లందు విలంబము సేయ రాదు. నవేగాన్ధార యేత్క్వచిత్‌ అని యిదే విషయము మఱి యొకచో దెలుప బడినది. నోటితో నగ్ని నూద రాదు. ఈ క్రింది నాలుగును లేని యూరిలో వసింప రాదు. ఇదేమాట సుమతి శతకమం దిట్లున్నది.

అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడ తెగక పారు నేరును ద్విజుడున్‌

జొప్పడిన యూర నుండుము

చొప్పడు కున్నట్టి యూరు సొరకుము సుమతీ!

భృత్యులను జయించిన వాడు నౌకరులకు లొంగని వాడన్న మాట బలశాలి ధర్మ తత్పరుడు నయిన రాజు గల దేశ మందు ప్రాజ్ఞుడు వసింప వలెను. చెడ్డ రాజు కలచోట సుఖ మెక్కడిది? ఎక్కడ పౌరులు (ప్రజలు) కలిసి మెలిసి న్యాయ వర్తనులై శాంతులు మాత్స్యర్య హీనులునై యుందురో అక్కడ నివాసము సుఖో దయము. ఎక్కడ వ్యవసాయ దారులు (కృషికులు) దురభిమాన దురహంకారములు లేనివారో యెక్కడ ఓషధులు సర్వము గలవో యచట వివేకి వసింప వలె. జయింప వలెనను కోరిక కలవారు పూర్వ వైరము కలవారు నిరంతరము వేడుకలకై వేడుక పడు జనము ఈ మూడు లక్షణములు గలచోట వసింప రాదు. ఉత్తీమ శీలురైన వారు సహచరులు శత్రువుల బెదిరింపులకు లొంగని రాజు సస్య సమృద్ధమైన భూమిగల చోటు నిత్యనివా సార్హము. ఇదంతయు మీ హితము కోరి తెల్పితిని. ఈమీద భక్ష్యాభక్ష్య విధానము తెల్పెద వినుండు.

నేయి నూనెలతో మిశ్రిత మైనచో పర్యుషితమైన (నిలువ యున్నది చలిది) అన్నము గూడ త్యాజ్యమే. నేయి నూనెల స్పర్శ లేకున్నను గోధుమ యవ పదర్థములు అవు పాలు పెరుగు నేయి మొదలయి నవి వానితో జేసిన వంటలును నిలువ యున్న వైనను భుజింప తగినవే. కుందేలు తాబేలు ఉడుము పంది చేప ఒక రకము చేప యనునవి తిన దగినవి. ఊరబంది కోడియు తిన రానివి. పితృ శేషము దేవ శేషము శ్రాద్ధ మందు బ్రహ్మణులకు బెట్టు నుద్దేశముతో బ్రోక్షింప బడి నదియు ఔషధము కొరకై నదియు నగు మాంసము దిన్న దోషము గల్గదు. శంఖము రాయి బంగారము వెండి త్రాళ్ళ వస్త్రములు కూరలు దుంపలు పండ్లు పప్పులు చర్మము మణులు వస్త్రములు పవడములు ముత్యాలు పాత్రలు చమసలు (చతురస్రము లైన యజ్ఞ పాత్రలు) నీటితో గడిగిన శుద్దము లగును. రాతి చిప్పలు(రాచ్చిప్ప అని వాడుక) నీటి చేతను రాతితో సంఘర్షించుట చేతను శుద్దము లగును. నూనె జిడ్డున్న యెడల వానిని వేడినీట గడుగ వలయును. చేట చర్మము ఱోకలి ఱోలు ముతక బట్టలు ప్రోక్షణ చేసిన శుద్ది గల్గును. నార బట్టలు నీరు మట్టి (చవుడు మన్ను) ఎండ బెట్టుట అనువానిచే పరిశుద్ధము లగును. గొర్రె యున్నితో నేసిన బట్టలు (ముదుకగా నున్న బట్టలు) అవాల ముద్ద నువ్వుల ముద్దచే శోధనము సేయ వలెను. దట్టమైన నూలు బట్టలు గూడపూర్వోక్త రీతిగానే స్వచ్చము లగును. కఱ్ఱ దంతములు ఎముకలు కొమ్ములు అనునవి నీటితో గడిగి నను భస్మముతో దోమినను శుద్ధము లగును. అంటు కుండలు మరల వంటకు పనికిరావు. తోమి మఱి వంట చేయవలెను. బ్రహ్మచారి సంన్యాసి మొదలగు వారి భిక్షాన్నము వడ్రంగి (శిల్పి) హస్తము బజారు వస్తువులు స్త్రీ ముఖమును శుద్ధములు. బాటలో పడి యున్నది తెలియ కుండ స్పృశించినది (త్రోక్కినది) దాసిచే తోమ బడినది అదిలో పరి శుద్దమే. చిరకాల మయినను. వస్తు సమృద్దితో చేరిన ఆశుచి యైన అల్ప వస్తువు గూడ పరిశుద్దమే. స్థాన భ్రంశము పొందని వెంట్రుక ముసలి వాండ్రు రోగాది పీడితులు సేసిన వనిసత్కర్మ మరిగిన యిండ్లు వాకిండ్లు స్త్రీయొక్క పాలిండ్లు పవిత్రములు. ప్రవాహో దకము వాసన లేని నీరు పరిశుద్దము. భూమి కాలము చేతను అగ్ని దాహము చేత ఉదకము మార్జనము చేత అవులు త్రొక్కులు చేత పవిత్ర మగును. గృహము అలుకుట త్రవ్వుట నీట తడువుట నీళ్లు చల్లుట వలన శుచి యగును. వెంట్రుకల పురుగులచే ధూషిత మయినపుడు ఆవు వాసన చూచి నపుడు ఈగలు వ్రాలి నపుడు అన్నము మట్టి నీరు భస్మము నించుక చిమ్ముట వలన శుచి యగును. చింత పండు రసము చేత మేడికర్రతో జేసిన పాత్రలు తగరపు సీసపు గిన్నెలు చింతపండు రసము చేతను కంచు గిన్నెలు బూడిద నీరు చేతను శుద్ధి చెందును. ద్రవ పదార్థము అశుచియైన తఱి కొంచెము క్రింద పోయుట వలన పవిత్ర మగును. అపవిత్ర వస్తువులతో గూడిన ద్రవ్యము మట్టి నీరు వలనను వాసన పోవుదాక తోముట వలనను పవిత్ర మగును. మఱి యితర వస్తువులు వాని రంగు వాసనను దొలగించిన శుభ్రము లగును. చండాలుడు పచ్చి మాంసము తినువాడు తెచ్చిన మాంసము శుచి. దుకాణము నుండి తెచ్చిన నూనె గోవునకు దృప్తి గూర్చిన నీరు (ఆవులు త్రావినది) ధూళి అగ్ని గుర్రములు గోవుల యొక్క నీడ కిరణములు గాలి భూమి నీటి చినుకులు ఈగలు మొద లయిన దుష్ట వస్తు స్పర్శ పొందినను మైల పడవు. మేకలు గుర్రములు ముఖముచే పవిత్రములు.