కూర్మ మహా పురాణము
11వ అధ్యాయము
ఈశ్వరుడు చెప్పెను.
ఇకమీద అత్యంత దుర్లభమైన యోగమును వివరించేదను. ఈయోగము చేత సూర్యుని సాక్షాత్కరించుకొనునట్లు ఈశ్వర సాక్షాత్కారము పొందగలరు.
యోగాగ్ని త్వరితముగా సకలపాపరాశిని భస్మము చేయగలదు. సాక్షాత్తు మోక్షమును ప్రసాదించు ప్రసన్నమైన జ్ఞానము కలుగును. యోగము వలన జ్ఞానము కలుగును. జ్ఞానము యోగమును ప్రవర్తింపజేయును. యోగ జ్ఞానములు కలవారికి ఈశ్వరుడు ప్రసన్నుడగును. ప్రతి దినము ఒకమారు, రెండు మారులు లేదా మూడుమారులు లేక అన్ని కాలములందు నా యోగసాధనలో నున్నవారు సాక్షాత్తు మహేశ్వరుడనియే తెలియవలెను.
యోగము రెండు విధములుగా తెలియుము. మొదటిది అభావయోగము, రెండవది సర్వయోగములలో ఉత్తమ యోగమనబడు మహా యోగము. నిర్వికల్ప స్వరూపము ధ్యానించబడునది అభావ యోగము. దీనివలన యోగాత్మను దర్శించగలుగును. ఇక నిత్యానంద రూపుడు, నిరంజనుడునగు పరమాత్మ దర్శనము చేయించునది, నాలో ఐక్యము కలిగించునది మహాయోగమనబడును.
ఇతర గ్రంథములలో యోగులు ఆచరించు ఇతర యోగములు చాలా చెప్పబడి యున్నవి. కాని అవియన్నియు బ్రహ్మయోగమునకు వ అంశముతో సాటిరావు. విముక్తులైనవారు ఈశ్వరుని ప్రపంచమున, ప్రపంచమును ఈశ్వరునిగా చూచెడి యోగము అన్ని యోగాలలో ఉత్తమోత్త మము. ఈశ్వరునీ చూపనీ వేదబాహ్యములైన వందలు వేలు యోగములు అభ్యసించబడుచున్నవి. కానీ వాని వలన నో సాక్షాత్కారము లభించదు.
ప్రాణాయామము, ధ్యానము, ప్రత్యాహారము, ధారణ, సమాధి, యమము, నియమము ఆసనము, ఇతర విషయముల నుండి మరల్చి చిత్తమును నా యందే యుంచుట యను నీ ఎనిమిది యోగ సాధనములుగా చెప్పబడినవి.
అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవీ సంక్షేపముగా యమములనబడును. ఇవి మానవులకు చిత్త శుద్ధిని ప్రసాదించును. కర్మతో, మనసుతో మాటతో అన్ని వేళల యందు అన్ని ప్రాణుల యందు కష్టము కలిగించకుండుట అహింసయని పరమరులు చెప్పిరి. అహింసను మించిన ధర్మము, అహింసను మీంచీన సుఖము లేదు. వేద విధితో చేయు హింస అహింసగానే పేర్కొనబడినది. సత్యముతో అన్నింటిని పొందగలడు. ఈ జగమంతయు సత్యములోనే నిలిచియున్నది. యథార్థమును చెప్పు ఆచారమే సత్యమని ద్విజులు చెప్పిరి. దొంగతనముగా గాని బలవంతముగా గానీ, పరద్రవ్యమును హరించుట సేయమనబడును. స్తేయము నాచరింపకుండుట అస్తేయమనబడును. ఇది ధర్మ సాధనముగా చెప్పబడినది. కర్మచేత, మనసుచేత, వాక్కుచేత అన్నివేళల, అన్ని అవస్థలలో, అన్నిచోట్ల మిధున ధర్మమును త్యజించుట బ్రహ్మచర్య మనబడును.
