కూర్మ మహా పురాణము
21 - వంశకీర్తనమ్
సూతుడిట్లు చెప్పెను.
రాజకుమారుడైన సుధన్వుడు ధర్మమార్గముతో భూమిని పాలించెను. అతనికి పండితుడు, త్రయ్యారుణుడను పేరుతో ప్రసిద్ధుడైన పుత్రుడు కలిగెను.
అతనికి గొప్పబలము కలిగిన సత్యవ్రతుడను పుత్రుడు పుట్టెను. అతని భార్య సత్యధన అనునామె హరిశ్చంద్రుని పుత్రునిగా పొందెను.
ఆ హరిశ్చంద్రునికి పరాక్రమవంతుడైన రోహితుడను కుమారుడు కలిగేను. ఆ రోహితునికి వృకుడనుపుత్రుడు, అతనివలన బాహువు అనుకుమారుడు కలిగెను.
రోహితునకు హరీతుడను మరొకపుత్రుడు, అతనికీ ధుంధువు అనుకుమారుడు కలిగేను. విజయుడు, సుదేవుడు అనుపోరు ధుంధువు పుత్రులుగా పుట్టిరి.
విజయునకు కారుకుడను పేరుగల వీర్యవంతుడైన సుతుడు కలిగెను. అతనికి మిక్కిలి ధర్మస్వభావముకల సగరుడను రాజు కుమారుడుగా పుట్టెను.
ఆ సగరునకు ప్రభ, భానుమతి అను ఇద్దరు భార్యలుండిరి. వారిచేత పూజింపబడిన అగ్నిదేవుడు వారికి మంచి వరమిచ్చెను.
ఆ వరముద్వారా భానుమతి అసమంజసుడను ఒకపుత్రుని పొందినది. మంగళరూపయగు ప్రభ అనుసగరుని భార్య అరువది వేల మంది కుమారులను స్వీకరించినది.
అసమంజసునికి అంశుమంతుడను రాజు కుమారుడాయెను. అతని కుమారుడు దిలీపుడు. అతనివలన భగరీథుడను సుతుడు కలిగెను.
ఏ భగీరథునిచేత తపస్సుచేసి దేవతలకు దేవుడైన శివుని అనుగ్రహమువలన గంగానది భూమికి తేబడి భాగీరథి అని పిలువబడినదో అతడే ఆ భగీరధుడు.
భగీరథుని తపస్సుచేత సంతోషించిన మనస్సుకల, చంద్రుని భూషణముగా ధరించిన శివుడు గంగానదిని శిరస్సుపై చంద్రుని ప్రక్కన ధరించెను.
ఆ భగీరథుని పుత్రుడుగా శ్రుతుడనువాడు పుట్టెను. అతని సంతానముగా నాభాగుడు, అతనివలన సింధుద్వీపుడు అనువాడు జన్మించెను.
సింధుద్వీపునికి గొప్పబలముకలవాడు, అయుతసంవత్సరముల ఆయుర్దాయము కలవాడును అగు ఋతుపర్ణుడను కుమారుడు కలిగెను, అతనికి ధర్మశీలముకల సుదాసుడను కొడుకు పుట్టెను.
సుదాసుని పుత్రుడు కల్మాషపాదకుడని ప్రసిద్ధుడైన వాడుఉండెను. గోప్పతేజస్సుకలవసిష్ఠుడు, కల్మాషపాదుని క్షేత్రము నందు;
ఇక్ష్వాకువంశమునకు పతాకము వంటి అశ్మకుడను కుమారునకు జన్మనిచ్చెను. అశ్మకునికి ఉత్కలయను భార్యయందు నకులుడను రాజుపుట్టెను.
ఆ నకులుడు పరశురాముని భయమువలన మిక్కలి దుఃఖముతో అడవికేగెను. అతడు స్త్రీల వస్త్రధారణముచేసి తప్పించుకొనెను. అతనివలన శతరధుడు పుట్టెను.
శతరథునివలన శ్రీమంతుడగు బిలబిలుడు కలిగెను. అతని పుత్రుడు వృద్ధశర్మ, అతనికి విశ్వసహుడను పుత్రుడు, అతనికి ఖట్వాంగుడను వాడు తనయుడుగా జన్మించెను.
