కూర్మ మహా పురాణము

Table of Contents

ఉత్తరార్థమ్ - 1వ అధ్యాయము

ఋషులిట్లు పలికిరి:

ప్రభూ నీచేత మాకు స్వాయంభువ మన్వంతరమునకు సంబంధించిన సర్గము, బ్రహ్మాండము యొక్క మొట్టమొదటి వ్యాప్తి, మన్వంతరముల యొక్క నిర్ణయముకూడ చక్కగా చెప్పబడినది. వాటిలో దేవతలకు ప్రభువైన దేవుడు, ధర్మతత్పరులైన సన్యానులచేత, జ్ఞాన యోగమునం దాసక్తులైన వారిచేత ఆరాధింపదగినవాడు చెప్పబడినాడు.  సమస్త ప్రపంచముయొక్క సంసార దుఃఖమును నశింపజేయు తత్త్వము, సర్వశ్రేష్ఠమైనది, కేవల పరబ్రహ్మవిషయకమైనది. దానిద్వారా ఆపరమాత్మను చూడగల్గుదుము.  

స్వామీ నీవు సాక్షాత్తు నారాయణ స్వరూపుడవు. కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని వలన సమస్త విజ్ఞానమును పొందినవాడవు. అందువలన మరల నిన్ను ప్రశ్నించుచున్నాము.

మునులయొక్క ఆవాక్యమును విని, వ్యాసుని ప్రసాదము వలన దక్షుడైన సూతపౌరాణికుడు మాట్లాడుట ప్రారంభించెను.  ఓ మునీశ్వరులారా ఈ లోపల కృష్ణద్వైపాయనుడైన వ్యాసభగవానుడు సత్రయాగము జరుగుచున్న ప్రదేశమునకు స్వయముగా విచ్చేసేను.

నీలమేఘముతో సమానంతిగల, వేదవిజ్ఞాననిధియైన, తామరరేకులవంటి కన్నులుగల ఆవ్యాసుని చూచి, బ్రాహ్మణశ్రేష్ఠులందరు నమస్కరించిరి.

రోమహర్షణుడైన సూతుడు వ్యాసుని చూచి నేలమీద దండ వత్రణామముచేసెను. శిరసువంచి, చేతులు జోడించి విధేయుడుగా నిలబడెను.

ఆ వ్యాసునిచేత శౌనకాది మహామునులు కుశల ప్రశ్నలు వేయబడిరి. మునులు వ్యాసుని సమీపించి ఆయనకు యోగ్యమైన ఆసనమును ఏర్పాటు చేసిరి.  

తరువాత పరాశరుని పుత్రుడైన వ్యాసభగవానుడు ఆమునులతో ఇట్లు పలికెను. “మీ తపస్సుకు వేదాధ్యయనమునకు, పొండిత్యమునకు హానీయేమియు లేదుకదో?”

తరువాత సూతుడు తన గురువగు వ్యాసునకు నమస్కరించి, బ్రహ్మ విషయకమైన జ్ఞానమును ఈ ముసులకు నీవు చెప్పదగియున్నావు.

ఈ మునులు శాంతులు, తపోనిష్ఠకలవారు, ధర్మమునందు తత్పరులు. వీరికి ఆ జ్ఞానమును గూర్చి వినుకోరిక కలిగినది. ఆతత్వమును గూర్చి తెలుపుటకు తగుదువు.

నీచే నాకు పూర్వము చెప్పబడినది, మోక్షమునిచ్చునది, దివ్యము అగు జ్ఞానము, పూర్వకాలములో కూర్మరూపియైన విష్ణువు చేత మునులకు చేప్పబడినది.

సూతునిమాటను విని సత్యవతి కుమారుడైన వ్యాసుడు, శివునకు శిరసువంచి నమస్కరించి, సుఖమును కలిగించుమాటను ఈవిధముగా పలికెను.

పూర్వము భగవంతుడగు మహాదేవుడు సనత్కుమారుడు మొదలగు యోగీశ్వరులచేత అడుగబడినాడు. అప్పుడాయన స్వయముగా ఇట్లు చెప్పెను.  

సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, అంగిరుడు, రుద్రునితో కూడిన భృగువు, పరమధర్మమును తెలిసినవాడు అగు కణాదుడు, కపిలుడు, గరుడు, మహామునీయగు వామదేవుడు, శుక్రుడు, భగవంతుడగు వసిష్ఠుడు, నిగ్రహింపబడిన మనస్సు కలవారగు వీరందరు  తమలోతాము వీచారీంచుకొని, సంయమముతో కూడిన మనస్సుకలవారై, పుణ్యమైన బదరికాశ్రమములో ఘోరమైన తపస్సును చేసిరి.

