కూర్మ మహా పురాణము

Table of Contents

17 - త్రివిక్రమచరితము 

అంధకాసురుడు నీగ్రహీంపబడగా, మహాత్ముడైన ప్రహ్లాదునియొక్క కుమారుడు, బలవంతుడును అగు విరోచనుడనువాడు రాజాయెను.

ఆ వీరోచనుడు ఇంద్రునితో కూడ దేవతలందరిని జయించి, చేలసంవత్సరములపాటు చరాచరయుక్తమైన ముల్లోకముల సమూహమును ధర్మమార్గముతో పాలించెను.

అతడిట్లు రాజ్యపాలన చేయుచుండగా, ఒకానొక సమయమున పూజ్యుడైన గొప్పముని సనత్కుమారుడు విష్ణువుచేత పంపబడి విరోచనుని పట్టణమునకు వచ్చెను.

అప్పుడు సింహాసనమధిష్టించి యున్న విరోచనుడు, బ్రహ్మకుమారుడైన సనత్కుమారునికి ఎదురుగా వెళ్లి తలవంచి నమస్కరించెను. తరువాత భక్తితో దోసిలియొగ్గి ఈమాటలుపలికెను.

యోగీశ్వరుడవు, భగవంతుడవు, స్వయముగా బ్రహ్మవేత్తవు అయిననీవు ఈనాడు నాపట్టణమును చేరినందువలన నేను ధన్యుడనైనాను; అనుగ్రహించబడినెను.

బ్రహ్మస్వరూపుడా! స్వయముగా బ్రహ్మదేవుడని చెప్పదగిన నీవు ఏకారణమున వచ్చితివి? ఓ బ్రహ్మమానసపుత్రుడా నేను మీకు ఏమి పని చేయవలెనో చెప్పుము.

అప్పుడు ధర్మాచరణకల ఆ అసురశ్రేష్ఠుని గూర్చి పూజనీయుడైన సనత్కుమారదేవుడిట్లనెను. “నీవు భాగ్యవంతుడవు. నేను నిన్ను చూచుటకు వచ్చినాను.

రాక్షసశ్రేష్టుడా నీవు అవలంబించుచున్న యీ చక్కని నీతి రాక్షసులకు మిక్కిలి దుర్లభమైనది. మూడులోకములయందు కూడ నీవంటి ధర్మమార్గవర్తనుడు మరొకడు లేడనుట నిశ్చయము.

ఇట్లు పలుకబడిన అసురరాజు ఆగొప్పమునినిగూర్చి మరల ఇట్లనెను. “బ్రహ్మవేత్తలలో గొప్పవాడా! ధర్మములన్నిటిలో గొప్ప ధర్మమునుగూర్చి నాకు చెప్పుము!”

మహాత్ముడు, యోగిఅగు నా సనత్కుమారుడు ఉత్తముడైన రాక్షసరాజునుగూర్చి, రహస్యములన్నిటిలో మిక్కిలి శ్రేష్ఠము, సాటిలేని ఆత్మజ్ఞాన రూపధర్మమును చెప్పెను.

ఆ విరోచనుడు గొప్ప జ్ఞానమును పొంది, మునికి గురుదక్షిణనిచ్చి, తరువాత తన కుమారునియందు రాజ్యభారమునుంచి యోగసాధనయందా సక్తుడాయెను.

వీరోచనుని కుమారుడు, బుద్ధిమంతుడు బలియను గొప్ప రాక్షసుడు, బ్రహ్మజ్ఞానము కలవాడు, మిక్కిలి ధర్మస్వభావము కలవాడు. అతడు తరువాత ఇంద్రుని జయించేను.

వీరోచనునితో గొప్పయుద్ధముచేసి, అతనిచేత ఓడింపబడి, దేవతలందరితోకూడుకున్నవాడై ఇంద్రుడు, నాశరహితుడైన విష్ణుదేవుని శరణముపొందెను.

ఈలోపల దేవతలతల్లియగు అదితి చాలా దుఃఖమును పొందినదై రాక్షసుల సంహారముకొరకు సమర్థుడైన పుత్రుడు నాకు కలుగుగాక అని. తలచి,

మిక్కిలి తీవ్రమైన, భయంకరమైన తపస్సునుచేసెను. అనంతరము అవ్యక్తరూపుడైన, శరణుపొందుటకు యోగ్యుడైన, విష్ణువును శరణము పొందెను.

