కూర్మ మహా పురాణము
19వ అధ్యాయము
వ్యాస మహర్షి పలికెను.
తూర్పుముఖముగా కాని సూర్యునికి అభిముఖముగా కాని కూర్చొని భూమి యందు పాదములుంచి కూర్చొని భుజించ వలయును.
తూర్పు ముఖముగా భుజించు వానికి ఆయుష్యము దక్షిణా ముఖముగా భుజించు వానికి కీర్తి పశ్చిమ ముఖముగా భుజించు వానికి సంపదలు ఉత్తర ముఖముగా భుజించువానీకి సత్యము లభించును.
అయిదు అవయవములను తడిగా ఉంచుకొని భుజించవలయును. రెండు చేతులు రెండు కాళ్ళు ముఖము కడుగుకొని భూమి యందు పాత్ర నుంచి భోజనము గావించినచో అది ఉపవాసముతో సమానమని ప్రజాపతియగు మనువు పలికెను. పాదములను హస్తములను ప్రక్షాళనము గావించి ఆచమనము చేసి ఆర్ధవస్తుడై కోపమును విడిచి చక్కగా అలికిన పరిశుద్ధమగు ప్రదేశమున భుజించవలయును. మహావ్యాహృతులతో జలముతో అన్నమును పరిషేచనము గావించవలయును. "అమృతో పస్తరణమసి” అని పరిషేచనము గావించపలయును.
తరువాత “ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా !
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా” అని పలుకుచు వీటి తత్త్వములను తెలిసి ఆత్మలో ఆహుతులను గావించవలయును. మిగిలిన అన్నమును యథేచ్చగా తనవారితో కలిసి భుజించవలయును. తదేక మనస్కుడై దేవుని ఆత్మను ప్రజాపతిని ధ్యానము గావించి భోజనము ముగిసిన తరువాత 'అమృతాపి ధానమసి' అని జలమును స్వీకరించవలయును. ఆచమనము చేసిన తరువాత మరల ‘ఆయంగోః పృశ్ని రక్రమీత్' అను మంత్రముతో ఆచమనము గావించవలయును. ఆ తరువాత సర్వ పాప వినుశినియగు 'ద్రుపదా” మంత్రమును ముమ్మారు పఠించవలయును. తరువాత ప్రాణానాం గ్రంధిరసి' అను మంత్రముతో హృదయమును స్పృశించవలయును.
పైన చేయి పెట్టుకొని సావధాన మనస్కుడై ఆచమనము గోవించీ 'అంగుష్ఠ మాత్ర' అను మంత్రము ద్వారా కుడికాలు బొటనవేలు పై హస్త జలమును విడువవలయును. 'శ్ర ద్ధాయాం' అను మంత్రముతో హుతాను మంత్రణము చేయవలయును, తరువాత బ్రాహ్మణా' అను మంత్రముతో తన ఆత్మను అక్షర తత్వముతో యోజించవలయును. అన్నీ యోగములలో ఆత్మయోగము ఉత్తమమైనది. ఈ విధిని అనుసరించి ఆత్మయోగము చేయువాడు బ్రహ్మ సాయుజ్యమును పొందును.
యజ్ఞోపవీతమును ధరించియే భుజించవలయును. గంధ మాల్యాదులు ధరించి భుజించవలయును. సాయంకాలము ప్రాతఃకాలము మధ్యాహ్నకాలము విశేషించి సంధ్యాకాలమున భుజించరాదు. సూర్య గ్రహణమునకు ముందు పగలు చంద్రగ్రహణ పూర్వ సాయంకాలమున భుజించరాదు. గ్రహణ సమయమున భుజించరాదు. గ్రహణము విడిచిన తరువాత స్నానము గావించి భుజించవలయును. చంద్రగ్రహణము విడిచిన తరువాత అర్ధరాత్రి కాకున్నచో భుజించవచ్చును. గ్రహాణము విడువక మునుపే సూర్యచంద్రులు అస్తమించినచో మరునాడు శుద్ధ బింబమును దర్శించిన తరువాతనే భుజించవలయును.