వారు తరువాత గొప్పయోగముకల ధర్మసుతుడైన, ఆద్యంత రహితుడైన, నరునితో కూడిన నారాయణ మునిని చూచిరి.  భక్తితో కూడిన యోగులు యోగవిదులలో శ్రేష్టుడైన ఆసారాయణమునీని, అన్ని వేదముల నుండి పుట్టిన వివిధములైన స్తోత్రములతో పొగడీ నమస్కరించిరి.

సర్వజ్ఞుడగు భగవంతుడు వారికోరికను తెలిసినవాడై, గంభీరమైన వాక్కుతో, ఎందుకు తపము చేయుచున్నారని ప్రశ్నించెను.

సంతోషించిన మనస్సులు కల ఆ మునులు, విశ్వాత్మ రూపుడు, సనాతనుడు, సంకల్పసిద్ధిని సూచించువాడు, స్వయముగా వచ్చిన నారాయణ దేవుని గూర్చి యిట్లు పలికిరి.

మేమందరము బ్రహ్మవాదులము. తపోనియమము నవలంబించినాము. పురుషోత్తముడవైన నిన్ను ఒకనినే శరణము పొందుచున్నాము.

నీవు స్వయముగా నారాయణరూపుడవగు ఋషివి. అవ్యక్తుడవైన పురాణ పురుషుడవు. పరమరహస్యమైన బ్రహ్మతత్త్వమును నీవెరుగుదువు.

పరమేశ్వరుడవైన నీవు తప్ప మరియొకడు తెలిసినవాడు లేడు. అందువలన నీవు మా సంశయమును ఛేదింపదగియున్నావు.

ఈ సమస్తమునకేది కారణము? ఎవడు ఎల్లప్పుడు సంసారబద్దుడై యుండును? ఆత్మయేది? ముక్తియననేమి? సంసారమునకు నీమిత్తమేది?

సంసారమనగా ఏది? సమస్తమును దర్శించునట్టి ఈశానుడేవరు? సర్వోత్తమమైన బ్రహ్మతత్వమేదీ? ఇదీయంతయు మాకు చెప్పదగి యున్నావు.

ఈ విధముగా పలికి మునులు, తాపసవేషమును వదలి తన తేజస్సుతో ప్రకాశించుచున్న ఆపురుషోత్తముని దర్శించిరి,

ఆ హరి నిర్మలుడుగా, కాంతి సమూహముచే అలంకరింపబడినవాడుగా, వక్షమున శ్రీవత్స చిహ్నము కలవాడుగా, కాచినబంగారము వంటి కాంతీ గలవాడుగా వెలుగుచుండెను.

శంఖచక్రములు, గద చేతుల యందు ధరించినవాడు, శార్జ మను వింటీని చేతియందు ధరించినవాడు, లక్ష్మితోకూడియున్నవాడుగా నారాయణుని చూచిరి. అతని తేజస్సులో నరుడు కన్పించడాయేను.

ఈ లోపల తలపై చంద్రకళనుధరించినవాడు, మహాదేవుడు, అనుగ్రహమును పూనుకున్న రుద్రరూపియగు మహేశ్వరుడచట సాక్షా త్కరించెను.

లోకనాథుడు, చంద్రభూషణుడు, త్రిలోచనుడు అగు పరమేశ్వరునిచూచి ఆ మునులు సంతోషించిన వారై భక్తితో అతనిని స్తుతించరీ.  

ఓ ఈశ్వరా, మహాదేవా భూతముల కధిపతీ, శివా నీకు జయము. సమస్తమునుల కీశ్వరుడా తపస్సుచేత పూజింపబడువాడా నీకు జయము.

అనంతమూర్తులుకలపోడా ప్రపంచమే ఆత్మగా కలవాడా లోకయంత్రమును నడుపువాడా సృష్టిస్థితి లయములకు కారణమైనవాడా నాశములేనివాడా, నీకు జయము.