తన హృదయకమలపు కేసరము నందు భేదశూన్యుడు, పొసుదేవుడు, ఆద్యక్షరహితుడు, ఆనందస్వరూపుడు, కేవలాకాశరూపుడు, సర్వోన్నత గమ్యమైన విష్ణువును గూర్చితపస్సుచేసెను.

అప్పుడు శంఖచక్రములను ధరించిన భగవంతుడైన విష్ణువు, యోగాత్మకుడు ప్రసన్నుడై దేవమాతయగు అదితికి ముందు సాక్షాత్కరించెను.

తనకు ప్రత్యక్షమైనవిష్ణువును చూచి, అదితిభక్తితో కూడినదై తనను ధన్యురాలుగా భావించుకొనెను. ఆనారాయణుని స్తోత్రముతో ప్రీతుని చేసేను.

సమస్తదుఃఖముల సమూహమును నశింపజేయుటకు ముఖ్యకారణమైనవాడా! అంతములేని గొప్పతనముల సంబంధముకలవాడా! ఆదీ మధ్యాంతములు లేని విజ్ఞానస్వరూపుడా! ఆకాశమువంటి నిర్మలానందస్వరూపుడా! దేవా, నీకు జయము.

కాలస్వరూపుడైన విష్ణువుకు నీకు వందనము, శేషాత్మకుడవు, నరసింహరూపుడవు అగునీకు నమస్కారము. జగత్తులమయముచేయువాడ వైన ప్రళయకాలరుద్రునికీ నీకు నమస్కారము. వాసుదేవుడవగునీకు సోనమోవాకము.

ప్రపంచమునందలి మాయనుకల్పించు నీకువందనము. సత్యరూపుడు, యోగసాధనచేతపొందదగినవాడవగునీకు నమస్కారము. ధర్మము, విజ్ఞానము అనువానియందు ప్రతిష్ఠితుడవైననీకు నమస్కారము. వరాహస్వరూపుడవైననీకు మరలమరల పందనము.

వేయిసూర్యుల, చంద్రులతో సమానమైనకాంతిగలవాడా నీకువందనము. వేదమునందలివిజ్ఞానముచేత, ధర్మముచేత తెలియదగినవాడా, నమస్కారము. భూమినిధరించువాడవు, ఇంతఅనికొలుచుటకు శక్యముకానివాడవగునీకు నమోవాకము. ప్రపంచమునకు మూలకారణభూతుడైన పాడా! ప్రభూనీకు మరలమరల వందనము.

సత్యమందు నిష్టగల శంభురూపుడవైన నీకు నమస్కారము. జగద్రూపుడవు, కారణాత్మకుడవగునీకు వందనము. యోగవిద్యాపీఠమధ్యభాగ మందుండునీకు నమస్కారము. కేవలస్వరూపుడవు అగునీకుమరల నమోవాకము.

దేవతలతల్లియగు అదితిచేత ఈవిధముగా సంతోషపరచబడిన లోకమయుడైన భగవంతుడగు విష్ణువు నవ్వుచున్నవానివలె ఆమెను వరము కోరుకొమ్మని అనుగ్రహించెను.

ఆ అదితి శిరస్సుభూమికి వంచి నమస్కరించి, దేవతల మేలుకొరకు నిన్నే పుత్రునిగా జన్మించుమని వరమువేడుచున్నానని శ్రేష్ఠమైన వరమును కోరుకొనెను.

తననాశ్రయించినవారియందు వాత్సల్యముకల ఆభగవంతుడు, అట్లేయగుగాక అని పలికెను. ఇట్లు వరమునిచ్చి వర్ణింప శక్యముకాని విష్ణువు అక్కడనే అదృశ్యుడాయెను.

తరువాత చాలాకాలము గడువగా దేవతలమాతయగు అదితి, స్వయముగా భగవంతుడు, జనార్దనుడు అగునారాయణుని గర్భములో ధరించేను.

హృషీకేశుడగువిష్ణువు అదితిదేవి యొక్క గర్భములో ప్రవేశించగా, విరోచనకుమారుడైన బలియొక్క పట్టణములో చాలాభయంకరములైన ఉత్పాతములు సంభవించెను.

సమస్తములైన ఉత్పాతమలను చూచి రాక్షసరాజగుబలి భయముతోకలతపడి, తనకుతాత, రాక్షసవృద్దుడును అగు ప్రహ్లాదునివద్దకు వెళ్లి నమస్కరించి యిట్లు పలికెను.

