కూర్మ మహా పురాణము
9 – సృష్టి క్రమము
సూతుడు చెప్పెను: -
ఈ మాటను విని నారదుడు మొదలగు మహారులు, వరములనిచ్చు విష్ణువుకు నమస్కరించి, సందేహముతో కూడిన వారై ఆయననిట్లు ప్రశ్నించీరి.
మునులు పలికిరి : -
ఓ జనార్ధనా! నీ చేత ముఖ్యతత్వము మొదలగు వాని సర్గము గూర్చి చెప్పబడినది. ఇప్పుడిక మాయీ సంశయమును తొలగించుటకు నీవు తగియున్నావు.
భగవంతుడు, పినాకమును ధరించువాడును అగు శివుడు పూర్వమందే ఉన్నవాడైనప్పటికి, అవ్యక్తముఐన పుట్టుక గల బ్రహ్మకు కుమారుడుగా ఎట్లు అయినాడు?
మరియు లోకపితామహుడు, జగత్తులకు ప్రభువు అగు బ్రహ్మ అండము నుండి ఎట్లు జన్మించెనో, దానిని మాకు తెలుపుము.
కూర్మస్వామి చెప్పెను: -
ఋషులారా! మీరందరు వినుడు. అధికమైన ప్రభావము కల శంకరుడు బ్రహ్మకు కుమారుడగుట, కమల సంభవుడుగా బ్రహ్మయొక్క పుట్టుకను గూడ, చెప్పుదును.
గడచిన కల్పము చివర మూడు లోకములు అంధకారముతో నిండి ఉండెను. మొత్తము ఒకే సముద్ర రూపముగా భయంకరముగా ఉండెను. దేవతలు మొదలగు వారు కాని, బుషులు కానీ లేకుండిరి.
జనశూన్యమైన, ప్రమాదరహితమైన ఆ సముద్రములో భగవంతుడగు నారాయణుడు, పురుషోత్తముడు శేషుని శయ్యగా కల్పించుకొని శయనించేను.
ఆ నారాయణుడు వేయి తలలు కలవాడు, వేయి కన్నులు వేయిపాదములు కలవాడుగా, వేయి చేతులు కలవాడును అయి, సర్వజ్ఞుడై బుద్దిమంతులైన పండితుల చేధ్యానింపబడుచు. పసుపు పచ్చని వస్త్రము ధరించి, వెడల్పయిన రొమ్ము కలవాడై, నల్లని మేఘముతో సమాన కాంతి కలిగి, విభూతి యోగ స్వరూపుడై యోగుల యందు దయకలవాడుగా నుండెను.
ఒకప్పుడు నిద్రించి యున్న ఆ నారాయణుని యొక్క నాభియందు విలాసము కొరకు, ఆశ్చర్యకరము, మూడు లోకముల సారభూతము, నిర్మలము అగు కమలము ఆవిర్భవించెను.
ఆపద్మము నూరు యోజనముల విస్తీర్ణము కలది, బాలసూర్యునితో సమాన కాంతి గలది, శ్రేష్ఠమైన పరిమళముతో కూడినది, పుణ్యకరము. కర్ణికతో, కేసరములతో కూడియుండెను.
ఈ విధముగా చాలా కాలము ఆ విష్ణువు నివసించి యుండగా అప్పుడు భగవంతుడగు హిరణ్యగర్భుడు ఆ ప్రదేశమును చేరుకొనెను.
విశ్వాత్మకుడైన నారాయణునీ తన చేతితో సనాతనుడైన బ్రహ్మ పైకి లేపి, అతని మాయ చేత మోహితుడై మధురమైన మాటను ఇట్లు పలికెను.
జనశూన్యము, అంధకారముతో నిండినది, ఒకే సముద్ర రూపముగా మారిన యీలోకములో ఒంటరివాడుగా ఉన్న నీవెవరవు? ఓ పురుషశ్రేష్ఠుడా! నాకు తెలుపుము.
బ్రహ్మయొక్క ఆ మాట విని నారాయణుడు నవ్వి, మేఘము వలె గంభీర ధ్వని కలవాడై బ్రహ్మదేవుని గూర్చి ఇట్లు పలికెను.
ఓ బ్రహ్మదేవుడా! నారాయణ దేవుని, లోకములకు ఉత్పత్తి కారణమైన, నాశరహితుడైన వానిగా నన్ను పురుషోత్తముడని, గొప్ప యోగీశ్వరుడని తెలిసి కొనుము.
