బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
180 - శ్రీకృష్ణ చరితే - చతుర్వ్యూహ వర్ణనమ్
సురేశ్వరునికి సృష్టి కారణునకు విష్ణువునకు పురాణ పురుషునకు చతుర్వ్యూహ స్వరూపుడైన నిర్గుణ స్వరూపునకు గుణ రూపునకు సర్వాధికునకు యజ్ఞాంగ స్వరూపునకు సర్వాంగునకు నమస్కారము. ఎవని కంటె నణువైన వస్తువు యెవని కంటె పెద్దదైన వస్తువు లేదో, జననము లేని యెవ్వని చేత విశ్వము వ్యాప్త మైనదో బుట్టుట గిట్టుట దృశ్య మగుట యదృశ్య మగుట యను లక్షణములచే విలక్షణ మైన చరాచర విశ్వ వ్యాప్తమైన వానినిగా దెలుపుదురో యెవని వలన జగత్తు పుట్టినది నశించు నదియని బ్రహ్మణ్యులు పేర్కొందురో యట్టి నిర్వికారము శుద్ధము నిత్యము నేకైక రూపము విష్ణువు జిష్ణువు (సర్వ వ్యాపకము జయ శీలము) నని వర్ణింప బడు పరమాత్మకు నమస్కారము. హిరణ్య గర్భునకు (స్వర్ణ మయమైన బ్రహ్మాండము గర్భముగా గలవాడు) హరికి శంకరునకు వాసు దేవునకు (సర్వ దేవ నివాస మైన వానికి) తారునికి (సంసారమును తరింప జేయువాడు) నేక రూపునికి స్ధూలము సూక్ష్మము నైనవానికి నవ్యక్తము వ్యక్తము నైన వానికి ముక్తిహేతు వగు విష్ణునకు జగన్మూలము నయిన వానికి నమస్కారము. విశ్వమున కాధారమై నణువుల కంటె నణువై సర్వభూతము లందుండి చ్యుతిలేని వానికి (అచ్యుతునకు) నమస్కారము. పరమార్థముగ గేవల జ్ఞాన రూపమయ్యు నర్థ స్వరూపముగ భ్రాంతి దర్శనమున దృశ్యాత్మక జగత్తుగ గనిపించు వానినిగ మునులు పేర్కొనెడి భగవత్తత్వమును గుఱించి బ్రహ్మ మున్ను చెప్పినట్లు నేనును జెప్పు చున్నాను.
ఎవడు తన ముఖముల చేత ఋక్సామ మంత్రములను బఠించుచు నేకార్ణవము నుండి వెలువడి వచ్చి ముల్లోకముల బవిత్రము జేయునో యట్టి యీశానునకు నమస్కరించి దేవతలు యజ్ఞము లొనరించు వారి యజ్ఞా చరణమునకు లోపము రానీయరో యాయనకు నమస్కరించి యవ్యక్తము నుండి పుట్టిన బ్రహ్మ యొక్క సమగ్రమైన యభిప్రాయమును దెలుపు చున్నాను. ఆయన సృష్ఠి నుద్దేశించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను వేద రూపమున ప్రకటించి యున్నాడు. ఆపః (దీనికి నీరు సామాన్యార్థము. కాని దానికి మూల పదార్థమైన విద్యుత్తు ప్రకాశోదక మను బేర నర్థమని ఋషులు చెప్పినారు) వానికి నారములని నామాంతరము. అవియ యనము అనగా గమ్య స్థానముగ (ఉనికి) గలవాడు నారాయణుడు. సృష్టి మూలమైన నాపో రూపమున సర్వ వ్యాపకమై యున్న తత్త్వమే నారాయణ తత్త్వమని తాత్పర్యము, ఆ భగవత్తత్వము నాలుగు విధములై యున్నది. ఒక మూర్తి శుక్ల వర్ణము. అది జ్వాలామాలా మయము. దానిని యోగులు జ్ఞానులు మాత్రమే దర్శింతురు. అది దూర మందును దగ్గరను గూడ నుండునది. అది గుణముల కతీత మైనది. వాసుదేవ నామమున నుండునది. మమకారము లేని స్థితిలోనే యది కనబడును. రూపము రంగు మొదలగు కల్పిత భావములు దానికి లేవు. కేవల శుద్ధ స్వరూపము. మిక్కిలి నిలకడ గల వస్తువు. ఇక