మిక్కిలి వివేకశాలివగు ఓపితామహా ఈ పట్టణము నందు ఉత్పాతము ఎందుకు కలుగుచున్నది? దీనివలన మనకు ఎటువంటి ఫలితము కలుగనున్నది?

ఆ బలియొక్క మాటను విని రాక్షసశ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు చాలా సేపు ఆలోచించి, తనమనస్సులో విష్ణువుకు నమస్కరించి ఈ విధముగా అతనితో పలికెను.

ఎవడు యజ్ఞములచేత పూజింపబడుచున్నాడో, ఈ సమస్త ప్రపంచము ఎవనికి చెందినదో, ఆభగవంతుడగు విష్ణువును దేవమాత అదితీ, దైత్య సంహారము కొరకు తన గర్భములో ధరించినది.

ఈ సమస్తము ఎవనికంటే భిన్నముకదో, ఎవడు సమస్తమునుండి తానుభిన్నముగా నుండునో, అటువంటి వాసుదేవుడైన విష్ణువు దేవమాత శరీరము నాశ్రయించినాడు.

ఎవని స్వరూపతత్త్వమును దేవతలుకూడ యథార్థముగ తెలియజాలరో, ఆ విష్ణువు స్వయముగా, తన ఇచ్ఛతో అదితి యొక్క శరీరమును ప్రవేశించినాడు.

ఎవనినుండి సమస్తప్రాణులు పుట్టుచున్నవో, తిరిగీ ఎవని యందులయమును చెందుచున్నవో, అటువంటి గొప్పయోగీశ్వరుడు, పురాణ పురుషుడు అగుహరి అదితి గర్భమును చేరినాడు.

ఎవని విషయములో, పేరు, జాతి మొదలగువాని భేదభావముండదో, సత్తామాత్రమైన ఆత్మస్వరూపుడగు ఈవిష్ణువు అంశావతారముగా జన్మింపబోవుచున్నాడు.

ఎవనియొక్కశక్తి లోకములకు మాతృస్వరూపమైయున్నదో. ఆశక్తి అతనిధర్మమును ధరించునది, మాయారూపిణి అగు భగవతి లక్ష్మీదేవియై ఉన్నదో, ఆ విష్ణువు అవతరించుచున్నాడు.

ఏ పరమేశ్వరుని యొక్క తమోగుణప్రధానమైన రూపముకలదో అదియేశంకరుడు. రజోగుణాత్మకమైన శరీరము బ్రహ్మగాపుట్టినాడు. అతడే సత్త్వగుణమును ధరించినవాడై ఒకఅంశముతో విష్ణువగుచున్నాడు.

ఈ ప్రకారముగా ఆలోచించీ, భక్తితో వినీతమైన మనస్సుతో ఆగోవిందుడైన నారాయణునే శరణముపొందుము. దానివలన శాశ్వతానంద రూపమైన ముక్తిని పొందగలవు.

తరువాత ప్రహ్లాదుని మాటననుసరించి వీరోచనుని పుత్రుడైన బలి విష్ణువును శరణము పొందెను. తరువాత ధర్మమును తెలిసిన అతడు ప్రపంచమును పాలించెను.

కొంతకాలము గడువగా తగిన సమయములో దేవతల తల్లియైన అదితిదేవి కశ్యప ప్రజాపతివలన, దేవతలకు సంతోషమును పెంచువాడైన మహావిష్ణువును స్వయముగా పుత్రుడుగా పోందెను.

ఆ విష్ణువు నాలుగు భుజములు కలిగి, విశాలమైన నేత్రములు కలవాడై, శ్రీవత్సమను పేరుగల చిహ్నముతో కూడిన వక్షము కలవాడు, నల్లని మేఘము వంటి శరీరము కలిగి తేజస్సుతో ప్రకాశించువాడుగా ఉండేను.

ఆ విష్ణువు దగ్గరకు దేవతలందరు, సిద్దులు, పాధ్యులు, చారణులు ఉపేంద్రుడు, ఇంద్రుడు మొదలగువారు, ఋషిసమూహములతో గూడిన బ్రహ్మకూడ వచ్చి సేవించిరి.