ఆపదలో కూడా ఇష్టపూర్వకముగా ఏ ద్రవ్యమును స్వీకరింపకుండుట ఆపరిగ్రహమనబడును. ఈ అపరిగ్రహమును అత్యంత యత్నముతో పాటించవలెను. తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, ఈశ్వర పూజనము - ఇవి యోగసిద్ధిని ప్రసాదించు నియమములు. ఉపవాసము, పరాకము, కృచ్ఛము, చాంద్రాయణము మొదలగు వ్రతములతో శరీరమును శోషింపచేయుట ఉత్తమతపస్సని తాపసులు చెప్పిరి.
వేదాంతశాస్త్రమును, శతరుద్రీయమును, ప్రణవము మొదలగు - సినీ జపించుట స్వాధ్యాయమనబడును. ఇది మనసును పరిశుద్ది చేయునని పండితులు చెప్పెదరు. ఈ స్వాధ్యాయము చికము, ఉసాంశము, మానసము అని మూడు విధములు. మొదటి దానికన్నా తరువాత
ఉత్తమము అని వేదార్థము తెలిసినవారు చెప్పెదరు. విను వారికి ఎదుటివారికి స్పష్టముగా శబ్దములు తెలియునట్లు పలుకుట పాచిక స్వాధ్యాయమందురు. ఇక ఉపాంశు లక్షణము వినుము. పెదవులు మాత్రము కదలును. ఇతరులకు శబ్దము వినరాదు, ఇది ఉపాంశు స్వాధ్యాయుము. వాచికముకన్న ఇది వేయిరెట్లు ఉత్తమము. పదములు, అక్షరములు కలిపీ చేయుచున్నను పెదవుల కదలిక కూడా లేకుండగా అన్ని శబ్దములను చింతించుట మానస జపమందురు. దైవ సంకల్పము వలన లభించునదే చాలును అను బుద్ధి సంతోషమనబడును. ఇది పరమానందమును కలిగించును.
శాచము బాహ్యమని ఆభ్యంతరమని రెండు విధములుగా చెప్పబడినది. మృత్తికచేత, జలముచేత చేయబడునది బాహ్యశౌచమని, మనః పరిశుద్ది అభ్యంతర శౌచమని యందురు. స్తుతి, స్మరణము, పూజ - ఇవి వాజ్మనః కాయకర్మలు. ఈ మూడింటిచే పరమశివుని యందు నీశ్చలమైన భక్తి ఈశ్వర పూజన మనబడును. ఇట్లు యమ నియమములు చెప్పబడినవి. ఇక ప్రాణాయామమును తెలియుము. తన దేహము వలన కలుగు పోయువు ప్రాణమనబడును. ప్రాణమును నిరోధించుట ప్రాణాయామము. ఈ ప్రాణాయామము ఉత్తమ, మధ్యమ, అధమ భేదములతో మూడు విధములు. మరల సగర్భము, అగర్భము అని రెండు విధములు. ద్వాదశ మాత్రాకాలము ఆచరింపబడునదీ మందమని. (అధమమని), ఇరువది నాలుగు మాత్రలకాలము ఆచరింపబడునది. మధ్యమమని, ముప్పదియారు మాత్రల కాలమాచరింపబడునది ఉత్తమమని చెప్పబడుచున్నది. స్వేదమును మాత్రము కలిగించు ప్రాణాయామము అధమమని, కంపనము కలిగించునది మధ్యమమని, ఉత్తానము కలిగించునది ఉత్తమమని చెప్పబడును. ఆనందము కలిగించు ప్రాణాయామము ఉత్తమోత్తమము అని తెలుపబడును. అనగా ఒకదానికంటే మరియొకటి అధికానందము కలిగించునని తెలియవలెను.
జపముతోపాటు చేయు ప్రాణాయామము సగర్భమని, జపహీనులుగా చేయు ప్రాణాయామము అగర్భమని యోగులు చెప్పిన ప్రాణాయామ లక్షణము. వ్యాహృతులతో, ప్రణవముతో, శీర్షమంత్రముతో కూడియున్న గాయత్రిని ప్రాణాయామముతో మూడుసార్లు జపించిన అతి ఉత్తమ ప్రాణాయామమనబడును. మనో నిగ్రహముగల యోగులు రేచకము, పూరకము, కుంభకమని యీ ప్రాణాయామము మూడు విధములని చెప్పిరి.
