కూర్మ మహా పురాణము
43వ అధ్యాయము
సూతమహర్షి పలికెను.
ఇట్లు నారాయణునినుండీ చెప్పబడిన ఈ విజ్ఞానమును విని కూర్మరూపధరుడగు నారాయణుని మునులు ఇట్లడిగిరి.
తాము చాలా ధర్మములను చెప్పితిం. మోక్ష జ్ఞానమును తెలిపితిరి. లోకముల సృష్టివిస్తారమును, వంశములను మన్వంతరమునుకూడా చేప్పితిరి. ఇక ఇప్పుడు తాము చెప్పిన విధిని అనుసరించి ప్రతిసర్గమును ప్రళయమును చెప్పవలయును.
సూతమహర్షి పలికెను
కూర్మరూపధారియగు శ్రీమహావిష్ణువు వారిమాటలను విని ప్రాణుల ప్రళయమును ఇట్లు వివరించెను.
ఈ పురాణమున ప్రలయము నిత్యము నైమిత్తకము ప్రాకృతము అత్యంతికమని నాలుగు విధములుగా చెప్పబడినది. ప్రతినిత్యము జరుగుచున్న ప్రాణులక్షయము నిత్యప్రలయమనబడును. బ్రహ్మ కల్పాంతమున జరుగు ప్రలయము (త్రిలోక ప్రలయము) నైమిత్తికమనబడును. మహత్తత్త్వమునుండి విశేషము వరకు జరుగు ప్రలయమును ప్రాకృత ప్రలయుందురు. పరమాత్మ జ్ఞానము కలుగుట వలన పరమాత్మలో లీనమగుట ఆత్యంతిక ప్రలయమనబడును.
నాలుగువేల యుగములు గడిచిన తరువాత ప్రలయకాలము రాగా బ్రహ్మ ప్రజలను తనలో నిలుపుకొనుటకు సంకల్పించుకొనును. అప్పుడు నూరు వత్సరములు తీవ్రమగు అనావృష్టికలుగును. ఇది సకల ప్రాణులను నశింప చేయునది. ఘోరమగునది. అపుడు అల్పసారములగు ప్రాణలు మొదట లయమును పొందును. అవి భూమిలో లీనమగును. అంతట సూర్యభగవానుడు రధారూఢుడై ఉదయించి తనకిరణములతో నీటిని త్రాగి సహించ జాలని తేజము కలవాడగును. అతనిపడు కిరణములు సముద్రజలమునుపానము చేయును. ఆ ఆహారముతో విజృంభించిన ఆ ఏడురశ్ములు ఏడు సూర్యులగుదురు. ఆ ఏడుగురు సూర్యులు నాలుగు దిక్కులలో నాలుగు లోకములను అగ్ని వలె దహించును.
ఆ ఏడుగురు సూర్యులు తమ కీరణముల ద్వారా పైకీ క్రిందికి వ్యాపించి యుగాంతాన్నీ ప్రతాపము కలిగి ప్రజ్వరిల్లును. నీటితో ఉద్దేపించబడిన ఆ సూర్యులు వేలకిరణములు కలవారై ఆకాశమునావరించి భూమిని దహింప చేయుచుందురు. ఆ సూర్యుని తేజముతో పరీతపించబడిన భూమీ ద్రవరహితమగును. బాగుగా ప్రజ్వరిల్లుచు అంతటా వ్యాపించుచు ఊర్థ్వము అధోభాగములు అడ్డముగా కూడ ఆవరించియుండును.