లోకములకు పితామహుడవైన నీవు ఈ సమస్త ప్రపంచమును నా యందు చూడుము - పర్వతములతో, మహాద్వీపములతో కూడినది, ఏడు సముద్రముల చేత చుట్టబడి యున్నదై నాలో నున్నది.
తరువాత భగవంతుడు, వేదములకు నిధి యగు బ్రహ్మ నవ్వి కమలములవంటి కన్నులు కల విష్ణువును గూర్చి తీక్షమైన వాక్కుతో బదులు పలికెను.
ఈ రీతిగా మాట్లాడి విష్ణువు, మహాయోగి, తెలిసిన వాడయ్యు బ్రహ్మను నీవెవ్వడవు? అని ప్రశ్నించెను.
నేను ధాతను, విధాతను, స్వయంభువును, ప్రపితామహుడను. ఈ విశ్వము నాయందే నిలిచి యున్నది. నేను అంతట వ్యాపించియున్న బ్రహ్మను.
ఆ వాక్కును విని, సత్యపరాక్రముడైన భగవంతుడగు విష్ణువు వారిని పంపించి తరువాత యోగశక్తితో బ్రహ్మయొక్క శరీరమును ప్రవేశించెను.
దేవతలు, రాక్షసులు, మనుష్యులతో కూడిన ఈ మూడు లోకముల సముదాయమును ఆ భగవంతుని ఉదరములో చూచి ఆశ్చర్యమును పొందెను.
అప్పుడాతని ముఖము నుండి బయటికి వచ్చి, శేషుడే నివాసముగా కలిగిన భగవంతుడైన విష్ణువు ఆ బ్రహ్మను గూర్చి ఇట్లు పలికెను.
నీవు కూడా ఇదే విధముగా శాశ్వతమైన నా కుక్షిని ప్రవేశించి, ఈ విచిత్రములైన లోకాలను పురుషశ్రేష్ఠుడా! చూడుము.
తరువాత ఆహ్లాదమును కల్గించు అతని పొక్కును విని, అభినందించి కుశధ్వజుడు మరల శ్రీపతియగు నారాయణుని యొక్క ఉదరమును ప్రవేశించెను.
సత్యమైన పరాక్రమము కల ఆకుశధ్వజుడు శ్రీమహావిష్ణువుయొక్క గర్భములో నున్న ఆ లోకములను చూచెను. ఆ గర్భములోపలి భాగములో సంచరించి ఆ నారాయణుని యొక్క చివరీ హద్దును చూడలేక పోయెను.
తరువాత మహాత్ముడగు ఆ విష్ణువు చేత అన్ని ద్వారములు మూయబడినవి. అప్పుడీ బ్రహ్మ నారాయణుని నాభి యందు ద్వారమును పొందెను.
సువర్ణ రూపమైన అండము నుండి పుట్టిన బ్రహ్మ తన యోగ బలముచేత ఆ నాభిద్వారములో ప్రవేశించి తన స్వరూపమును చతురాననుడుగా కమలము నుండి సాక్షాత్కరింపజేసెను.
కమలము యొక్క లోపలి భాగము వంటి కాంతీ గల ఆ బ్రహ్మ పద్మము నందు నిలిచిన వాడై, భగవంతుడు, స్వయంభువు, లోకములకు కారణభూతుడు, పితామహుడుగా ప్రకాశించెను.
అతడు తనను ప్రపంచమునకు ప్రభువుగా, సర్వోన్నత స్థానముగా తలచిన వాడై విష్ణువును గూర్చి మేఘ ధ్వని వలే గంభీర మైన వాక్కుతో ఇట్లు పలికెను.
నీవు జయమును పొందవలెనను కోరికతో ఇప్పుడు చేసిన పనియేమిటి? నేను ఒక్కడినే మిక్కిలి బలవంతుడను. మరియొకడు లేడు. నన్ను ఎవడు తిరస్కరించగలడు?
బ్రహ్మచేత పలుకబడిన వాక్యమును విని నారాయణుడు సావధానుడై ఊరడింపు ధోరణితో అతనితో మధురమైన వాక్యమునిట్లు పలికెను.
నీవు ధాతను, విధాతవు, స్వయముగా అవతరించిన వాడవు. ప్రపితామహుడవు. నేను అసూయతో ద్వారములను మూయలేదు.
కేవలము వినోదము కొరకే ఆ పని చేసినాను. నిన్ను బోధించు కోరికతో కాదు. దేవతలకు దేవుడవైన పితామహుని నిన్ను ఎవరు బాధింపగోరుదురు?
నీవు బాధింపబడుట లేదు. అన్ని విధముల నీవు గౌరవింప తగిన వాడవు. నా చేత నీకు జరిగిన అపకారమునకు నన్ను నీవు మన్నించుము.
