కూర్మ మహా పురాణము

Table of Contents

10 - రుద్రసృష్టిః

కూర్మస్వామి చెప్పెను -

భగవంతుడైన మహేశ్వరుడు వెడలిపోగా, మరల పితామహుడైన బ్రహ్మ, నాభినుండి పుట్టిన విశాలమైన ఆ పద్మమునే చేరెను.

తరువాత చాలా కాలమునకు అక్కడికి సాటిలేని పౌరుషము కలవారు, సహోదరులు అగు మధు కైటభులు అను గొప్ప రాక్షసులు ఇద్దరు వచ్చిరి.  పెద్ద పర్వతముల వంటి శరీరములు కలవారు, తీవ్రమైన కోపముతో నిండిన వారగు ఆ అసురులు దేవదేవుడైన విష్ణువు యొక్క చెవుల మధ్య భాగము నుండి జన్మించినారు.

వచ్చినటు వంటి ఆ ఇద్దరిని చూచి బ్రహ్మ విష్ణువుతో ఇట్లనెను. ఈ అసురులు మూడు లోకములను కంటకముల వలె బాధించుచున్నారు. వీరినీ చంపుట నీకు యుక్తము”.

ఆ బ్రహ్మ మాటలు విని ప్రభువైన నారాయణుడు ఆ రాక్షసులను చంపుటకు ఇద్దరు పురుషులను ఆజ్ఞాపించెను.

విప్రులారా! ఆ విష్ణువు ఆజ్ఞతో ఆ పురుషులిద్దరికి మధుకైటభులతో గొప్ప యుద్ధము జరిగినది. కైటభుడను అసురుని జిష్ణుడు, మధువును విష్ణువు జయించిరి

తరువాత లోకములకు ప్రభువైన హరి పద్మాసనముపైన కూర్చుండి యున్న బ్రహ్మను గూర్చి.. ప్రీతితో కూడిన మనస్సు కలవాడై మధురమైన వాక్యము నిట్లు పలికెను.

ప్రభూ! నా చేత భరింప బడుచున్న నీవు ఈ పద్మము నుండి దిగుము. తేజోమయుడవు, బరువు గల నిన్ను మో యుటకు నేను శక్తుడను కాను. అప్పుడు బ్రహ్మ కమలము నుండి దిగి విష్ణుమూర్తి శరీరము నావేశించి, అతనితో అభేదము పొంది విష్ణు కల్పితమైన నిద్రను పొందెను.

ఆ బ్రహ్మ నారాయణుని ఆ విధముగా ఆవేశించి, శంఖచక్రములను, గదను ధరించి నారాయణనామధేయుడై అప్పుడు నీటి యందు నిద్రించెను.

అతడా వీధముగా చాలా కాలము పరమాత్మతో ఆద్యక్షరహితము, భేదశూన్యము, బ్రహ్మ సంజ్ఞ కలది అగు ఆత్మానందము నను భవించి, (11) తరువాత ప్రాతః కాలము కాగా యోగ రూపుడైన చతుర్ముఖ రూపము కలవాడై, వైష్ణవ భావమును పొంది, తదను గుణమైన సృష్టినీ కొనసాగించెను.

మొదట బ్రహ్మ సనందునీ, సనకుని సృష్టించేను. తరువాత ఋభుని, సనత్కుమారుని సనాతనుడైన పూర్వపురుషుని సృజించెను.

వారందరు సుఖదుఃఖాదిద్వంద్వాల మోహము నుండి విడివడి, గొప్ప వైరాగ్యమును పొందిన వారై, జ్ఞాన మార్గము యొక్క శ్రేష్ఠత్వమును" గుర్తించి దాని యందు బుద్ధిని నిలిపిరి.

వారీ విధముగా వాంఛారహితులై యుండగా సీతామహుడగు బ్రహ్మ పరమేష్టి యొక్క మాయ చేత, లోకసృష్టి యందు మనస్సు ప్రసరించని వాడాయెను.

