కూర్మ మహా పురాణము
35 - వారణాశి మాహాత్మ్యము
సూతుడిట్లు చెప్పెను.
తరువాత పూజనీయుడైన వ్యాసుడు జైమిని మొదలగు శిష్యులతో కూడి రహస్యములు, పుణ్యకరములైన సమస్త తీర్థ స్థలములను చూచుటకు వెళ్ళెను.
గొప్ప పుణ్యస్థలమైన ప్రయాగమును, ప్రయాగకంటె ఎక్కువ శుభదాయకమైన విశ్వరూపమను తీర్థమును, అట్లే సాటిలేని కాల తీరమనుస్థలమును;
ఆకాశమనుపేరుగల గొప్ప తీర్థస్థలమును, శ్రేష్ఠమైన ఆనుషమను తీర్థమును, స్వర్లీనమను పేరు గల గొప్ప తీర్ధమును, అద్వితీయమైన గౌరీతీర్థమనుదానిని కూడ,
గొప్పదైన ప్రాజాపత్యమను తీర్థస్థానమును, అట్లే స్వర్గద్వారమును స్థలమును, జంబుకేశ్వరమను పేరుతో వ్యవహరింపబడునది, చర్మాఖ్యమైన శ్రేష్ఠమైన తీర్థమును;
గయాతీర్థమును, మహాతీర్థమును, మహానది అనుపేరుగల తీర్థమును, శ్రేష్ఠమైన నారాయణ తీర్థమును, అద్వితీయమగు వాయు తీర్థమును;
మిక్కిలి రహస్య తరమైన జ్ఞానతీర్థమును, ఉత్తమమైన వారాహ తీర్థమును, మిక్కిలి పుణ్యదాయకమైన యమతీర్థమును, గొప్పదైన సంవర్తకమను తీర్థమును,
ఓ బ్రాహ్మణోత్తములారా! అగ్నితీర్థమును, శ్రేష్ఠమైన కాలకేశ్వర క్షేత్రమును, నాగతీర్థమును, సోమతీర్థమును అట్లే సూర్యతీర్ధమును కూడ,
మిక్కిలి పుణ్యకరమైన పర్వతనామక తీర్థమును, సాటిలేని మణికర్ణ తీర్థమును, తీర్థములలో శ్రేష్ఠమైన ఘటోత్కచమును, శ్రీ తీర్థమును, పితామహాక్షేత్రమును కూడ,
గంగా తీర్థమును, దేవేశ స్థలమును, శ్రేష్ఠమైన ఆ కాపిల తీర్థమును, సోమేశ క్షేత్రమును, సాటిలేనిదైన బ్రహ్మతీర్థమును;
(ఎక్కడనైతే పూజింపదగిన లింగమును, బ్రహ్మదేవుడు స్నానము చేయుటకు వెళ్ళినప్పుడు విష్ణువు ఆ ఈశ్వర లింగమును అప్పుడు ప్రతిష్ఠించినాడో,
తరువాత స్నానము చేసివచ్చిన బ్రహ్మ ‘నాచేత తీసుకొని రాబడిన లింగమును నీవు ఎందువలన ప్రతిష్ఠించినావు’ అని విష్ణువును ప్రశ్నించెను.
విష్ణువు బ్రహ్మకు ఇట్లు బదులిచ్చెను. నీకంటె నాకు రుద్రుని యందు దృఢమైన భక్తి కలదు. అందువలన నేనీ లింగమును ప్రతిష్ఠించినాను. ఇది నీపేరుతో ప్రసిద్ధమై యుండగలదు)
మరియు భూతేశ్వరమను తీర్థము, ధర్మ సముద్భవమను తీర్థము, శుభకరమైన గంధర్వ తీర్థము, శ్రేష్ఠమయిన వాహ్నేయ తీర్థము,
బ్రాహ్మణోత్తములారా! దూర్వాసమునికి సంబంధించిన హెూమ తీర్థము, చంద్రతీర్థము, పుణ్యదాయకమైన చిత్రాంగదేశ్వరము, అటువంటిదే యగు విద్యాధరేశ్వర తీర్థము;
తీర్థముఖ్యమను పేరుగల కేదార క్షేత్రము, శ్రేష్ఠమైన కాలంజర తీర్థము, సారస్వతము, ప్రభాసతీర్థము, ఖేటకర్ణము, శుభకరమైన హారతీర్థము.
లౌకిక మనుపేరుగల గొప్పతీర్థము, హిమాలయతీర్థము, హిరణ్యగర్భము, గోప్రఖ్యము, వృషధ్వజము అను పేర్లు కల తీర్థములు;
ఉపశాంతము, శివము, శ్రేష్ఠమైన వ్యాఘ్రేశ్వర తీర్థము, త్రిలోచనమను గొప్ప తీర్థము, లోలార్కము, ఉత్తరమను పేరు కల తీర్థము;
బ్రహ్మహత్యా పాపమును తొలగించునట్టి కపాల మోచనమను తీర్థము, మిక్కిలి పుణ్యకరమైన శుక్రేశ్వర తీర్థము, ఉత్తమమైన ఆనందపురము అను తీర్థము;
ఈ చెప్పబడినవి మొదలుగా గల తీర్ధ స్థలములు, వాని ప్రాముఖ్యాన్ననుసరించి చెప్పబడినవి. విప్రశ్రేష్ఠులారా! ఆ తీర్ధముల సంఖ్యను ఇంకను విశదముగా చెప్పుట శక్యము కాదు.