ఓ బ్రహ్మా ఈ కారణము వలన గూడ నీవు నాకు కుమారుడవు అగుదువు గాక. నాకు ప్రియమగునట్లు పద్మయోని అని ప్రసిద్ధుడవు కమ్ము.
తరువాత భగవంతుడైన బ్రహ్మ, విష్ణువునకు ఆ వరము నిచ్చి సాటిలేని సంతోషమును పొందిన వాడై మరల విష్ణువుతో ఇట్లనెను.
నీవు సమస్త ప్రపంచము ఆత్మగా కలవాడవు. నాశములేని వాడవు. అందరికి పరమేశ్వరుడవు. సమస్త భూతములకు అంతరాత్మ స్వరూపుడవు, అతి పురాతనమైన పరబ్రహ్మ స్వరూపమవు.
నేను సమస్త లోకములకు ఆత్మ స్వరూపుడను. మహేశ్వరుడను. ఈ సమస్తవిశ్వము నాతో నిండి యున్నది. బ్రహ్మ కంటే శ్రేష్ఠుడైన పురుషుడను నేను.
మన యిద్దరి కంటే భిన్నముగా మరోక పరమేశ్వరుడు లోకములకు లేడు. ఒకే స్వరూపము నారాయణుడు, పితామహుడు అను పేర్లతో రెండుగా విభజింపబడినది.
అతని చేత ఇట్లు పలుకబడిన నారాయణుడు బ్రహ్మతో ఇట్లనెను. నీవు ఈ విధముగా శపథము చేయుట వినాశమునకు కారణము కాగలదు.
నీవు యోగశక్తితో, నాశరహితుడు, బ్రహ్మకు అధిపతి, ప్రధాన పురుషుడు, అయిన ఈశ్వరుని చూచుట లేదా? నేనా పరమేశ్వరుని తెలుసుకున్నాను.
ఏ మహేశ్వరుని యోగీంద్రులు, సాంఖ్యులు కూడా దర్శించ లేకపోవుచున్నారో, ఆది అంతము లేని ఆ పరబ్రహ్మము నే శరణము పొందుము.
అప్పుడో మాటలకు కోపించిన బ్రహ్మ, కమలముల వంటి కన్నులు గల కేశవునితో ఇట్లనెను. మహాత్మా! శ్రేష్ఠము, నాశరహితము అగు ఆత్మస్వరూపమును నిశ్చయముగా ఎరుగుదును.
జగత్తులకు బ్రహ్మ, అద్వితీయుడు, పరమమైన స్థానముగా నన్ను నేను భావించుచున్నాను మన యిద్దరి కంటే ఇతరుడు మరి యొక పరమేశ్వరుడు లోకములకు లేడు.
నీవు అధిక మైన నిద్రను విడిచి, నీ ఆత్మస్వరూపమును దర్శించుము. అని కోపముతో పలికిన బ్రహ్మయొక్క వాక్యమును విని కూడా ప్రభువైన ఆ విష్ణువు, ఓ శ్రేష్ఠుడా! నీవిట్లు మహాత్ముని గూర్చి తిరస్కారముగా పలుకకుము. ఓ బ్రహ్మా ! నాకు తెలియనిది లేదు. నేను మరి యొక విధముగా నీకు చెప్పుట లేదు.
కాని ఓ బ్రహ్మా! పరమేశ్వర సంబంధిని, అంతములేనిది, సమస్త విశేషములకు కారణభూతమైనది, తనంతట తాను సంభవించి నది యగు మాయ మోహింపజేయును.
భగవంతుడగు విష్ణువు ఇంత మాత్రముగా యీ విషయమును చెప్పి ఊరకుండెను. దేవేంద్రుడు ఆపరమతత్త్వమును, తన ఆత్మస్వరూపమును తెలిసికొనెను. అపరిమేయమైన ఆత్మ కల, భూతములకు పరమేశ్వరుడగు శివుడు బ్రహ్మను అనుగ్రహించుట కొరకు అక్కడ సాక్షాత్కరించెను.
నొసటి యందు కన్ను కలవాడు, జడల సమూహముచేత అలంకరింపబడినవాడు. త్రిశూలము చేతియందు ధరించిన వాడు, తేజస్సులకు గొప్ప నిధి, భగవంతుడు, విద్యలయొక్క విలాసములను కూర్చిన వాడు, సూర్య, చంద్ర, నక్షత్ర సహితములైన గ్రహములతో ఆశ్యర్యకరమైన రూపము కలిగి పాదముల యందు వ్రేలాడుచున్న మాలను ధరించువాడుగా శివుడు కన్పించెను.