ఆకలితో చూచువారికీ పెట్టకుండగా భుజించరాదు. యజ్ఞశిష్టము కానీది భుజించరాదు. కోపముతో ఉండికానీ అన్యమనస్కముగా కాని భుజించరాదు. తన కొరకు మాత్రమే వండిన అన్నము, సుఖము కొరకే స్త్రీ సంగమము, బ్రతుకు తెరువు కొరకు చేయు అధ్యయనము కల జీవనము వ్యర్థముగా భావించబడినది. తలపాగాతో చేయు భోజనము, ఉదఙ్ముఖముగా చేయు భోజనము, పాదరక్షలతో చేయు భోజనము అంతయూ ఆసుర భోజనముగా చెప్పబడును. అర్థరాత్రి యందు, మధ్యాహ్నము నందు, అజీర్ణమున, తడిబట్టలతో ఇతరులకు నిర్దేశించిన ఆసనము నందు, పడుకొని, నిలుచొని, పగిలిన పాత్రలో, భూమి యందు చేతియందుంచుకొని భుజించరాదు.
భోజనము చేయుచు వేదము నుచ్చరించరాదు. భోజ్య పదార్థములు ఇంటిలో పూర్తిగా అయిపోవునట్లు భుజించరాదు. అనగా ఇంటి యజమాని భుజించిన తరువాత కూడా అతిథి అభ్యాగతులు ఒకరిద్దరువచ్చినచో వారిని కూడా భుజింప చేయగలుగునటు లుండవలయును. భార్యతో కలిసి భుజించరాదు. అంధకారమున ఆకాశమున (పై కప్పు లేని ప్రదేశమున్న) దేవాలయాదులందు భుజించరాదు. ఒకే వస్త్రముతో భుజించరాదు. వాహనముపై నుండి శయ్యపై నుండి భుజించరాదు. పాదుకలను విడువక నవ్వుచు, ఏడ్చుచు భుజించరాదు.
ఇట్లు భుజించి సుఖముగా కూర్చొని ఆ అన్నమును జీర్ణించుకోనవలయును, తరువాత ఇతిహాస పురాణములతో వేదార్థములను వ్యాఖ్యానించ వలయును. తరువాత ద్విజుడు పూర్వోక్త విధితో సంధ్యోపాస చేయవలయును. తరువాత పశ్చిమ దిజ్ముఖముగా కూర్చొని గాయత్రీ మంత్రమును జపించవలయును. ప్రాతః కాలసంధ్యావందనమును సాయంకాల సంధ్యావందనము నాచరించనిపోడు సర్వధర్మ బహిష్కృతుడై శూద్రునితో సమానుడగును.
యథావిధిగా అగ్నిలో హోమము గావించి యజ్ఞ శేషమును భుజించి భృత్య బంధు జన పరివృతుడై పొడికాళ్ళతో పరుండవలయును. ఉత్తరమువైపు కాని పశ్చిమమువైపు కాని తల పెట్టి పరుండరాదు. పై కప్పులేని చోట కాని, నగ్నముగా కానీ, అపరిశుద్దీగా కానీ ఆసనముపై కాని పరుండరాదు. విరిగిన మంచము మీద, ఎవ్వరూ లేని ఇంటిలో ఒంటీగా పరుండరాదు. వెదురు మంచము మీద మోదుగు మంచము మీద పరుండరాదు.
ఇట్లు బ్రాహ్మణులు ప్రతి నిత్యము ఆచరించవలసిన విధిని మోక్ష ప్రదములను వివరించితిని. నాస్తిక్య భావము వలన కాని బద్దకము వలన కానీ ఈ విధిని ఆచరించనిచో పాడు ఘోర నరకములను పొందును. తరువాత మరల కాకిగా పుట్టును. స్వాశ్రమ విధి తప్ప మోక్షమునకు మరియొక సాధనము కానరాదు. పరమాత్మ ప్రీతి చెందుటకు విహిత కర్మల నాచరించవలయును.
ఇది శ్రీకూర్మపురాణమున షట్ సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 19వ అధ్యాయము.
