కూర్మ మహా పురాణము

Table of Contents

14వ అధ్యాయము

వ్యాసుడు పలికెను.

ఇట్లు దండాదులను ధరించి శౌచాచారము కలిగి, గురువు పిలుపు మేరకు గురుముఖము చూచుచు అధ్యయనము చేయవలయును. సదాచార సంపన్నుడై ఉత్తరీయము నుండి దక్షిణ హస్తమును బయట ఉంచుకొని, ఇంద్రియ నిగ్రహము కలవాడై గురుపు కూర్చుండమని చెప్పినపుడు, గురువుకు అభిముఖముగా కూర్చొనవలెను. పడుకొని, కూర్చోని, భోజనము చేయుచు, నీలబడి, గురువు వంక వీపునుంచి, గురువునుండి విద్యనుగాని ఇతర సంభాషణలు గాని చేయరాదు.  

గురుపు సమీపమున ఆసనముగాని, శయ్యగాని, క్రిందుగా ఉండవలెను. గురువు కనుల ముందు యిష్టము వచ్చినట్లు కూర్చొనరాదు. గురువు పరోక్షమున కూడా గురువు నామమును, గౌరవ ఉపాధి శూన్యముగా ఉచ్చరించరాదు. గురువు. గమనమును, భాషలను, చేష్టలను అనుకరించరాదు.

గురువు దోషములను చెప్పుచోట, నిందించుచోట, చెవులు మూసికొనవలెను. అవకాశమున్నచో ఆట నుండి బయటకు వెళ్ళవలెను. తాను దూరముగా ఉండి, ఇతరుల ద్వారా గురువును అర్చింపచేయరాదు. తానే స్వయముగా చేయవలెను. తాను కోపముగా నున్నపుడు పూజించరాదు. గురువు స్త్రీ సమీపమున నున్నపుడు పూజించరాదు. గురువు మాటకు ప్రతివాదము పలుకరాదు. గురు సమీపమున గుర్వాజ లేక కూర్చొనరాదు.

శిష్యుడు ఎపుడు గురువు కొరకు జలపూర్ణ పాత్రను, దర్భలను పుష్పము సమిధలను కొనిపోవలెను. ఎపుడు గురువునకు మార్జనము, లేపనము మొదలగునవి ఆచరించవలెను. గురువు ధరించిన పుష్పమాలను, గురువు పరుండిన శయ్యను, పాదుకలను, పాదరక్షలను, గురువు ఆసనమును, నీడను దాటరాదు. గురువు కొరకు దంత కాషాదులను సంపాదించీ సమర్పించవలయును. గురువునకు ప్రియమును, హితమును కూర్చుటలో తత్పరుడై యుండవలయును. గురువునకు చెప్పకుండా వెళ్ళరాదు.

గురువు ముందర కాళ్లుచాపి కూర్చొనరాదు. అట్లే ఆవులింత, పేద్ధనవ్వు, మెడలో సుందరమైన మాలలు మొదలగు అలంకారములు చేసికొనరాదు. పెద్దగా చప్పట్లు కొట్టరాదు. గురువు విమనస్కుడు కానంతవరకు (కానపుడు) మాత్రమే, కాల నియమము ననుసరించి, అధ్యయనము కొనసాగించవలెను. గురువు సమీపమున అధ్యయన కాలమున, నీచాసనమున కూర్చయందుగాని, ఫలకము నందుగానీ, సావధానుడై కూర్చొన వలెను. గురువు ఆసనముపై, శయ్యపై, వాహనముపై కూర్చొనరాదు. గురువు పరుగెత్తుచున్నచో, తాను వెంట పరుగెత్తవలెను. నడుచుచున్నచో నడువవలెను. ఎడ్లబండి, అశ్వము, ఒంటె, భవనము, ప్రస్తరము, చాప, శిలా ఫలకము, నావ మొదలగు పోటీ యందు గురువుతో కూర్చొన వచ్చును. ఇంద్రియ జయము కలిగి, కోపమును వశములో నుంచుకోని, శుచియై గురువు వద్ద, హితముగా మధురముగా మాట్లాడ వలయును.

గురువు సన్నిధిలో గంధమును, మాల్యములను, రసములను, మద్యములను ఆడంబరములను ప్రాణిహింసను, అభ్యంగమును, కాటుక ధరించుట, పాదరక్షలు ధరించుట చేయరాదు. కామ, లోభ, భయ, నిద్రలను, గీతమును, వాద్యమున, నర్తనమును, బెదిరించుట, నీంద, స్త్రీ దర్శనము, స్త్రీని స్పృశించుట, పర అపకారము,లోభిత్వము, మొదలగునవి విడువవలయును.