ఖట్వాంగునకు దీర్ఘబాహువు కలిగెను. అతని వలస రఘువు జన్మించెను. రఘువువలన అజుడను పుత్రుడు, అతనికి దశరథుడను కుమారుడు జన్మించిరి.
ఆ దశరథునివలన వీరుడు, ధర్మములు తెలిసినవాడు, లోకవిఖ్యాతుడు అగు రాముడు, భరతుడు, లక్ష్మణశత్రుఘ్నులు అనుబలవంతులు జన్మించిరి.
వారందరుకూడ యుద్ధరంగుములో ఇంద్రునితో సమానబలము కలవారు, విష్ణువుయొక్క అంశలు ధరించినవారు. రావణుని సంహరించుట కోరకు నారాయణుడు అంశరూపములతో అవతరించెను.
జనకుని కూతురు, మంగళరూప, ఉత్తమురాలు, మూడులోకములందు ప్రఖ్యాతి వహించినది, శీలము ఔదార్యము అనుగుణములు కలది అగునీత రామునకు భార్య ఆయెను.
పర్వతరాజు పుత్రియగు పార్వతి జనకుని తపస్సుచేత సంతోషము పొందినదై, రామునే భర్తగా ఆశ్రయించు సీతను జనకుని కూతురుగా అనుగ్రహించెను.
భగవంతుడు, నీలలోహితుడు, త్రిశూలము ధరించిన వాడగు శంకరుడు కూడ సంతోషించినవాడై శత్రుసంహారము కొరకు జనకునకు' ఆశ్చర్యకరమైన ధనుస్సును ఇచ్చినాడు.
బుద్ధిమంతుడగు ఆజనకమహారాజు తసపుత్రికయగు సీతను యోగ్యుడైన వరునికిచ్చుటకుగాను, ఓ బ్రాహ్మణశ్రేష్ఠలారా లోకములో ఈ విధముగా ప్రకటించినాడు.
ఈ మూడు లోకములయందు దేవజాతీయుడు, దానవుడుకానీ ఎవడైనను ఈ శివధనుస్సును ఎక్కుపెట్టుటకు సమర్ధుడైనచో వాడు నాపుత్రిక సీతను భార్యగా పొందుటకరుడగును.
ఆ విషయము తెలిసికొని బలవంతుడైన రాముడు జనకుని నివాసమునకువెళ్లి, ఆ చాపమును గ్రహించి సులభముగా దానిని విరిచెను,
తరువాత మిక్కిలి ధర్మాత్ముడగు రాముడు, పార్వతిని శంకరుడు గ్రహించినట్లు, దేవసేన భారమును కుమారస్వామి వహించినట్లు ఆ సీతను వివాహమాడి భార్యగా స్వీకరించెను.
తరువాత చాలాకాలము గడిచిన పీడప దశరథమహారాజు, తనజ్యేష్ఠపుత్రుడు, వీరుడును అగు రాముని రాజుగా చేయుటకు స్వయముగా పూనుకొనెను.
అప్పుడు దశరథుని భార్య, అందమైనది, చక్కని నవ్వుకలది అగుకైకేయి అతనిని వారించినది. తత్తరపడిన మనస్సుకలదై భర్తతో ఇట్లనెను.
నాకుమారుడు, వీరుడు అయిన భరతుని రాజుగా చేయదగియున్నది. ఎందుకనగా నీచేత నాకు పూర్వకాలమునందే రెండు వరములు పానము చేయబడినవి కదా
ఆ దశరథుడు కైకేయి మాటనువిని మనస్సులో చాలాదుఃఖించినవాడై అట్లే యని అంగీకారవాక్యమును పలికెను. ధర్మమును తెలిసిన రాముడుకూడ అదేవిధముగా సమ్మతించెను.
తరువాత ఆ రాముడు తండ్రిపాదములకు నమస్కరించి, తమ్ముడగు లక్ష్మణునితో, భార్యయగు సీతతోకూడి నీయమప్రతిజ్ఞను చేసి అడవికి వెళ్లెను.