అప్పుడు పురాణపురుషుడు , సనాతనుడు అగు విష్ణువు, అతని మోహమును తొలగించుటకు కుమారుడైన బ్రహ్మతో ఇట్లు పలికెను.

విష్ణువు పలికెనుః-

శూలము చేతియందు కలవాడు, సనాతనుడు అగు భగవంతుడు మరువబడినాడా? పూర్వము శమ్బువు పుత్రభావమును పొందుమని చెప్పబడినాడు కదా!

ఆ శంకరుడు పుత్రత్వాన్ని పొందుటకు సంకల్పించేను. పుత్రుడుగా అవతరించిన శివుడు గోవిందుడనైన నా వలన పద్మయోని అనీ, పితామహుడని సండ్లను పొందేను

అతడు ప్రజలను సృష్టించుటకు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును చేసెను. అతడీ విధముగా తపస్సు చేయుచుండగా ఏమియు జరుగక స్తబ్ధముగా ఉండెను.

తరువాత చాలా కాలమునకు అతనికి దుఃఖము వలన క్రోధము జనించెను. కోపముతో కూడిన అతని కన్నుల నుండి బాష్పబిందువులు జారి పడెను.

అప్పుడా కన్నీటి బిందువుల నుండి భూతప్రేతములు జనించినవి. తన ముందు వానినన్నిటిని చూచి బహ్ర్మ తన స్వరూపమును గుర్తించెను.

కోపముతో నిండిన ప్రజాపతి తన ప్రాణములను విడిచెను. అప్పుడాయన ముఖమునుండి ప్రాణమయుడైన రుద్రుడు ఆవిర్భవించెను.

వేయి సూర్యులతో సమానుడు, ప్రళయ కాలపు అగ్ని వలె మండుచున్న దేవదేవుడైన శివుడు స్వయంగా ఉచ్ఛస్వరముతో భయంకరముగా రోదించెను.

ఏడ్చుచున్న అతనిని బ్రహ్మ రోదించవద్దని పలికెను. నీ రోదన కర్మ వలన 'రుద్రుడు' అని లోకములో ప్రసిద్ధిని పొందగలవు అని కూడా చెప్పెను.

ఇతరములైన ఏడు పేర్లను, భార్యలను, పుత్రులను, ఇచ్చి ఆ ఎనమండుగురికి శాశ్వతములైన స్థానములను లోకపితామహుడైన భగవంతుడు అప్పగించెను.

రుద్రనామము కాక తక్కిన ఏడు పేర్లు ఇవి. భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు' - అని

ఆ రుద్రుని యొక్క అష్టమూర్తులు క్రమముగా - సూర్యుడు, జలము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, యజ్ఞదీక్షితుడగు బ్రాహ్మణుడు, చంద్రుడు - అని ప్రసిద్ధములు.

ఈ స్థానములందు ఎవరైతే రుద్రులను ధ్యానింతురో, నమస్కరింతురో వారికి అష్టమూర్తి యగు శివుడు పరమ పదము నిచ్చును.

రుద్రుని యొక్క అష్టమూర్తులకు క్రమముగా - సువర్చల, ఉమ, వికేశి, శివ, స్వాహా, దిక్కులు, దీక్ష, రోహిణి అను వారు భార్యలుగా కల్పింపబడిరి

దశమాధ్యాయము శనైశ్చరుడు, శుక్రుడు, లోహితాంగుడు, మనోజవుడు, స్కందుడు, సర్దుడు, సంతానుడు, బుధుడు అను వారు ఈ అష్టమూర్తులకు కుమారులుగా చెప్పబడినారు.

ఈ విధముగా ఉన్న దేవతలకు దేవుడైన భగవంతుడగు మహేశ్వరుడు సృష్టిధర్మమును, కామమును కూడా వదిలి వైరాగ్యభావము నవలంబించెను.

ఆత్మను ఆత్మ యందే నిలిపి, ఈశ్వరభావము నాశ్రయించిన వాడై, అక్షరరూపమై శాశ్వతమైన బ్రహ్మమను గొప్ప అమృతమును పామము చేసి బ్రహ్మ చేత ఆదేశింపబడి నీలలోహితుడైన శివుడు ప్రజలను సృజింప బూనుకొనెను. మొదట తన సంకల్పముతో తనతో నమూనులైను రుద్రులను సృజించినాడు.

