కూర్మ మహా పురాణము

Table of Contents

10వ అధ్యాయము 

ఈశ్వరుడు పలికెను.

ఏ చిహ్నము లేనిది అద్వితీయమైనది, అవ్యక్తమగు లింగము బ్రహ్మమని నిశ్చయించబడినది. ఈ బ్రహ్మము స్వయం ప్రకాశము పరతత్వము పరమాకాశమున నుండునది. ఇదియే అవ్యక్త కారణరూపము అక్షరమగు పరచుపదము. ఇది నిర్గుణము శుద్ద విజ్ఞానము, దానిని పండితులు మాత్రమే చూడగలరు. వీరు బ్రహ్మ నిష్టులు శాంత సంకల్పులు ఎపుడు దానినే ధ్యానించువారు ఆ పరబ్రహ్మను తల్లింగమని శ్రుతి చెప్పు దానిని తెలియగలరు.

ఇతరోపాయములతో నన్ను చూడజాలరు. పరమతత్త్వమును తెలుపు ఇతర జ్ఞానమేదియూ లేదు. ఈ పరమ జ్ఞానమును విద్వాంసులు మాత్రమే తెలియగలరు. పరమ జ్ఞానము తప్ప ఇతర మంతయూ అజ్ఞానమే. ఈ అజ్ఞానము వలననే మాయ, మాయ జగత్తు ఉత్పన్న మాయెను.

ఈ జ్ఞానము నిర్మలము సూక్ష్మము నిర్వికల్పము నాశము లేనిది. ఇదియే నా ఆత్మ స్వరూపము. అనీ పండితులు చెప్పుచున్నారు. అనేక రూపములుగా చూచువారు కూడా భక్తిని ఆశ్రయించి అద్వితీయము అవినాశియగు తత్వమును తెలిసి దాని ద్వారా పరమతత్త్వమును తెలియుదురు, ఇతరులు పరమాత్మకు ఏకరూపముగా కాని అనేక రూపములుగా కాని భక్తితో చూచువారు కూడా బ్రహ్మ స్వరూపులుగానే చూడవలయును.

తనలోనే నిత్యానంద స్వరూపము నీర్వికల్పము సత్యస్వరూపమును అగు సాక్షాత్ పరబ్రహ్మను చూచుట యథార్థ స్థితి. పరమానంద స్వరూపుడు సర్వవ్యాపి యగు వానిని తనలో నున్నవానీనీ పరము నందు అవ్యక్తమున నున్న పరతత్త్వమును ఉపాసింతురు. ఇదియే పరమ విముక్తి ఇదియే నా సాయుజ్యము, ఇదియే బ్రహ్మైక్యము కైవల్యనుని కవులు తెలియుదురు. కావున ఆది మధ్యాంతములు లేనిది రెండవది లేనిది పరమ శుభ ప్రదము అగుతత్వమే ఈశ్వరుడు. ఇతడే మహాదేవుడు. ఇతనిని తెలిసినవారు విముక్తిని పొందెదరు.

ఆ పరంధామములో సూర్యుడు భాసించడు. చంద్రుడు భాసించడు. నక్షత్రములు భాసించవు. అగ్ని ప్రకాశించజాలడు. విద్యుత్ కూడా వెలుగొందదు. పరంధాముని కాంతితోనే ఇవన్నియూ వెలుగొందుచున్నవి. ఆ ధామము నిత్యము, ఆ కాంతి కూడా నీత్యముగా ప్రకాశించు చుండును. నీశ్చలము సత్గా భాసించు చుండును. ఎపుడూ ఉదయించియే యుండును. జ్ఞాన స్వరూపము నిర్వికల్పము శుద్దము బృహదా కారము పరమముగా భాసించుచుండును. ఈ ప్రకాశముననే బ్రహ్మ జ్ఞానులు ఎల్లప్పుడు నిత్యము అచలమగు తత్త్వమును దర్శింతురు. ఆ తత్త్వమే ఈశ్వరుడు.

ఆ పరమ పురుషుని అన్ని వేదములు నిత్యానందమయంగా, అమృత స్వరూపునిగా సత్యరూపునిగా పరిశుద్ధునిగా చెప్పుచున్నవి. వేదార్థ నిశ్చయము గలవారు ఆ పరమాత్మను ఓం అని ప్రణవముతో ధ్యానము చేతురు. ఆ పరమాకాశ మధ్యమున భూమి జలము అగ్నీ పాయువు ఆకోశము మనస్సు బుద్ధి ప్రాణము ఇవేవియూ ప్రకాశించవు. అచట ఏ చైతన్యము భాసించదు, అచట ఒకే ఒక శివుడు మాత్రమే భాసించు చుండును.

ఇట్లు పరమ రహస్యమును సర్వ వేదములలో అతీగూఢముగా దాగియున్న దానిని జ్ఞానామృతమును నీకు వివరించితిని. ఏకాంత ప్రదేశమున యోగాభ్యాసమును చేయువాడే ఈతత్త్వమును తెలియగలుగును.

ఇది షట్సాహస్త్రీ సంహితయగు కూర్మపురాణమున ఉపరి విభాగమున ఈశ్వరగీతలలో 10వ అధ్యాయము.