కూర్మ మహా పురాణము

Table of Contents

33 - వారణాశి మాహాత్మ్యము

సూతుడిట్లనెను : -

బుద్ధిమంతుడైన వ్యాసముని మునులతో వీడ్కోలు పొంది దేవదేవుడైన శివుని యొక్క నాశరహితమైన కపర్దీశ్వర లింగమును చూచుటకువెళ్ళెను.

విప్రులారా! అతడక్కడ విధి ప్రకారము స్నానము, పితృతర్పణముచేసి, పిశాచమోచనమనే పేరుగల తీర్థములో శివుని పూజించేను.

అక్కడ ఆ మునులు తమ గురువుతో కూడ అద్భుతమును చూచిరి. క్షేత్ర మహత్త్వముగా తలచి గిరీశుడైన శివునికి నమస్కారము చేసిరి.

అప్పుడు వారి దగ్గరికి భయంకర రూపము కల ఒక పులి కపర్దీశ్వర లింగము దగ్గర ఒక ఆడ జింకను చంపుటకు వచ్చెను. భయముతో కూడిన మనస్సుకల ఆ జింక ప్రదక్షిణములు చేసి తత్తరపాటుతో పరుగెత్తుతూ పులిచేతిలో చిక్కెను.

చాలా ఎక్కువ బలము కల శార్దూలము వాడియైన తన గోళ్ళతో ఆ జింకను చీల్చి, ఆ మునులను చూచి మరోక నిర్జన ప్రదేశానికి వెళ్ళినది.

ఆ హరిణి కపర్దశ లింగము ముందు భాగంలో మరణించిన వెంటనే ఆకాశంలో సూర్యునితో సమాన కాంతిగల గొప్ప జ్వాలా రూపంలో కన్పించెను.

అది మూడు కన్నులు కలిగి, నల్లని మెడ కలదై, చంద్రకళతో కూడిన తల కలదై, వృషభము నధిరోహించి అటువంటి ఆకారము కల పురుషులతో కలిసి ఉండెను.

ఆకాశ చారులైన దేవతలు ఆ జింక తలపై అప్పుడు పుష్పవర్షము కుపించిరి. తరువాత ఆ జ్వాల గణేశ్వర రూపాన్ని పొంది అదృశ్య మైనది.

ఈ గొప్ప అద్భుత దృశ్యాన్నీ చూచి జైమిని మొదలగు వారు తమ గురువైన వేదవ్యాస మునిని కపర్దీశ్వర క్షేత్ర మాహాత్మ్యము తెలుపుడని ప్రశ్నించిరి.

భగవంతుడైన వ్యాసముని కపర్దీశ్వర స్వామి ఎదురుగా కూర్చుని వృషభ ధ్వజుడైన శివునికి నమస్కరించి, ఆ మునులను గూర్చి కపర్దీశుని గొప్పతనము నిట్లు వివరించెను.

ఈ కపర్దీశ్వరుని స్మరణ మాత్రము చేతనే సమస్త పాప సమూహము వెంటనే నశిస్తుంది. కామము, క్రోధము మొదలుగ కల దోషాలు, సమస్త విఘ్నములు వారణాశి యందు నివసించే యీ దేవుని పూజించుట వలన నశించును. అందువలన ఎల్లప్పుడు కపర్దీశ్వరుణ్ణి దర్శించవలెను. (ఇదీ ప్రక్షిప్త భాగము)

ఇది ఉత్తమమైన కపర్దీశ్వర దేవుని లింగము. ప్రయత్నపూర్వకంగా పూజింపదగినది. వైదిక స్తోత్రాలతో కొనియాడదగినది.

శాంతమైన మనస్సు కలిగి నిత్యముగా ధ్యానించు యోగులకు ఆరు నెలల కాలంలో యోగ సిద్ధి లభించును ఇందులో సందేహము లేదు.

బ్రహ్మ హత్య మొదలైన పాపములు ఈ దేవుని పూజించుట వలన నశించును. ఇక్కడికి సమీపములోని పిశాచమోచన మనుకుండములో స్నానము చేసినవానీకి కూడా పాపములన్నీ తొలగును.

ద్విజులారా! ఈ క్షేత్రములో పూర్వము ప్రశంసింపబడిన నియమము కల శంకుకర్ణుడని ప్రసిద్ధుడైన ఒక ముని నివసించి శంకరుని పూజించేను.