కపర్దము అను జటాజూటము కలవారిని, భయరహితులను, నల్లని కంఠమము కలవారిని, మీనాకము ధరించిన వారిని త్రిశూలము చేతిలో కలవారిని, ఉద్రేకము కలవారిని, మూడు కన్నులు కలిగి, ఎల్లప్పుడానందము కలిగియున్నవారిని ముసలితనమణ, చావులేని వారీనీ, పెద్ద వృషభము వాహనము కలవారీని కోరికలను విడిచిన వారిని, సర్వజ్ఞులగు వారిని కోట్ల సంఖ్యలో ప్రభువు సృజించెను.

నిర్మలలు, నీలలోహితులు, జరామరణములు లేని వారు ఆగు ఆ రుద్రులను చూచి గురువగణ ప్రజాపతి శివునితో ఇట్లు పలికెను.

ఓ దేవా! మరణ రహితులైన ఇటువంటి ప్రజలను నీవు సృష్టించకుము. జనన మరణాలతో కూడిన ఇతర విధములైన ప్రజలను సృజింపుము.

అప్పుడు కాముని జయించిన వాడగు శివుడు అతనితో ఇట్లు పలికెను. అటువంటి పర్ణము నాకు ఇష్టము కాదు. నీవే విభిన్న ప్రజలను సృజింపుము” అని

అప్పటి నుండి ఆ దేవుడు (రుద్రుడు) శుభ లక్షణపు ప్రజలను సృష్టించలేదు. తన పుత్రులైను రుద్రుల తోనే తృప్తినందినవాడై ఉండెను.

ఆ కారణము చేత దేవదేవుడైన శూలధారి శివునికి స్థాణుత్వము కలిగినది. జిజ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపస్సు, సత్యము, ఓర్పు, ధైర్యము దర్శన స్వభావము, ఆత్మజ్ఞానము, ఆధిష్టాన లక్షణము - అను నాశరహితములైన యి పది లక్షణాలు శంకరుని యందు ఎల్లప్పుడు ఉండును.

ఇట్లు పినాకధారియైన ఆ శంకరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. పిమ్మటు భగవంతుడు బ్రహ్మ, మూడు కన్నులు గల శివుని చూచి అతని మానసపుత్రులైన రుద్రులతో కూడ సంతోషముతో వికసించిన కన్నులు కలవాడై, జ్ఞాననేత్రముతో ఆ శివున ఈశ్వరు నుంబంధియైన సర్వోత్కృష్టభావమును తెలుసుకొని.

తలపై దోసిలి యొగ్గి ఆలోకేశ్వరుని స్తుతించెను.

బ్రహ్మ పలికెను-

ఓ మహాదేవా! పరమేశ్వరా! నీకు నమస్కారము.

దేవుడైన శివునకు నమస్కారము. బ్రహ్మరూపివైన నీకు వందనములు. మహేశుడవైన నీకు నమస్సు. శాంతుడవు, కారణభూతుడవు అగు నీకు ప్రణామము.

ప్రధాన పురుషుడు, ఈశుడు, యోగమునకు అధిపతివి అగునీకు నమస్కారము, కాలుడు, రుద్రుడు, మహోభోజి, శూలధారియగు నీకు వందనము.

పినాకము చేతిలో ధరించిన, మూడు కన్నులు గల నీకు నమస్కారము. త్రిమూర్తి స్వరూపుడవు, బ్రహ్మవు, తండ్రివి అగు నీకు వందనము.

వేదాంత విద్యకు అధిపతివి, బ్రహ్మవిద్యనుపదేశించువాడవు. వేదముల రహస్యతత్త్వము కలవాడవు. కాలమునకు కాలుడవు అగు నీకు నమస్కారము.

వేదాంతసారమునకు సారభూతుడవు, వేద స్వరూపుడవు, బుద్దరూపుడవు, యోగులకు గురువవు, రుద్రుడవు అయిన నీకు నమస్కారము.