ఎల్లప్పుడు వాయువును బయటికి విడచుట రేచకమని, వాయువును నిరోధించుట పూరకమని, వాయు సామ్యస్థితి కుంభకమని యనబడును. శబ్దస్పర్శాది విషయములందు సహజముగా ప్రవర్తించు ఇంద్రియములను నిగ్రహించుట ప్రత్యాహారమని సజ్జనులందురు. హృదయ పద్మమున, నాభియందు, శిరసునందు, పర్వతశిఖరమున మనసును నిలుపుట 'ధారణ' అనబడును. ఒక్కొక్క దేశస్థితిని అనుసరించి, బుద్ధిని, ఏకాగ్రము చేయుట, ఇతర దేశముల నుండి సంబంధమును పరిత్యజించుట ధ్యానమనబడును. ఏ దేశమును ఆశ్రయించకుండగా, ఒకే ఆకారముతో, చిత్తమును నిలుపగలుగుట సమాధియనబడును. ఈ సమాధిలో అర్థము మాత్రము భాసించును. ఇది ఉత్తమ యోగసాధనము. ద్వాదశ ఆయామములు ఒక ధారణ, ద్వాదశ ధారణలు ఒక ధ్యానము, ద్వాదశ ధ్యానములు ఒక సమాధి అని చెప్పబడును.
ఆసనము స్వస్తికమని పద్మమని, అర్ధాసనమని మూడు రకములు. ఈ ఆసనములు అన్ని సాధనములలో ఉత్తమ సాధనములు. రెండు పాదములను రెండు ఊరువులపై నుంచి కూర్చొనుటను పద్మాసనమని చెప్పుదురు. ఇది ఉత్తమాసనము. ఒక పాదమును ఒక ఊరువుపై నుంచి కూర్చొనుట అర్థాసనమనబడును. ఇదియు ఉత్తమ యోగసాధనమే ! రెండు పాదములు రెండు మోకాళ్లపై నుంచి కూర్చొనుట స్వస్తికాసనమని పేరు.
అదేశమున, అకాలమున యోగము నాచరింపరాదు. అగ్ని సమీపముగా, జల ప్రవాహ సమీపమున, ఎండుటాకుల మధ్య, జంతువులు సంచరించుచోట, స్మశానము, ప్రాత యింటిలో, నాల్గుబాటల కూడలిలో ఎక్కువ ధ్వని కలుగుచోట, భయము కలిగించుచోట, దిష్టిబొమ్మల దగ్గర, పుట్టల వద్ద, అశుభ ప్రదేశమున, దుర్జనులున్నచోట,
దోమలు, చీమలు మొదలగు కీటకములు సంచరించుచోట, శరీరమునకు బాధ ఉన్నపుడు, మనసున చెడు ఆలోచనలు కలిగియున్నపుడు యోగమును ఆచరించరాదు. ఏకాంతప్రదేశములో, శుభప్రదేశమున, పర్వతగుహలో, నదీతీరమున, పుణ్యప్రదేశమున, దేవాలయమున, ఇంటిలో శుభకరమగు సమయమున, సుందరమగుచోట, జనులు లేనిచోట, జంతువులు సంచరించనిచోట, నా యందు చిత్తమును లగ్నముచేసి యోగమును ఆచరించవలెను.
శిష్యులతో కూడిన యోగీంద్రులను, వినాయకుని, గురువును, నన్ను, నమస్కరించి, సావధాన చిత్తుడై యోగమును ప్రారంభించవలెను. స్వస్తికమును, పద్మమును, అర్ధాసనమును అధిష్టించి, అర్ధనిమాలితనేత్రుడై, నాసికాగ్రమున దృష్టి నిలిపి, భయరహితుడై, శాంతుడై, మాయామయ జగత్తును విడిచి, తన ఆత్మలో అంతర్యామిగానున్న పరమేశ్వరుని ధ్యానింపవలెను.
