కూర్మ మహా పురాణము
49 - భువన విన్యాసవర్ణనము
సూతుడిట్లు చెప్పెను.
క్షీరసముద్రమునుచుట్టి వ్యాపించి, జంబూద్వీపపువైశాల్యమునకు రెట్టింపుగా ప్లక్షద్వీపము నెలకొని ఉన్నది. బ్రాహ్మణోత్తములారా! పక్షద్వీపమునందు ఏడుకులపర్వతములు కలవు. సిద్ధుల సమూహముచేత సేవింపబడుచు దేవతలు అచ్చట వేలకొలదిగా పక్షద్వీప నుందురు.
ఆ పర్వతములలో మొదటిది గోమేదము, రెండవది చంద్రపర్వతము, నారదము, దుందుభి, మణిమంతము, మేఘనిః స్వనము అని మరియు నాలుగు పర్వతములు.
వానిలో ఏడవది వైభాజపర్వతము. అది బ్రహ్మకు మిక్కిలి ప్రియమైనది. అక్కడ భగవంతుడైన బ్రహ్మదేవుడు, దేవతల, ఋషుల, గంధర్వుల సిద్దుల సమూహముచేత;
సేవింపబడుచుండును. ఆయన విశ్వస్వరూపుడు, సమస్తమునకు సాక్షి, విశ్వదర్శనుడు. అక్కడి జనపదములు పుణ్యములు. ఆధి వ్యాధులుండవు.
అక్కడ పాపమును చేయు పురుషులు ఏరూపములోను లేరు. ఆ వర్భములకు సముద్రమును చేరుకొను నదులు కూడ ఏడు మాత్రము కలవు.
ఆనదుల యందు బ్రహ్మరులు ఎల్లప్పుడు బ్రహ్మదేవుని పూజింతురు. ఆ నదులు - అనుతప్త, శిఖ, విపాప, త్రిదివ, కృత అనియు; అమృత, సుకృత అనుపేర్లతో ఏడుగాచెప్పబడినవి. అల్పములైన నదులు సరస్సులు కూడ ఇంకను చాల ప్రసిద్ధములుగా అక్కడ కలవు.
ఈ వర్షముల యందు యుగవ్యవస్థలేదు. అక్కడి పురుషులు దీర్ఘకాలము జీవింతురు. ఆర్యకులు, కురురులు, విదేహులు, భావులు అని వారు పీలువబడుదురు.
ఆ ద్వీపమునందు బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రజాతులకు చెందినవారు పైన తెలిపిన విధముగా పిలువబడుదురు. అక్కడ నివసించు వర్ణముల జనులచేత భగవంతుడైన ఈశ్వరుడు పూజింపబడును. .
మునివర్యులారా అక్కడి వారికి సోముని సారూప్యము, సామ్రాజ్యము లభించును. అందరు ధర్మమునందు శ్రద్దకలవారు, సంతోషించిన మనస్సులు కలవారుగా నుందురు.
అక్కడి జనులు రోగరహితులై అయిదువేల సంవత్సరాల పాటు జీవింతురు. ప్లక్షద్వీపమునకు చుట్టు ప్రక్కల దాని పరిమాణమునకు , రెండింతల పరిమాణము కలిగి;
ఇక్షురస సముద్రమును పరివేష్టించి శాల్మలిద్వీపము నెలకొని ఉన్నది. దానియందుకూడ ఏడువర్షములు, ఏడుకులపర్వతములే కలవు.
అక్కడ దేవతలు పొడవు కలిగి, ఋజు పర్తనలుగా నుందురు. ఏడునదులు కూడ కలవు. ఆ పర్వతముల పేర్లు వరుసగా - కుముదము, అన్నదము, బలాహకము;
ద్రోణము, కంసము, మహిషము, కకుద్మంతము అని కులపర్వతములున్నవి. యోనీ, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల,విమోచని నివృత్తి అని ఆ నదులపేర్లు. అవీ మనుష్యుల పాపములను నశింపజేయునవి. బ్రాహ్మణోత్తములారా అక్కడి జనుల యందు లోభము కానీ, క్రోధము కొని ఉండవు.
అక్కడ యుగవ్యవస్థలేదు. ప్రజలు రోగబాధలేనివారుగా జీవింతురు. అచట వర్ణముల జనులు ఎల్లప్పుడు సనాతనుడైన వాయుదేవుని పూజింతురు.
వారికి వాయుదేవుని సారూప్యము, సలోకత్వము తగినటువంటి సాధనము వలన లభించును. అక్కడి బ్రాహ్మణులు కపిలవర్ణము కలవారుగా, క్షత్రియులు ఎరుపు రంగుకలవారుగా నుందురు.
