కూర్మ మహా పురాణము
27 - రాజవంశాను కీర్తనము
సూతుడిలా చెప్పెను :
తరువాత మహేశ్వరుని వలన వరము పొంది కృష్ణుడు జాంబవతీ యందు ఉత్తముడైన సాంబుడనే కోడుకును పొందెను.
ప్రద్యుమ్నునికి గొప్ప బలవంతుడైన అనిరుద్ధుడనే కుమారుడు కలిగినాడు. వారిద్దరూ గుణవంతులు, కృష్ణుని మారు శరీరాల వలె ఉండిరి.
కంసుణ్ణి, నరకాసురుణ్ణి, ఇంకొ వందల కొలదీ రాక్షసులను చంపి, విలాసముగా ఇంద్రుని గెలిచి, బాణుడనే గొప్ప రాక్షసుణ్ణి జయించి, ప్రపంచాన్ని చక్కగా నెలకొల్పి, శాశ్వత ధర్మాలను లోకంలో కాపాడి, నారాయణుడు తన నివాసమైన వైకుంఠానికి వెళ్లాలని సంకల్పము చేసికొనెను.
బ్రాహ్మణులారా ఈ మధ్యలో భృగువు మొదలగు మునులు కార్యము నెరవేర్చిన సనాతనుడు, ఈశ్వరుడు అయిన కృష్ణుణ్ణి చూడటానికి ద్వారకాపట్టణానికి వచ్చిరి.
విశ్వాత్ముడైన కృష్ణుడు, బుద్ధిమంతుడైన బలరాముణితో కూడి వారికి నమస్కరించి, పూజించి, ఆసనాలలో కూర్చున్న తరువాత వారితో ఇట్లు పలికినాడు.
మునీశ్వరులారా నా కర్తవ్యాలన్నిటినీ పూర్తి చేసినాను. ఇక విష్ణులోకనామం కల నా స్వకీయపరమపదానికి వెళ్లుదును. మీరు ప్రసన్నులు కండు.
ఇప్పుడు ఘోరము, అశుభకరము అయిన కలియుగము వచ్చినది. ఈ యుగంలో ప్రజలందరు పాప మార్గంలో సంచరించే వారవుతారు.
ద్విజులారా అజ్ఞానులకు హితాన్ని కలిగించే విజ్ఞానాన్ని వ్యాపింప చేయండి. దాని చేత వీరు కలియుగ పాపాల నుండి విముక్తులవుతారు.
కలియుగంలో ఎవరైతే ప్రభువైన నన్ను ఒక్కమారైనా స్మరింతురో అట్టి పురుషోత్తముని యందు భక్తి కల వారికి పాపం నశిస్తుంది.
ఎవరైతే కలియుగములో వేదములందు ప్రతిపాదించబడిన విధానముతో ఎల్లప్పుడు భక్తితో నన్ను పూజింతురో అట్టివారు ఆ పరమపదమును పొందుదురు.
నారాయణునియందు భక్తిశ్రద్ధలు కల జనులు ఉత్తములలోకెల్ల ఉత్తమమైన సద్గతిని పొందుదురు. ఎవరైతే మహేశ్వరుడైన శివుని ద్వేషింతురో వారు అట్టి స్థానమును పొందజాలరు.
ఎవరైతే మహేశ్వరుని దూషింతురో, వారి యొక్క ధ్యానము, యోగము, చేయబడినతపస్సు, జ్ఞానము, యజ్ఞములు మొదలుగా గల ధార్మిక కార్యములు - అన్నియును శీఘ్రముగా నిష్ఫలములగును.
ఎవడు ఎల్లప్పుడు ఏకాగ్రత కల మనస్సుతోకూడి నన్ను పూజించునో, అట్టివాడు భగవంతుడగు శివునినిందించిన యెడల వేలకొలది నరకలోకములను పొందగలడు.
అందువలన ఓ విప్రులారా పశుపతియగు శివుని యొక్క నిందను పనుల చేతగానీ, మనస్సు చేతగాని, మాట చేతగాని పూర్తిగా వీడువ వలెను. అట్లే నా భక్తుల విషయంలో కూడా నిందను ప్రయత్నపూర్వకముగా పరిహరించవలెను.
దక్షయజ్ఞములో దధీచ మహామునిచేత శపించబడిన ఏ బ్రాహ్మణశ్రేష్ఠులు కలరో వారు కలియుగములో భక్తులచేత ప్రయత్నముతో దూరముగా విడువదగిన వారై యున్నారు.
మీ వంశములో జన్మించి ప్రభువైన శంకరుని ద్వేషించిన వారు, గౌతముని చేత శపించబడిన వారు, భూమి యందు బ్రాహ్మణ శ్రేష్టుల చేత మాట్లాడదగని వారు.
ఈ విధముగా కృష్ణుని చేత పలుకబడిన ఆ మహర్షులందరు తమ అంగీకారమును తెలిపి శీఘముగా తమ తమ స్థానములకు వెళ్లిరి.
తరువాత విష్ణువు రూపాంతరమైన కృష్ణుడు లోకాత్మకుడు కావున తన లీలావినోదముతో యాదవవంశము నంతయు సంహరించి, తన పరమపదమునకు వెళ్ళెను.
ఈ విధముగా రాజుల యొక్క వంశ చరిత్ర సంగ్రహముగా మీకు వివరించబడినది. ఇంతకంటే విపులముగా చెప్పుటకు సాధ్యము కోదు. మీరింకను ఏమీ వినగోరుచున్నారు?
మంగళకరమైన యీ రాజవంశముల చరిత్రను ఎవడు పఠించునో, లేదా వినునో అట్టివాడు.అన్ని పాపముల నుండి విడుదల పొందిన వాడై స్వర్గ లోకములో ప్రకాశించును.
శ్రీకూర్మ పురాణములో రాజవంశాను కీర్తనమను ఇరువది యేడవ అధ్యాయము సమాప్తము.
