కూర్మ మహా పురాణము

Table of Contents

పూర్వార్ధము 1 - అథ ఇంద్రద్యుమ్నస్య మోక్షప్రాప్తివర్ణనమ్

అప్రమేయుడు, కూర్మావతారమును ధరించినట్టి శ్రీవిష్ణువుకు నమస్కరించి, బ్రహ్మచేత చెప్పబడిన పురాణాన్ని చెప్పబోవుచున్నాను (1) దీర్ఘకాల యాగం తరుపోత నైమిశారణ్యంలో నివసించే మహామునులు పుణ్యాత్ముడైన రోమహర్షణుడను సూత పౌరాణికుని గూర్చి, పుణ్యదాయకమైన పురాణ సంహితను తెలుపుమని కోరినారు. (2) గొప్పబుద్దికల సూతుడా! నీచేత బ్రహ్మవిదులలో శ్రేష్టుడైన పూజ్యుడు వ్యాసమహర్షి ఇతి హాస పురాణతత్త్వమును గ్రహించటానికి బాగుగా సేవించబడినాడు కదా! (3) ఆవ్యాసమహర్షి వొక్కులతో శరీరంలోని రోమాలన్నీ సంతోష పారవశ్యం వలన పులకించినవి. అందువలననే నీవు రోమహర్షణుడని ప్రఖ్యాతుడవైనావు. (4) పూజ్యుడైన వ్యాసముని ముందుగా నీకే పురాణ సంహితను ఉపదేశించినాడు. ఆ పురాణాలలోని గాధలను మావంటి మునులకు వినిపించుటకు ఆమహర్షి పూర్వము నీకు అందజేసినాడు కదా!

నీవు పూర్వము బ్రహ్మదేవుని యజ్ఞములో అవబృథస్నానమునాడు పురాణ సంహితను ప్రవచించటానికి పురుషోత్తముడైన నారాయణుని అంశతో జన్మించితివి. (6) అందువలన మేము నిన్ను ఉత్తమమైన కూర్మపురాణమును వినిపించమని కోరుతున్నాము. పురాణార్థాలను బాగుగా తెలిసినవాడా! నీవు మాకు దానిని వివరించుము.

ఆ మునుల మాటను విని పౌరాణికులలో శ్రేష్ఠుడైన రోమహర్షణుడు తనగురువైన వేదవ్యాసునికీ మనఃపూర్వకంగా నమస్కరించి ఇట్లు పలికెను. (8) జగత్తుకు కారణభూతుడైన, కూర్మరూపధారీ అయిన శ్రీవిష్ణువునకు నమస్కరీంచీ, పాపాలను నశింపజేసే దివ్యమైన పురాణకథను చెప్పుతాను. {9} ఏ కథను విని పాపకర్మలు చేసిన వాడు కూడ ఉత్తమలోకాలకు చేరుకుంటాడో, అటువంటి పుణ్యమైన యీ పురాణకథను - నాస్తికుని విషయంలో ఎప్పుడుకూడ చెప్పవద్దు. (10) శ్రద్దకలపోడు, శాంతస్వభావుడు, ధర్మాత్ముడు అయిన ద్వీజాతికి చెందిన వానికే సాక్షాత్తుగా నారాయణునిచేత చెప్పబడిన ఈ కథను వినిపించవలెను.

సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశముల చరిత్ర అనే అయిదులక్షణాలు కలదీ పురాణమనబడుతుంది. (12) బ్రాహ్మము, పాదము, విష్ణుపురాణము, శైవము, భాగవతము, భవిష్యము, నారదీయము (13) మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మవైవర్తము, లింగపురాణము, పోరాహము, (14) స్కాన్దము, వామనము, కూర్మము, మాత్స్యము, గారుడము, వాయవ్యము, బ్రహ్మాండపురాణము అని పురాణాలు పదునెన్మిది సంఖ్య..లవీగా చెప్పబడ్డాయి.

అష్టాదశ మహాపురాణాలు కాకుండా, మునులచేత ఆపురాణాలను విని సంగ్రహంగా చెప్పబడిన ఉపపురాణాలు మరికొన్ని ఉన్నవి. (16) అవి క్రమంగా సనత్కుమారీయము, నారసింహము, స్కాన్దము (కుమారస్వామిచే చెప్పబడినది), (17) శివధర్మము, (ననీశ్వరుడు చెప్పినది), దుర్వాసముని చెప్పిన నారదీయము, (18) కాపిలము, వామనము, శుక్రాచార్యునిచే చెప్పబడిన బ్రహ్మాణపురాణము, పొరుణము, కాలకము (19) మాహేశ్వరము, సామ్బము, సకలవిషయ సముచ్చయరూపమైన సౌరము, పరాశరముని చెప్పిన మారీచము, భార్గవపురాణము, (20) ఈ కూర్మపురాణము ఉత్తమము, పదునైదవది, పుణ్యకరమైనది. ఇది సంహితాభేదాలను బట్టి నాలుగు భాగాలుగా ఉన్నది.