ఆ మునీ రుద్రుని గూర్చి, రుద్ర స్వరూపమైన ఓంకారమును ఎల్లప్పుడూ జపించెను. పుష్పములు, ధూపము మొదలగు ఉపచారములతో, స్తోత్రములతో, నమస్కార ప్రదక్షిణములతో అతడు పూజించెను.

ఆ శంకుకర్ణుడు అక్కడ యోగసాధన పరుడై, నిషాపూర్వకమైన దీక్ష నవలంబించి అక్కడ ఉండెను. ఒకానొక సమయమున ఆకలితో కూడిన, చర్మముతో కప్పబడిన అవయవములు కలిగిన, మాటి మాటికీ నిట్టూర్పులు విడుచుచున్న, తనవద్దకు వచ్చిన ఒక ప్రేతమును చూచెను. ఆ ప్రేతమును చూచీ ముని శ్రేష్టుడైన అతడు మిక్కిలి దయతో కూడినవాడాయెను.

తరువాత నీవు ఎవరవు? ఏ ప్రదేశము నుండి ఇక్కడికి వచ్చితివి? అని ప్రశ్నించగా ఆ పిశాచము ఆకలి బాధతో పీడింపబడుచున్నట్లు ఇట్లు పలికెను.

పూర్వజన్మములో నేను ధన ధాన్యములతో కూడిన ఒక బ్రాహ్మణుడను. కొడుకులు, మనుమలతోకూడి, కుటుంబ భారమును వహించుట యందాసక్తి కలిగియుంటిని.

నాచేత దేవతలు పూజింపబడలేదు. గోవులుకాని, అతిథులుకాని సత్కర్తింపబడలేదు. ఎప్పుడూ కూడా నాచేత కొంచెమైనను పుణ్యకార్యము చేయబడలేదు.

ఒకప్పుడు వృషభవాహనుడైన భగవంతుడగు రుద్రుడు, విశ్వేశ్వరుడు వారణాశి యందు నాచేత చూడబడి స్పృశింపబడి నమస్కారముచే పూజింపబడినాడు.

తరువాత చాలా కాలమునకు నేను మరణమును పొందితిని. ఓ మునీశ్వరా! అయినప్పటికి నాచేత భయంకరమైన యమలోకము చూడబడలేదు. (ఒక్కమారు విశ్వేశ్వర దర్శన, నమస్కారములచేత యమలోకమునకు దూరుడనైతినని భావము)

ఇటువంటి పుట్టుకను పిశాచ జాతికి సంబంధించిన దానిని పొంది ఆకలిచే పీడింపబడి, దాహముచే ఆక్రమింపబడి ఆ బాధతో మంచి చెడులను గుర్తించకపోతిని.

ఓ మహాత్మా! నాకీ జన్మనుండి విముక్తి కలిగించుటకు నీవేదైన ఉపాయమును కనుగొన్న యెడల దానిని నా విషయములో అనుగ్రహింపుము. నీకు నమస్కారము. నిన్ను నేను శరణు పొందుచున్నాను.

ఇట్లు పలుకబడిన ఆ శంకుకర్ణుడు పిశాచమును గూర్చి యిట్లు పలికెను. ఓయీ! ఈ లోకములో పుణ్యవంతులలో శ్రేష్ఠుడు నీ వంటివాడు మరియొకడు లేడు.

ఎందుకనగా, నీచేత పూర్వము భగవంతుడు, ప్రపంచమున కధీశ్వరుడు అగు శివుడు స్వయముగా చూడబడినాడు, స్పృశింపబడి ప్రణామము స్వీకరించినాడు. భూమిమీద నీతో సమానుడు ఇతరుడెవ్వడున్నోడు?

కావున పూర్వకర్మ ఫలరూపముగా నీవీ దేశమునకు వచ్చితివి. నీవు సావధానుడవై శీఘ్రముగా ఈ పుష్కరిణిలో స్నానమును చేయుము.

దానీతో నీవు తొందరలోనే నీంద్యమైన యీ పిశాచ రూపమును విడువగలవు.

