కూర్మ మహా పురాణము
34 - వారణాశి మాహాత్మ్యము
పూజనీయుడగు వ్యాసుడక్కడ కపర్దీశ్వరుని సమీపములో నివసించి చాలా సంవత్సరముల తరువాత మధ్యమేశ్వరుని దర్శించుటకు వెళ్ళెను.
అక్కడ మునుల సమూహముచేత సేవింపబడినది, నిర్మలమైన జలము కలది, పుణ్యకరమయినది అగు గంగా నదిని చూచి వ్యాసముని సంతోషము కలవాడాయెను.
ఆ వ్యాసముని మునులతో కూడా ఆ గంగానదిని చూచి భక్తిభావముచేత పవిత్రమైన హృదయము కలవాడై, స్నాన విధానము నెరిగిన అతడు విధిప్రకారము స్నానము చేసెను.
(లోకములకు మూలభూతుడైన శివుని మందిరమున ప్రవేశించి శిష్యులతో కూడి వెళ్ళిన వ్యాసముని, అనేక విధ పుష్పములతో పూజించెను.)
అక్కడి దేవతలను, ఋషులను, పితృదేవతలను శాస్త్ర విధి ప్రకారము తర్పణముతో పూజించి, శూలధారి, ఈశానుడు అగు మధ్యమేశ్వరుని అర్చించెను.
తరువాత అక్కడి మధ్యమేశ్వర దేవుని దర్శించుటకు శాంత స్వభావులు, భస్మముతో పూయబడిన శరీరములు కలవారు అగు పాశుపతులు వచ్చి చేరిరి.
ఓంకారము నందాసక్తి కల మనస్సు కలిగి, వేదముల నధ్యయనము చేయుట యందు శ్రద్ధ కలవారు, జటలను ధరించినవారు, శిరోముండనము చేయించుకున్నవారు, స్వచ్ఛమైన యజ్ఞోపవీతమును ధరించినవారు వారిలో నుండిరి.
కొందరు కౌపీనములను మాత్రము ధరించిరి. మరికొందరు దిగంబరులుగా నుండిరి. వారందరు బ్రహ్మచర్య వ్రతములో నిమగ్నులై, శమము, ఇంద్రియ నిగ్రహము కలిగినవారు, జ్ఞానమునందు ఆసక్తి కలిగి యుండిరి.
ఆ బ్రాహ్మణులు శిష్యులతో కూడియున్న వేదవ్యాసమునిని చూచి, సంప్రదాయము ననుసరించి పూజించి ఈ వాక్యమును పలికిరి.
ఓ మహామునీ! మీరెవరు? శిష్యులతో గూడ ఎక్కడి నుండి వచ్చితిరి? అనిప్రశ్నించగా వ్యాసుని శిష్యుడు పైలుడు మొదలగువారు, ధర్మస్వభావులైన ఆ ఋషులను గూర్చి యిట్లు పలికిరి.
ఈయన సత్యవతి కుమారుడైన వేదవ్యాస మహాముని. ఇతడు స్వయముగా నారాయణ స్వరూపుడు. ఈయన చేతనే వేదములు విభాగము చేయబడినవి.
ఎవనికి, పినాకమును ధరించిన మహాదేవుడు స్వయముగా శుకుడను పేరుతో అంశావతారముగా కుమారుడై మహానుభావుడుగా జన్మించినాడో,
ఎవడు శుభకరుడైన మహాదేవుని అన్నివిధముల భావనతో స్వయముగా, గొప్ప భక్తితో ఆశ్రయించి యున్నాడో, ఆ వ్యాసుని జ్ఞానము ఈశ్వర విషయకమైనది.
తరువాత ఆ పాశుపతులందరు కూడా సంతోషముతో పులకించినవారై, సత్యవతీదేవి కుమారుడైన వ్యాసుని గూర్చి సావధాన మనస్కులై ఇట్లనిరి.
మహాత్మా! పరమేష్ఠికి సబంధించిన జ్ఞానము, దేవదేవుడైన శివుని యనుగ్రహము వలన నీచేత తెలియబడినది. అది మహేశ్వర సంబంధమైనది, ఉత్తమమైనది.
ఆ విధముగానే, నిశ్చలము, రహస్యము, శ్రేష్ఠము అగు ఆ జ్ఞానమును మీరు మాకుపదేశించినచో, మీ ముఖము నుండి విని శీఘ్రముగా ఆ దేవుని దర్శింతుము.