పరాశరుని కుమారుడైన ఆ వేదవ్యాసమహాముని ఆ అన్ని పుణ్య తీర్థముల యందు స్నానము చేసి, ఆయా స్థలములలో సనాతనుడైన ఈశ్వరుని పూజించి, ఉపవాసము చేసి,
పితృదేవతలకు తర్పణములు విడిచి, వారికి పిండప్రదానము కూడా జరిపి, మరల విశ్వేశ్వరుడు నివసించియున్న ప్రధాన స్థానమునకే వెళ్ళెను.
అక్కడ వ్యాసమహాముని, శిష్యులతో కూడి స్నానము చేసి మహాలింగ రూపుడైన శివుని పూజించి, ధర్మాత్ముడగునతడు శిష్యులను గూర్చి, “మీరిక ఇష్టము వచ్చిన చోటుకు వెళ్ళవచ్చును” అని పలికెను.
పైలుడు మొదలగు ఆ బ్రాహ్మణులు, మహాత్ముడైన వ్యాసునకు నమస్కరించి వెడలిపోయిరి. ఆ వ్యాసుడు వారణాశిలోనే తన నివాసమును నిత్యముగా చేసికొనెను.
శాంతము, ఇంద్రియ నిగ్రహము కలవాడై, మూడు కాలముల యందు స్నానము చేసి శివుని పూజించి, భిక్ష వలన లభించిన ఆహారము కలవాడై, నిర్మలమైన మనస్సుతో, బ్రహ్మచర్య నియమము ధరించినవాడై,
అక్కడ నివసించుచున్న గొప్పతేజస్సు కల వ్యాసుడు ఒకప్పుడు భిక్షకొరకు తిరుగుచుండగా ఆయనకు భిక్షలభించలేదు.
విప్రవరులారా ! అప్పుడు వ్యాసుడు కోపముతోనిండినవాడై, ఇక్కడ నివసించు మనుష్యులందరికీ పుణ్యలోకప్రాప్తి కలుగకుండునట్లు ఆటంకమును కల్పింతును అని సంకల్పించెను.
వెంటనే శంకరుని అర్థశరీరరూపణియగు పార్వతి, స్వయముగా ప్రీతితో మానవరూపమును ధరించి అక్కడ సాక్షాత్కరించెను.
“గొప్పబుద్ధికల ఓ వ్యాసుడా ! ఈ కాశీపట్టణము నీచేత శపించదగినది కాదు. నీవు నావలన భిక్షను స్వీకరింపుము” అని పలికి అతనికి భిక్షనిచ్చెను.
తరువాత ఆ దేవి వ్యాసునితో ఇట్లనెను. “ఓ మునీ ! నీవు కోపస్వభావము కలవాడవు కనుక, కృతఘ్నుడవైనందున ఈ క్షేత్రములో ఎల్లప్పుడు నివసించదగవు”.
మానవరూపము ధరించిన పార్వతీదేవి చేత ఇట్లు పలుకబడిన వేదవ్యాసమహాముని, తనధ్యానశక్తి వలన ఆమెను దేవిగా గుర్తించి నమస్కరించి ప్రశస్తములైన పొగడ్తలతో స్తుతించి ఇట్లనెను.
“ఓ పార్వతీదేవీ! నాకు చతుర్దశినాడు, అష్టమినాడు వారణాశిలో ప్రవేశించుటకు అనుమతినిమ్ము”. అని వ్యాసుడు ప్రార్థించ అట్లేయగుగాక అని అనుగ్రహించి దేవి అదృశ్యమాయెను.
పూజనీయుడు, సనాతనుడు, గొప్పయోగీ అగు వ్యాసుడీ విధముగా కాశీక్షేత్రము యొక్క గుణములన్నింటిని తెలుసుకొని దానికి సమీపములో కొద్దిదూరములో నివసించెను.
ఇట్లు వ్యాసముని ఆ క్షేత్రములో చాలకాలమున్న విషయమును తెలుసుకొని, పండితులు ఆ క్షేత్రమును సేవించుచుండిరి. అందువలన మనుష్యుడు అన్ని విధముల ప్రయత్నముతో వారణాశియందు నివసించవలెను.
సూతుడు పలికెను :-
ఈ అవిముక్త క్షేత్రము యొక్క మాహాత్మ్యమును ఎవడు చదువునో, లేక వినునో, అథవా శాంతులైన ద్విజులకు వినిపించునో, వాడు ఉత్తమగతిని పొందును.
శ్రాద్ధములోగాని, దేవకార్యమునందుగాని, రాత్రికాలమున, లేక పగటియందుగాని, నదులతీరప్రదేశములందు, దేవతామందిరములందు కాని ఓ బ్రాహ్మణులారా !
జ్ఞానమును పొంది, సావధాన మనస్సు కలవాడై, కోరికలను కోపమును విడిచినవాడై ఈశ్వరునికి నమస్కరించి అతనిని గూర్చి జపము చేసినచో అట్టివాడు ఉత్తమగతిని పొందును.
శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యవర్ణన యందు ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.