ప్రతిదినమును జలకుంభమును, పూవులను, ఆవుపేడను, మృత్తికను, దర్భలను గురువు అవసరమునకు తగినంత గొనిపోవలెను. ప్రతి దినము భిక్షాటన చేయవలయును. కృత్రిమ లవణమును, పోసన పట్టిన పదార్ధములను విడువవలయును. నృత్యమును చూడరాదు. గీతాదులయందు , ఆసక్తి కనబరచరాదు. సూర్యుని ఎదురుగా నిలవగాదు. ఏకాంత స్థితిలో అపవిత్రులైన స్త్రీలతో, శూద్రులతో, అంత్యజులతో, సంభాషించరాదు.  

గురూచ్చిష్ట భోజనమును లోభముతో స్వీకరించరాదు. శరీరమున మురికిని తొలగించుటకు రాగపూర్వకముగా స్నానము సొచరింపరాదు. గురువును మానసికముగా కూడా త్యజించరాదు. మోహముతోగాని, లోభముతోగాని, గురువును పరిత్యజించి పతితుడగును. గర్విష్టి మహాపాతక యుక్తుడు, కార్యాకార్యములను తెలియనివాడు, చెడుదారిలో నడుచు వాడగు గురువును త్యజించవచ్చునని మనువు చెప్పెను. గురువు యొక్క గురువు సమీపమున గురువిషయమునవలే భక్తిని వినయమును చూపవలెను. గురువు యింటిలో, గురువు సమీపమున, గురువు నాజ్ఞలేక, తన గురుజనులను (తల్లిదండ్రులను మొదలగువారిని) నమస్కరించరాదు.  

విద్యా గురువులయందు, తల్లిదండ్రులయందు, అధర్మమును నిషేధించువారి యందు, హితము నుపదేశించువారి యందు, శ్రేయస్సును బోధించువారియందు గురువు యందువలే వ్యవహరించవలెను. గురుపుత్రులయందు, గురుపత్నియందు గురు బంధువులయందు, గురువు యందువలె వ్యవహరించవలెను.

  తనకంటే చిన్నవాడు, సమానవయస్కుడు, యజ్ఞకర్మలో శిష్యుడుగా నున్నపోడు కూడా, అధ్యాపనము చేయుచో, గురువు వలెనే గౌరవము పొందదగును. కాని గురుపుత్రుని పాదప్రక్షాళన చేయరాదు. గురుపుత్రుని ఉచ్చిష్టమును భుజించరాదు. సవర్ణురాలగు గురుపత్ని గురువువలెనే గౌరవనీయురాలు. అసవర్ణులైనచో ప్రత్యుత్థాన అభివాదనొదులతో మాత్రమే పూజించవలయును.

గురుపత్నికి అభ్యంజనము, స్నానము చేయుటను, శరీర సంవాహనము, కేశాలంకరణము, చేయరాదు. గురుపత్నీ యువతి యగుచో, పాదములు స్పృశించి నమస్కరింపరాదు. అసావహం' అనీ భూమిపై నమస్కరించవలెను. శిష్యుడు గ్రామాంతరము, దేశాంతరము వెళ్లివచ్చినపుడు శిష్టాచారమును స్మరించుచు, గురుపత్ని యువతీ అయినను పాదగ్రహణ పూర్వకముగా అభివాదము చేయవచ్చును, పినతల్లి, మేనమామ భార్య, అత్తగారు, మేనత్త వీరందరు గురుపత్నులతో సమానము కావున, గురుపత్నీ విషయమున వలెనే పూజించవలెను. సవర్ణురాలైన భాతృభార్య కూడా గౌరవించ తగినది. ప్రతిదినమును తప్పక అభివాదము చేయవలయును. ప్రవాసము నుండి తిరిగివచ్చినపుడు జ్ఞాతి స్త్రీలు, సంబంధిత స్త్రీలకు కూడా అభిపోదము చేయవలెను.

మేనత్త విషయమున, పినతల్లి, పెదతల్లి విషయమున, తన సోదరి విషయమున, తల్లియందువలే ప్రవర్తించవలెను. తల్లి వీరికంటే శ్రేష్టు రాలగును. ఇట్టి ఆచారముతో కూడి మనోనిగ్రహము గలిగి, దంభమును విడచిన శిష్యునికి వేదమును, ధర్మములను, వేదాంగములను, పురాణములను, అధ్యాపనము చేయవలెను.  