ఇట్లు సూర్యాగ్నిచే కాల్చబడి ఒకదానితో ఒకటికలిసి ఒకేభావమును పొంది ఒకే జ్వాల రూపమును పొందును. అన్ని లోకములను నశింప చేయు ఆ సూర్యరూపొగ్ని మండలాకారముగా మారి తన తేజస్సుతో నాలుగు లోకములను దహింపచేయును. అంతట సకల స్థావర జంగమాత్మకమగు సకల భూత జాలము లయము చెందగా చెట్లుగడ్డి ఏమిలేనిదై, కూర్మపృష్ఠము వలె భాసించును. సకల జగత్తు బాణలిపై భాగమువలె భాసించును. అతితీవ్రముగా సూర్య కిరణములతో మండుచుండును. పొతొలములో సముద్రములో నున్న సకల ప్రాణులు లయమై భూమి రూపమును చెందును. సప్తరూపుడగు సూర్యుడు ద్వీపములను పర్వతములను వరములను సముద్రములను అన్నిటిని భస్మము గావించి నదీ సముద్ర పాతాలములను అంతట జలమును త్రాగి భూమిని ఆశ్రయించి భూమిని మండింప చేయును.
అంతట సాంవర్తకమగు అగ్ని పర్వతములనాక్రమించి రుద్రతేజో విజృంభితమై అన్ని లోకములను దహింప చేయును. ఇట్లు ఆ అగ్ని భూమిని దహించి రసాతలమును ఎండింపచేయును. భూమిక్రింది భాగమును దహించివేసి ద్యులోకమును జ్వలింప చేయును. ఆ సంవర్తకాగ్ని శిఖలు నూరువేల పదివేల యోజనములు వ్యాపించి జ్వలించుచుండును. కాలరుద్రునిచే ప్రేరితుడగు ఆయగ్ని గంధర్వులను, పిశాచములను యక్షరాక్షస ఉరగులను దహింప చేయును. భూలోకమును భువర్లోకమును, సువర్లోకమును మహర్లోకమసు సమగ్రముగా దహింప చేయును. ఈ అగ్ని లోకములలో పైన క్రింద అడ్డముగా వ్యాపించి తరువాత ఆ తేజస్సు సకల జగత్తును ప్యాపించి మండుచున్న ఉక్కు ముద్దలా భాసించును. తరువాత ఏనుగుల సమూహపు ఘీంకారము వలె గర్జించుచు మెరపు తీగలతో అలంకరించబడినదై ఘోరమగు సంవర్తక మేఘములు బయలు నేడలును. కొన్ని నల్లకలువల వంటివి, కొన్ని కుముదముల వంటివి కొన్నీ ధూమ్రవర్ణముకలవి, కొన్ని పసుపు పచ్చనివి, కొన్ని రాసభవర్ణములు కలవి, కొన్ని లాక్షారస సపర్ణములు, కొన్ని శంఖకుందముల వలె తెల్లనివి, జాతీపుష్పసన్నిభములు, కాటుకరంగు కలవీ మరికొన్ని కొన్ని మనశ్శిలాసన్నిభములు కొన్ని పావురమురంగు కలవి, ఇంద్రనీలమణుల వంటివి మరికొన్ని హరితాల సన్నీభములు కొన్ని కొన్ని ఇంద్ర ధనుస్సు వన్నె కలవీ కొన్ని బయలు వెడలును. కొన్ని పర్వతా కారములు, కొన్నీ గజాకారములు, కూటాంగార సన్నిభములు కొన్ని, కొన్ని మత్స్యాకార సన్నిభములు పలురూపములు కలవి, భయంకరరూపములు కలవి భయంకరగర్జనలు కలవి మేఘములు అన్ని ఆకాశము నిండా వ్యాపించును. సూర్యునివలన పుట్టిన ఆమేఘములు గొప్ప ప్రవాహమువలె వర్షించును. మహాభయంకరమగు అమంగలమగు ఆయగ్నిని సంపూర్ణముగా చల్లార్చును. అతిగా వర్షించిన జలముతో జగమంతయూ నీండును. జలమాక్రమిoచుటవలన అగ్ని జలములో ప్రవేశించును.