ఆ యీశానదేవుని చూచి లోకపితామహుడైన బ్రహ్మ మాయచేత మిక్కిలి మోహితుడై పీతాంబరుడైన విష్ణువుతో ఇట్లనెను
నల్లని వాడు, శూలము చేతి యందు కలవాడు, మూడు కన్నులు కల యీ పురుషుడెవ్వడు? ఓ జనార్ధనా! ఇతడు తేజస్సుల సమూహము, అమేయమైన ఆకారము కలవాడై వచ్చుచున్నాడు
అతని యీ మాటను విని రాక్షస వినాశకుడైన విష్ణువు, నిర్మలమైన జలము నందు ప్రకాశించుచున్న భగవంతుడగు ఈశ్వరుని చూచేను.
బ్రహ్మతత్త్వమును భావించు వాడగు, భగవంతుడు విష్ణువు, ఈశ్వరుని ఆపరమ భావమును తెలిసి కొని, లేచి దేవదేవుడగు పితామహుని గూర్చి యిట్లనెను.
ఇతడు భగవంతుడగు మహాదేవుడు. స్వయం ప్రకాశమానుడు. సనాతనుడు, ఆద్యంతాలు లేనివాడు, ఆలోచింప శక్యము కాని వాడు, లోకములకు ప్రభువు, గొప్పవాడు
ఇతడు శుభమును కలిగించువాడు, శంభువు, ఈశానుడు, సమస్తమునకు ఆత్మయగువాడు, పరమేశ్వరుడు, భూతముల కధిపతి, యోగి, మహేశుడు, నిర్మలుడు, శివుడు, ధాత మరియు విధాత, ప్రధానుడు, నాశరహితుడగు ప్రభువు. బ్రహ్మభావము చేత ప్రభావితులైన సన్యాసులు ఎవనిని దర్శింతురో, అతడే ఇతడు.
ఇతడు సమస్త విశ్వమును సృజించును, కాపాడును, సంహరించును. ఈ మహాదేవుడు, కేవలుడు, భేదరహితుడు శివుడు. కాలపురుష రూపుడై సృష్ట్యాది కార్యములను జరుపును.
ఏ సనాతన పురుషుడు పూర్వము నిన్ను బ్రహ్మగా చేసెనో, నీకు వేదములను గూడ అప్పగించేనో ఆ శంకరుడు ఇప్పుడు వచ్చుచున్నాడు.
ఓ ప్రపితామహా! ఈ శివుని యొక్క మరి యొక మూర్తి లోక కారణభూతము, సనాతనము అయిన నా రూపమును వాసుదేవ నామము కలదానినిగా తెలిసికొనుము.
యోగేశ్వరుడు, బ్రహ్మకు అధిపతి, నాశరహితుడు అగు భగవంతుని చూచుట లేదా? నీ నేత్రము దివ్యదృష్టి కలదగు గాక. దానితో ఆపరతత్వరూపమును చూడగలవు.
విష్ణువు వలన దివ్యచక్షువును పొంది లోకపితామహుడగు బ్రహ్మ తన ఎదురుగా నిలిచి యున్న శివుని పరమజ్ఞాన రూపునిగా తెలిసికొనెను.
ఆ బ్రహ్మదేవుడు ఈశ్వర సంబంధియగు ఆ పరమజ్ఞానమును పొంది, ఆ దేవుని తండ్రిగా గుర్తించి శరణము పొందెను.
ఓంకారమును స్మరించుకొని, ఆత్మను ఆత్మతో నిగ్రహించుకొని, అధర్వ శిరోమంత్రములతో అంజలి జోడించి దేవుని స్తోత్రము చేసెను.
భగవంతుడగు పరమేశ్వరుడు ఆ బ్రహ్మ చేత స్తోత్రము చేయబడిన వాడై గొప్ప ప్రీతిని పొంది చిరునవ్వు కలవాడై ఇట్లు పలికెను.
వత్సా! నీవు నాతో సమానుడవు, సందేహము లేదు. నీవు నాకు భక్తుడవు కూడా, నీవు నా చేతనే పూర్వము లోక సృష్టి కొరకు పుట్టించబడినావు.
నీవు నా శరీరము నుండి పుట్టిన ఆది పురుషుడవు, నాకు ఆత్మరూపుడవు, ఓ విశ్వాత్మా! అనఘా!ఒక వరమును కోరుకొనుము. నీకు నేను వరము నిచ్చెదను.
దేవదేవుని మాటను విని పద్మసంభవుడైన బ్రహ్మ విష్ణుదేవుని చూచి నమస్కరించి శంకరునితో ఇట్లనెను.