శోకములు తొలగిన వివిధ భూతగణములతో చుట్టబడిన నీకు వందనము. బ్రహ్మకు హితుడైన దేవుడవు, బ్రహ్మకధిపతివి అగునీకు నమస్కారము.

త్రిలోచనుడవు, ఆదిదేవుడవు, పరమేష్ఠివి అగునీకు వందనము. దిగంబరుడవు, దండధారివి, సన్యాసియు అగు నీకు నమస్కారము.

ఆదిలేనివాడవు, నిర్మలుడవు, జ్ఞానముచేత పొందదగినవాడవు అగు నీకు నమస్కారము - తీర్థభూతుడవు, యోగులవృద్ధికి మూల భూతుడవు, ప్రణవరూపుడవు అగునీకు వందనము. ధర్మము మొదలగు పురుషార్థములచే పొందదగినవాడవు, యోగముచే సాధ్యుడవు, ప్రపంచమునకతీతుడవు, భ్రాంతిరహితుడవు అయిన నీకు నమోవాకము.

ప్రపంచ స్వరూపుడవు, పరమాత్మవు, బ్రహ్మవు అగు నీకు నమస్కారము. ఈ సమస్తము నీ చేతనే సృజింపబడినది. సర్వము నీయందే నిలిచి ఉన్నది.

ఓ లోకమయుడా ! ఈ ప్రపంచము నీచేత లయము పొందింపబడుచున్నది. నీవు మహాదేవుడవు, ప్రభువువు, పరబ్రహ్మ స్వరూపుడవు, మహేశ్వరుడవు అయి ఉన్నావు.

నీవు పరమేష్టివీ, శివుడవు, శాంతరూపుడవు, భేదరహితుడగు పురుషుడవు, హరుడవు. నీవు నాశరహితమైన గొప్పతేజస్సువు. నీవు కాలరూపుడవు, పరమేశ్వరుడవు.

నీవే అంతములేని పురుషుడవు, ప్రధానతత్త్వము, ప్రకృతి రూపమునీవే. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, అహంకారము కూడ నీవే.

బ్రహ్మనామము కలిగిన ఏ నీ రూపమునకు నమస్కరించుచున్నానో ఏ పురుషునికి స్వర్గము శిరస్సుగా, భూమి పాదములుగా, దిక్కులు చేతులు గా ఏర్పడినవో.

 ఆకాశము పొట్టగా ఉండునో ఆ విరాడ్రూపపురుషునికి నమస్కరించుచున్నాను. ఎవడు తన కాంతులతో ఎల్లప్పుడు దిక్కులను ప్రకాశింపజేయుచున్నాడో.  

బ్రహ్మతేజస్సురూపమైన ప్రపంచమును వెలుగుతోనింపుచున్న సూర్యస్వరూపుడైన అతనికి వందనము. రుద్రునికి సంబంధించిన తేజోమయ శరీర రూపుదైన ఎవడు ఎల్లప్పుడు హవ్యమును ధరించుచున్నాడో. పితృగణములకు చెందవలసిన కవ్యమును గూడ మోయుచున్న అగ్నిరూపుడైన అతనికి నమస్కారము. ఎవ్వడు సర్వదా తన తేజస్సుతో సమస్త విశ్వమును ఆహ్లాదపరచుచున్నాడో, దేవతల సమూహముచే ఎవడు త్రాగబడుచున్నాడో, ఆ చంద్ర స్వరూపుడైన పురుషునికి నమస్కారము. ఏ శక్తి ఎల్లప్పుడు సమస్త భూతములలో సంచరించుచు వానిని ధరించుచున్నదో. మహేశ్వరుని శక్తి, వాయు స్వరూపమును అగు నీకు వందనము. ఎవడు వారి వారి కర్మలకు తగినట్లుగా ఈ సమస్త విశ్వమును సృజించునో, తన యందే తాను ఆధారపడి యున్న నాలుగు ముఖములు కల బ్రహ్మ స్వరూపుణికి నమస్కారము. ఎవడు తన మాయతో ప్రపంచము నావరించి శేష సర్పరూపశయ్య యందు శయనించునో.