ఆ పిశాచరూపుడు కరుణాళువైన శంకుకర్ణమునిచేత ఇట్లు చెప్పబడినవాడై, దేవతలలో శ్రేష్ఠుడు, మూడు కన్నులు కలవాడు, విశ్వప్రభువైన కపర్దీశ్వర దేవుని స్మరించి, మనస్సును సావధానము చేసికొని ఆ కుండములో స్నానము చేసెను.

ఆ మునిసమీపములో కుండములో స్నానము చేయుట వలన పిశాచరూపము నశించిపోయేను. అప్పుడతడు శ్రేష్టములైన ఆభరణములతో అలంకరింపబడినవాడై సూర్యునితో సమానముగా ప్రకాశించుచున్న విమానమునందు చంద్రకళతో కూడియున్న అందమైన శిరోభాగము కలవాడై సాక్షాత్కరించెను.

స్వర్గము నందున్నటువంటి రుద్రులతో, వర్ణించుటకు శక్యముకాని మహిమకల యోగులతో కూడియున్నవాడై ప్రకాశించేను. సూర్యుడు తన ఉదయ కాలములో వాలఖిల్యాదిమునులతో, సమస్త దేవతలతో పరివృతుడై ఎట్లు ప్రకాశించునో, అతడట్లుండెను.

ఆకాశమునందు సిద్దులు స్తోత్రము చేయుచుండిరి, దేవతా సమూహములు కొనియాడినవి. అందమైన అప్సరసలు నాట్యము చేసిరి. గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు మొదలగు వారు పుష్పసమూహముతో కూడిన వర్షమును కురియించిరి.

ఆ మునిసమూహములచేత కొనియాడబడినవాడై, భగవంతుని అనుగ్రహము వలన దివ్యజ్ఞానమును పొంది, శ్రేష్టమైనది, వేదత్రయాత్మక మైనది, రుద్రదేవుడు స్వయముగా ఎక్కడ ప్రకాశించునో ఆ దివ్యపదమును ప్రవేశించినాడతడు.

పిశాచ రూపము నుండి విడుదల పొందిన అతనిని చూచి అ శంకుకర్ణముని సంతోషించినవాడై మహేశ్వరుడైన శివుని మనస్సుతో ధ్యానించి, సర్వశ్రేష్ఠుడు, కవి అయిన ఆ కపర్దీశ్వరునికి నమస్కరించి స్తోత్రము చేసెను.

పరమునకంటే అధికుడవైన రక్షకుడవు, అసహాయుడవు, పురాణపురుషుడవగు నిన్ను గూర్చి నమస్కరించుచున్నాను. యోగమునకు ప్రభువు, ఈశ్వరుడు, అగ్ని సూర్యస్వరూపుడు, గహన స్థానము నధిష్టించిన దేవుని ఆశ్రయించుచున్నాను.

వేదాంతగమ్యుడవు, హృదయమందు అధిష్ఠించినవాడవు, హిరణ్మయరూపుడవు, యోగివి, జన్మరహితుడవు, ఆకాశమందున్న గొప్ప మునీశ్వరుడవు, పవిత్రుడవు, బ్రహ్మకు అతీతుడవు అగురుద్రుని నిన్ను శరణము పొందుచున్నాను.

అనంతములైన పాదములు, కన్నులు, శిరస్సులతో కూడియున్నవాడవు, అనంతభుజములు కలవాడవు, తమో గుణమునకు అతీతుడవు, వేదముల యొక్క లక్ష్యమైనవాడవు, హిరణ్యగర్భుడగు బ్రహ్మకు అధిపతివి, మూడు కన్నులు కలవాడవును అగు శంభునకు నీకు ప్రణమిల్లుచున్నాను.

ఎవనివలన ఈ విశ్వము యొక్క పుట్టుక, నాశము జరుగుచున్నదో, ఏ శివుని చేత ఈ సమస్తము కల్పించబడినదో, అటువంటి వేదాంత వేద్యుడవైన, భగవంతుడగు ఈశ్వరునికి ప్రణామముచేసి ఎల్లప్పుడు శరణాగతుడనై యుందును.

చిహ్నరహితుడు, వెలుతురున కందని రూపము కలవాడు, తనంతతాను ప్రభువు, జ్ఞాన ప్రతిమయే ముఖ్యరూపముగా కలవాడు, వేదాంత గమ్యుడు, పరమేశ్వరుడును అగు నీకు నమస్కరింతును. నీకంటె అన్యము మరియేదియు లేదు కదా.