భూతభవిష్యత్తులకు ప్రభువైన భగవంతుడా! పార్వతీ పతీ! మహాదేవా! నిన్నే కుమారునిగా పొందగోరుచున్నాను. లేదా నీతో సమానుడైన పుత్రునైనా అనుగ్రహించుము.
మహాదేవా! నీచేత సూక్ష్మమైన మాయద్వారా మోహాము పొందింపబడినాను. శివా! నీ సర్వోతృష్ణ తత్వమును యథాతథముగా తెలియకున్నాను. । ప్రభూ! నీవే భక్తులకు తల్లివి, సోదరుడవు, తండ్రివి, మిత్రుడవు కూడా. శరణుకోరి నీ పాదములకు నమస్కరించుచున్నాను. ప్రసన్నుడవు కమ్ము.
లోకానికి ప్రభువు, వృషభధ్వజుడైన ఆ దేవుడు అతని మాటను వినీ, కుమారుడైన జనార్ధనుని చూచి ఇట్లు పలికెను.
కుమారా! పూజ్యుడవైన నీచేత ఏది అడుగబడినదో, దానిని చేయగలను. నీకు పాపరహితమైన, దివ్యమైన, ఈశ్వరసంబంధి అయిన విజ్ఞానము కలుగగలదు.
లోకములకు పితామహుడా! నీవే సమస్త భూతములకు మొదటి స్రష్టగా నియమింపబడినావు. దేవతలకు ప్రభువైన వాడా! ఆభూతముల యందు నీవు మాయను కల్పించుము.
ఈ నారాయణుడు, నా యొక్క ప్రశస్తమైన శరీరరూపుడు. ఈ హరి నావలన నియుక్తుడై నీ యొక్క యోగక్షేమాలను పాలించగలడు.
ఆ పరమేశ్వరుడు ఈ విధముగా పలికి, సంతోషించిన వాడై చేతులతో బ్రహ్మదేవుని స్పశించి, తరువాత విష్ణువు నుద్దేశించి ఈ మాట పలికెను.
నేసు నీ విషయంలో అన్ని విధాల సంతోషించినాను. జగన్మయుడా! నీవు భక్తుడవు. ఏదైన వరమును కోరుకొనుము. యథార్థముగా మన యిద్దరి కంటే ఇతరుడొకడు లేడు.
భగవంతుని వాక్యమును విని విశ్వమయుడగు విష్ణువు, ఆయన ముఖమును చూచి ప్రసన్న వాక్కుతో ఇట్లనెను.
పరమేశ్వరుడవైన నిన్ను నేను చూచుచున్నాను. ఇదియే నాకు కొని యాడ దగిన వరము. నాకు నీ యందు భక్తి కలిగి ఉండుగాక, మహాదేవుడు 'అట్లే అగుగాక' అని పలికి మరల విష్ణువు తో పలికెను. నీవు సమస్త కార్యములకు కర్తవు, నేను అధిదేవతను.
ఈ సమస్త ప్రపంచము, నీ రూపము నా రూపము అనుటలో సందేహము లేదు. నీవు చంద్రుడ వైన నేను సూర్యుడను. నీవు రాత్రివి కాగా నేను పగలును.
నీవు అవ్యక్తమైన ప్రకృతి రూపుడవు, నేను పురుషుడను. నీవు జ్ఞానము నేను జ్ఞాతను. నీవు మాయా స్వరూపుడవు, నేనీశ్వరుడను.
నీవు విద్యాస్వరూపిణియైన శక్తివి, నేను శక్తిమంతుడనైన ఈశ్వరుడను. ఏ నేను కలారహితుడైన భగవంతుడనో, నీవు నా కభిన్నుడవైన నారాయణ ప్రభుడవు బ్రహ్మవాదులైన యోగులు మన యిద్దరిని ఒకరుగానే చూచేదరు. ఓ విశ్వాత్మ! నీన్నోశయించక ఏ యోగి కూడా నన్ను చేరలేడు. దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన యీ ప్రపంచాన్నంతటిని పరిపాలించుము.
అనాది యగు భగవంతుడు తన మాయచేత సమస్త భూతములను మోహింప జేయువాడు, అనంత శక్తి కల పోడు అగు మహేశ్వరుడు ఇట్లు పలికీ, పుట్టుక, వృద్ధి, నాశము లేనటు వంటి, అవ్యక్తము, కేవలము అగు తన ధామము నకు వెళ్లెను. శ్రీ కూర్మపురాణములో నవమాధ్యాయము సమాప్తము.