ఒక సంవత్సరకాలము గురువు వద్దనుండి, సేవచేసిన శిష్యునికి, గురువు జ్ఞానమును బోధించనిచో, ఆ శిష్యుని దుష్కృతము గురువునకు చేరును. ఆచార్యపుత్రుడు, సేవించువాడు, ఒక విద్యనిచ్చి మరొక విద్య తీసికొనువాడు, ధార్మికుడు, పవిత్రుడు, సమర్థుడు, గురువుకు కావలసినంత అన్నము నిచ్చువాడు, ధనము నిచ్చువాడు, సచ్చీలము గలవాడు, తనవాడు, ఈ పదిమంది అధ్యాపనమునకు యోగ్యులు (చదివించ తగినపోరు), కృతజ్ఞుడు, ద్రోహము చేయనివాడు, మేధావి, శుభకరుడు, ఆప్తుడు, ప్రీయమును ఆచరించువాడు, ఈ ఆరురు ద్విజులు, యధావిధిగా అధ్యాపనకు యోగ్యులు. వీరిలో బ్రాహ్మణునికీ బ్రహ్మజ్ఞానము, వేదజ్ఞానమును ఈయవలెను. ఇతరులకు మాత్రము, వీధి సనుసరించి విద్యా ప్రదానము చేయవలేను.

ఆచమనము చేసి నియతమనస్కుడై, ఉత్తరాభిముఖుడై, అధ్యయనము గావించవలెను. గురుపాదములకు ప్రణామముచేసి, గురు ముఖమును చూచుచు, అధ్యయనము చేయవలెను. చదువుము అని గురువు చెప్పినపుడు అధ్యయనము ప్రారంభించవలెను, ఇక చాలునుఅని చెప్పినపుడు అధ్యయనము నిలిపి వేయవలెను.

ప్రాగగ్రములగు దర్భలయందు కూర్చొని, రెండు చేతులలో దర్భలను పట్టుకోని పవిత్రుడై మూడు ప్రాణాయామములు చేసి శుచియైన తరువాత ప్రణమోచ్చారణకు యోగ్యుడు. బ్రాహ్మణుడు, ద్వీజుడు, ఆధ్యయన ప్రారంభమునందు, అంతమునందు ప్రణమోచ్చారణ చేయవలయును. బ్రహ్మాంజలి పూర్వకముగా (చేతులు జోడించి) వేదమును అధ్యయనము చేయవలయును. అన్ని ప్రాణులకు వేదమే సనాతన చక్షువు. ఈ వేదమును ప్రతినిత్యము అధ్యయనము గావించవలయును. అట్లు చేయనివాడు బ్రాహ్మణ్యము నుండి భ్రష్టుడగును.

నీత్యము ఋగ్వేదము అధ్యయనము చేయువానికి క్షీరములతో దేవతలను తృప్తిపరచువానికి, ఆ దేవతలు అభీష్ట ప్రదానముతో తృప్తి కలిగింతురు. యజుర్వేదము అధ్యయనము చేయుచు, దేవతలను పెరుగుతో తృప్తి పరచవలయును. సామ వేదాధ్యయనమున, నేతితో తృప్తి పరచవలెను. అధర్వణాధ్యయనమున తేనెతో తృప్తి పరచవలేను. ధర్మశాస్త్రములను, వేదాంగములను, పురాణములను, అధ్యయనము చేయునపుడు, మాంసాదులతో తర్పణము చేయవలయును.  

అరణ్యమునకు వెళ్లి, జలసమీపమును చేరి, నిత్య కర్మ విధిని అనుసరించి, గాయత్రీ జపము చేయవలయును. ఈ గాయత్రీ జపమును వేయిమారులు చేయుట ఉత్తమము. నూరు మధ్యమము, పదీ అధమము. ఆది గాయత్రీ జపముగా పేర్కొనబడినది. గాయత్రీ మంత్రమును, నాలుగు వేదములను త్రోసులో తూచినచో, ఒకవైపు నాల్గువేదములు, మరొకవంక గాయత్రి నిలుచును.

మొదట ఓంకారమును, తరువాత వ్యాహృతులను, తరువాత సావిత్రీ మంత్రమును ఏకాగ్ర మనస్కుడై శ్రద్దతో జపించవలెను, పూర్వ కల్పమున సర్వ అమంగళములు నశింపచేయు మహా వ్యాహృతులు 'భూః', 'భువః', 'సువః' అనునవి ఆవిర్భవించినవి.