బ్రాహ్మి, భాగవతి, సొర, వైష్ణవి అని కూర్మపురాణంలో సొల్లుసంహితల పేర్లు - అవీ పుణ్యములైనవి, ధర్మార్థకామమోక్షాలను ప్రసాదించేవి (22) ఈ సంహిత నాలుగు వేదాలననుసరించినది. ఆరువేల శ్లోకాల సంఖ్యతో కూడిఉన్నది. (23) దీనిలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్ధాల గొప్పతనము, బ్రహ్మతత్వము, పరమేశ్వర రూపము తెలియబడుతున్నది.

దీనిలో సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితము అనే వానితో కూడిన పుణ్యకరమైనది, దివ్యమైనది అయిన ప్రాసంగిక కథ కలదు (25) ఈ సంహిత వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణాదులచేత ధరించదగినది. పూర్వము వ్యాసభగవానుని చేత చెప్పబడిన ఆ కథను మీకు చెప్పగలను.

పూర్వము అమృత సంపాదన కొరకు దీతి కుమారులు, దనుపుత్రులతో కూడ కలిసి దేవతలు, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీరసముద్రాన్ని చిలికిరి (27) సముద్ర మథనం జరుగుతుండగా విష్ణుమూర్తి, దేవతల మేలునుకోరి తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని ధరించినాడు.

దేవతలు, సోరదుడు మొదలగు ఋషులు, కూర్మరూపాన్ని ధరించిన లోకసాక్షి, నాశరహితుడు అయిన శ్రీమహావిష్ణువును ప్రస్తుతించినారు (29) ఆ సాగరమథన సమయంలో సముద్రమునుండి నారాయణునికి వల్లభ అయిన లక్ష్మీదేవి ప్రాదుర్భవించినది. ఆమెను పురుషోత్తముడైన విష్ణువు స్వీకరించినాడు.

తేజస్సుతోకూడి, స్పష్టముగా తెలీయరాని విష్ణువును చూచి నారదాది మహర్షులు, ఇంద్రుడు మొదలగువారు కూడ మోహము చెందిన వారై మంచి మాటలు కొన్ని పలికిరి.

దేవతల కధినాయకుడా! భగవంతుడవైన నారాయణా! సర్వలోక స్వరూపా! విశాలమైన కన్నులుకల ఈమే ఎవరు? తెలుసుకొనగోరుతున్న మాకు యథార్థముగా తెలుపుము.

వారి మాటను విని, రాక్షస సంహారకుడైన మహావిష్ణువు, ఒకమారు లక్ష్మీదేవివైపు చూచి పాపరహితులైన నారదాదులనుగూర్చి ఈ విధముగా చెప్పినాడు.

ఈమే గొప్పశక్తి స్వరూపిణి, సోతో అభిన్నమయినది, పరబ్రహ్మస్వరూపిణి, మాయారూపమైనది, అంతములేనిది, నాకత్యంత ప్రీతిపాత్రురాలు. ఈ లోకము ఈమే చేతనేధరించబడుతున్నది.

బ్రాహ్మణోత్తములారా! ఈమె సహాయముతోనే దేవ, దానవ, మానవులతో కూడిన సమస్త ప్రపంచమును మోహింపజేస్తున్నాను. నాలో లీనం చేసుకొని మరల సృజిస్తున్నాను.

లోకాలయొక్క సృష్టిని, వినాశాన్ని, ప్రాణుల జననమరణాలను ఆత్మస్వరూపాన్నికూడ జ్ఞానముతో తెలుసుకొని పెద్దదైన యీమాయను దాటగలరు. ఈమె యొక్క అంశాలను స్వీకరించుటచేతనే బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలందరు శక్తిమంతులైనారు. ఈమె నాయొక్క సకలశక్తి స్వరూపిణి. ఈ లక్ష్మి సమస్తలోకాలకు కారణభూతురాలు, సత్త్వరజస్తమోరూప గుణత్రయస్వరూపిణి, ప్రకృతిరూప, కమలనివాసిని ఐన ఈమె నాకంటే ముందు కల్పంలోనే ప్రభవించినది.