గొప్పబలవంతుడైన ఆ రాముడు పదునాలుగు సంవత్సములపర్యంతము లక్ష్మణునితోగూడ ఆ అడవులలో నివసించేను. ఆ వనవాసకాలములో ఒకమారు రావణుడను పేరుగల రాక్షసరాజు సన్న్యాసీ, వేషముతో వచ్చి సీతనపహరించీ తనపట్టణమునకు వెళ్లి పోయేను.
తరువాత సీతకనుపించక రామలక్ష్మణులు కలతచెందీనమనస్సుకలవారై దుఃఖముతో, శోకముతో పీడింపబడినవారైరి. విప్రులారా తరువాత ఒకమారు వానరరాజైన సుగ్రీవునితో, వానరులతో, నిర్మల చరిత్ర కలిగిన రామునకు స్నేహము కలిగెను.
సుగ్రీవుని అనుచరుడగు హనుమంతుడను వానరుడు వాయుపుత్రుడు, గొప్పతేజస్సుకలవాడు, అతడు రామునకు ఎల్లప్పుడు ఇష్టమైనవాడుగా ఆయేను.
ఆ హనుమంతుడు గొప్పదైర్యముచేసి, నిశ్చయముచేసికొన్నవాడై, సీతను తీసుకోనీరాగలనని పలికి ఆమెజాడకొరకు ప్రయాణమయ్యెను.
సీతజాడను తెలిసికొనుట యందాసక్తికలహనుమంతుడు సముద్రము వరకుగలభూమిని సంచరించి, సముద్రమధ్యములో నుండి రావణునిచే పాలింపబడుచున్న లంకాపట్టణమును చేరెను.
తరువాత ఆలంకలో జనశూన్యమైన ప్రదేశములో ఒకచెట్టుమొదట రాక్షసస్త్రీలచేత చుట్టబడిన, స్వచ్ఛమైన చిరునవ్వుకలిగి నిర్మలరూపముతో నున్న సీతను హనుమంతుడు చూచెను. బొడ్డుబిందువులతోనిండిన కన్నులుకలిగి, మనోహరముగానున్నది, నల్లకలువల వంటి శరీరముకల రాముని, లక్ష్మణునితో కూడ తన హృదయమందున్నవానిని, స్మరించుచున్న, నిందితురాలు కాని సీతను చూచెను.
సమర్థుడైనహనుమంతుడు ఏకాంతములో సీతకు తనను పరిచయము చేసికొనీ, ఆమెకు శంకలేకుండుటకొరకు రాముడిచ్చిన ఉంగరమును ఆనవాలుగా ఆమెకిచ్చెను.
ఆ సీత తనభర్తయొక్క మంగళకరమైన ఉంగరమును చూచి, సంతోషముతో వికసించిన కన్నులు కలదై, రాముడే తనవద్దకు వచ్చినట్లుగా తలచేను.
అప్పుడాహనుమంతుడు సీతనూరడించి, గొప్పభుజములు కలరాముని దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్లుదునని ఆమెతో చెప్పి మరల అక్కడి నుండీ రామునిగూర్చి బయలుదేరెను.
రామునిచేరి ఆత్మవిశ్వాసము కలహనుమంతుడు, తానుసీతను దర్శించిన విషయమాయనకు తెలిపి, లక్ష్మణునిచేత గౌరవింపబడినవాడై రాముని ఎదురుగా నిలుచుండెను.
తరువాత బలవంతుడైన రాముడు హనుమంతునితో, లక్ష్మణునితో కూడ ఆలోచించి రాక్షసుడైన రావణునితో యుద్ధముచేయుటకు స్వయముగా నిశ్చయించెను.
పిమ్మట వందల కొలదీ వానరులతో సముద్రముపైన లంకా నగరమునకు వెళ్లుటకు మార్గముగా వంతెనను నిర్మించి, మిక్కిలి ధర్మాత్ముడైన రాముడు రావణాసురుని చంపెను.
భార్యాసహితుడైన రావణుని, అతని కుమారుడగు ఇంద్రజిత్తును, సోదరుడగు కుంభకర్ణుని సంహరించి శత్రువిజయియగు రాముడు, హనుమంతుని సహాయముతో సీతను తీరిగి తెచ్చెను.