ఆద్వీపమునందు వైశ్యులు పసుపుపచ్చని రంగుకలవారుగాను, శూద్రులు నల్లనివారుగాను ఉందురు. ఓ విప్రులారా శాల్మల ద్వీపము యొక్క విస్తారమునకు రెండురెట్లుగా దానికీచుట్టుగా సురాసముద్రమును పరివేష్టించి కుశద్వీపము నిలిచియున్నది. అక్కడ విద్రుమము, హెూమము, ద్యుతిమంతము మరియు పుష్పవంతము కుశేశయము, హరి, మందరము అను ఏడు పర్వతములు కలవు. మరియు ధూమపాప, శివ, పవిత్ర, సమ్మిత అనియును; విద్యుత్ర్పభ, రామ, మహానది అను పేర్లుగల ఏడు నదులు కలవు. ద్విజులారా ఇవికాక ఇతరములైన, నిర్మల జలములు కలిగిన వందలకొలది నదులు కూడ శుభములైనవి కలవు.
అక్కడ దేవతలు మొదలగు వారందరు ప్రభువైన బ్రహ్మదేవుని సేవింతురు. అక్కడి బ్రాహ్మణులు ద్రవిణులనీ, క్షత్రియులు శుష్ములు అనియును;
వైశ్యులు స్తోభులనీ, శూద్రులు ముందేహులని పేర్కొనబడుచున్నారు. మనుష్యులందరు జ్ఞానముతో కూడినవారు, మైత్రి మొదలగు మంచి గుణములు కలవారై యుందురు.
ప్రజలందరు చెప్పిన విధముగా చేయువారు, ప్రాణులకు మేలు చేయుట యందాసక్తి కలవారుగానుందురు. పరమేష్టియగు బ్రహ్మను నానా విధములైన యజ్ఞములతో పూజింతురు.
అక్కడి జనులకు బ్రహ్మదేవుని సాయుజ్యము, సమానరూపము, సలోకత్వము సిద్ధించును. కుశద్వీపముయొక్క విస్తారమునకు రెండు రెట్ల పరిమాణముతో దానికి చుట్టు అన్నివైపుల; క్రౌంచద్వీపము, నేతి సముద్రమును పరివేష్టించి నెలకొనియున్నది. ఓ బ్రాహ్మణులారా క్రౌంచము, వామనకము, ఆధికారికము అను పేర్లు కలవి;
మరియు దేవాబ్దము, వివేదము, పుండరీకము, దుందుభిస్వనము అను పేర్లతో ఏడుకుల పర్వతములు కలవు;
గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, కోభి, పుండరీకాక్ష అను ఏడు నదులు ఆద్వీపములో ప్రధానముగా ప్రవహించుచున్నవి.
అక్కడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనుసొలుగు వర్ణములవారు క్రమముగా పుష్కలులు, పుష్కరులు, ధన్యులు, తీష్యులు అను పేర్లతో వ్యవహరింపబడుదరు
వారు యజ్ఞములచేత, దానముశమము మొదలగువానిచేత, వివిధములైన వ్రతములతో, ఉపవాసములతో, హోమములతో, పితృతర్పణములతో మహాదేవుని పూజింతురు..
అక్కడివారికి, మిక్కిలి దుర్లభములైన శివసాయుజ్యము, సారూప్యము, సలోకత్వము, సమీపగమనము ఆదేవుని అనుగ్రహము వలన కలుగును.
క్రౌంచద్వీపమునకు రెండు రెట్ల విస్తారముతో దానికి అన్నివైపుల దధిసముద్రమును పరివేష్టించి శాకద్వీపము నీలిచియున్నది. అక్కడ ఉదయము, రైవతము, శ్యామము, కాష్ఠము, ఆంబికేయము,రమ్యము, కేసరి అను పేర్లు గల పర్వతములుండును.
సుకుమారి, కుమారీ, నలిని, వేణుక, ఇక్షుక, ధేనుక, గభస్తి అనుపేర్లతో ఏడునదులు ప్రవహించుచుండును.
అక్కడ వసించు మనుష్యులు ఈనదులయొక్క నీటిని త్రాగుచు జీవింతురు. వారు రోగములులేక, దుఃఖములేక, రాగద్వేషములు విడిచిన వారైయుందురు.
అక్కడి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమముగా మృగ, మగధ, మానస, మందగులు అనుపేర్లతో వ్యవహరింప బడుదురు.
వారు సర్వలోకములకు ఏకమాత్రసాక్షియగు దేవుడైన సూర్యభగవానుని వివిధములైన వ్రతములతో, ఉపవాసములతో, ఎల్లప్పుడు పూజింతురు.
