కూర్మ మహా పురాణము
29 - యుగవంశాను కీర్తనము
వ్యాసుడు పలికెను-
పాండుకుమారా భయంకరమైన యీ కలియుగము భూమండలములో ప్రవేశించినది. అందువలన నేను, మంగళకరమైన యీశ్వరుని పట్టణమైన కాశీకి వెళ్లుచున్నాను.
క్రూరమైన యీ కలియుగములో, గొప్ప భుజములు కల అర్జునుడా జనులు పాపమార్గమున వర్తించువారు, వర్ణాశ్రమ ధర్మములను విడుచువారు కాగలరు.
లోకములోని ప్రాణులకు అన్ని పాపములను నశింపజేయునది, ప్రాయశ్చిత్తము కలుగజేయునది, వారణాశి పురము కాక మరియొకటి యీ కలియుగములో కన్పించదు.
కృత, త్రేతా, ద్వాపరములను పేర్లు గల ఈ యుగము లన్నింటిలో మనుష్యులు ధర్మ స్వభావులు, సత్యము పలుకుతారు, మహాత్ములుగా ఉండగలరు.
నీవు లోకము లందు ప్రసిద్ధుడవు, ప్రజలకు ప్రియమైన వాడవు, ధైర్యవంతుడవు, కావున నీవు స్వీయ ధర్మమును కాపాడుము. భయము నుండి విముక్తుడవగుదువు.
బ్రాహ్మణులారా భగవంతుడగు వ్యాసునిచేత ఇట్లు పలుకబడిన, శత్రువుపురములను జయించిన అర్జునుడు, ఆయనకు నమస్కరించి యుగధర్మములను గూర్చి ప్రశ్నించెను.
సత్యవతీకుసూరుడైన వ్యాసుడు, భగవంతుడైన శివునికి నమస్కరించి, అనాదిసిద్ధములగు యుగధర్మములను సంపూర్ణముగా ఆ అర్జునునకు తెలియజేసేను.
ఓ రాజా యుగధర్మములను గూర్చి నీకు సంగ్రహముగా తెలియపరుతును. విస్తరముగా వర్ణించి చెప్పుటకు నాకు శక్యము కాదు.
యుగములలో మొదటిది కృతయుగమని, తరువాత త్రేతాయుగమని పండితులచేత చెప్పబడినది. ఓ పొరుదో మూడవదిద్వాపరమని, నాలుగవది కలియుగమని చెప్పబడుచున్నది.
కృతయుగములో ధ్యానము, తపస్సు ముఖ్యమని, త్రేతాయుగములో జ్ఞానము ప్రధానమని చెప్పబడినది. ద్వాపరయుగములో యజ్ఞమును, కలియుగములో ఒక్కదానమునే ప్రధానముగా పండితులు చెప్పుదురు.
కృతయుగములో బ్రహ్మప్రధాన దేవతగా ఉండును. త్రేతాయుగమందు భగవంతుడగు సూర్యుడు. ముఖ్యదైవము. ద్వాపరయుగములో విష్ణువు, కలియుగములో మహేశ్వరుడు ప్రధానదేవతలుగా నుందురు.
బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు వీరందరు కలియుగములో కూడ పూజింపబడుదురు. పినాకధారియగు భగవంతుడు శివుడు నాలుగు యుగములలో కూడ పూజింపబడుచున్నాడు.
మొదటి దైన కృతయుగములో ధర్మము నాలుగు పాదములు కలదిగా చెప్పబడినది. త్రేతాయుగములో మూడు పాదములు కలదిగా, ద్వాపరములో రెండుపాదములు కలదైయుండును.
కలియుగములో మూడు పాదములు లేనిదై కేవలము. తన ఉనికిని కాపాడుకొనుచు నీలిచి యుండును. కృతయుగములో దంపతుల సంతానోత్పత్తి విషయలోలత లేనిదిగా ఉండును.
ప్రజలు కృతయుగములో అందరు ఎల్లప్పుడు తృప్తి కలిగి, సమస్తానందములు, సుఖానుభవము కలవారై యుందురు. వారికి నీచత్వము, శ్రేష్ఠత్వము అనుభేదభావములు లేకుండును.
కృతయుగములో ఆ ప్రజలకు ఆయువు, సుఖము, రూపము అందరికి సమానముగా నుండును. జనులు శోకరహితులు, తత్త్వవిచారముకలవారు, ఏకాంతవాసము ప్రధానముగా కలిగి యుందురు.
కృతయుగములో ప్రజలు ధ్యానమునందు, తపస్సు చేయుట యందు నిష్ఠకలవారుగా, మహాదేవుడగు శివునియందు శ్రద్దకలవారుగా, కోరికలులేక ప్రవర్తించువారుగా, ఎల్లప్పుడు సంతోషించిన మనస్సుకలవారుగా ఉందురు.