శీఖాగ్ర భాగమున పండ్రెండంగుళముల ప్రదేశమున, ఒక పద్మమును కల్పించు (భావించు) కొనవలయును. ఈ పద్మము ధర్మ స్కంధము నుండి పుట్టినది. జ్ఞానమను నాళము కలది. పరమ సుందరము. అప్లైశ్వర్యములు దళములుగా గలది. తెల్లనిది. వైరాగ్యమను కర్ణిక కలది. ఆ కర్ణికలో హిరణ్మయ కోశమును సర్వశక్తి మయమును చింతించవలెను. ఈ కోశము నందు దివ్యము, అవ్యయము, ఓంకార పొచ్యము, అవ్యక్తము, బహుకాంతి పుంజ సమన్వితము, అక్షరము, పరిశుద్దమగు జ్యోతిని చింతించవలెను. తన ఆత్మను అభేద బుద్దీతో ఆజ్యోతిస్సులో ఉంచి, ఆకాశ మధ్యమున నున్న పరమకారణమైన ఈశ్వరుని ధ్యానించవలయును. అపుడు ఆత్మ సర్వవ్యాపి యగును. ఇంక దేనిని చింతించరాదు.
ఇది పరమ గుహ్యమైన ధ్యానము. ఇప్పుడు యింకోక ధ్యానమును చెప్పెదను. మొదట చెప్పబడిన పద్మమును హృదయమున చింతించు కొనుచు, ఆ కమలమున అగ్నితో కూడిన ఆత్మను కర్త ఇరువది అయిదవ తత్త్వమైన పురుషుని అగ్నిశిఖ సమాహాకారునీ, మధ్యమున చింతించుచు, ఆ ఆత్మ మధ్యమున ఓంకార పాచ్యుడు పరమాకాశమయుడు శాశ్వతమగు శివతత్త్వమును ధ్యానించవలయును.
ఆ జ్యోతి మధ్యన ప్రకృతిలో లీనమైన అవ్యక్తమును, సర్వోత్తమమైన పరంజ్యోతిని సర్వాధారమును, నిరంజనమును, ఏకరూపుడగు "మహేశ్వరుని, తన్మయుడై ధ్యానించవలయును లేదా అన్ని తత్త్వములను ప్రణవముతో పరిశుద్ధీ గావించి, నిర్మలము పరమ పదమైన నాయందు ఆత్మను నిలిపి, జ్ఞాన జలముతో దేహమును ముంచి, నా స్వరూపుడై సోయందే మనసునిల్పి, అగ్నిహెూత్రము వలన కలిగిన భస్మమును తీసుకొని “అగ్నిమీడే...” ఇత్యాది మంత్రములతో అన్ని అవయములకు అందుకొని, పరంజ్యోతి స్వరూపుడైన ఈశ్వరుని తనలో ధ్యానించ వలయును.
జీవ బంధమును విడిపించు నీ యోగమును పాశుపత యోగమందురు. ఇది సర్వవేదాంతసారము, సర్వాశ్రమములలో ఆచరించదగినదని చెప్పుదురు. ఇది పరమోత్కృష్టము. పరమ రహస్యము. నా సాయుజ్యమును కలిగించునది. భక్తులు, బ్రహ్మచారులగు ద్విజులకు ఈ యోగము చెప్పబడినది. బ్రహ్మచర్యము, అహింస, క్షమ, శౌచము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, సంతోషము, సత్యము, ఆస్తిక్యము, అనునవి ఈ యోగమునకు అంగములు. వీనిలో ఒకటి లోపించినను ప్రతమే లోపించును. కావున ఆత్మగుణ సమన్వితుడై యీ వ్రతమును అనుష్ఠించవలెను.