ఆత్మానుభవ రూపమైన యోగముతో కూడి యుండు విష్ణు రూపుడగు దేవునికి నమస్కారము., పదునాల్గు లోకముల రూపములో ఉన్న బ్రహ్మాండమును ఎల్లప్పుడు శిరసుతో మోయుచు సమస్తమునకా ధారభూతుడైన శేషసర్పరూపునికి వందనము. ఎవడు ప్రళయకాలములో దేవి మాత్రమే సాక్షిగా కలిగి యుండగా పరమానందమును ఆస్వాదించి. నృత్యము చేయునో, అంతులేని మహిమ కల రుద్రస్వరూపునికి నమస్కారము. ఎవడు సమస్త ప్రాణులకు అంతర్భూతుడై, నీయమించువాడుగా ఉండునో ఎవని రోమముల యందు మేఘములు, సమస్తా వయవముల సంధి ప్రదేశములలో నదులు, ఉదరములో నాలుగు సముద్రములు చేరి ఉండునో, జలస్వరూపుడగు ఆ పురుషునికి నమస్కారము.

సమస్తమునకు సాక్షిభూతుడు, ప్రపంచమంతట వ్యాపించిన శరీరము కలవాడు అగు ఆ దేవునికి నమస్కరింతును. నిద్రను విడిచిన వారు, శ్వాసను జయించిన వారు, సంతోషముతో ఉండువారు, అందరిని సమముగా చూచువారు ఎవనిని,

యోగమార్గమవలంబించి తేజోరూపముగా చూతురో, యోగాత్మకుడైన అతనికి నమస్కారము. దేని చేత యోగి తన పాపములు నశింపగా మూయను దాటుచున్నాడో, (70) అంతు తెలియక, దాటుటకు శక్యము కాని మాయను దాటుటకు సాధనమైన విద్యా రూపుడైన వానికి వందనము. ఎవని కాంతితో సూర్యుడు ప్రకాశించుచున్నాడో, ఏ తేజస్సు చీకటి కతీతమైనదో (71) పరమతత్త్వమైన, పరమేశ్వర సంబంధియైన, ఎల్లప్పుడు ఆనందయుక్తమైనది, ఆధారరహితము, భేద శూన్యము, శ్రేష్ఠము, మంగళకరము అయిన ఆ రూపమును ఆశ్రయించుచున్నాను.

పరమాత్మవు, పరమేశ్వరుడవు అయిన నీన్ను శరణు పొందుచున్నాను. బ్రహ్మ మహాదేవుని ఈ విధముగా కొనియాడి, ఆ దేవుని యందలి భావముచే ప్రభావితుడై చేతులు జోడించి నమస్కరించుచు నిలిచెను, సనాతన మగు బ్రహ్మను కీర్తించుచుండెను. తరువాత మహాదేవుడతనికీ గొప్పయొగమును, ఈశ్వర సంబంధి బ్రహ్మతత్త్వమును, మంచి శీలమును, వైరాగ్యమును కూడా ఇచ్చి, శివుడు తన కోమల హస్తములతో స్పృశించి సమస్మరించువారి బాధలను పొగొట్టువాడు కనుక అతనికిట్లు తెలియజేసెను.

ఆ విష్ణువు బ్రహ్మదేవుని యందనుగ్రహించి నవ్వుచునే ఇట్లు పలికెను. ఓ బ్రహ్మా! నీ చేత నాకు పుత్రుడవగు దశలో ఏదైతే కోరబడినదో.

అది యంతయు నా చేత ఆచరింప బడినది. నీవు నానా విధమైన ప్రపంచమును సృజించుము. ఓయీ విధాతా! నేను బ్రహ్మ, విష్ణువు, శివుడు అను పేర్లతో మూడు విధముల భిన్న రూపములను పొందీనాను.