ఓ బ్రాహ్మణులారా వారికి సూర్యుని సాయుజ్యము, సామీప్యము, సమానరూపత్వము, సలోకత అనునవి ఆదేవుని అనుగ్రహము వలన లభించును. శాకద్వీపమును పరివేష్టించి క్షీరసముద్రము నెలకొనియున్నది, దానిమధ్యలో శ్వేతద్వీపమున్నది. అక్కడ నారాయణునియందు శ్రద్దకలని, అనే కాశ్చర్యములతో కూడుకున్నవి, పుణ్యకరములైన జనపదములు కలవు. వానీలో తెల్లని నరులు విష్ణువునందు ఎల్లప్పుడు భక్తి కలవారైయుందురు.
అక్కడ రోగములు కాని, మనోబాధలుకానీ ఉండవు. ముసలితనము, మరణము వలన భయములేదు. అచటి జనులు కోపము, లోభము లేనివారుగా, సూయలు, అసూయలు లేనివారుగా నుందురు.
ఆ ద్వీపములోనివారు ఎల్లప్పుడు దృఢముగా, భయములేని వారుగా, నిత్యానందముకలవారై, సుఖపరులైయుందురు. అందరు నారాయణుని యందు ఆసక్తికలవారై, అతనితో సమానరూపులై యందురు.
కొందరు ఇంద్రియములను నిగ్రహించి, యోగులుగా, ఎల్లప్పుడు ధ్యానపరులైయుందురు. మరికొందరు జపము, తపము చేయుదురు, ఇతరులు కొందరు విజ్ఞానవంతులైయుందురు.
మరికొందరు బీజరహితమైన బ్రహ్మభావముతో తన్మయులై పరబ్రహ్మరూపుడైన, సనాతనుడగు వాసుదేవుని ధ్యానము చేయుచుందురు.
కొందరు ఏకాంతపోసులై, ఆధారరహితులై, గొప్పభగవద్భక్తి పరిపూర్ణులై, తమస్సుకు అతీతమైన విష్ణువను పేరుకల ఆపరబ్రహ్మ స్వరూపమును దర్శింతురు.
అందరు నాలుగు భుజముల ఆకారము కలవారు, శంఖము, చక్రము, గద అను ఆయుధాలను ధరించినవారు, మంచి పసుపు పచ్చని వస్త్రమును ధరించినవారు, శ్రీవత్సచిహ్నముతో కూడిన వక్షము కలవారుగానుందురు.
ఇతరులు కొందరు మహేశ్వరుని యందుభక్తి కలవారై, మూడు పుండ్రములను తల యందు ధరించినవారై, మంచియోగ సంబంధము వలన భూతిని ధరించినవారుగా, గొప్పగరుడుని వాహనముగా కలవారై యుందురు.
అందరును శక్తితో కూడినవారు, ఎల్లప్పుడు అనందముకలవారు, నిర్మలస్వభావులై, విష్ణువుయొక్క ఆంతరంగిక సంచారులుగా అక్కడ నివసింతురు.
అక్కడ సారాయణుని యొక్క మరియొక పట్టణము, నారాయణనామధేయము కలది కలదు. అది ఇతరులకు పొందరానిది. శత్రువులచే దాటరానిది, ప్రాసాదములతో ప్రకాశించునదిగా ఉండును.
ఆ పట్టణము బంగారు ప్రాకారములతో కూడినది, స్ఫటికమణుల మండపములు కలిగినది, వేలకొలది కాంతికిరణ శోభితము, ఇతరులకు ;
ఎదుర్కొనరానిది, మిక్కిలి అందమైనది, మేడలు, భవనాలతో కూడినది, పెద్దవైన పైభాగపు గదులు కలది, వేలసంఖ్యలో గోపురములు కలది అనేకమణులతో ప్రకాశించునదిగా ఉండును.
స్వచ్ఛములైన పరచబడిన ఆసనములతోకూడిన, విచిత్రములైన గోపురములచే అలంకరించబడినది, వివిధములైన ఆకారములు గల నందనవనములతో, నదులతోగూడ ప్రకాశించునదిగా ఉండును.
కొలనులతో అంతట కూడియున్నది, వీణ, వేణువు అనువాద్యములతో ప్రతిధ్వనించునది, అనేకములైన విచిత్రములైన పతాకములతో శోభించుచుండును. మణులచే అలంకరించబడిన సోపానములతో, ఇండ్లవరుసలతో అంతట కూడియున్నది, వందల, వేల, నదులతో కూడి, దివ్యమైనగానముతో ధ్వనించునదిగా అది ఒప్పుచుండును.
హంసలు, కన్నెలేడిపిట్టలతో నిండియున్నది, చక్రవాక పక్షులతో ఒప్పుచున్నది, నాలుగు ద్వారములు కలది, సాటిలేనిది, రాక్షసులకు చేరశక్యము కానిదిగా ఆ పట్టణముండును. .
