కూర్మ మహా పురాణము

Table of Contents

37 - ప్రయాగ మహాత్త్యము

మార్కండేయుడిట్లు చెప్పెను :-

కుమారా! తీర్థ యాత్రల విధానమును, క్రమమును ఋషులచేత చెప్పబడిన పద్ధతితో నేను చూచినంతవరకు, విన్నంతవరకు నీకు చెప్పబోవుచున్నాను.

ఏ మనుష్యుడు ప్రయాగక్షేత్రమునకు యాత్ర చేయగోరినవాడై, వాహనముగా ఎద్దును ఎక్కినవాడై ప్రయాణముచేయునో, వానికి కూడా ఎటువంటి ఫలము కలుగునో వినుము.

అటువంటి మనుష్యుడు భయంకరమైన నరకలోకములో వేలకొలది కల్పముల పర్యంతము ఎన్నో సంవత్సరాలు నివసించును. అక్కడి నుండి మరలినవాడై భయంకరమైన క్రోధము కల వృషభముగా జనించును.

  ఎవడు తన పుత్రులను బాలురుగా ఉన్నప్పుడే జీవనాధారము కల్పించక విడిచిపెట్టి వెళ్ళునో అటువంటి ప్రాణి యొక్క పితృదేవతలు తమ కొడుకు వదలిన తర్పణ జలమును కూడా స్వీకరించరు.

తనను తాను అర్పించుకొనుటతోపాటు, తనకున్న సర్వస్వమును బ్రాహ్మణుల కర్పించవలెను. ఐశ్వర్యమదము వలన, లోభ మోహముల వలన గాని ఎవడు వాహనముతో ప్రయాణించునో

అతని ఆ యాత్ర వ్యర్థమగును. అందువలన తీర్థయాత్రకు వాహనమును ఉపయోగించకూడదు. గంగాయమునా నదుల మధ్య ప్రదేశములో ఎవడు కన్యాదానము జరుపునో,

అతడు ఋషి ప్రోక్తమైన క్రమముతో, తనకున్న వసతులకు, శక్తికి తగినట్లుగా దానిని చేసినట్లైతే, ఆ పని ద్వారా అతడు భయంకరమైన నరకమును చూడబోడు.

అట్టివాడు ఉత్తర కురుదేశములను చేరి చిరకాలము అచ్చట సంతోషముతో గడుపును. ఎవడైతే ప్రయాగ తీర్థము వద్ద వటవృక్షపు మొదలు ప్రదేశంలో తన ప్రాణములను విడిచిపెట్టునో,

వాడు స్వర్గలోకములను దాటి శివలోకమును పొందగలడు. ఆ లోకములో బ్రహ్మ మొదలగు దేవతలు, దిక్కులు, దిక్పాలకులు సన్నిహితులై యుందురు.

ఇంకను ఇంద్రాది లోకపాలకులు, పితృదేవతలు, సనత్కుమారుడు మొదలుగా గలవారు, ఇతరులైన బ్రహ్మర్షులు కూడా అందరు ఆ లోకమందు నివసించి యుందురు.

నాగజాతికి చెందినవారు, గరుడులు, సిద్ధులు కూడా అక్కడ ఎల్లప్పుడు నివసింతురు. భగవంతుడైన శ్రీ విష్ణువు కూడా బ్రహ్మదేవునితో కూడినవాడై అక్కడ నెలకొని యుండును.

గంగా యమునా నదుల మధ్య ప్రదేశము భూమి యొక్క నడుము ప్రదేశముగా తలచబడుచున్నది. ఓ రాజశ్రేష్ఠుడా! ఈ ప్రయాగ క్షేత్రము మూడులోకముల యందు చాలా ప్రసిద్ధమై ఉన్నది.

ఆ గంగా యమునల సంగమ ప్రదేశములో ప్రశస్తమైన నియమము కలవాడై ఎవడు అభిషేకము చేయునో, అతడు రాజసూయ, అశ్వమేధ యాగములు చేసిన దానితో సమానమైన ఫలమును పొందును.

నాయనా! తల్లిమాట వలన కాని, జనుల యొక్క మాటల వలన గాని, ప్రయాగ తీర్థయాత్రను గూర్చిన నీ అభిప్రాయమును మార్చుకొని చాలించవద్దు.

ఓ కురు కుమారా! అరువదివేల తీర్థములు, ఇతరములైన అరువదికోట్ల పుణ్య స్థలములు. వాని అన్నింటి యొక్క సన్నిధి ఈ ప్రయాగమందే కలిగియుండును.

యోగ సాధన చేయువానికి, సన్న్యాసము స్వీకరించిన బుద్ధిమంతునికి ఎటువంటి పుణ్యగతి కలుగునో, గంగా యమునా సంగమము వద్ద ప్రాణములు విడిచిన వానికి కూడా అట్టిపుణ్యలోకము లభించును.

ఓ ధర్మరాజా! ఎవరైతే తమ జీవన కాలములో ప్రయాగ క్షేత్రమును చేరరో, వారు మూడు లోకములందు వంచింపబడినవారు. వారీ లోకములో జీవించి ఉన్నవారుగా పరిగణింపబడరు.

ప్రయాగమను పేరుగల మిక్కిలి శ్రేష్ఠమైన స్థానమును, పుణ్యతీర్థమును చూచి మనుష్యుడు, రాహువుచేత విడువబడిన చంద్రునివలె అన్ని పాపముల నుండి విడువబడుచున్నాడు.

