కూర్మ మహా పురాణము

Table of Contents

38వ అధ్యాయము

సూతమహర్షి పలికెను.

ఈ నర్మదాదేవి పరమ పావనురాలు. దేవతలచే గంధర్వులచే సేవించబడి, ప్రసిద్ధిగాంచీ, నదీరూపముగా పరిణమించి, ఉత్తమ తీర్థముగా పేరొందిను. మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన ఈ తీర్థమాహాత్మ్యమును వినుడు. ఇది శుభము, సర్వపాప ప్రణాశనము.

ధర్మరాజు ఇట్లు అడిగెను

ఓ మహామునీ నీచే పలువిధములగు ధర్మములను వింటిని. ప్రయాగ మాహాత్మ్యము, పలు తీర్థముల మాహాత్మ్యము కూడా వింటిని. అన్ని తీర్థములలో ముఖ్యమైనది నర్మద అని మీరు చెప్పితిని. ఇప్పుడు ఆ నర్మదా మాహాత్మ్యమును తెలుపవలసినదిగా ప్రార్థించుచున్నాను.

మార్కండేయుడిట్లు చెప్పెను.

నర్మదానది అన్నీ సదులలో శ్రేష్టమైనది. ఈనదీ రుద్రదేహమునుండి వెడలినది. స్థావరములను, చరములను అన్నింటిని తరింప చేయును. పురాణకాలమున నేను వినిన నర్మదా మాహాత్మ్యమును నీకు చెప్పెదను. సావధానముగా వినుము. కనఖల క్షేత్రమున గంగ కురుక్షేత్రమున సరస్వతి పాపనమని చెప్పుదురు. కాని నర్మదానది గ్రామమున గాని, అరణ్యమునగానీ, అంతట పవిత్రమైనదేకదా సరస్వతీనదిని మూడు దీనములు, యమునానదిని ఏడు దీనములు, గంగానదిని స్పృశించిన వెంటనే పవిత్రులగుదురు. కాని నర్మదానది దర్శనమాత్రముచే పునీతము చేయును. కళింగదేశపు పశ్చిమభాగమున అమరకంటకమను పర్వతమునుండియే, పవిత్రము, మూడులోకముల రమణీయము, మనోహరమునగు నర్మదానదీ వెలువడినది. ఓ రాజేంద్రా దేవతలు, అసురులు, గంధర్వులు, తపోధనులగు ఋషులు ఇచ్చటనే తపస్సుచేసి, పరమమగు సిద్ధిని పొందిరి. నరుడెవరేని అచటస్నానముచేసి, ఆత్మసంయమనము కలిగి, జితేంద్రియుడై ఒక్కరాత్రి ఉపవసించెనేని, నూరు తరముల ఆతని వంశమును తరింప చేయును.

రాజేంద్రా ఈ ఉత్తమమగు నది నూరు యోజనముల పొడవు, రెండుయోజనముల వెడల్పు విస్తరించేనని విందుము. ఆ అమరకంటక పర్వత సమీపమున లెక్కకు మిక్కిలి తీర్థములున్నవి. ఓ రాజా ఎవరైనను బ్రహ్మచర్యమును పాటించుచు, శుచియై, క్రోధమును జయించి, ఇంద్రియములు జయించి, సర్వవిధముల హింసనువీడీ, సర్వభూతములందు హితమును పాటించుచు, వీటినన్నింటిని అసిధారావ్రతముగా పాటించు వాడు ఇచట ప్రాణములవీడెనేని, వానికి లభించు పుణ్యమును సావధానచిత్తుడవైవినుము.

ఓ రాజా అతడు దేవతాస్త్రీలతో పరివేష్టించబడి, అప్సరోగణముల సమ్మర్ధమైన స్వర్గలోకమున నూరువేల సంవత్సరములు ఆనందించును. దీవ్యగంధమును ఒంటినిండ అలదుకొని, దివ్యపుష్పదామముల అలంకరింపబడి, దేవలోకములో క్రీడించుచు, దేవతాబృందముతో ఆనందించును.

అంతట పుణ్యానుభవము పూర్తి అయిన పిదప స్వర్గమునుండి భువికి జారీ, ధార్మికుడగు రాజుగా జన్మించును. అతనిని నానారత్న సమన్వితమును, దీవ్యమణిమయములు, వజ్రవైడూర్యములచే అలంకరింపబడు స్తంభములతో, వర్ణింపనలవికాని వైభవముగల వాహనములతో, దాసదాసీజన సమన్వితమైన భవంతి లభించును. సకల స్త్రీలోక మనోవల్లభుడై, రాజరాజేశ్వరుడై శ్రీయుతుడై నూరు వత్సరముల పర్యంతము సకలభోగములను అనుభవించుచు జీవించును.