రాగమును, భయమును, క్రోధమును విడచి, మన్మయులై నన్నే ఆశ్రయించి, ఈ యోగముతో పవిత్రుల్లో చాలా మంది నా రూపమును పొందిరి. ఎవరు ఏ విధముగా నన్ను ఆశ్రయింతురో నేను గూడా వారిని ఆ విధముగానే పరిగ్రహించెదను. కావున పరమేశ్వరుడనైన నన్ను జ్ఞాన యోగముతో ఉపాసించవలయును. లేనిచో భక్తియోగముతో లేదా వైరాగ్యముతో సేవించవలయును. సర్వకాలములయందు శుభమై జ్ఞానముతో కూడిన మనస్సుతో, నన్ను పూజించవలయును. అన్ని కర్మలను విడిచి, భిక్షతో లభించినదానిని భుజించుచు, పరిగ్రహమును విడచి, ఈ యోగమును ఆచరించిన నా సాయుజ్యమును పొందుదురు. ఇది పరమ రహస్యమైన యోగము. నీకు చెప్పబడినది,
ఏ ప్రాణిని ద్వేషించక, మిత్రభావము కరుణ కలిగి, అహంకార మమకారములు లేని నా భక్తుడు, నాకు ప్రియతముడు, నిత్యసంతోషి, నిత్య యోగి, మనసును నియమించినవాడు, దృఢనిశ్చయము కలవాడు, మనసును బుద్ధిని నా యందు నిలిపీన నా భక్తుడు నాకు ప్రియతముడు. ఎవని వలన లోకము భయపడదో, ఎవడు లోకమునుండి భయపడడో, సంతోషము, అసూయ, భయము, ఉద్వేగము లేనివాడు నాకు ప్రీతిపాత్రుడు. అపేక్షలేనివాడు, శుచి, దక్షుడు, ఉదాసీనుడు, వ్యధచెందనివాడు, అన్ని ప్రయత్నములు విడిచినపోడు, భక్తికలవాడు, నాకు ప్రీతిపాత్రుడు. నీందాస్తుతులను సమముగా స్వీకరించువాడు, మౌనమునవలంబించువాడు, లభించిన దానితో సంతోషించెడివాడు, ఒకేచోట స్థిరనివాసము లేనివాడు, స్థిరమైన బుద్ధిగల నా భక్తుడు నన్ను చేరగలడు. నా యందు మనసుంచి, అన్నివేళల అన్ని పనులు ఆచరించుచు, నా అనుగ్రహము వలన శాశ్వతమైన పరమపదము పొందగలడు.
మనః పూర్వకముగా అన్ని కర్మలను, నా యందు ఉంచి, సన్నే ధ్యానించుచు, కోరికలు లేనివాడై, మమకారమును విడచి, నన్ను ఒక్కనీ మాత్రమే శరణు వేడవలెను. కర్మఫల సంగమును విడచి, ఎల్లప్పుడు తృప్తితో నిలిచి, ఆశ్రయరహితుడై, కర్మల నాచరించినను, ఆ కర్మలతో బద్ధుడు కాడు. ఆశలను విడచి, మనసును నియమించి, అన్ని పరిగ్రహములను విడచి, కేవలము శరీర కర్మలను మాత్రము ఆచరించగలవాడు పరమపదమును పొందును.
దైవ సంకల్పమున లభించిన దానితో సంతుష్టిని పొందుచు, శీతోషాది ద్వంద్వములు సహించుచు, నా అనుగ్రహము కొరకు సంసార సౌశకమగు కర్మనాచరించుచు, నాయందు మనసుంచి, నాకు నమస్కరించుచు, నన్ను పూజించుచు,నా యందు మనసు నిలుపుచు, నన్ను యోగీశ్వరునిగా, పరమేశ్వరునిగా తెలిసినవాడు నన్నే చేరును. నా యందు బుద్ది నిలిపినవారు ఎపుడు ఒకరికొకరు నా గురించియే బోధించు కొనుచు, నా గురించియే చెప్పుకొనుచు, నా సాయుజ్యమునే పొందగలరు. ఇట్లు నిత్యయోగముతోనున్న వారికి ప్రకాశవంతమైన జ్ఞాన దీపముతో అజ్ఞానాంధకారమును, సకల కర్మలను నశింపచేయుదును.
నా యందు బుద్ధి కలిగి నిత్యము నన్నే పూజించువారీ యోగక్షేమములను నేను వహించెదను. కామ భోగముల కొరకు, ఇతర దేవతలను పూజించు వారు, విషయ భోగ రూప ఫలమును మాత్రమే పొందగలరు. అన్య దేవతా భక్తులగువారు ఆయా దేవతలను పూజించుచున్నను, నా భావన కలిగియున్నచో వారు కూడా ముక్తిని పొందెదరు. కావున ఈశ్వరులు కాని ఇతర దేవతలను విడచి, ఈశ్వరుడనైన నన్నే ఆశ్రయించినచో పరమపదమును పొందును.