ఆ విష్ణువు ఉపనయన సంస్కారమును పొంది వేదములను అధ్యయనము చేసెను. భరద్వాజముని వలన వేదములతోపాటు సదాచోరమును గూడ ముల్లోకములకు ప్రదర్శించుచు అభ్యసించెను.

ఆ ప్రభువైన నారాయణుడు ఈవిధముగా లౌకికమైన మార్గమును లోకమునకు ప్రదర్శించినాడు. అతడు ఏ పద్దతిలో కర్మలనాచరించునో, ప్రపంచము దానినే అనుసరించి వర్తించును.

తరువాత కొంతకాలమునకు బుద్ధిమంతుడైన, విరోచనపుత్రుడగు బలి, స్వయముగా యజ్ఞములకధిపతి, అంతటవ్యాపించియుండువాడును అగు విష్ణువును. యజ్ఞములతో పూజించేను.

అధికమైన ధనమును దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులను ఆరాధించెను. మహాత్ముడైన బలిచక్రవర్తి యొక్క యజ్ఞమంటపమునకు బ్రహ్మరులు విచ్చేసిరి.

భగవంతుడైన విష్ణువు, బలియొక్క యజ్ఞవిషయమును తెలిసికొని భరద్వాజముని చేతప్రేరణపొందీ వామనరూపమును ధరించి అప్పుడు , యజ్ఞప్రదేశమునకు వెళ్లెను.

ఆ వామనుడు కృష్ణాజినము, యజ్ఞోపవీతముతో గూడిన శరీరముకలవాడు, పాలాశదండముతో ప్రకాశించువాడు, జడలనుధరించి, గొప్పకాంతితో ప్రకాశించుచు వేదమంత్రములనుచ్చరించుచున్న బ్రాహ్మణ వటువుగా వచ్చేను.

రాక్షసరాజైన బలి సమీపమును చేరి వామనరూపుడైన విష్ణువు భిక్షము నర్జించువాడుగా, తన అడుగులతో కొలువబడుమూడడుగుల భూమిని యాచించెను.

వామనరూపియగు విష్ణువుయొక్క పాదములను కడిగి శ్రద్ధాభావముతో కూడిన బలి ఆచమనముచేసి, బంగారముతో చేయబడిన కలశమును చేతిలో ధరించి;

నీవడిగిన ప్రకారము మూడడుగుల ప్రదేశము నీకివ్వగలను. నాశరహితమైన రూపముకల విష్ణువు సంతోషించుగాక. అని మనస్సులో అనుకొని ఆ భగవంతుని చేతికొనలయందు చల్లని జలమును దానముకొరకు వదలెను.

అప్పుడు ఆదిదేవుడైన హరి భూమిని ఒకపాదముతో కొలిచెను. తరువాత రెండవపాదముతో అంతరిక్షమును స్వర్గమును కొలిచెను. కోరికలు తొలగిన, రాక్షసప్రభువైన బలిచక్రవర్తిని తనకు శరణాగతుడగునట్లు చేయగోరినవాడై, తన పాదముతో ముల్లోకములనాక్రమించి

ప్రాజాపత్యమునుండి బ్రహ్మలోకమును చేరెను. అప్పుడాయాలోకములలో నివసించు ఆదిత్యుడు మొదలగు దేవతలు, సిద్ధులు, ఆపాదమునకు సమస్కరించిరి.

ఆ సమయమున భగవంతుడు, ఆదిరహితుడునగు బ్రహ్మ అక్కడికివచ్చి నారాయణుని ప్రస్తుతించెను. తరువాత విష్ణుపాదము బ్రహ్మండమును భేదించి ఇంకను పైభాగమునకు మరల వ్యాపించెను.

అప్పుడు, బ్రహ్మాండమును భేదించుటవలన, అక్కడ పుణ్యవంతులచేత సేవింపబడుచల్లని గొప్ప ఉదకము స్రవించెను. జలమే ప్రవహించి నదులలో శ్రేష్ఠమైనదిగా, బ్రహ్మచేత 'గంగ' అని పలుకబడినదై ఆకాశములో నిలిచేను.

ఆ విష్ణువుయొక్క పాదము విశాలమైన ప్రకృతిని వ్యాపించి, బ్రహ్మస్థానమును, ప్రపంచబీజభూతుడైన ఏకపురుషుని, బ్రహ్మరూపునిచేరి అక్కడ నీలిచెను. నాశరహితమైన ఆవిష్ణుపాదమునుచూచి అక్కడక్కడ కలదేవతలు కొనియాడిరి.