ఈమే నాల్గుభుజాలు కలది, శంఖము, చక్రము, పద్మములను చేతులలో ధరించేది, పుష్పహారముతో కూడినది, కోటిసూర్యుల తేజస్సుతో సమానకాంతి కలది. ప్రపంచంలోని ప్రాణులందరిని మోహింపజేసే శక్తికలది.

ఈమే మాయనతి క్రమించటానికి దేవతలు కానీ, పితరులు కాని, మనుష్యులు కాని చివరకు ఇంద్రుడుకాని సమర్థులు కారు. భూలోకములోని శరీరధారులు మరెవ్వరు కాని లక్ష్మీమాయను దాటిపోలేరు.

ఈరీతిగా విష్ణువుచేత చెప్పబడిన మునులు ఆయనతో ఇట్లన్నారు. “పద్మముల వంటి కన్నులుగల నారాయణా! మాకు కాలాంతరములో జరిగిన సంఘటనలను గూర్చి తెలుపుము” అని.

అప్పుడు మునిబ్బందముచే సేవింపబడే శ్రీవిష్ణువు ఆ మునులతో ఇట్లు చెప్పినాడు. ఇంద్రద్యుమ్నుడని ప్రసిద్ధుడైన బ్రాహ్మణశ్రేష్టుడు ఒకడుండెను. గతజన్మలో అతడురాజుగా ఉండి శంకరాదులకు గూడ నిగ్రహించరానివాడై, కూర్మరూపంలో ఉన్న నన్నుచూచి, నావలన పురాణాలకు సంబంధించిన గాథను, దివ్యమైన సంహితను మునీశ్రేష్ఠులతో కూడి విని, సృష్టికర్త బ్రహ్మాను, రుద్రుణ్ణి, ఇతరదేవతలనుగూడ తమతమ అధికారాలతో కూడ, నాయొక్కశక్తికి అధీనులై ఉండటాన్ని గుర్తించి, నన్నే శరణము పొందినాడు - అప్పుడే నేనతనితో మాట్లాడి, విప్రకులములో జన్మించగలవని చెప్పితిని.

ఇంద్రద్యుమ్నుడనే పేరుతో ప్రసిద్ధుడవై, పూర్వజన్మ స్మృతి కలిగి ఉంటావు. సమస్త ప్రాణులకు; దేవతలకు గూడ తెలియరానటువంటిది; చెప్పదగినది, మిక్కిలిరహస్యమైనది అగు జ్ఞానాన్ని నీకు అందిస్తాను. ఓ పుణ్యపురుషా! సా వలన ఆజ్ఞానాన్ని పొంది చివరకు నాలో అంతర్లీనమవుతావు. భూమిమీద ఇతరాంశతో నీవు నిశ్చింతగా చొలకాల మక్కడనివసించుము. వైవస్వత మన్వంతరము గడువగానే నీవు తిరిగి ప్రయోజనార్థము నన్ను చేరుకోగలవు ఇట్లు చెప్పగా, నాకు నమస్కరించి భూమికీ వెళ్లి రాజ్యాన్ని పాలించినోడు. కొంతకాలానికి శరీరాన్ని విడిచీ శ్వేతద్వీపంలో ఉన్ననావద్దకు వచ్చి, నాతో సహనివసించి, యోగులకు గూడ పొందరానివి, విష్ణులోక సంబంధులైన భోగాలననుభవించి, ఓ మునులారా! నా ఆజ్ఞతో మళ్లీ బ్రాహ్మణ కులంలో జన్మించినాడు.

వాసుదేవ నామము కల నన్ను గుర్తించి, ఎచ్చట నాశరహితములైన విద్య, అవిద్య అనునవి గాఢముగా ఉంచబడినవో, దేనిని పరబ్రహ్మ స్వరూపముగా తెలిసికొందురో, ఆ నా తత్త్వమును తెలిసికొని ఆ ఇంద్రద్యుమ్నుడు ప్రాణులకాధారభూతుడైన పరమేశ్వరుణ్ణి వ్రతాలు, ఉపవాసాలు, నియమాలతో, హోమాలు, బ్రాహ్మణ సమారాధనలతో పూజించినాడు.

ఆ పరమేశ్వరుణీ యందు నిష్ఠకలవాడై, ఆయనకు నమస్కరిస్తూ ఆశీస్సులు పొందుతూ, అతనియందే ఆసక్తుడై, యోగులహృదయాల్లో నివసించే మహాదేవుణ్ణి పూజిస్తూ గడిపాడు.