యోగులు విడువబడిన బీజ సంబంధము కలవారై, ధ్యానసమాధిని పొంది, పరమాత్మరూపులై ఏ పరబ్రహ్మమును దర్శింతురో, బ్రహ్మాతీతమైన నీయొక్క స్వరూపమునకు ఎల్లప్పుడు నమస్కరింతును.

ఏ తత్త్వవిషయములో నామములు తృప్తిని కలిగించవో, ఏ స్వరూపము ఇంద్రియ జ్ఞానమునకు గోచరము కాదో, స్వయంభువు, బ్రహ్మపారము అగు నిన్ను శరణు పొంది, నిత్యము వందన మాచరింతును.

వేదములందు శ్రద్ధకలవారు, దేహశూన్యము, భేదరహితము, అఖండము అగు ఏ తత్త్వమును అనేక విధములుగా దర్శింతురో, బ్రహ్మపారమైన నీ యొక్క స్వరూపమును ఎల్లవేళల నమస్కరింతును.

ఎవరి నుండి ప్రధాన తత్త్వము, పురాణ పురుషుడు పరిణామము చెందుచుండునో, దేవతలు ఎవనికి నమస్కరింతురో, తేజోమయ రూపములో నిలిచియున్న, మహాకాలరూపమైన నీయొక్క స్వరూపమునకు నమస్కరించుచున్నాను.

మహేశ్వరుని ఎల్లప్పుడు శరణము పొందుదును. పురాణ పురుషుడు, పర్వతము నందు శయనించు శివుని ఆశ్రయింతును. చంద్రుని శిరస్సున ధరించిన శివుని ఆశ్రయింతును. పినాకమును ధరించు నిన్ను శరణు పొందుచున్నాను.

శంకుకర్ణుడు ఈ విధముగా భగవంతుడగు శివుని స్తోత్రము చేసి, మంగళకరమైన ఓంకారము నుచ్చరించుచు నేలమీద కఱ్ఱవలె పడిపోయెను.

ఆ క్షణములో వెంటనే శివ స్వరూపమైన, జ్ఞానానందాత్మకము, భేదరహితము, ప్రళయకాలపు కోటి అగ్నులతో సమానమైన శ్రేష్ఠమైన లింగము ఆవిర్భవించినది.

అప్పుడు ఆ శంకు కర్ణముని దైవ సంబంధమైన నిర్మల లింగములో లీనమై సర్వాత్మకుడుగా, దోషరహితుడుగా రూపొందెను. అదిచాలా ఆశ్చర్యకరమువలె సంభవించినది.

కపర్దీశ్వరుని యొక్క ఈ రహస్యము, మహిమ కూడా నాచేత తెలుపబడినది. తమోగుణ ప్రభావముచేత దీనిని ఎవ్వడును తెలియలేడు. పండితుడు కూడా ఈ విషయములో మోహమునకు గురియగుచున్నాడు.

పాపములను నశింపజేయునట్టి యీ కథను ఏ భక్తుడు ఎల్లప్పుడు వినునో, అతడు పాపముల చేత విడువబడిన ఆత్మకలవాడై శివుని సాన్నిధ్యమును పొందును.

మనుష్యుడు పరిశుద్ధుడై ఎల్లప్పుడు బ్రహ్మపారమను గొప్ప స్తోత్రమును ఉదయ, మధ్యాహ్న కాలాలలో చదువవలెను. అట్టివాడు యోగసిద్ధిని పొందగలడు.

ఇక్కడనే శాశ్వతముగా నివసింపగలము. దేవతలకు దేవుడైన కపర్దీశ్వరుని దర్శింపగలము. మూడు నేత్రములు కల ఆ దేవుని ఎల్లప్పుడు పూజింతుము.

మహాత్ముడగు వ్యాసముని ఈ విధముగా పలికి, గొప్ప తేజస్సుతో కూడినవాడై, శిష్యులతో కూడ ఆత్మ సంయమము కలవాడై కపర్దీశ్వరుని పూజించుచు అక్కడ నివసించెను.

శ్రీ కూర్మపురాణములో వారణాసీ మాహాత్మ్యము అను పేరుగల ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.