సృష్టించుట, కాపాడుట, సంహరించుట అను మూడు గుణముల చేత పరమేశ్వరుడనైన నేను భాగముల కతీతుడను నీవు నాకు పెద్ద కుమారుడవు. ప్రపంచ సృష్టికారణమునకు నాచే సృజింపబడినావు

నీవు నా శరీర దక్షిణ భాగము నుండి పుట్టగా, ఎడమ భాగము నుండి పురుషోత్తముడగు విష్ణువు ఏర్పడెను. దేవతలకు దేవుడైన శివుని యొక్క హృదయ ప్రదేశము నుండి రుద్రుడు జనించెను. నేను ఆ శివుని యొక్క మరి యొక శరీరము వంటి పోడను. ఓ బ్రహ్మా! బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురు ప్రపంచము యొక్క సృష్టికి, నీలుకడకు, వినాశనానికి కారణభూతులై యున్నారు. సృష్టికర్త బ్రహ్మ రక్షకుడు విష్ణువు, ప్రళయకారకుడు రుద్రుడు అని తెలియవలెను.


 

శంకరుడు ఒక్కడే అయినను తనను విభజించుకొని తన యిష్ట ప్రకారము ఉన్నాడు. అట్లే ఇతరములైన రూపములు నా యొక్క మాయ చేత కల్పిండినవి.

మహాదేవుడు సహజముగా, రూపము లేని వాడు, అద్వితీయుడు, నిశ్చలముగా నుండువాడు. ఈత్రిమూర్తుల కంటే అతిశక్తుడైన దేవుడు త్రిమూర్తి స్వరూపుడు. శ్రేష్ఠమైన ఆకృతి కలవాడు. మహేశ్వర సంబంధిని, మూడు కన్నులు కలది, ఎల్లప్పుడు యోగులకు శాంతిని కలిగించునది అగు త్రిమూర్త్యాత్మక శక్తి యొక్క మరొక అంచనుగా ఓపితామహా! నన్ను తెలిసి కొనుము.

శాశ్వతమైన ఐశ్వర్యము, విజ్ఞానము కలవానిగా, తేజస్సు యోగబలముతో కూడిన వానిగా నన్ను గుర్తించుము. అటువంటి నేను తామసగుణాన్నవలంబించి కాలపురుషుడనై సమస్త విశ్వమును మింగి వేయుదును.

ఇతరుడెవ్వడూ నన్ను మనస్టూ చేత కూడా తిరస్కరించజాలడు. కమలము నుండి పుట్టిన ఓ బ్రహ్మా ఎప్పుడెప్పుడు నీవు నన్ను ఎల్లప్పుడు ధ్యానింతువో.

పాపములు లేని వాడా! ఆయా సమయాలలో నీకు నా సాక్షాత్కారము లభించును. ఆ శివుడు బ్రహ్మను గూర్చి ఇంతవరకు చెప్పి, గురువునకు ప్రణామము చేసి,

తన మానసపుత్రులతో కూడా క్షణ కాలములో అదృశ్యుడాయెను. ఆ బ్రహ్మ కూడా పరమపురుషుడు చెప్పిన యోగము నాశ్రయించి సమస్త ప్రపంచమును సృష్టించెను.

నారాయణుడను పేరు గల భగవంతుని ఆదేశము ప్రకారము ప్రజాపతి అగు బ్రహ్మ, పూర్వ కల్పములందు వలెనే మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనువారీనీ,

దక్షుని, అత్రిని, వసిష్టుని కూడా యోగవిద్య చేత సృజించెను. ఈ తొమ్మిది మంది నవబ్రహ్మలు అని పురాణములందు నిశ్చయముగా చెప్పబడినది. వారందరు కూడా బ్రహ్మతో సమానులు, సాధన చేయువారు, పరబ్రహ్మను గూర్చి చెప్పువారు - పరమాత్మ సంకల్పమును, ధర్మ మార్గాన్ని, శాశ్వతాలైన యుగధర్మాలను పూర్వము నీకు చెప్పినట్లు అన్ని స్థానములనభీమానించువారు.

శ్రీ కూర్మపురాణములో దశమాధ్యాయము సమాప్తము.