ఆ విధంగా కాలం గడుపుతున్న అతనికి కొంత కాలానికి శ్రేష్ఠమైన దివ్యకళ తన అపూర్వమైన, విష్ణుసంబంధమైన స్వరూపాన్ని దర్శింప జేసినదీ.

భగవంతుడైన విష్ణువుకు ప్రియమైన ఆకళారూపాన్ని దర్శించి, శిరస్సుతో నమస్కరించి, అనేక స్తోత్రవాక్యాలతో కొనియాడి చేతులు జోడించి అతడిట్లు పలికెను.

“విశాలమైన కన్నులు కల ఓదేవీ! నీవు ఎవరవు? నీవు విష్ణు సంబంధి చిహ్నాలతో కూడిఉన్నావు. నీ యథార్థ స్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా నాకు తెలుపుము”.

ఇంద్రద్యుమ్నుని ఆమాటను విని ప్రసన్నురాలై, మంగళస్వరూపిణి అయిన ఆకళామూర్తి చిరునవ్వుతో, విష్ణువును స్మరిస్తూ ఆబ్రాహ్మణునితో ప్రియముగా ఇట్లనెను.

“మునులుకొని, ఇంద్రుడు మొదలగు దేవతలు కాని, నారాయణ స్వరూపిణినైన నన్ను చూడజాలరు. నేను ఆసారాయణుని విశిష్టమైన మాయారూపమైన దానను.

విచారించినట్లైతే నాకు, నారాయణునికి భేదము లేదు. నేను ఆయన స్వరూపాంతర్భూతురాలనే. ఆవిష్ణువు పరబ్రహ్మతత్త్వము, పరమేశ్వరుడు కూడ.

సమస్త ప్రాణులకాధారభూతుడైన, పురుషులలో శ్రేష్ఠుడైన ఆనారాయణుని జ్ఞానమార్గముతోకాని, కర్మయోగముతోకాని ఎవరు పూజింతురో వారినీ నేను ఏమి చేయుటకుశక్తురాలను కాను (60).

అందువలన “ఓ ఇంద్రద్యుమ్నా! నీవు కర్మయోగమునందు శ్రద్ధకలవాడవై, తరువాత జ్ఞాన మార్గమవలంబించి ఆది మధ్యాంత శూన్యుడైన నారాయణునిపూజించుము. దానివలన నీవు మోక్షాన్ని పొందుతావు”. ఈ విధముగా దేవిచేత చెప్పబడిన గొప్పబుద్దికల ఇంద్రద్యుమ్నుడు దేవికీ శిరస్సువంచి నమస్కరీం, చేతులు జోడించి మళ్లీ ఇట్లన్నాడు.

“ఓ దేవీ! భగవంతుడు, ఈశ్వరుడు, శాశ్వతుడు, కళాశనములేని వాడు అగు శ్రీమహావిష్ణువు ఎట్లు మాకు తెలుసుకోవటానికి సులభుడౌతాడో నాకు తెలుపుము” .

ఆ బ్రాహ్మణునిచేత ఈవిధముగా అడుగబడిన కమలనివాసిని అయిన లక్ష్మీదేవి, ఆతనితో నారాయణుడే స్వయంగా జ్ఞానాన్ని ప్రసాదించునని చెప్పినది.

తరువాత తనరెండు చేతులతో, నమస్కరించిన ఆ ఇంద్రద్యుమ్నమునిని తాకి పరాత్పరుడైన విష్ణువును తలచుకొని ఆదేవి అక్కడనే అంతర్ధానము చెందినది.

ఆ ఇంద్రద్యుమ్నుడు శ్రేష్ఠమైన ధ్యానయోగముతో నారాయణుని సాక్షాత్కారం కొరకు, తనకు విధేయులైన వారి దుఃఖాలను పెనుగాలి వలె తొలగించే శ్రీ మహావిష్ణువును పూజించినాడు.

చాలా రోజులు గడచిన తరువాత, పసుపు పచ్చని వస్త్రము ధరించిన, విశ్వరూపుడు, గొప్పయోగీశ్వరుడైన నారాయణుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమైనాడు.

నాశరహితుడు, ఆత్మ స్వరూపుడు అయిన విష్ణువు తన వద్దకు వచ్చుటను చూచి ఇంద్రద్యుమ్నుడు మోకాళ్లను నేలకానించి ప్రణతుడై గరుడధ్వజుడైన అతణ్ణి ఈ విధముగా ప్రస్తుతించినాడు.