ఆ వంతెన మధ్యభాగములో రాముడు, చర్మము వస్త్రముగా ధరించిన ఈశానుడగు శంకరుని, లింగరూపములోనున్న వానినిగా ప్రతిష్ఠించి పూజించేను.
ఆ రామునికి మహాదేవుడగు శంకరుడు పార్వతీదేవితో కూడ సాక్షాత్కరించి శ్రేష్ఠమైన ఒకవరమునిచ్చెను.
నీచేత ఇక్కడ ప్రతిష్టించబడిన యీ లింగమును ద్వీజాతివారగు మానవులు చూచినయెడల, మహాపాపములతో కూడినవారైనప్పటికి వారి పాపము తొలగిపోగలదు.
ఇక్కడి సముద్రములో స్నానముచేసిన వానియొక్క ఇతరపాపములుకూడ, లింగదర్శనముచేతనే నశించిపోవును. సందేహములేదు.
ప్రపంచములో ఎప్పటివరకు పర్వతములు నిలిచి ఉండునో, ఎంతవరకు ఈభూమి ఉండునో, ఈవంతెన ఎంతకాలముండునో, అంతకాలము నేనిక్కడ అదృశ్యరూపుడనై నిలిచిఉండును. ఈసేతువువద్ద స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధము చేయబడిన దంతయు అక్షయముగా నుండును. ఇక్కడి లింగమును తలచుకొన్నంతనే ఏదనపు పాపము ఆదినముననే నశించిపోవును.
భగవంతుడైన శివుడు ఇట్లు పలికి శ్రీరాముని కౌగిలించుకొని, నందీశ్వరునితో, ప్రమధగణములతోకూడి అక్కడనే అదృశ్యమాయెను.
ఆ రాముడుకూడ ధర్మమార్గ పరాయణుడై, పట్టాభిషిక్తుడై, భరతునితోగూడి మహాబలవంతుడుగా రాజ్యమును పరిపాలించెను. విశేషముగా బ్రాహ్మణులందరిని, ఈశ్వరునిగూడ పూజించెను. అశ్వమేధ యాగముతో, దక్షయజ్ఞధ్వంసము కావించిన శంకరుని పూజించెను.
రామునకు కుశుడని ప్రసిద్ధుడైన కుమారుడు జన్మించెను. మహానుభావుడు, అన్ని తత్వముల సారము తెలిసిన బుద్ధిమంతుడైన లవుడు కూడ పుత్రుడుగా కలిగెను.
కుశునివలన అతిథియను కుమారుడు కలుగగా, అతనికి నీషధుడను పుత్రుడు జనించెను. నిషధునకునలుడు, అతనికి నభసుడు పుత్రులుగా జన్మించిరి.
నభస్సు అనుపోనికి పుండరీకాక్షుడు, అతనికి క్షేమధన్వ అనువాడు కుమారులుగా పుట్టిరి. ఆ క్షేమధన్వునీకి ప్రతాపవంతుడగు దేవానీకుడను వీరుడు పుత్రుడుగా జన్మించెను.
అతని పుత్రుడు అహీనగువు అనువాడు. అతనికి మహస్వంతుడు కుమారుడాయెను. అతనివలన చంద్రావలోకుడు పుట్టెను. అతని పుత్రుడు కౌరధీశుడనువాడు కలిగెను.
తారాధీశునివలన చంద్రగిరి అనుకుమారుడు, అతనివలన భానువిత్తుడను సుతుడు కలిగెను. అతనివలన శ్రుతాయువను పుత్రుడు జన్మించెను. వీరందరు ఇక్ష్వాకువంశములో జన్మించినవారు.
బ్రాహ్మణశ్రేష్ఠులారా అందరు వారి ప్రాధాన్యాన్ని బట్టి సంగ్రహముగా చెప్పబడినారు. శ్రేష్టమైన యీ ఇక్ష్వాకువంశమును గూర్చి ఎవడు వినునో, అతడు అన్నిపాపములనుండి విముక్తుడై దేవలోకములో ప్రకాశించును.
ఇరువదొకటవ అధ్యాయము సమాప్తము.
