కూర్మ మహా పురాణము

Table of Contents

5 - కాల సంఖ్యావివరణము

కూర్మపురుషుడుచెప్పెను :

పుట్టుకలేకపోవుట, అన్నిటికంటే పూర్వంనుండి ఉండుట అనే కారణాల వలన స్వయంభువు అని చెప్పబడినాడు. ఏకారణం చేత మనుష్యులకు గమ్యమార్గమైనాడో, అందువలన నారాయణుడుగా తలచబడుచున్నాడు.

సంసారబంధాన్ని నశింపజేయటం వలన హరుడని, సర్వవ్యాపి కనుక విష్ణువని చెప్పబడుతున్నాడు. సమస్త విజ్ఞానము కలిఉన్నందున భగవంతుడుగా, జగద్రక్షుడు కావున ఓంకారరూపుడుగా పిలువబడుతున్నాడు.

సమగ్రవిజ్ఞానవంతుడు కావున సర్వజ్ఞుడనీ, సమస్త విశ్వస్వరూపుడైనందున సర్వుడనీ చెప్పబడును. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఆవిర్భవించినట్టి ఆ స్వయంభువు యొక్క కాలసంఖ్య; లెక్కించి చెప్పటానికి అనేక సంవత్సరాల కాలంచేత కూడ సాధ్యం కాదు. సంగ్రహంగా కాలసంఖ్య రెండు పదార్థాలతో ఏర్పాటు చేయబడింది.

అదియే పరకాలము. ప్రళయకాలము. దాని తరువాత మరల సృష్టిజరుగుతుంది. ఆ బ్రహ్మయొక్క స్వీయ మానంతో అది శతాబ్ద కాలంగా చెప్పబడింది.

బ్రాహ్మణోత్తములారా!

ఆపరకాలంలో సగభాగాన్ని పరార్ధము అని వ్యవహరిస్తారు. పదునైదు నిమిషాల కాలము ఒక కాష్ఠగా చెప్పబడినది.

ముప్పది కాష్ఠల కాలము ఒకకల అనబడును. ముప్పది కలలకాలము ఒక ముహుర్తమగును. అటువంటి ముప్పది ముహూర్త కాలాలతో మనుష్యులకు ఒక అహోరాత్ర పరిమాణ కాలము జరుగును.

ముప్పది అహోరాత్రముల కాలము ఓకమాసమని, అదీరెండు పక్షములు కలిగి ఉండునని, అటువంటి మాసములారింటికి ఒక అయనమగు నని, దక్షిణాయనము, ఉత్తరాయణము అని రెండు అయనములను తెలియవలెను.

మానవుల దక్షిణాయనము దేవతలకు రాత్రికాలము, ఉత్తరాయణము పగటికాలముగా పరిగణించబడును. అటువంటి దేవమానముతో 12 వేల సంవత్సరాల కాలముతో కృత, త్రేతాది సంజ్ఞలు కలిగిన,

నాలుగు యుగాలు ఏర్పడును. వాని విభాగమును తెలిసి కొనుడు. నాలుగు వేల దేవసంవత్సరాల కాలము కృతయుగమని చెప్పుదురు.

కృతయుగానికి నాలుగువేలదేవసంవత్సరాల కాలము. నాలుగు వందల సంధ్యాకాలము, నాలుగు వందల సంధ్యాంశము. మొత్తము 4800 సంవత్సరాలు. అదే విధంగా త్రేతాయుగానికి మూడువేల సంవత్సరాలు. సంధ్యాసంధ్యాంశలు 300+300 = 600 సంIIలు మొత్తం 3600 సంవత్సరాలు. ద్వాపరయుగానికి రెండువేల సంవత్సరాలు యుగకాలము; సంధ్యసంధ్యాంశలు 200+200 = 400 సం॥లు. మొత్తం 2400 సంవత్సరాలు - కలియుగానికి యుగకాలం 1000 సంIIలు, సంధ్య సంధ్యాంశలు 100+100 = 200 సంIIలు మొత్తం 1200 సంవత్సరాలు.

ఈ విధంగా నాలుగు యుగాలమొత్తం సంవత్సరాలు 4800+1600+2400+1200 = 12000 సంవత్సరాలు సరిపోతాయి.

ఇట్టి మహాయుగములు 71 అయినచో ఒక మన్వన్తరముగా చెప్పబడినది. బ్రహ్మకు పగటిపూట 14 గురు మనువులు స్వాయంభువ సావర్ణి కాదులుగా ఉందురు. వారితో ఈ పృథివీ అంతయు సప్తద్వీపములు పర్వతములు కలది వ్యాపించ బడినది.

సంపూర్ణముగా వేయి యుగముల సమూహము పరికల్ప అని చెప్పబడును. ఒక మన్వంతరమును వివరించుట చేత అన్ని మన్వంతరాలను గూర్చి వివరించినట్లైనది. సందేహములేదు. ప్రతికల్పము బ్రహ్మకు ఒక పగలు, అట్లే ఒక కల్పము రాత్రిగా పరిగణింపబడును.

నాలుగు వేలయుగముల కాలమును ఒక కల్పమని పండితులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మూడు వందల అరవై కల్పముల కాలము;

బ్రహ్మకు ఒక సంవత్సరకాలమని విద్వాంసులైన వారిచేత చెప్పబడినది. దానికి వందరెట్లు పరిమాణము గల కాలము పరార్థము అని తెలియవలెను.

దానీ సమాప్తి కాలములో సృష్టిలోని సకల ప్రాణులకు ప్రకృతి యందు లయము కలుగును. అందుచేత ఇది సజ్జనులచేత ప్రాకృతమైన సర్గమని చెప్పబడుచున్నది.

బ్రహ్మకు, విష్ణువుకు, రుద్రునికి ఈ ముగ్గురికి కూడ కాలనియమముతో ప్రాకృతికమైనలయము కలుగుతున్నది. మరల కొంత కాలానికి జన్మము కూడ కలుగుతుంది.

ఈ విధముగా బ్రహ్మ, ప్రాణులు, వాసుదేవుడు, శంకరుడు కూడ కాలముచేతనే సృజింప బడుతున్నారు. మరల ఆకాలమే వారిని మ్రింగి వేయుచున్నది.

పూజనీయమైన యీ కాలము ఆది, అంతములేనిది, జరామరణములు లేనిదీ, ఆకాలమే అన్నిటిని పొందినది, స్వతంత్రము, సర్వాత్మకము అయినందువలన మహేశ్వర స్వరూపమైనది.

బ్రహ్మలు చాలా మంది కలరు. రుద్రులు, సారాయణాదులు కూడ పెక్కు మంది ఉన్నారు. భగవద్రూపమైన కాలము మాత్రము ఒక్కటే అని వేదము.

ఓ విప్రులారా! బ్రహ్మయొక్క ఒక పరార్థము గడిచినది. ఇప్పుడు అతని రెండవ పరార్ధము జరుగుతున్నది. దానిలో ఇది మొదటి కల్పము.

ఇంతకు ముందుగడిచిన చివరి కల్పము పాద్మమని పండితులచేత చెప్పబడుతున్నది. ఇప్పుడు వారాహకల్పము జరుగుతున్నది. దాని వివరము తెలుపుదును.

కూర్మపురాణములో కాలసంఖ్యాకథనము అను పంచమాధ్యాయము సమాప్తము.