“ఓ యజ్ఞపురుషా! నాశనములేనివాడా! గోవులను సంతోషపరచేవాడా! మాధవా, అంతములేనివాడా, కేశవా! కృష్ణా! విష్ణురూపా, ఇంద్రియాలకధీశుడా! జగత్స్వరూపుడవైన నీకు ప్రణామము.

పురాణపురుషుడవు, లోకస్వరూపుడవు, హరివి, సృష్టిస్థితీప్రళయాలకు కారణభూతుడవు, అపరిమితశక్తికలవాడవు అయిన నీకు నమస్కారము.

గుణరహితుడవైన నీకు నమస్కారము. విభాగ శూన్యుడవై ప్రపంచస్వరూపుడగు పురుషుడైన నీకు అనేకనమస్కారములు.

వాసుదేవుడు, అంతటవ్యాపించి ఉన్నవాడు, జగత్తుకుమూలకారణమైనవాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, జ్ఞానము చేత తెలుసుకొనదగినవాడు అగు నీకు నమోపోకము.

ఎటువంటి వికారము లేనివాడవు, ప్రపంచమున కతీతముగా నుండువాడవు, భేదముకానీ అభేదముకానిలేని వాడవు, ఆనంద స్వరూపుడవు అయిన నీకు నమస్కారము.

తరింపజేయువాడు, శాంతరూపుడు, అప్రతిహితమైన ఆత్మశక్తికలవాడు, అంతములేని రూపములుకలవాడు, మూర్తిరహితుడును అగునీకు నమస్కారములు.

పరమార్థరూపుడవైన నీకు ప్రణామము. మాయకు అతీతుడవగు నీకు వందనము. పరమేశ్వరుడవు, పరమాత్మవు, బ్రహ్మస్వరూపుడవునగు నీకు నమోవాకము.

మిక్కిలి సూక్ష్మరూపము కలవాడవు, గొప్పదేవాధిదేవుడవు, మంగళరూపుడవు, పరిశుద్ధుడవు, బ్రహ్మస్వరూపుడవు అయిననీకు నా నమస్కారము.

ఈ సమస్తవిశ్వము నీచేత సృజింపబడినది. నీవే అందరికి పరమగమ్యము. సమస్తప్రాణులకు పురుషోత్తముడవైన నీవే తల్లివి తండ్రివి కూడ అయిఉన్నావు.

నీవు నాశరహితమైన, శ్రేష్ఠమైన ప్రాప్యస్థానము. జ్ఞానమాత్రస్వరూపుడవు. భాగరహితమైన ఆకాశరూపుడవు, సమస్తమున కాధారభూతుడవు, స్పష్టముగా తెలియనివాడవు, అంతములేని వాడవు, అంధకారమునకతీతమైనవాడవు.

పరమాత్మ రూపుడవైన నిన్ను కేవలము జ్ఞానమనే దీపముచేతనే చూడగలుగుదురు. విష్ణువైన నీ యొక్క రూపమును, శ్రేష్ఠమైన నీస్థానమును సేవించుచున్నాను”.

ఈవిధముగా తనను పొగడుచున్న ఇంద్రద్యుమ్నుని, భగవంతుడు, సర్వభూతస్వరూపుడు, భూతములను భావించువాడును అగు విష్ణువు నవ్వుచున్నవానివలె తనరెండు చేతులతో స్పృశించెను.

భగవంతుడైన విష్ణువుచేత స్పృశింపబడినంతనే ఆఇంద్రద్యుమ్నముని ఆయన అనుగ్రహంవలన పరమాత్మతత్త్వాన్ని ఉన్నదున్నట్లుగా స్పష్టంగా తెలుసుకోగలిగినాడు.

తరువాత సంతోషించిన మనస్సుతో అతడు విష్ణుమూర్తికి నమస్కరించి, వికసించిన కమలములవంటి కన్నులు కలిగిన, పచ్చని వస్త్రముధరించిన నేరాయణుని గూర్చి ఇట్లు పలికినాడు.

“ఓ పురుషోత్తమా! నీ అనుగ్రహమువలన నాకు సంశయములు తొలగినవి, పరబ్రహ్మవిషయకమైనది, శ్రేష్టమైన ఆనందరూపసిద్ధిని కలిగించునది అగు జ్ఞానము సిద్ధించినది.