బ్రహ్మచే ప్రేరేపించబడిన యామేఘములు ప్రలయకాలమున పుట్టినవై సంవర్షాగ్నిని చల్లార్చి నూరు సంవత్సరములు మహాజలధారలను వర్పించి ఆప్రవాహముతో సకల ప్రపంచమును ముంచెత్తుతూ సకలలోకములను నీటితో సముద్రము చెలియకట్టలను. ముంచునట్లు నింపివేయును. ఇట్లు పర్వతములతో ద్వీపములతో కూడియున్న భూమియంతయూ నీటితో కప్పి వేయబడును. సూర్యకిరణములతో త్రాగబడిన జలము మేఘములలో నిలుచును. మరల ఆజలము భూమీపై కురియును. దానితో సముద్రములు నిండును. అంతట సముద్రములు తమ చెలియలికట్టలను పూర్తిగా దాటిపేసి పర్వతములను ముంచెత్తును. భూమికూడా జలములో మునుగును. ఇట్లు సకల జగత్తు నశించగా బ్రహ్మ యోగ నీద్రను చేంది పరుండును. నాలుగు యుగములు ఒకవే మార్లు తిరిగితే ఒక కల్పమనీ ఋషులు చెప్పెదరు. ఇప్పుడు నేను చెప్పిన దంతయూ వారాహకల్పమునకు సంబంధించినది. బ్రహ్మవిష్ణుశివాత్మకమగు కల్పములు అసంఖ్యాకములు అని కాలచింతకులగు మునులు చెప్పియుండిరి. సాత్త్విక కల్పములలో విష్ణువుమహత్త్వము, తామసకల్పములలో రుద్రునివైభవము రాజసకల్పములలో బ్రహ్మవైభవము అధికముగా నుండును. ఇపుడు నడుచు వారాహకల్పము. సాత్త్విక కల్పము. ఇతర సాత్త్విక కల్పములలో నా ప్రభావము అధికముగా నుండును.
ఆయా కల్పములందు యోగులు ధ్యానము తపస్సు జ్ఞానములను పొంది నన్ను శంకరుని ఆరాధించి పరమపదమును చేరుదురు. ఆ నేను సత్త్వమును ఆశ్రయించి మాయనై మాయామయమగు యోగనిద్రను ఆశ్రయించి ఏకార్ణవ రూపముగా నున్న ఈ జగత్తులో యోగనిద్రలో నుండును. జనలోకమున నున్న మహానుభావులు యోగదృష్టితో పడుకొనియున్న నన్ను చూచేదరు. నేను పురాణ పురుషుడను, భూర్భువః ప్రభృతిలోకములకు కారణమును. సహస్ర చరణుడను. శ్రీమంతుడను సహస్ర కిరణములుకలవాడను. సహస్ర నేత్రములు కలవాడను. మంత్రము అగ్నీ బ్రాహ్మణులు, గోవులు, కుశములు, సమిధలు, ప్రోక్షణి స్రువము, చంద్రుడు నేయి ఇవన్నీ నా రూపములే. నేనే సంవర్తకాగ్నిని, మహత్తత్త్వమును, ఆత్మను, పవిత్రము, పరమ కీర్తిని నేనే. వేదమును, వేద్యమును, ప్రభవమును, రక్షకుడను గోపతిని, (ఇంద్రియాధిపతిని) అనంతుడను, తారకమును, యోగీని, జ్ఞానము కలవారి జ్ఞానమునునేనే. హంసను, ప్రాణమును, కపిలుడను, విశ్వమూర్తిని, సనాతనుడను, క్షేత్రజ్ఞుడను, ప్రకృతిని, కాలమును, జగద్బీజమును, అమృతమునునేనే తల్లితండ్రి, మహాదేవుడునేనే. నాకంటే భిన్నము ప్రపంచమునలేదు. నేను ఆదిత్యవర్ణుడను ప్రపంచరక్షకుడను. నారాయణుడను, పరమపురుషుడను యోగమూర్తిని యతులు యోగనిష్టులు నన్ను చూడగలరు. నన్ను తెలిసినవారు మోక్షమును పొందెదరు.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రంహితలో ఉపరి విభాగమున 43వ అధ్యాయము.