శత్రువులను తపింపజేయు అర్జునా ఆ జనులు పర్వతములయందు, సముద్రప్రాంతములయందు నివసించువారు, గృహనివాసములేని వారుగా బ్రాహ్మణులు వర్తింతురు. తరువాత కాలక్రమమున త్రేతాయుగములో రసోల్లాసము నశించును
ఆ విధమైన సిద్ది నశించిపోగా మరియొక విధమైన సిద్ధి సంభవించినది. ఆ సమయములో మేఘస్వరూపముచేత జల సౌఖ్యమునకు విఘాతముకలుగగా,
గర్జనముచేయు స్వభావముకల మేఘములనుండీ వర్షపాతము ప్రారంభమైనది. ఆ వర్షముచేత ఒక్కసారిగా భూప్రదేశము తడుపబడగా, అప్పుడా ప్రజలకు గృహములని పేర్కొనదగిన వృక్షములు ఆవిర్భవించినవి. ఆ వృక్షముల వలన ప్రజలకు అన్ని విధములైన అవసరముల వినియోగము కలుగుచుండెను.
ఆ త్రేతాయుగప్రారంభములో ప్రజలు ఆ వృక్షసంబంధిగృహములలో జీవనము సాగించిరి. తరువాత చాలకాలము గడువగా మరల మార్పుకలుగుట వలన అజనులకు
ఆ సమయములో ఆ ప్రజలకు కాలపు ప్రభావముచేత అంతకుముందు కన్న భిన్నముగా, రాగము, లోభము ప్రధానముగాకల భావము ప్రవర్తించెను.
తరువాత గృహమను సంజ్ఞతో వ్యవహరింపబడువృక్షములన్నియు నశించును. అప్పుడవి యన్నీయు నశించగా, దంపతుల వలన జన్మించిన ప్రజలు కలత చెందినవారై
అప్పుడు ఆ సిద్ధిని గూర్చి సత్యాభిధ్యాసముతో ధ్యానము చేయుదురు. తరువాత వారికి గృహసంజ్ఞకములైన వృక్షములు మరల ప్రాదుర్భవించినవి.
ఆ వృక్షములు వస్త్రములను, పండ్లను, ఆభరణములను గూడ కలుగజేసెను. ఆ ప్రజలకు వానియందే వాసన, రంగు, రుచితో కూడినది
తేనెటీగలచే చేయబడని, గోప్పబలము కలిగించునది అగుతేనే చెట్లయొక్క ప్రతి భాగమునందు కలుగుచుండెను. త్రేతాయుగప్రారంభములో జనులు ఆ తేనెతో తమ జీవనమును గడపుచుండిరి.
ఆ సిద్దిచేత ప్రజలందరు సంతోషించినవారు, తృప్తిపొందినవారును అయి, హ్యాధిపీడలేనివారై ఉండిరి. తరువాత కొంత కాలము గడువగా మరల లోభగుణముచే ఆవరింపబడినవారైరి.
వారు ఆవృక్షములను, తేనెటీగలచేత చేయబడిన తేనెను బలాత్కారముతో స్వీకరించిరి. లోభగుణముచేత చేయబడిన ఆ ప్రజల అపరాధము చేత మరల;
ఆ కల్పవృక్షములు తేనెతో గూడ అక్కడక్కడ నశించి పోయినవి. ఆ జనులు చలి, వర్షము, ఎండలు తీవ్రముగా బాధింపగా దుఃఖమును పొందిరి.
చలి, ఎండ మొదలగు జంట దుఃఖాలతో బాధింపబడినవారై ప్రజలు తమనివాసమునకై ఆచ్చాదనతో కూడిన ఆవరణములు కల్పించుకొనిరి. శీతోషాదులగు ద్వంద్వములకు నివారణోపాయములను ఏర్పరచుకొని జీవనోపాధిని ఆలోచించిరి.
ఆ సమయములో కల్పవృక్షములు తమఫలములు, తేనెపట్లతోగూడ నశించగా త్రేతాయుగములోని ప్రజలకు మరల ఒకమారు సిద్ధి సాక్షాత్కరించెను.
ఆజనుల జీవనోపాధికి సహాయకారిగా వర్షముఅనునది మిక్కిలి ఎక్కువగా ఉపకరించినది. పల్లపు ప్రదేశములవైపు ప్రవహించు ఏ వరోదకములు కలవో అవి ఆజనులకు;
వర్షముల సమూహముచేత ప్రవాహస్థానములైన నదులుగా అవతరించినవి. ఎప్పుడు భూప్రదేశము పైన జలములు అధికముగా వర్ష, నదీరూపములో వ్యాపించినవో
అప్పుడు భూమికి జలములకు సంయోగము కలిగినందున, నాగలిచేదున్నబడినవి, విత్తనములు వేయబడినవి, గ్రామసంబంధమైనవి, అడవులకు సంబంధించినవి అగు పదునాలుగు విధముల ఓషధులు మొలకెత్తినవి.