భగవంతుడవు, వాసుదేవుడవు, బ్రహ్మస్వరూపుడవు అగునీకు నమస్కారము. యోగేశ్వరుడవు, విశ్వమయుడవు అగుఓప్రభూ! నేను ఏమిచేయవలెనో, దానిని నాకు తెలుపుము!!

ఇంద్రద్యుమ్నుని యొక్కవాక్యమును విని, లక్ష్మీపతి అయిన నారాయణుడు చిరునవ్వుతో, లోకానికి హితకరమైన సంపూర్ణవాక్యమును ఇట్లు పలికెను.

వర్ణములు, ఆశ్రమాలకు సంబంధించిన ఆచారముకల పురుషులకు భగవంతుడైన మహేశ్వరుడు జ్ఞానయోగ భక్తియోగములతో పూజింప దగినవాడు: ఇతరపద్ధతులలో పూజారుడు కాడు.

ఆ పరతత్త్వమును తెలుసుకొని, సమస్త కార్యసమూహమునకు కారణభూతమైన విభూతిని, నాయొక్క ప్రవృత్తినికూడ గ్రహించి మోక్షమును కోరుపోడు ఈశ్వరుని పూజించవలెను.

ఈలోకము మాయతోనిండి ఉన్నదని తెలుసుకొని, ప్రపంచ సంబంధమైన అన్ని బంధాలను విడిచిపెట్టి జీవాత్మకు పరమాత్మతో అభేదాన్ని దర్శించి పరమేశ్వర సాక్షాత్కారము పొందగలవు.

ఓ బ్రాహ్మణుడా! నాచేత చేప్పబడుమూడు విధముల భావనసు గూర్చి తెలుసుకొనుము. వానిలో ఒకభావన నాకు సంబంధించినది. రెండవది వ్యక్త రూపములోకన్పించు జగత్తు విషయమైనదీ.

మూడవది బ్రహ్మవిషయకమైనది. అది గుణత్రయమున కతీతమైనదిగా తెలియవలెను. ఈ మూడింటిలో ఒకభావనను పండితుడు ఆశ్రయించి తత్త్వజ్ఞానము పొందవలేను.

సామర్థ్యములేనివాడు మొదటిదైన భావన నాశ్రయించదగునని వేదములో చెప్పబడినది. అందువలన సంపూర్ణప్రయత్నముతో ఆమొదటిదైన మద్విషయభావనయందు నిష్ఠకలిగి, దానియందే నీమగ్నుడవై, విశ్వేశ్వరుడైన భగవంతుని బాగుగా పూజించుము. దానివలన నీవు మోక్షమును పొందగలవు”

ఇంద్రద్యుమ్నుడుపలికెను :

ఓ జనార్ధనా! ఆపరతరమైన తత్త్వముఏది? ఆవిభూతియేది?

దానికి కారణమేది? నీవు ఎవరు? నీ ప్రవృత్తి ఎటువంటిది?

భగవంతుడు చెప్పినాడు :

పరముకంటే మిక్కిలి శ్రేష్ఠమైన తత్వమది. ఏకము, నాశరహితమైన పరబ్రహ్మమది.

శాశ్వతానందమయమైన తేజస్సు, నాశరహితము, అంధకారానికి దూరమైనది ఆతత్త్వము. దానియొక్క నిత్యమైన ఐశ్వర్యమే విభూతి అని చెప్పబడును.

సృష్టిస్థితి, లయాలను నిర్వహించుట నాయొక్క ప్రవృత్తిగా చెప్పబడుచున్నది. ఓవిప్రుడా! ఈ విషయము సమస్తమును క్రమవిధానముతో తెలిసికొని, తరువాత నీవు కర్మయోగముతో శాశ్వతుడైన పురుషుని పూజింపుము.

ఇంద్రద్యుమ్నుడు పలికెను :

ఏ ఆచారాలతో పరమ పురుషుడు ఆరాధింపబడునో, ఆవర్ణాశ్రమాచారాలు ఏవి?

మూడు విధముల భావనల నాశ్రయించి ఉన్న జ్ఞానమెటువంటిది? ఈ విశ్వము పూర్వము ఎట్లు సృజించబడినది? మరల ఏవిధముగా లయము చేయబడును?

లోకములో ఎన్ని సృష్టులు, ఎన్నివంశాలు, మన్వంతరాలు ఉండును? వాటి ప్రమాణములెంత? పవిత్రములైన వ్రతములు. పుణ్యతీర్థాలు, సూర్యుడు మొదలగు జ్యోతిర్మండలాల స్వరూపము, భూమియొక్కవైశాల్యము, ద్వీపముల, సముద్రాలసంఖ్య, పర్వతముల, నదీ నదముల వివరమును. ఓ నారాయణా! నాకు యథాతధముగా చెప్పుము.