ప్రకృతి, పురుషుడు, కాలము', 'విష్ణువు, బ్రహ్మ మహేశ్వరుడు', 'సత్త్వము, రజస్సు, తమస్సు' ఇవి మూడు వ్యాహృతులు. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. సావిత్రీ నశించని పరతత్వము, ఈ మంత్రము మహాయోగము, సకల సారములకు సారము. ప్రతిదినము వేదమాతయగు గాయత్రీని జపించువాడు, అర్థమును తెలియుపోడు, ఉత్తమగతిని పొందును.

గాయత్రి వేదమాత. గాయత్రి లోకపావని. గాయత్రీకంటే జపించతగినది వేరు ఒకటి లేదు. ఇది తెలిసి ముక్తుడగును.

శ్రావణ పూర్ణిమనాడుగాని, ఆషాఢ పూర్ణిమనాడుగాని, భాద్రపద పూర్ణిమనాడుగాని ఉపాకర్మ ఆచరించవలెను. అనగా సంస్కార పూర్వకముగల వేదగ్రహణము చేయవలెను. గ్రామమును, నగరమును విడచి బ్రహ్మచారి అయిదున్నర నెలలు పవిత్ర ప్రదేశమున సావధానచిత్తుడై వేదాధ్యయనము చేయవలయును. పుష్యమాసమున విడువవలెను. అట్లే మాఘ శుక్ల ప్రతిపత్తునాడుగానీ, గ్రామము వెలుపల వేదోత్సర్జన గావించవలెను. అప్పటి నుండి శుక్ల పక్షమున వేదములను, కృష్ణపక్షమున వేదాంగములను, పురాణములను సృతులను అధ్యయనము చేయవలెను.  

వేదాధ్యయనము చేయువారు, వేదమును అభ్యసించుచూ అధ్యాపనము చేయువారు ఈ అనధ్యయనములను తప్పక పాటించవలెను, రాత్రులందు చెవులకు వినిపించు ధ్వని కలిగిన వాయువు వీచునపుడు, పగలు దుమ్ములేచి వేడివేడిగా గాలి వీచునపుడు, మెరుపులతో, ఉరుములతో వర్షించినపుడు, పిడుగులు పడుచున్నపుడు, ఇవి ఆకాళిక అనధ్యయనములుగా తెలియవలయును. అనగా నిమిత్తములు ప్రారంభమైనప్పటి నుండి మరునాడు సూర్యోదయము వరకు అనీ తెలియవలెను. పైన చెప్పబడిన ఈ నిమిత్తములు సంభవించినపుడు, వర్ష ఋతువుకంటే భిన్న ఋతువులలో మేఘములను చూచినప్పుడు, అనధ్యయనముగా తెలియవలెను. పిడుగుపాటు, భూకంపము, సూర్యచంద్రగ్రహణములు ఇవి కూడా ఆకాలిక అనధ్యయనములు. అగ్ని జ్వాలలు కనబడినపుడు, ఉరుములతో కూడిన మెరుపులు కలిగినపుడు, వెలుతురున్నను, రాత్రి కూడా అనధ్యయనముగానే పాటించవలయును.  

ధర్మము నైపుణ్యమును కోరువారికి, గ్రామములోను, నగరములోను, దుర్గంధ సహిత స్థానమున నిత్య అనధ్యయనమే యగును. గ్రామమున శవమున్నపుడు, శూద్రుల సన్నిధిలో, అధర్మ జనుల సమీపమున, జన సమూహము ఏడ్చుచున్నపుడు అనధ్యాయమగును. జల మధ్యమున, అర్థరాత్రి, మలమూత్రవిసర్జనవేళ, ఉచ్చిష్ణావస్థలో, శ్రాద్ధ భోజనమున, మనసులో గూడా అధ్యయనము చేయరాదు. ఏకోద్దిష్ట నియంత్రణ స్వీకరించినపాడు, రాజునకు పుత్రుడు కలిగిన , రాహుగ్రస్త ఉప రాగమున, మూడు దినములు అధ్యయనము చేయరాదు. బ్రాహ్మణుని శరీరమున ఏకోదిష్ట శ్రాద్ధమునకు సంబంధించిన నేతీవాసన ఉన్నంతవరకు, బ్రాహ్మణుడు వేదములను చదువరాదు.  

