కూర్మ మహా పురాణము

Table of Contents

41 - అథజ్యోతిః సన్నివేశవర్ణనమ్

 సూతుడిట్లు చెప్పెను :-

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఇకముందు మీకు ఈమూడు లోకముల పరిమాణమును సంగ్రహముగా చెప్పుదును. దానిని విపులముగా చెప్పుటకు శక్యము కాదు.

 భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను నీయేడులోకములు బ్రహ్మండము నుండి జనించినవి.

ఎంతవరకైతే సూర్యచంద్రులు తమకిరణములతో ప్రకాశించుచు కన్పింతురో, అంతవరకు భూలోకమని పురాణములయందు చెప్పబడినది.

భూలోకము సూర్యుని పరిమండలము నుండి ఎంత ప్రమాణము కలదై విస్తరించియున్నదో, భువర్లోకము కూడ సూర్యమండలమునకు అంత ప్రమాణముతో వ్యాపించియుండును.  

ఆకాశమునందు పైభాగమున ఏమండలముకలదో, ధ్రువుడు ఎంతమేర నిలిచియున్నాడో అది స్వర్గలోకమని చెప్పబడుచున్నది. అక్కడ వాయువు యొక్క నేములు కలవు.

ఆవహము, ప్రవహము, అనువహము, సంవహము, వివహము దానికిపైన పరావహము; 

మరియు పరివాహము అనునవి ఆనేముల పేర్లు. భూమికి లక్ష యోజనముల దూరములో సూర్యునియొక్క మండలము నిలిచియున్నది.

సూర్యునకు లక్ష యోజనముల దూరములో చంద్రుని మండలము కలదు. సమస్తమైన నక్షత్రముల మండలముకూడ దానికి లక్షయోజనముల దూరములో ప్రకాశించును.  

ద్వీజవర్యులారా నక్షత్రమండలానికి రెండు లక్షల యోజనముల దూరములో బుధుడు ప్రకాశించును. బుధునికి అంత ప్రమాణము కల దూరములో శుక్రుడు నిలిచియున్నాడు.

అంగారకుడు కూడ శుక్రునికి అంత దూరములో నిలిచి యున్నాడు. అంగారకునకు రెండులక్షల యోజనాల దూరములో శని నిలిచినాడు, ఈ గ్రహముల మండలము నుండి లక్షయోజనముల దూరములో సప్తర్షి మండలము ప్రకాశించును.

సప్తర్షి మండలానికి పైభాగమున లక్షయోజనముల దూరములో ధ్రువుడు నిలిచియున్నాడు. అక్కడ ధర్మ స్వరూపుడైన, భగవంతుడగు నారాయణుడు ఉన్నాడు.

సూర్యమండలముయొక్క విష్కంభము తొమ్మిదివేల యోజనముల పరిమాణము కలది. దానియొక్క వైశాల్యము మండల ప్రమాణమునకు మూడురెట్లు ఎక్కువగా నుండును.

సూర్యుని వ్యాప్తికంటె చంద్రుని విస్తారము రెండురెట్లు ఎక్కువగా నుండును. రాహుగ్రహము ఆ సూర్యచంద్రుల సమాన పరిమాణము కలదై వారిని సమీపించి అడ్డగించును.

భూమియొక్క నీడను పైకితెచ్చి వలయాకారముగా నిర్మించబడిన వాడు రాహువు. రాహువుయొక్క స్థానము పెద్దది, మూడవది. అది చీకటి మయముగా నుండును.

చంద్రుని యొక్క పదునారవభాగము శుక్రునకు ప్రతిపాదించబడినది. శుక్రుని కంటె నాలుగవ వంతు తక్కువగా బృహస్పతిని తెలియవలెను.

 బృహస్పతికంటె నాలుగవభాగము తక్కువవారుగా అంగారకుడు, శని చెప్పబడినారు. విస్తారమును బట్టి, మండల పరిమాణమును బట్టి కూడ వారిద్దరికి నాలుగవవంతు తక్కువగా బుధుడు తెలుపబడినాడు.

ఆకారము కలిగిన యే తారలు, నక్షత్రములు కలవో, అవి అన్నియు విస్తారమును, మండలమును బట్టి బుధునితో సమానములని తెలియవలెను.

తారల, నక్షత్రముల రూపములు ఒకదానికొకటి అయిదు, నాలుగు, మూడు, రెండు వందల యోజనముల దూరములతో ఎక్కువ తక్కువ దూరములు కలిగియున్నవి.

ఈరకమండలాలు ముందువెనుకలవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. యోజన పరిమాణంలో సగం కల్గి ఉంటాయి. అంతకంటె చిన్నగా ఉండదు.  

వారిలో మూడు గ్రహములు పైభాగమున దూరముగా సంచరించును. సూర్యుని కుమారుడైన శని, బృహస్పతి, అంగారకుడు అనుమూడు గ్రహములు మందగమనము కలవని తెలియవలెను

ఆ గ్రహములకు క్రింది భాగమున ఇతరములైన మరి నాలుగు పెద్దగ్రహములు సంచరించును. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు అను నాలుగు గ్రహములు శీఘ్రగమనము కలవి.

  ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయన మార్గములో సంచరించునో అప్పుడు పూర్వపు గ్రహములకు క్రింది భాగములో సూర్యుడు సంచరించను.

చంద్రుడు విశాలమైన మండలము నేర్పరచుకొని, దానికి పైభాగములో సంచరించును. సమస్తమైన నక్షత్రమండలము కూడ చంద్రునికి పైభాగమున సంచరించును.