పుత్రాదులయందు స్నేహమును, శోకమును విడిచి, సర్వపరిగ్రహములను త్యజించి, దేహమునందు విరక్తి పొంది, మరణించువరకు, పరమేశ్వరుని ఆరాధించవలేను. అన్ని భోగములను వదలి, ఈ దేహమున పరమేశ్వరుని ఆరాధించుచున్న పోరు ఒకే జన్మలో ముక్తిని పొంద -గలరు. పరమానంద స్వరూపము, లింగాకారము, కేవలము సద్రూపము, నిరంజనము, జ్ఞాన స్వరూపము, సర్వవ్యాపీ, ఎపుడు యోగుల హృదయములో నిలుచునదిగా ధ్యానించవలయును.
ఇతరులు కూడా నియమపూర్వకముగా, యధావిధిగా ఎక్కడో ఒకచోట, లింగమును భావించి, మహేశ్వరుని అర్చించువారు ముక్తిని పొందెదరు. జలమధ్యమున, అగ్నిమధ్యమున, ఆకాశమున, సూర్యునిలో, ఇతర ప్రదేశములలో, రత్నాదులయందు, ఈశ్వర లింగమును భావించి శివుని ఆరాధించవలెను. ఈ జగమంతయు లింగమయము. లింగమందే సకల జగత్తు ప్రతిష్టించబడినది. కావున లింగమున యీశ్వరుని శాశ్వతుని ఏదో ఒక ప్రదేశములో అర్చించవలయును.
క్రియాశీలురగు, అనగా శ్రాత స్మార్త కర్మలను సావధానముగా ఆచరించువారు అగ్నిలో, లింగమును ఆరాధించవలయును. యధావిధిగా శ్రాతస్మార్తములను ఆచరించి శుద్ధాంతః కరణుడై, బ్రహ్మనిష్ఠుడగు మనిషి, ఆకాశమున గానీ, సూర్యుని యందుగాని లింగమును ఆరాధించ వలయును. వేదశాస్త్రములయందు శ్రద్ద ఉన్నను ఐహ లౌకిక భోగముల యందు ఆశకలిగి, ఆ భోగ ప్రాప్తికి ప్రయత్నించు మూర్చులు కాషాదులలో లింగమును అర్చించవలయును. యోగులు హృదయమున అర్చించవలెను. విజ్ఞానము కలుగకున్నను సంసారము నందు విరక్తి కలిగి, నాయందు ప్రీతిగలవాడై పరబ్రహ్మ స్వరూపమగు ప్రణవమును జీవించినంతకాలము జపించవలయును లేదా మరణించువరకు శతరుద్రీయమును, ఏకాకియై మనోనిగ్రహముతో జపించిన పరమ పదమును పొందును. జీవితకాలమంతయు నాయందే మనసు నీలిపీ, వారణాసిలో వసించినను ఈశ్వరాను గ్రహముతో పరమపదము చేరును. శరీరము నుండి జీవులు బయలు వెడలు సమయములో వారణాసిలో నివసించువారందరికి సంసార బంధమును విడిపించు జ్ఞానమును ఈశ్వరుడు ప్రసాదించును.
సకల వర్ణాశ్రమ ధర్మములను సోయందు మనసు నిలిపి ఆచరించుచు, అదే జన్మయందు జ్ఞానమును పొందీ శివసాయుజ్యమును పొందును. వారణాసిలో నీవసించువారు నీచులైనను, పాపులైనను, ఈశ్వరానుగ్రహము వలన సంసారమును తరింతురు. కానీ పాప బుదులకు బహు విఘ్నములు కలుగుచుండును. కావున ముక్తికోరువారు ధర్మము నోచరించ వలయును. ఇది సకల వేద రహస్యము, అందరికీ చెప్పరాదు. ధార్మికునికి, భక్తునికి, బ్రహ్మచారికి మాత్రమే చెప్పవలయును.
వ్యాసుడు చెప్పెను.