పడుకొని కానీ, ఆసనముపై పాదములుంచిగాని, అవసక్లిక ఏర్పరచుకొనినను (రెండు మోకాళ్ళను వస్త్రముతో బంధించికొన్నను)గాని, మాంసము భుజించిగానీ, సూతకాన్నము భుజించీకాని వేదాధ్యయనము చేయరాదు.మంచు పడుచున్నపుడు, బాణ శబ్దము వినిపించినపుడు, ఉభయ సంధ్యలలో, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్యలలో, ఉపాకర్మలో ఉత్సర్గములో, మూడు దినములు వేదాధ్యయనము చేయరాదు. అష్టకములలో, అహెరాత్రములు, ఋతు అంతరాత్రములలో, అనధ్యయనమగును. మార్గశీర్ష పుష్య మాఘ మాసములలో కృష్ణ పక్షమున ఈ మూడు అష్టకములుగా పండితులు చెప్పిరి. (మార్గశీర్ష కృష్ణ సప్తమి అష్టమి నవములు, పుష్య కృష్ణ సప్తమి అష్టమి నవములు, మాఘకృష్ణ సప్తమి అష్టమీ నవములు అష్టకములందురు) బూరుగ, అవిసె, దానిమ్మ, వెలగ, కోవిదార వృక్షముల నీడలలో వేదాధ్యయనము చేయరాదు.

తనతో సమానముగా చదువువాడు, సహాధ్యాయి మరణించినపుడు, ఆచార్యుడు తమ యింటికి వచ్చినపుడు, మూడు దినములు అనధ్యయనము. ఇవి బ్రాహ్మణ ఛిద్రములుగా పేర్కొనబడినవి. ఈ దినములలో రాక్షసులు హింసించు చుందురు. కావున వీటిని పరిత్యజించ వలయును.

నిత్యకర్మ విషయమున, సంధ్యోపాసనలో, ఉపాకర్మలో, కర్మ అంత్యమున, హెూమ మంత్రములలో అనధ్యాయముండదు. అష్టకములలో, ఝంఝా మారుతములో, ఒక్క ఋక్కును, ఒక్క యజుర్మంత్రమును, ఓక్క సామమంత్రమును మాత్రమే అధ్యయనము చేయనలెను. వేదాంగములకు, ఇతిహాస పురాణములకు, ధర్మ శాస్త్రములకు అనధ్యాయము లేదు. కాని పర్వదినములలో దీనిని అధ్యయనము చేయరాదు. ఇట్లు పవిత్రులైన ఋషులకు బ్రహ్మచేత చెప్పబడిన బ్రహ్మచారి ధర్మములను సంగ్రహముగా వివరించితిమీ.

వేదాధ్యయనము చేయకయే, ఇతర శాస్త్రాధ్యయనమునకు ప్రయత్నించినవాడు మూర్ఖుడు. అతడే వేదబాహ్యుడు. ద్వీజుడతనితో మాట్లాడ రాదు. అట్లే వేద పాఠముతో మాత్రమే సంతుష్టి చందరాదు. పాఠమాత్రముతో విరమించినవాడు బురదలో చిక్కిన గోవువలె కష్టపడును. యథా విధిగ వేదాధ్యయనము చేసి, వేదార్థ పర్యాలోచన చేయనిచో, అతని వంశమంతయు శూద్ర సమమగును. అతడపాత్రుడగును.

జీవన పర్యంతము గురువు వద్దనే నివసించదలచినచో, శరీరావసానము వరకు సొవధానముగా గురు శుశ్రూష చేయుచుండవలెను, గురువు, గురుపత్ని, గురుజ్ఞాతి బంధువులు లేనిచో, అరణ్యమునకు వెళ్లి విధిపూర్వకముగా, అగ్నిని ఉపాసించవలయును. స్నానము చేసి, భస్మాడులను ధరించి, గాయత్రీ మంత్రమును, శతరుద్రీయమును, వేదాంత శాస్త్రములను ఎపుడు అభ్యసించు చుండవలయును.

పూర్వకాలమున మహర్షివర్యులు అడుగగా స్వాయంభువ మనువు చెప్పిన వేద జ్ఞాన ప్రాప్తి విధానమును మీకు నేను చెప్పితిని. విధానమును తెలిసి, ఈశ్వరుని యందు మనసును లగ్నముచేసి విధిని ఆచరించినవాడు, సంసార మోహజాలమును తొలగించుకొని అమృతుడై పరమ పదమును పొందును.

ఇది శ్రీ కూర్మ పురాణమును షట్ సాహస్ర సంహితలో ఉపరీ విభాగమున పదునాల్గవ అధ్యాయము