ఆయాఋతువులకు చెందిన పూవులు, పండ్లతో వృక్షములు, తీగలు జనించెను. అప్పుడుమరల ప్రజలకు అంత కోరిక, లోభము అను గుణములు ప్రభవించినవి.
త్రేతాయుగప్రభావముచేత అవశ్యముగా కావలసియున్న రాగలోభవ్యాప్తిచేత ప్రజలు నదులను, పొలములను, పర్వతములను తమకు ఉపకరణముగా స్వీకరించిరి.
చెట్లు, పొదలు, ఓషధులు పోటి బలాన్ననుసరించి పరస్పర వినిమయముతో భూమిని ప్రవేశించినవి.
పితామహుడైన బ్రహ్మయొక్క ఆజ్ఞచేత పృథువు భూమిని పీతికేను. అప్పుడు ఆ ప్రజలు పరస్పరము క్రోధావేశమును పొందినవారై ఆ ఓషధులను స్వీకరించిరి.
కాలప్రభావముచేత, జనుల బలప్రయోగముచేత సదాచారము క్షీణించిపోగా, ఈవిషయమును తెలిసికొని భగవంతుడగు బ్రహ్మ లోకమర్యా దను కాపాడుటకొరకు;
బ్రాహ్మణులయొక్క హితము కొరకు బ్రహ్మదేవుడు క్షత్రియులను సృజించెను. ఆ త్రేతాయుగములో బ్రహ్మ వర్ణముల, ఆశ్రమములయొక్క వ్యవస్థను కూడ నియమించెను.
పశువుల హింసతో సంబంధములేనీ యజ్ఞముల అనుష్టానమును గూడ బ్రహ్మ ఏర్పరచెను. తరువాత ద్వాపరయుగములోకూడ, వర్ణాశ్రమ ధర్మములు, యజ్ఞములు కొద్దీ భిన్నాభిప్రాయముతో ప్రవర్తించినవి.
అనురాగము, లోభము, యుద్ధము అనువానిని బుద్ధియొక్క నిశ్చయముగాతలచి, నాలుగు పాదములు కలవేదము ఇక్కడమూడు విధములుగా భావించబడుచున్నది.
వేదవ్యాసమునులచేత ఆవేదము ద్వాపరాదియుగములందు నాలుగు భాగములుగా ఏర్పరచబడినది. మురల ఋషికుమారుల చేత వారివారి దృష్టిభేదములచేత వేదములు విభజించబడినవి.
మంత్ర, బ్రాహ్మణ భాగముల విన్యాసములు, స్వరముల, వర్ణముల మార్పులచేత ఋక్కు యజుస్సు, సామము అనువేదముల సంహితలుగా గోప్పఋషులచేత చెప్పబడుచున్నవి.
సాధారణమైన భావనకూడ, అక్కడక్కడ దృష్టిభేదములతో వివరించబడినది. బ్రాహ్మణభాగము, కల్పసూత్రములు బ్రహ్మవచనములను, ఇతి హాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు, అనావృష్టి, మరణము, అట్లే ఇతరములైన ఉపద్రవములు వాక్కు మనస్సు, శరీరము అను త్రికరణముల వలన సంభవించిన దోషములచేత మనుష్యులకు నిర్వేదము కలుగుచుండును. అటువంటి వారికి విషయసుఖములందు విరక్తి కలిగినప్పుడు దుఃఖమునుండి మోక్షము పొందువిచారము కలుగును.
ఆలోచించుట వలన వైరాగ్యము, వైరాగ్యమువలన దానిలోని దోషాలను గ్రహించుట, దోషముల దర్శనం వలన ద్వాపరయుగంలో జ్ఞానము సంభవిస్తుంది.
విప్రులారా! ద్వాపరయుగంలో రజస్తమోగుణాలతో కూడిన ఇటువంటి వ్యవహారముంటుంది. మొదటి కృతయుగంలో ధర్మంప్రధానమై అదీ త్రేతాయుగంలో కూడా ప్రవర్తిస్తుంది. ద్వాపరయుగంలో ఆ ధర్మం వ్యాకులత చెంది, కలియుగంలో క్షీణదశను పొందుతుంది.
శ్రీకూర్మపురాణములో యుగవంశాను కీర్తనమను ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము
