కూర్మ మహా పురాణము
40 - భువన విన్యాస ప్రకరణమ్
మునులు ఇట్లు పలికిరి :-
నైమిశారణ్యమునకు చెందిన ఆ మునులు పూర్వోక్త విధముగా చెప్పబడినవారై తరువాత భూమి మొదలగు లోక వివరాలను గూర్చి ఆ సూతుని మరల ఇట్లు ప్రశ్నించిరి.
నీచేత మంగళకరమైన స్వాయంభువ మను సంబంధమైన సృష్టిక్రమము చెప్పబడినది. ఇప్పుడు మేము ఈ మూడులోకముల మండల వివరాలను వినగోరుచున్నాము.
ఎన్ని సముద్రములు, ద్వీపములు, వర్షములు, పర్వతములు, వనములు, నదులు కలవో, సూర్యుడు, ఇతర గ్రహముల యొక్క స్థితి కూడ,
ఈ సమస్త సృష్టి దేని ఆధారముగా జరుగుచున్నది? ఈ భూమి పూర్వము ఎవరికి సంబంధించి యుండెను? ఆ రాజుల యొక్క వృత్తాంతమును సంగ్రహముగా మాకు తెలుపుము.
సూతుడు పలికెను :-
దేవతల కందరికి ప్రభువైన, సర్వసమర్థుడైన, ప్రమాణము గుర్తించుటకు శక్యము కాని శ్రీ విష్ణువుకు నమస్కరించి, ఆయనచేత చెప్పబడిన దానిని మీకు వివరింతును.
స్వాయంభువ మనువుకు పూర్వము చెప్పబడిన ప్రియవ్రతుడను కుమారునకు ప్రజాపతితో సమానులైన పదిమంది పుత్రులు జన్మించిరి.
ఆగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధ, మేధాతిథి, హవ్యుడు, సవనుడు, పుత్రుడు, జ్యోతిష్మంతుడు అని క్రమముగా వారి పేర్లు, వారిలో చివరివాడైన జ్యోతిష్మంతుడు గొప్ప బలపరాక్రమములు కలవాడు, ధర్మస్వభావుడు, దానగుణము కలవాడు, అన్ని ప్రాణుల యందు దయకలవాడుగా ఉండెను.
మేధ, అగ్నీబాహువు, పుత్రుడు అనువారలు ముగ్గురు యోగము నందాసక్తి కలవారు, పూర్వజన్మ స్మృతి కలవారు, మహాత్ములు అయినందున రాజ్యము నందు కోరికను వదిలిపెట్టిరి.
ప్రియవ్రతుడు మిగిలిన తన ఏడుగురు కుమారులను ఏడు ద్వీపముల యందు రాజ్యాభిషిక్తులను కావించెను. అతడు ఆగ్నీధ్రుడను కుమారుని జంబూద్వీపమున కధిపతిగా చేసెను.
మేధాతిథి అను పుత్రుడు అతనిచే ప్లక్ష ద్వీపమునకు ప్రభువు చేయబడెను. వపుష్మంతుడను కుమారుని శాల్మలీ ద్వీపానికి ప్రభువుగా అభిషేకము జరిపెను.
ప్రియవ్రతుడు కుశద్వీపమునకు జ్యోతిష్మంతుని రాజుగా చేసెను. ద్యుతిమంతుడను పుత్రునకు క్రౌంచద్వీపాధిపత్యము నొసగెను.
ఆ రాజు హవ్యుడను పుత్రుని శాకద్వీపమునకు ప్రభువుగా అభిషేకించెను. సవనుడను పేరుగల కుమారుని పుష్కర ద్వీపమున కధిపతిని కావించెను.
పుష్కర ద్వీపాధిపతి అగు సవనునీ వలన మహావీతుడు, ధాతకి అను ఇద్దరు కుమారులు కలిగిరి. ఆ ఇరువురు పుత్రవంతులలో శ్రేష్ఠులైన వారుగా నుండిరి.
ఆ మహావీతుని పేరుతో మహావీత మను వర్షము ప్రసిద్ధమైనది. ధాతకి అను వానిపేర ధాతకీ ఖండము పిలువబడుచున్నది.
శాకద్వీపమునకు ప్రభువైన హవ్యునకు కుమారులు కలిగిరి. వారు క్రమముగా జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మణీచకుడు,
కుశోత్తరుడు, మోదాకి మరియు మహాద్రుముడు అను పేర్లుగల ఏడుగురు కలరు. మొదటివాడైన జలదుని యొక్క పేరుతో జలద వర్షము వ్యవహరింపబడుచున్నది.
కుమారునిపేరుతో కౌమార వర్షము, సుకుమారుని సంబంధముతో సుకుమారక వర్షము, నాలుగవది మణీచక వర్షము, అయిదవది కుశోత్తర వర్షము క్రమముగా వారి పేర్లతో ఏర్పడినవి.
ఆరవ, ఏడవ కుమారులపేర్ల మీదుగా మోదాకము, మహాద్రుమము అను వర్షములు ప్రసిద్ధములైనవి. క్రౌంచద్వీపాధిపతియైన ద్యుతి మంతునకు గూడా పుత్రులు కలిగిరి.
వారీలో మొదటివాడు కుశలుడు, రెండవవాడు మనోహరుడు మూడవవాడు ఉష్ణుడని, నాలుగవవాడు పీవరుడు అని చెప్పబడుచున్నారు.
అంధకారుడు, ముని, దుందుభి అని పై నలుగురితో కలిపి మొత్తము ఏడుగురు. వారి పేర్లననుసరించి ఆయా దేశాలు క్రౌంచ ద్వీపము నాశ్రయించి శుభకరములుగా నున్నవి.
కుశ ద్వీపములో జ్యోతిష్మంతునికి గొప్ప పరాక్రమము కల ఏడుగురు కుమారులుండిరి. ఉద్భేదుడు, వేణుమంతుడు, అశ్వరథుడు, లంబనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అని క్రమముగా వారిపేర్లు. వారి వారి పేర్ల సంజ్ఞలతో ఇక్కడ ఏడు వర్షము లేర్పడినవి.
అదే విధముగా ఇతర ద్వీపాలలో కూడా ఇదే విధానముగా పేర్లు కల్పించబడినవి. శాల్మలీ ద్వీపపు అధిపతియైన వపుష్మంతునికి ఈ చెప్పబోవు పేర్లు కల కుమారులు కలిగిరి.
శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు, సుప్రభుడు అని ఆ యేడుగురు కుమారుల పేర్లు ప్రసిద్ధములు
ప్లక్ష ద్వీపమునకు ప్రభువైన మేధాతిథికి కుమారులు కలిగిరి. వారిలో పెద్దవాడు శాంతమయుడు. శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు అని ఆ కుమారుల పేర్లు. ప్లక్ష ద్వీపము మొదలగు వాని యందు, శాకద్వీప సమీప దేశములందు గూడ ఈ రీతిగనే గ్రహించవలెను.
వర్ణముల యొక్క విభాగముచేత తమ ధర్మము ముక్తి హేతువుగా చెప్పబడినది. జంబూద్వీపాధిపతికి గూడ గొప్పబలము కల కుమారులుండిరి.
ఆ ద్వీపాధిపతి ఆగ్నీధ్రుడు. బ్రాహ్మణోత్తములారా! అతని పుత్రుల పేర్లను వినుడు. నాభి, కింపురుషుడు, హరి, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురువు;
భద్రాశ్వుడు, కేతుమాలకుడు అనునవి వారిపేర్లు. జంబూ ద్వీపాధిపతియగు ఆగ్నీధ్ర మహారాజు గొప్పబుద్ధి బలము కలవాడు.
అతడు తన ద్వీపభాగమును తొమ్మిది భోగములుగా విభజించి తనకుమారులకు న్యాయానుసారముగా పంచియిచ్చెను. నాభి అనుకుమారునకు హిమమను పేరుగల దక్షిణ వర్షమును అప్పగించెను.
తరువాత హేమకూటమను వర్షమును కింపురుషున కర్పించెను. మూడవదైన నైషధవర్షమును హరియను పుత్రునకిచ్చెను.