యమునా నది దక్షిణ తీరములో కంబల, అశ్వతరులను నాగదేవతలున్నారు. అక్కడ స్నానముచేసి, ఆ నీటిని త్రాగి మనుష్యుడు అన్ని పాపముల చేత విడువబడుచున్నాడు.

అక్కడికి వెళ్లి మహాదేవుని సన్నిధిలో స్నానము చేసినచో తన వంశములోని పూర్వులు పదితరముల వారిని, తరువాతి పదితరాల వారినందరిని తరింపజేయును.

ఆ క్షేత్రములో అభిషేకము జరిపిన నరుడు అశ్వమేధము చేసిన ఫలమును పొందును. సమస్త ప్రాణుల ప్రళయము కలుగువరకు స్వర్గలోకమును పొందును.

గంగ యొక్క తూర్పు భాగమున స్నానము చేసినవాడు ముల్లోకముల యందు ప్రశస్తిని పొందును. ఆ ప్రదేశములో అవటము, ప్రతిష్ఠానము, సర్వసాముద్రము అనుతీర్థములు కలవు.

బ్రహ్మచర్యము నవలంబించి, కోపమును జయించినవాడై ఆ ప్రదేశములో మూడు రాత్రులు నివసించిన యెడల అట్టివాడు, అన్ని పాపములు తొలగిన ఆత్మకలవాడై అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందును.

ప్రతిష్ఠాన క్షేత్రమున ఉత్తరమున, గంగానదికి ఎడమవైపున మూడు లోకముల యందు ప్రసిద్ధమైన హంస ప్రపతనము అనుపేరు గల తీర్థస్థానము కలదు.

ఆ స్థలములో స్మరణ మాత్రముచేతనే అశ్వమేధ యాగఫలము సిద్ధించును. సూర్య చంద్రులున్నంతవరకు స్వర్గలోకనివాసము కూడా స్మరించిన పురుషునకు లభించును.

విశాలమై మనోహరమైన, హంసవలె తెల్లనైన ఊర్వశి నామకమైన ఇసుకతిన్నె మీద ఎవడు తన ప్రాణములను విడుచునో, దాని ఫలమును చెప్పుదును వినుము.

ఓ రాజా! అట్టి పురుషుడు అరువదివేల అరువది వందల సంవత్సరాల కాలము తన పితృదేవతలతో కూడి స్వర్గలోకములో నివసించి యుండును.

అందమైన సంధ్యావటమను ప్రదేశములో బ్రహ్మచారిగా, ఏకాగ్రచిత్తుడై శుచిగా ధ్యానించిన మనుష్యుడు బ్రహ్మలోకమును పొందును.

ఎవడైతే కోటితీర్థమును చేరుకొని తన ప్రాణములను విడుచునో, అతడు వేయికోట్ల సంవత్సరాల కాలము వరకు స్వర్గలోకములో పూజింపబడును.

అనేక పుణ్య తీర్థములతో, తపోవనములతో కూడియున్న ప్రశస్తమైన గంగానది ఎక్కడ ప్రవహించుచుండునో, ఆ ప్రదేశము సిద్ధ క్షేత్రముగా పరిగణింపదగినది. ఈ విషయములో విచారణ చేయదగదు.

ఆ గంగ, భూమి మీద మనుష్యులను, పాతాళ లోకములో నాగ జాతీయులను, ఆకాశములో దేవతలను తరింపజేయుచున్నది. అందువలననే త్రిపథగ అని పేర్కొనబడుచున్నది.

ఎంతకాలము మనుష్యుని అస్థులు గంగానదిలో నిలిచియుండునో, అన్నివేల సంవత్సరముల కాలము ఆ పురుషుడు స్వర్గలోకములో సుఖించును.

తీర్థములలో శ్రేష్ఠమైనది, నదులలో ఉత్తమమైన నది, గోప్ప పాపములు చేసినవారైనను సమస్త ప్రాణులకు మోక్షము నిచ్చునది ఆ గంగానది,

గంగ అన్ని చోట్ల సులభముగా లభించును. గంగాద్వారము, ప్రయాగ, గంగాసాగర సంగమము అను మూడు చోట్ల మాత్రము అభించుట కష్ట సాధ్యము.  

పాపముచేత పీడింపబడు మనస్సులు కల అందరు ప్రాణులకు, ఉత్తమ లోక ప్రాప్తిని గూర్చి వెదకు వారికి గంగానదితో సమానమైన మరియొక ప్రాప్యము లేదు.

పవిత్రములైన వాటిలో మిక్కిలి పవిత్రము, శుభకరములలో మిక్కిలి శుభమైనది, మహేశ్వరుని శిరస్సు నుండి జారిపడునది, అన్ని పాపములను తొలగించునది, మంగళరూప గంగానది.

కృతయుగములో నైమిశారణ్యము పుణ్యతీర్థము. త్రేతాయుగములో పుష్కరక్షేత్రము, ద్వాపరములో కురుక్షేత్రము మిక్కిలి పవిత్రమైనవి. కలియుగములో గంగానది విశిష్టమైనది.

ప్రయాగ క్షేత్రములో ప్రత్యేకముగా గంగానదినే సేవింతురు. ఓ రాజా! క్రూరమైన కలియుగములో దానికంటె ఇతరమైన మరియొక ఔషధము లేదు.

కోరికతోగాని, కోరిక లేకుండాకాని ఎవడైతే గంగానది యందు తన ప్రాణములను విడుచునో, అట్టివాడు స్వర్గలోకమున జీవించును. నరకమును చూడడు.

శ్రీ కూర్మ పురాణములో ప్రయాగ మాహాత్మ్యము నందు ముప్పది యేడవ అధ్యాయము సమాప్తము.