సర్వోత్తమమైన ఆత్మయోగమును చెప్పి ఈశ్వరుడు అచట ప్రక్కనే కూర్చొనియున్న నిరామయుడైన నారాయణునితో యిట్లు పలికెను. “బ్రహ్మవాదుల హితమును కోరి నేనీ యోగమును బోధించితిని. దీనిని మీరు ప్రశాంత చిత్తులగు శిష్యులకుపదేశించవలెను." ఇట్లు చెప్పి యోగీంద్రులతో మరల యిట్లు పలికెను. “బ్రాహ్మణులకు, భక్తులందరికి హితమును కలిగించుటకు మీరందరు విధి పూర్వకముగా శిష్యులకు నా జ్ఞానమును ఉపదేశించుడు.
ఇతడు, శ్రీమన్నోరాయణుడు, నేను ఈశ్వరుడను. మా యిరువురిలో భేదమును చూడనివారికే యీ జ్ఞానమును ఉపదేశించవలయును, సో దివ్యరూపమే నారాయణ నామముతో వ్యవహరించబడును. అన్ని ప్రాణులలో అంతర్యామిగా నుండును. ఈ రూపము శాంతము, అక్షరము. లోకమున భేదమును చూచు జనులు ఇందుకు భిన్నముగా చూచినను, వారు నన్ను చూడజాలరు మరల మరల పుట్టు చుందురు. అవ్యక్తుడైన విష్ణువును, మహేశ్వరుడనైన నన్ను ఒక్కటిగా చూచువారు మరల పుట్టరు. కావున ఆద్యంతములు లేనివాడు, అవ్యయుడు, ఆత్మ స్వరూపుడైన శ్రీ మహా విష్ణువును నన్నుగానే చూచుచు, అట్లే పూజింపుడు.
విష్ణువు మరియొక దేవతగా, నన్ను యింకొక దేవతగా భావించువారు ఘోర నరకములను పొందెదరు. నేను వారిలో నివసింపను. నన్ను ఆశ్రయించినవాడు మూర్ఖుడైనను, పండితుడైనను, బ్రాహ్మణుడైనను, చివరకు చండాలుడైనను ముక్తినిచ్చెదను. కాని నారాయణుని నిందించు పోరికీ మోక్షమియను. కావున మహాయోగి, పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణునీ నాకు ప్రీతి కలిగించుటకు, నా భక్తులు పూజించ వలయును, నమస్కరించవలయును.
ఇట్లు పలికి శంకరుడు వాసుదేవుని ఆలింగనము చేసికొని, వారందరు చూచుచుండగానే అంతర్థానము చెందెను, నారాయణుడు కూడా దివ్య దేహము విడచి తాపస వేషము స్వీకరించెను, యోగులతో యిట్లు పలికెను.
పరమశివుని అనుగ్రహముతో మీకు పరిశుద్దమగు జ్ఞానము లభించినది. ఈ మహేశ్వర జ్ఞానము సాక్షాత్తుగా సంసార నాశకము. మీ సంతాపము తొలగిపోయినది కదా కావున మీరందరు ధార్మికులైన శిష్యులకు పరమేశ్వర విజ్ఞానమును ప్రవర్తింపచేయుడు. ఈ జ్ఞానమును భక్తులకు శాంతులకు, ధార్మికులకు, ఆహితాగ్నికి, విశేషించి బ్రాహ్మణునికీ యీయవలయును. యోగ విదులలో ఉత్తముడగు విశ్వరూపుడగు నారాయణుడు యోగులతో యిట్లు పలికీ అంతర్థానము చెందెను.