ఇలావృతుడను కుమారునకు మేరుమధ్యభాగమైన ఇలావృతవర్షము నొసగెను. రమ్యుడను వానికి నీలాద్రికాశ్రయభూతమైన వర్షము నప్పగించెను.
శ్వేతమను పేరుగల ఉత్తరపువర్షమును తండ్రి హిరణ్వంతునకిచ్చెను. శృంగపర్వతమున కుత్తరముగా నున్న వర్షమును కురువునకిచ్చెను.
మేరు పర్వతానికి తూర్పుదిక్కున కల వర్షమును భద్రాశ్వుడను కుమారునకిచ్చెను. గంధమాదన వర్షమును కేతుమాలునకు అప్పగించెను.
ఆ ప్రభువు ఈ వర్షముల యందు తనకుమారులను పూర్వము చెప్పిన విధముగా పట్టాభిషిక్తులను గావించెను. తరువాత ప్రపంచము సారహీనమని గుర్తించి తపస్సు చేయుటకు అడవికి వెళ్లెను.
ఋషభునివలన భరతుడనువాడు నూరుగురు కుమారులలో అగ్రజుడుగా, వీరుడుగా జన్మించెను. ఆ ఋషభుడు తన కుమారుడైన భరతుని రాజ్యాభిషిక్తుని చేసి, వానప్రస్థాశ్రమమునకు వెళ్లి, శాస్త్రవిధి ప్రకారము తపస్సును చేసెను. తపస్సుచేత ఆకర్షింపబడిన అతడు తరువాత ఎల్లప్పుడు కృశించిన వాడుగా ఉండెను.
జ్ఞానయోగమునందు శ్రద్ధకలవాడై, మహాపాశుపతుడుగా మారెను. ఆ భరతునకు మిక్కిలి ధర్మాత్ముడగు సుమతియను వాడు కుమారుడుగా పుట్టెను.
సుమతి వలన తైజసుడనువాడు, అతని వలన గొప్ప తేజస్సుకల ఇంద్రద్యుమ్నుడు, అతని వలన పరమేష్ఠియనువాడు, అతనికి ప్రతీహారుడు పుత్రులుగా జన్మించిరి.
ఆ ప్రతీహారునకు కుమారుడుగా ప్రతిహర్తయని ప్రఖ్యాతుడైనవాడు జన్మించెను. అతనికి భవుడను పుత్రుడు, అతని వలన ఉద్గీతుడు, ఉద్గీతునకు ప్రస్తావియను ఆత్మజుడు కలిగెను.
ప్రస్తావికి పృథుడు, అతనికి నక్షుడు, నక్తునకు గయుడు, ఆగయునకు నరుడు, అతనికి విరాట్టు అనువాడు క్రమముగా పుత్రులుగా జన్మించిరి.
ఆ విరాట్టుకు గొప్పపరాక్రమముకల పుత్రుడు ధీమంతుడను వాడు జన్మించెను. ఆ ధీమంతునకు రౌవణుడను కుమారుడు కలిగెను.
ఆ రౌవణునకు త్వష్టయను కుమారుడు, అతని వలన విరజుడు, వానికి రజస్సు, రజస్సుకు శతజిత్తు, అతనికి రథజిత్తనువాడు, అతనికి నూరుగురు పుత్రులు కలిగిరి.
వారిలో ముఖ్యుడు, బలవంతుడు విశ్వజ్యోతి పేర్కొనబడినవాడు. అతడు బ్రహ్మదేవుని ఆరాధించి క్షేమకుడు అనుబడు ధర్మజ్ఞుడైన కుమారుని పొందెను. అతడు గొప్పభుజబలముకలవాడు, శత్రువులను నిర్జించినవాడాయెను.
వీరందరు పూర్వకాలపు రాజులు గొప్ప ఆత్మబలము, పరాక్రమముకలవారు. వీరి వంశమునందు జన్మించిన వారి చేత పూర్వకాలమున, ఈ భూమీ పరిపాలించబడినది.
శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసమను నలుబదియవ అధ్యాయము సమాప్తము.