రెండవ వ్యూహము. శేషుడను బేర భూమిని ధరించు చున్నది. అది తమో గుణమూర్తి. తిర్యగ్భావమును బొందినది. అనగా బశుత్వము నొందినదని యర్థము. మూడవ వ్యూహము సత్వ ప్రధాన మూర్తి ధర్మ సంస్థాపన మొనరించి ప్రజా రక్షణ నిమిత్తమైన కర్మను (స్థితి రూపమును జేయునది) నాలుగవ వ్యూహము (మూర్తి) శేష తల్పమున సముద్ర మధ్య మందుండును. రజోగుణ రూపము సర్గ కారణము (సృష్ఠి కారణము) ఈ చెప్పిన వానిలో మూడవ మూర్తి యగు హరి స్వరూపము ధర్మ వ్యవస్థాపనము జేయును. ధర్మ నాశము జేయ జలరేగిన నసురులను సంహారించును. ధర్మ పరాయణు లైన దేవ గంధర్వాదులను రక్షించును. ఈ మూర్తి యెపుడు ధర్మము వాడి పోవునో యధర్మము ప్రకోపించునో యపుడు తనను తాను సృజించు కొనును. మున్ను వరాహమై ముట్టెతో నుదకమును జిమ్ముకొని వచ్చి తన యొక్క కొమ్ము చేత నీ వసుంధరను బద్మిని (తామర తీగ) నట్లు పైకెత్తినది. ఈ మూర్తియే నరసింహ మూర్తియై హిరణ్య కశిపుని సంహరించినది. దేని చేతనే విప్రచిత్తి మొదలుగా మఱెందరో దానవులు గూల్ప బడిరి. వామన రూపమూని మాయచే బలిని బంధించి దైత్యుల గెలచి ముర్లోక మాక్రమింప బడినది. భృగు వంశమందు జమదగ్ని కుమారుడై పుట్టి యద్భుత ప్రతాపముచే నొకరాచ పురువు తండ్రిని సంహరించి నాడని సర్వ క్షత్రియ నాశన మొనరించి నది. అట్లే అత్రి కుమారుడై ప్రతాప శీలియై దత్తాత్రేయు డను బేర నుదయించి మహాత్ముడైన యలక్కునకు నష్టాంగ యోగము నుపదేశించి నది. దశరథ కుమారుడై రాముడను బేర పుట్టి రావణుని సంహరించి నది. సర్వ జగత్తు నొకే సముద్ర మైనపుడు ఈ సర్వ జగత్ప్రభువు అనేక యుగ సహస్రములు నాగపర్యంక శయనుడై యోగనిద్ర నూని తన మహిమ యందు దాన నిమిడి యుండి ముల్లోకములను గర్భమున దాల్చి జనోలోక మందున్న సిద్ధులు స్తుతింప విలసిల్లు చుండును.
అయ్య నంతశయన మూర్తి నాభి నుండి దిక్కులే రేకులుగా భాసించు నొక పద్మము బుట్టినది. అందలి కేసరములు మరుద్గణము. (వాయు) అది పితా మహుని చతుర్ముఖుని పుట్టిల్లు. యోగ నిద్రనున్న యా స్వామి గులిమి నుండి మదు కైటభు లను దానవులు బుట్టిరి. మహా వీర్యులు మహా బలశాలులునై బ్రహ్మను చంప బోయిన యా యిద్దరను తల్పము నుండి లేచి యా ప్రభువు సంహరించెను. ఇట్లనేక లీలలు ఆయనవి అసంఖ్యాక ములు. అట్టి యజుడు అవికారుడు మధురా నగరములో నవతరించి యున్నాడు. ఈ సాత్విక మూర్తి జగత్ స్థితిహేతువై యవతరించగా బ్రద్యుమ్న నామమున నాల్గవ వ్యూహముగ జెప్ప బడినది. ఈ మూర్తి యొకపుడు దేవ భావమును నొకతఱి మనుష్య భావమును వేరొక యెడ పశు పక్ష్యాది భావమును గూడ గ్రహించు చుండి తదనురూప స్వభావమునై వాసు దేవాఖ్యమై పూజింప బడి యభీష్టముల ననుగ్రహించు చున్నది. కృత కృత్యుడయ్యు (ఏకర్తవ్యము లేని వాడయ్యు) సర్వ ప్రభువైన విష్ణువును గూర్చి నేనింత వరకు దెల్పితిని. ఆయన మనుష్యత్వమును బొంది చేసిన లీలా విశేషములను నిటుపై నాలింపుడు.