అప్పుడు వ్యాసుడు సుమంతుడు మొదలుగా గల శిష్యులను పంపించి, యోగవేత్తలలో శ్రేష్ఠుడైన ఆయన ఆ మునుల కొరకు ఉత్తమమైన ఆ జ్ఞానమును గూర్చి వివరించెను.
వెంటనే ఆ యోగులకు స్వచ్ఛము, శ్రేష్ఠతమము అగు జ్ఞానతేజము సాక్షాత్కరించెను. ఆ బ్రాహ్మణులందరు ఆ తేజస్సులోనే లీనమైపోయిరి. ఆ తేజము క్షణములో అదృశ్యమాయెను.
తరువాత బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, భగవంతుడును అగు వేదవ్యాసముని పైలుడు మొదలగు శిష్యులందరిని సమావేశపరచి, మధ్యమేశ్వరుని యొక్క మాహాత్మ్యమును వారికి వివరించెను.
ఈ ప్రదేశము నందు భగవంతుడైన మహేశ్వరుడు, రుద్రగణముతో కూడినవాడై, పార్వతీదేవితో ఎల్లప్పుడు విహరించుచుండును.
ఇక్కడ పూర్వకాలములో నారాయణాంశుడు, విశ్వరూపుడు, దేవకి కుమారుడును అగు శ్రీకృష్ణుడు పాశుపత గణములతో కూడి సంవత్సర కాలము నివసించినాడు.
ఆ కృష్ణుడు అన్ని అవయవములకు భస్మలేపనము చేసినవాడై, శివుని పూజించుట యందు శ్రద్ధ కలవాడై, పాశుపత వ్రతమును చేసి శివ పూజ చేసెను.
అతని యొక్క శిష్యులు చాలా మంది బ్రహ్మచర్య వ్రతమును పాటించువారై, కృష్ణుని మాట వలన జ్ఞానమును పొంది మహేశ్వరుని సాక్షాత్కరించుకొనిరి.
ఆ శ్రీకృష్ణునికి నీలలోహితుడు, భగవంతుడును అగు మహాదేవుడు ప్రత్యక్షమై వరములనిచ్చు స్వభావము కల అతడు ఉత్తమమైన వరమునిచ్చెను.
నా భక్తులైనవారు ఎవరైతే శాస్త్ర విధి ప్రకారము గోవిందుని పూజింతురో, వారికి ఈశ్వర విషయకమైన సత్యజ్ఞానము అనుభవ గోచరము కాగలదు.
ఓ కృష్ణా! నీవు నా భక్తులైన జనులచేత, విప్రులచేత పూజింపదగినవాడవు, ధ్యానింపదగినవాడవుగా నా అనుగ్రహము వలన కాగలవు. దీనిలో సందేహము లేదు.
ఎవరైతే పినాకధారియగు శంకరుని ధ్యానించి దర్శించు కొందురో, వారి యొక్క బ్రహ్మహత్య మొదలుగా గల మహాపాపములు కూడా శీఘ్రముగా నశించును.
ఈ వారణాసీ క్షేత్రములో, ఎంత పాపకర్మ పరాయణులైనప్పటికి మృతి చెందిన యెడల అట్టివారు సర్వోత్తమమైన పుణ్యగతిని పొందుదురు. ఈ విషయములో సందేహించ వలసిన పనిలేదు.
ఓ భూసురులారా! గంగానది యందు స్నానమాచరించి మహాదేవుడు, సర్వశ్రేష్ఠుడు, మధ్యమేశ్వర నామకుడైన దేవుని పూజించినవారు నిజముగా ధన్యజీవులు.
ఈ క్షేత్రములో స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధకర్మ, పితరులకు పిండ ప్రదానము జరుపుట అను కార్యములు ఒక్కొక్కటిగా చేయబడినవై తమ వంశములోని ఏడు తరముల వారిని పవిత్రులుగా చేయును.
సూర్యుడు రాహువుచే గ్రహింపబడిన గ్రహణ సమయములో ‘సన్నిహత్య’ అను తీర్థములో స్నానము చేసి మనుష్యుడు ఏ ఫలమును పొందునో, దానికి పదిరెట్లు ఫలమును ఈ స్థలములో పొందగలడు.
ఈ విధముగా చెప్పి ఆ మహాయోగియగు వ్యాసుడు ఆ మధ్యమేశ్వరుని సన్నిధిలో, మహేశ్వరుని పూజించుచు చాలా కాలము నివసించెను.
శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యము అను ముప్పది నాలుగవ అధ్యాయము సమాప్తము.