అనంతపాదములు కలవాడా యోగులచే నమస్కరించబడుపోడా శంభూ అంబికాపతీ, ఓపరమేశ్వరా నీకు జయము, వందనము. ఇట్లు స్తుతించబడిన భక్తవత్సలుడగు త్రిలోచనుడు, ప్రక్కనున్న నారాయణుని కౌగిలించుకొని, గంభీరమైన వాక్కుతో ఇట్లు పలికెను.  పుండరీకాక్షా బ్రహ్మవిదులగు ఈ మునులు ఎందుకు ఇక్కడకు వచ్చినారు? వీరికి సాతో ఏమి ప్రయోజనము నెరవేరవలెను?

ఈశ్వరుని వాక్యమును విని దేవదేవుడైన నారాయణుడు ప్రసాదాభిముఖుడైయున్న శివునితో ఇట్లు పలికెను.  

దేవా! ఈ తాపసులు పాపములు నశించినవారు. అభ్యాగతులకు ఆశ్రయభూతుడవైన నిన్ను బాగుగా దర్శించ గోరుచున్నవీరికీ  శ్రేష్టమైన హృదయముకల వారికి నీవు ప్రసన్నుడవైనచో, వీరి సమక్షమున నాకుగూడ ఆదివ్యజ్ఞానమును గూర్చి బోధింపదగుదువు.

ఆత్మ స్వరూపమును నీవు చక్కగా ఎఱుగుదువు. ఓ శివా మరియొకడు ఆత్మజ్ఞుడు లేడు. ఈ మునీంద్రులకు ఆత్మస్వరూపమును వివరించి ప్రదర్శించుము.

ఇట్లు పలికి శ్రీవిష్ణువు ముని శ్రేష్ఠులతో వృషభధ్వజుడైన శివునిచూచి, యోగసిద్ధిని ప్రదర్శించుచు ఇట్లు చెప్పెను.  మహేంద్రుని యొక్క శూలధారియగు శివునియొక్క దర్శసమువలన యథార్థముగా మీరు కృతార్ధులయినట్లు తెలిసికొనుడు.

దేవతలకీశ్వరుడు, ప్రత్యక్షముగా ఎదుటనున్న శివుని దర్శింపుడు. నా యెదుట ఆయన ఆత్మతత్త్వమును యధారూపముగా బోధించుటకు సమర్థుడు.  

విష్ణువుయొక్క మాటను విని, వృషభధ్వజుడైన శివునికి నమస్కరించి, సనత్కుమారుడు మొదలగు వారు మహేశ్వరుని ఇట్లు ప్రశ్నించబూనిరి.

ఇంతలో ఆకాశమునుండి నిర్మలమైన, మంగళకరమైన, ఆలోచించుటకు శక్యముకాని, దివ్యమైన ఒకానొక ఆసనము శివునికొరకు అక్కడ సాక్షాత్కరించెను.   యోగస్వరూపుడు, విశ్వకర్మయగు ఈశ్వరుడు విష్ణువుతో కూడ ఆ ఆసనముపై కూర్చుండెను. ఆ మహేశ్వరుడు తన తేజస్సుతో విశ్వమును నింపుచు ప్రకాశించుచుండెను.

తరువాత బ్రహ్మనాదులగు మునులు స్వచ్ఛమైన ఆయాసనమునందు ప్రకాశించుచున్న దేవాధిదేవుడైన శంకరుని చూచిరి.  ఈ సమస్త విశ్వము ఎవనీ యందీమిడి యున్నదో, జగత్తు ఎవనికి భిన్నము కాదో ఆ భూతేశుని ఆసనమందు కూర్చుండగా వారు చూచిరి.

నారాయణునితో కూడిన ఈశ్వరుని పరమపురుషుని ఆ మునులు చూచిరి. మునులచే ప్రశ్నింపబడిన పరమేశ్వరుడు వారితో ఇట్లు చెప్పెను.  

విష్ణువువైపుచూచీ శంకరుడు, పుణ్యాత్ములగు మునులారా శ్రేష్ఠమైన ఆత్మయోగమును నాచే విధివిధానముతో చెప్పబడుదానిని వినుడు. మీరందరు ప్రశాంతమైన చిత్తము కలవారై నిర్మలమైన ఈశ్వరంబంధి జ్ఞానమును వినుడు.

శ్రీ కూర్మపురాణములో ఉత్తరార్థమునందు, ఈశ్వరగీతోపనిషత్తులో బ్రహ్మవిద్యయందు యోగశాస్త్రమున ఋషి వ్యాససంవాదరూప ప్రధమాధ్యాయము సమాప్తము.