అచ్చటచ్చట నృత్యము చేయుచున్న అప్సరసలతో కూడినది, అనేకములైన గీత విధానములు తెలిసిన, దేవతలకు గూడ పొందుటకు శక్యముకానివి, అనేక విలాసములతో నిండినవి, మిక్కీలి సుకుమారులైన కాముకులతో, చంద్రునివంటి ముఖము కలిగిన, నూపురములయొక్క ధ్వనులతో కూడిన అప్సరసల సమూహము నృత్యము చేయుచుండును.
చిరునవ్వుకలవారు, చక్కనిదొండపండు వంటి పెదవులుకలవారు, అమాయకమైన లేడిపిల్లల కన్నులవంటి చూపులుకలవారు, సంపూర్ణ వైభవముతో కూడినవారు, సన్నని నడుముతో అలంకరించబడినవారు, మంచీరాజహంసలనడకవంటి నడకగలవారు, చక్కనివేషము ధరించినవారు, కమ్మని కంఠస్వరముకలవారు, చమత్కార సంభాషణ యందు నేర్పరులు, శ్రేష్ఠమైన ఆభరణములచేత అలంకరింపబడినవారు ఆ అప్సరసలు.
కుచములబరువుచేత వంగినవారు, మద్యపానముచేత మత్తెక్కి తిరుగుచున్న కన్నులుకలవారు, అనేక వర్ణములతో చిత్రములైన అవయవములు కలవారు, అనేక సుఖములయందు, రతిక్రీడల యందు ప్రీతి కలవారు అగు అప్సరసల గుంపుతో కూడియుండును ఆనారాయణపురము
వికసించినపూలుగల తోటలతో, ఆపురము వందలకొలది భూతగణముతోకూడినది, లేక్కపెట్టరాని గుణములు కలదీ, నిర్మలమైనదీ, లెక్కలేనంతమంది దేవతలతోకూడినదీ, సంపదకలది, అమీతమైన బలముకల లక్ష్మీపతియగు నారాయణదేవుని పవిత్రమైనది ఆ పట్టణము. దానిమధ్యలో, మిక్కిలీ తేజస్సుకలదీ, ఎత్తైన ప్రాకారములు, తోరణములుకలది, యోగులకు సిద్ధిని కలిగించునదీ అగు దివ్యమైన శ్రీవిష్ణువు యొక్క స్థానమున్నది. దాని మధ్యభాగమున తొమరరేకుల వంటి కాంతిగలభగవంతుడు ఒంటరిగా,
శయనించి యుండును. సమస్తలోకములకు కారణభూతుడైన ఆ విష్ణువు, సనందనుడు మొదలుగా కల యోగీంద్రులచేత ధ్యానింపబడు చున్నవాడై శేషశయ్యమీద నిద్రించును.
తనయొక్క ఆత్మానందమను అమృతమును పానముచేసి, తమస్సుకు అతీతుడుగా, పచ్చని వస్త్రము ధరించి, విశాలమైన వక్షము కలపొడుగా, గొప్పమాయలు, గొప్పభుజములు కలవాడై ఎదురుగా కన్పించును.
ఆహరి క్షీరసముద్రుని పుత్రికయగు లక్ష్మిచేత ఎల్లప్పుడు గ్రహించబడిన పాదద్వయముకలవాడై యుండును. లోకములచే పూజింపబడు ఆదేవికూడ, హరికి ప్రియురాలై పాదమూల ప్రదేశములో వసించును. ఎల్లప్పుడు హారియందే మనస్సుకలడై, నారాయణనామమను అమృతమును ఆస్వాదించుచు ఆశ్రయించి యుండును. అక్కడికి అధర్మవర్తనులు చేరలేరు. అక్కడ ఇతరదేవతల నుందిరములు లేవు
ఆస్థానము వైకుంఠమనుపేరుకలది. అది దేవతలచేత నమస్కరింపబడినది. శాస్త్రములయందు వర్ణింపబడిన దాని మహత్త్వమును సంపూర్ణముగా ప్రతిపాదించుటకు నాబుద్ధి చాలదు.
అదినారాయణునీ పురము అని ఇంతవరకు మాత్రము చెప్పుటకు శక్తుడను. ఆనోరాయణుడే పరబ్రహ్మరూపుడైన సనోతన పురుషుడగు వాసుదేవుడు.
శ్రీమంతుడగు ఆనారాయణుడు తనమాయచేత లోకమును మోహింపజేయుచు శయనించీ యుండును. ఈ విశ్వమంతయు నారాయణుని వలన పుట్టినది. అతనియందేనిలిచియున్నది. ప్రళయకాలములో మరల అతనినే ఆశ్రయించును. ఆనారాయణుడే పరమగమ్యము.
శ్రీ కూర్మపురాణములో భువనవిన్యాసమనబడు నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