ఆ యోగులు కూడా దేవాది దేవుడగు మహేశ్వరునికి సకల జగత్కారణుడైన సొరాయణునికి సమస్కరించి, తమ తమ స్థానములకు వెడలిరి. ఈశ్వర జ్ఞానమును సనత్కుమార భగవానుడు సంవర్తునికి, సంవర్తుడు సత్యవ్రతునికి బోధించిరి. యోగీంద్రుడైన సనందుడు పులహునికీ, పులహ ప్రజాపతి గౌతమునికీ, అంగిర ప్రజాపతి వేదవిత్తను భరద్వాజునికి బోధించిరి. కపిలుడు జైగీషవ్యునికి, పంచశీఖునికి బోధించెను. సర్వతత్త్వములు తెలిసిన నా తండ్రియగు పరాశరుడు సనకుని వలన యీ పరమ జ్ఞానము పొందెను. పరాశరుని వలన వాల్మీకి పొందెను. శంకరుని అంశతో పుట్టిన మహాయోగియగు వామదేవుడు ఈ జ్ఞానమును నాకు తెలిపెను. ఈ పోమదేవుడు సాక్షాత్తు మహేశ్వర రూపుడు.
శ్రీమస్నోరాయణుడు దేవకీ తనయుని అవతరించీ, స్వయముగా అర్జునునకు ఈ జ్ఞానమును ఉపదేశించెను. నేను రుద్రరూపుడైన వామదేవుని వలన యీ జ్ఞానము పొందిన నాటి నుండి, శంకరుని యందు విశేషభక్తి కలిగెను. అప్పటి నుండి నేను సర్వలోక శరణ్యుడగు రుద్రుని పొంధితీనీ. రుద్రుడు భూతేశుడు, గిరిశుడు, స్థాణుడు, దేవదేవుడు, త్రిశూలి, గోవృష వాహసుడగు శంభుదేవుని భార్యాపుత్రులతో కలిసి మీరు కూడా శరణుపొందుడు. శివుని యనుగ్రహముతో, కర్మయోగముతో మహాదేవుడు, గోపతి భూతి భూషణుడగు శంకరుని పూజించుడు.
ఇట్లు పలుకగా శౌనకాది మహర్షులు శాశ్వతుడు, స్థాణురూపుడు, సనాతనుడు, సత్యవతీసుతుడైన వ్యాసునికి నమస్కరించిరి. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు, సర్వలోక మహేశ్వరుడు అగు కృష్ణ ద్వైపాయనునితో సంతుష్టాంతరంగులై యిట్లు పలికిరి.
మి అనుగ్రహము వలన సర్వలోక శరణ్యుడు గోవృషధ్వజుడైన శంకరుని యందు దేవతలకు కూడా లభించని భక్తి పుడు మాకు కలుగును. ఓ మునిశ్రేష్టా ఇపుడు మాకు సర్వోత్తమమైన కర్మయోగము బోధించుము. ఈ కర్మయోగముతో ముముక్షువులు ఈశ్వరుని ఆరాధించ గలరు. నీ సమీపములో సూతుడు తమ పొక్యములను వినుగాక అట్లే సకలలోక రక్షణ, ధర్మ సంగ్రహము, కూర్మరూపి, దేవదేవుడగు శ్రీ మహా విష్ణువు అమృతమథన సమయమున యింద్రుడడుగగా చెప్పిన దానిని కూడా వివరించును.
సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు మునుల మాటలను విని, సుసమాహితచిత్తుడై సనాతనమైన కర్మయోగమును చెప్పసాగెను.
సనత్కుమారుడు మొదలగు ఋషులతో శంకరుడు చెప్పిన యీ సంవాదము వినీసపాడు అన్ని పాపముల నుండి విముక్తుడగును, బ్రహ్మ చర్య పరాయణులైన ద్వీజులకు వినిపించినవాడు, యీ అర్థమును విచారించినపోడు కూడా పరమపదమును పొందును, దృఢవ్రతుడై, భక్తి యుక్తుడై ప్రతిదినము ఈ సంవాదమును వినినవాడు అన్ని పాపముల నుండి వైదొలగి బ్రహ్మలోకమున అనందించును.
కావున పండితులందరు సర్వప్రయత్నముతో యీ శివ ఋషి సంవాదమును చదువవలెను, వినవలెను, మననము చేయవలెను. విశేషించి బ్రాహ్మణులకిది వర్తించును.
ఇది శ్రీ కూర్మపురాణమను షట్ సాహస్ర సంహితలో ఉపరి విభాగమున ఈశ్వరగీతలలో పదునొకండవ అధ్యాయము పూర్తి.
ఈశ్వరగీత సమాప్తము.