శ్రీకూర్మస్వామీ ఇట్లుచెప్పేను :

ఆ ఇంద్రద్యుమ్నునిచేత ఇట్లు అడుగబడిననేను భక్తులననుగ్రహించు కోరికకలవాడనై.

ఓ మునులారా! అతనికి సమస్తవిషయాలను, అతడు ప్రశ్నించిన ప్రకారముగా, విశదముగా, స్పష్టముగా చెప్పినాను.

ఆ బ్రాహ్మణునికి ఆవిధముగా అనుగ్రహించినేను అక్కడనే అదృశ్యుడనైతిని. ఓ బ్రాహ్మణ వర్యులారా! ఆ ఇంద్రద్యుమ్నుడు కూడ నాచేత చేప్పబడిన పద్దతితో పరిశుద్ధ భావముకలవాడై, ఏకాగ్రచిత్తుడై, పుత్రాదుల యందు స్నేహభోపాన్ని విడిచి, సుఖదుఃఖాదీ ద్వంద్వాల కతీతుడుగా, దేనియందు కోరికలేనివాడుగా పరబ్రహ్మరూపుడైన పురుషుని ఆరాధించినాడు.

అన్ని పనులను వదిలి, గొప్పవైరాగ్యభావమును పొంది, తనలో పరమాత్మను, సమస్త జగత్తును కూడ సాక్షాత్కరించుకోనుచు. చివరిదైన బ్రాహ్మీభావనను అక్షరపూర్వకమైనదానిని చేరుకొని, దేనితో పరమాత్మను దర్శింపగలడో, ఆగొప్ప యోగమును పొందగలిగెను.

శ్వాసను జయించినవారు, నిద్రారహితులు అగు మోక్షకాములు ఏ స్థితిని కోరుదురో ఆ బ్రాహ్మణుడు దానిని పొందెను. తరువాత ఒకప్పుడో యోగీశ్వరుడు నాశరహితుడైన బ్రహ్మను చూచుటకై సూర్యుని సూచన ప్రకారము, యోగశక్తి మహిమవలన ఆకాశ మార్గముతో ప్రయాణించి మానసోత్తర పర్వతమును చేరుకున్నాడు.

సూర్యునివలె ప్రకాశించుచున్న, సర్వోత్తమమై ఆకాశంలో సాక్షాత్కరించిన ఆయోగీంద్రుని విమానాన్ని, దేవతాసమూహము, గంధర్వులు, అప్సరసలు వెంబడించిరి.

మరికొందరు సిద్దులు, బ్రహ్మర్పులు కూడ అతని విమానమును చూచి మార్గములో అనుసరించిరి. అప్పుడాతడు దేవతలచేత పూజింపబడు మానసోత్తరపర్వతమునకు వెళ్లి ఉత్తమ యోగులచే సేవింపబడుచున్నదీ, పరమ పురుషుని నివాసస్థానము, పదివేల సూర్యులతో సమానకాంతీ కలది అగు పరమపురుష స్థానమునుపొంది దేవతలకు గూడ ప్రవేశించుటకు శక్యముకాని లోపలి భవనమును ప్రవేశించి, సమస్త ప్రాణులకు శరణ్యుడైన పరమాత్మరూపుని ధ్యానించెను.

జననమరణాలులేనట్టి, దేవతలకు దేవుడు, పితామహుడు అగుదేవుని ధ్యానించగా, అప్పుడక్కడ మిక్కిలి ఆశ్చర్యకరమైన ఒకగొప్ప తేజస్సు ఆవిర్భవించెను.

ఆకాంతిమధ్యలో ముందుగా ఒకపురుషునీ, తేజోరాశిగా ఉన్నవానీనీ, బ్రహ్మ విరోధులకు పొందరాని, సర్వోత్తమ ప్రాప్యభూతుడైన వానినీ చూచెను ఇంద్రద్యుమ్నుడు.