నక్షత్రములకు పైభాగమున బుధుడు, బుధునికి పైభాగములో శుక్రుడు, అతనికి పైన అంగారకుడు, అంగారకుని పైభాగములో బృహస్పతి ఉండును.

బృహస్పతికి పైభాగములో శని, శనికంటేపైన సప్తర్షిమండలము ఉండును. ఆ సప్తర్షులకు పైభాగములో ధ్రువుడు నిలిచి ఉన్నాడు.  

సూర్యుని యొక్క రథము తొమ్మిది వేల యోజనములు వ్యాపించి యుండును. బ్రాహ్మణోత్తములారా! దాని ఈషాదండము రెండు రెట్లు కలదై యుండును.

ఆ రథము యొక్క ఇరుసు ఏడు నియతములు ఎక్కువగా కల కోటిన్నర యోజనముల పరిమాణము కలిగి యున్నది. దాని యందు చక్రము ప్రతిష్ఠింపబడియున్నది.

మూడు నాభులు కలిగి, అయిదు ఆకులుండి, ఆరు అంచులు కల అక్షయరూపమైన చక్రము నందు సంవత్సరరూపమైన కాలచక్రము పూర్తిగా నెలకొల్పబడి యున్నది.

రెండవ ఇరుసు నలుబదివేల యోజనముల పరిమాణము కలిగిఉన్నది. ఓ విప్రవరులారా! సార్థములైన ఏబదివేల యోజనముల ప్రమాణము ఆరేండిటి యొక్క అక్షముల కొలత, అర్థయుగముల ప్రమాణము క్రమముగా తెలియవలెను. ఆయుగార్థముతో హ్రస్వమైన అక్షము, ధ్రువమైన ఆధారము రథమునకు కలదు.

రెండవ ఇరుసునందు మానసపర్వతములో ఆచక్రము నిలిచియున్నది. దానికి గుఱ్ఱములుగా ఏడు ఛందస్సులున్నవి. వానిపేర్లను తెలిసికొనుడు.

గోయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, పంక్తి, అనుష్టుప్, త్రిష్టువ్, అనుపేర్లు గల ఏడు ఛందస్సులు సూర్యుని రథమునకు అశ్వములు.

తూర్పుదిక్కున మానసశైలముపైన మాహేంద్రి అనుపెద్ద పట్టణము కలదు. యముని ముఖ్యపట్టణము దక్షిణదిక్కున, వరుణుని పట్టణము పడమటి దిక్కున కలదు.

సోముని పట్టణము ఉత్తరదిక్కునందు కలదు. ఆ పట్టణముల పేర్లను తెలిసికొనుడు. అమరావతి, సంయమని, సుఖ, విభావరి అని క్రమముగా వానిపేర్లు.

దేవతలకు దేవుడైన పితామహుడు దక్షిణదిక్కును పొందినవాడై గ్రహనక్షత్రాదుల చక్రమును తీసికొని, ప్రయోగించబడిన బాణమువలె సంచరించును.

సూర్యుడు అన్ని కాలములయందు పగటి భాగములో సప్తద్వీపములయందు నిలిచియుండును. రాత్రిమధ్యభాగమునకు సమ్ముఖములో గోచరించును.

ఉదయ, అస్తమయ కాలమందు, అన్నికాలములయందు, ఎదురుగాను, అన్నిదిక్కులయందును, మూలలయందును, ఓ బ్రాహ్మణులారా! కులాల చక్రము వరకు ఇతడు ఈశ్వరునివలె తిరుగుచుండును. ఈతడు భూమిని విడిచిపెట్టి ఏవిధముగా రాత్రిని కల్పించునో, అదే విధముగా సూర్యకిరణములచేత మూడు లోకములు నింపబడును. మునీశ్వరా! సత్పురుషులచేత ఇది త్రైలోక్యమని చెప్పబడినది.

ఈ సమస్తలోకత్రయము కూడ ఆదిత్యమూలకమైనదే. ఇందులో సందేహము లేదు. ఈసూర్యుని వలననే దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన లోకమంతయు నిలుచుచున్నది.

రుద్రుడు, ఉపేంద్రుడు, చంద్రుడు అనువారియొక్కయు, బ్రాహ్మణశ్రేష్ఠుల యొక్క స్వర్గవాసులగు దేవతలయొక్క సమస్తమైన తేజస్సును, అన్ని లోకములకు చెందిన దానిని ఈ తేజోవంతుడైన భాస్కరుడు జయించినాడు.

ఇతి శ్రీ కూర్మపురాణే జ్యోతిషాం సన్నివేశే ఏక చత్వారింశోఽధ్యాయః   ॥

సమస్తమునకాత్మయగువాడు, అన్ని లోకములకు ప్రభువు, మహాదేవుడు, ప్రజాపతియునగు ఈ సూర్యుడు లోకమునకు మూలకారణమైన గొప్పదైవము.

అట్లే ఇతరులు పండ్రెండుమందీ ఆదిత్యులు, అధికారముకల దేవులు ఎవరుకలరో, వారు ఆయాకార్యములను నిర్వహింతురు. ఆ సూర్యుని అంశభూతులు విష్ణుమూర్తులుగా చెప్పబడుచున్నారు.

గంధర్వులు, యక్షులు, నాగులు, కిన్నరులు మొదలగు వారు అందరు సహాస్రభుజములు కల ఆభగవంతునకు నమస్కరింతురు. ముని శ్రేషులు వేదమయుడు, పురాతన బ్రహ్మస్వరూపుడైన యీ సూర్యదేవుని, వివిధములైన యజ్ఞములతో పూజించుచున్నారు.

శ్రీ కూర్మపురాణములో జ్యోతిస్సులసన్నివేశమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.