ప్రపంచమే శరీరముగా కల ఆమహాపురుషుడైన విష్ణువును చూచి, ఉత్తముడైన బలి భక్తియోగముతో ప్రణమిల్లెను. అద్వితీయుడు, నాశరహితుడు అగు ఏనారాయణుని వేదములుగూడ నమస్కరించి పూజించునో, ఆవిష్ణువునకు హృదయపూర్వకముగా నమస్కరించినోడు బలి.

మొదటి సృష్టికర్త, భగవంతుడగు విష్ణుమూర్తి మరల వామనుడుగా మారి అతనితో ఇట్లనెను. “ఓరాక్షసరాజూ ఇప్పుడు ఈ మూడులోకములు నీచేత సంకల్పదానముచేయబడినందున నా అధీనములోనివే.

ఆ బలిచక్రవర్తి నారాయణునకు శిరస్సుతోనమస్కరించి మరల తనచేతిలోనీకి నీటిని వంపుకొనెను. అనంతమైన తేజస్సుకలిగిన, గొప్ప పరాక్రమముకల, త్రివిక్రముడవగునీకు నన్ను నేను సమర్పించుకోనుచున్నాను.

తరువాత శంఖముచేతియందు ధరించిన విష్ణువు ప్రహ్లాద కుమారుడగు వీరోచనుని పుత్రుడైన బలివలన ఇవ్వబడిన దానమును స్వీకరించీ పాతాళలోకముయొక్క మూలమును ప్రవేశించుమని మరల రాక్షసరాజును గూర్చిపలికెను.

అక్కడ నీవు దేవతలకుగూడ పొందశక్యముకొని భోగములననుభవించుచు ఎల్లప్పుడు సుఖముగా నివసించుము. భక్తియోగమునవలంబించి సన్ను సర్వదో ధ్యానించుము. చివరకు కల్పాంతకాలములో మరలనన్ను ప్రవేశించగలవు.

రాక్షసులలో శ్రేష్ఠుడైన ఆ బలిచక్రవర్తిని గూర్చి యిట్లుపలికి సత్యమైన పరాక్రమము కల విష్ణువు, జయశీలుడై ఇంద్రునికి మూడు లోకముల ప్రభుత్వమును దానముచేసెను.

గొప్పయోగమహిమకల విష్ణువును దేవతలు, ఋషులు, కిన్నరులు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు, ఆదిత్యులు, మరుద్గణములు స్తోత్రము చేయసాగిరి.

వామనరూపమును ధరించిన విష్ణువు, ఆశ్చర్యకరమైన పనినిచేసి, అందరు చూచుచుండగా అక్కడనే అంతర్థానమాయెను. సంపద్యుక్తుడై ఆరాక్షసశ్రేష్ఠుడగు బలి విష్ణువుచే ప్రేరితుడై పాతాళమును చేరెను. ప్రహ్లాదునిచేత, ఇతరరాక్షస వరులచేత ప్రోత్సహించబడి, విష్ణువునందు భక్తికలవాడై, తత్పరుడైయుండెను.

విష్ణువుయొక్క మహాత్మ్యమును, శ్రేష్ఠమైనభక్తి యోగమును గూర్చి, పూజావిధానమునుగూర్చి బలి, ప్రహ్లాదుని ప్రశ్నించేను. అప్పుడావిషయముల నాతడు చెప్పగా దాని ప్రకారమతడు చేసెను.

 తరువాత బలిచక్రవర్తి శంఖమును, చక్రమును చేతులయందు ధరించినట్టి, పద్మముల వంటి కన్నులు గలిగిన, ఇంతయని వర్ణించుటకు శక్యముకానట్టి, ప్రభువైన నారాయణుని, మనస్సునందు శ్రద్ధాపూర్వకముగానిలిపి, కర్మయోగము నుపేక్షించి భక్తితో శరణము పొందెను. ఓ ద్వీజవరులారా ఈవామనావతారముయొక్క పరాక్రమము నాచే మీకు చెప్పబడినది. పురుషశ్రేష్ఠుడైన ఆనారాయణుడు ఎల్లప్పుడు దేవకార్యములను నెరవేర్చుచుండును.

శ్రీ కూర్మమహాపురాణములో త్రివిక్రమ చరితమనబడు పదునేడవ అధ్యాయము సమాప్తము.