నాలుగు ముఖములు కలిగి, ఉదాత్తములైన అవయవములతో, వెలుగులతో ప్రకాశించుచున్న దేవునిచూచి నమస్కరించుచు సమీపించు యోగీని ఆ భగవంతుడు చూచి స్వయముగా ఎదుర్కొని అతనిని ఆలింగనము చేసికొనెను. పరమపురుషునిచే ఆలింగీతుడైన ఆబ్రాహ్మణ శ్రేష్ఠుని శరీరమునుండి అప్పుడు ఒక పెద్ద వెన్నెలవంటి తేజస్సు బయలుదేరి సూర్యమండలము ప్రవేశించినది. ఆతేజస్సు ఋక్కు యజుస్సు, సామము అను పేర్లు కలది, పవిత్రమైన నిర్మలమైన స్థానము.

హవ్యకవ్యములను భుజించువాడు, భగవంతుడు అగు హిరణ్యగర్భుడైన బ్రహ్మ ఎక్కడ నివసించునో, ఆస్థానము వేదాంతముల యందు స్థాపించ బడియున్న యోగీశ్వరుల మొదటి ద్వారము.

అది బ్రహ్మతేజముతో నిండినది, సంప్రద్యుక్తము; బుద్ధిశాలురైన వారిలో ద్రష్టయగుపోడు, భగవంతుడగు బ్రహ్మచేత చూడబడినవాడై, తేజోమయుడైన ఆముని, ఈశ్వరసంబంధి, శాంతమైనదీ, అంతటా వ్యాపించినది, మంగళకరమగునది అగు తేజస్సును చూచెను. ఆ తేజస్సు నాశములేనిదీ, ఆకోశాత్మకమైనది, స్వాత్మరూపమైన విష్ణువుయొక్క శ్రేష్ఠమగు స్థానము.

అది ఆనందరూపము, నిశ్చలమైనది, పరమేశ్వర స్థానమైనది కూడ. అన్ని ప్రాణుల ఆత్మల యందుండువాడు, గొప్ప ఐశ్వర్యము నధిష్టించినవాడునై, మోక్షమను పేరుగల, నాశరహితమైన ఆత్మస్థానమును చేరెను. అందువలన అన్ని విధముల ప్రయత్నము చేత వర్ణాశ్రమ ధర్మము నందు నిలిచినవాడై;

చివరిదైన భావమును పొంది పండితుడు లక్ష్మీ రూపమైన మాయను దాటగలడు. సూతుడిట్లు పలికెను :

విష్ణువుచేత ఈ విధముగా చెప్పబడిన నారదుడు మొదలుగాగల మహర్షులు: ఇంద్రునితో కూడ కలిసి అందరు, గరుడ ధ్వజుడైన నారాయణుని ఇట్లు ప్రశ్నించిరి.

దేవతలకు దేవుడవైన ఓనారాయణా! ఇంద్రియముల కధీశుడవు, నాశములేని వాడవునగు ఓ ప్రభూ! పూర్వము నీచేత బ్రాహ్మణుడైన ఇంద్రద్యుమ్నుని కొరకు చెప్ప బడిన, ధర్మాదులకు సంబంధించిన సమస్త జ్ఞానాన్ని మాకు తెలుపుము.

ఓ విశ్వరూపా ! నీకు చెలికాడైన ఈ ఇంద్రుడు కూడ ఆ విషయములను విన గోరుచున్నాడు. అని పలుకగా అప్పుడు కూర్మరూపధరుడైన భగవంతుడు, జనార్దనుడగు విష్ణువు; రసాతలమును చేరిన భగవంతుడు, నారదాదులచేత అడుగబడి సమస్తమైన, ఉత్తమ కూర్మపురాణమును వారికి చెప్పెను.

ఇంద్రుని సమీపములో విష్ణువు చెప్పిన, ధన్యము, కీర్తికరము, ఆయుష్కారకము, మోక్షాన్నిచ్చునది, పుణ్యకరమైనదానిని నేను మీకు చెప్పుదును.

బ్రాహ్మణులారా ! పురాణములను వినుట, ప్రత్యేకముగా ప్రవచనము ప్రశస్తము. ఒక్క అధ్యాయమును విన్నంతనే అన్నిపాపములనుండి విముక్తుడగును.

ఏదో ఒక ఉపాఖ్యానమును విన్నప్పటికీ బ్రహ్మలోకమున గౌరవించబడును. ఈ శ్రేష్టమైన కూర్మపురాణము కూర్మరూపమును ధరించిన దేవదేవుడైన నారాయణుని చేత చెప్పబడినది.

ఇది బ్రాహ్మణాది ద్విజులచేత శ్రద్ధతో ఆదరించదగినది.

ఇది శ్రీ కూర్మపురాణములో ఇంద్రద్యుమ్న మోక్షవర్ణన మనుప్రథమాధ్యాయము.