ఈ తీర్థములో అగ్ని ప్రవేశముచేసి, జలప్రవేశము చేసిన, అనశన వ్రతమాచరించిన ఆకాశమున వాయువులో, పునరావృత్తి రహితమైన ఉత్తమపదము ప్రాప్తించును. అమరకంటక పర్వత పశ్చిమతటమున జలేశ్వరమను హ్రదము సర్వపాపవినాశకము, మూడులోకములలో ప్రసిద్ధి గలది. ఈ తీర్థమున సంధ్యావందనము చేసి, పిండప్రదాన మాచరించిన పితృదేవతలు పదిసంవత్సరముల వరకు తృప్తి చెందుదురు. నర్మదా దక్షిణ తటమున కపిల అను మహానది కలదు. ఈనదికి రెండువైపుల సరళ, అర్జునవృక్షములు హ్యాపించియున్నవి. కపిలానది పరమపావనము. మూడులోకముల ప్రసిద్దిగాంచినది. ఈ తీర్థమున కోటి తీర్థముల కంటే ఎక్కువ తీర్థములే కలిసి ఉన్నవి. కాలవశమున, ఈ తీర్థమున పడిపోయిన వృక్షములు గూడ నర్మదాజల స్పర్శ సంభవించినచో ఉత్తమ గతినీ పొందును. మరియొక మహానది మహాభాగ అనునదీ. ఇది శుభంకరము; విశల్యకరణి కూడ ఈ తీర్థములో స్నానము చేసిన వానికి శల్యములు, (పాపములు) తొలగిపోనును. కపిల, విశల్య అను రెండు నదులు పురాణ కులమున లోకహితమునుగోరీ ఈశ్వరునిచే ఏర్పరచబడినవి. ఈ తీర్థమున ఉపవసించినవాడు అన్ని పాపములు తొలగి పరిశుద్ధుడై రుద్రలోకమును పొందును. ఈ తీర్ధమున స్నానము చేసినవాడు అశ్వమేధ ఫలమును పొందును. ఈ నది ఉత్తరతీరమున ఉన్నవారు రుద్రలోక పోసమును పొందెదరు.

సరస్వతీ నదీలో, గంగానదిలో, నర్మదానదిలో చేసిన స్నానము, దానము సమఫలముల నీచ్చునని శంకరుడు చెప్పెను. అమర కంటక పర్వతమున మృతి చెందినవాడు రుద్రలోకమున నూరు కోట్ల సంవత్సరములు నివసించును. నురుగుల తరగలతో నిండిన, పరమపావనమైన పుణ్యకరమైన నర్మదానదీ జలమునకు, నమస్కరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడగును. నర్మద అన్ని విధముల పవిత్రమైనది. బ్రహ్మహత్యా పాపము గూడో నశింపచేయగల నది. ఇచట ఒక్కదినము ఉపవాసమున్నవారు బ్రహ్మహత్యాపాపము తొలగించుకొనగలరు. అట్లే జాలేశ్వరము అను మరియొక తీర్థము గలదు. ఇది కూడా సర్వపాప వినాశకరము. ఇచట మనో నియమముతో నివసించువారు సర్వాభీష్టములను పొందుదురు, సూర్యచంద్ర గ్రహణ సమయములో అమరకంటక పర్వతమునకు వెళ్లినవాడు అశ్వమేథయాగముకన్న పదిరెట్లు ఫలమును పొందును. ఈ అమర కంటక పర్వతము పుణ్యప్రదమైనది. దేవతలు గంధర్వులు సేవించిరి. పలు వృక్షములతో లతలతో కూడియున్నది. పలుప్రకృతులతో పరిశోభితమైనది. ఈ క్షేత్రమున పార్వతితో పరమేశ్వరుడు, బ్రహ్మ విష్ణువు, ఇంద్రుడు, విద్యాధరగణములు నిత్య నివాసమేర్పరచుకొనిరి. అమరకంటక పర్వతమునకు ప్రదక్షిణ చేసినవాడు పౌండరీకక్రతుఫలమును పొందును.

ఇట్లే కావేరియను విశాలమగు పాపనివారిణియగు నది కలదు. ఇచట స్నానమాడి, వృషభధ్వజుడైన మహాదేవుని పూజించవలయును. నర్మదాసంగమమున, శంకరుని ఆరాధించినపోడు, రుద్రలోకమును చేరును.

ఇది శ్రీ కూర్మపురాణములో షటిసాహస్రసంహితలో ఉపరివిభాగమున ముప్పది ఎనిమిదవ అధ్యాయము.