కూర్మ మహా పురాణము
8 - అథ ముఖ్యాదిసర్గ కథనమ్
కూర్మస్వామి చెప్పెను :
ఈవిధముగా స్థావరములు, చరములు అగు భూతములు సృష్టించబడినవి. బుద్ధిమంతుడగు బ్రహ్మదేవునిచేత సృజింపబడిన ప్రజలు వృద్ధినొందకపోయిరి.
తమోగుణపరిమాణముచేత ఆవరింపబడిన బ్రహ్మ దుఃఖము కలవాడై విచారించెను. అప్పుడతడు విషయములందు నిశ్చయమును సాధించు బుద్ధిని సంపాదించుకొనెను.
తరువాత, తనను వశము చేసికొని నియమించుచున్న తమోగుణపు పరిమాణమును తనయందు కనుగొన్నాడు. తన ధర్మము ననుసరించి ప్రవర్తించు రజస్సు, సత్త్వమును గూడ గమనించేను.
తరువాత రజస్సత్త్వగుణములతో కూడుకున్నవాడై తమోగుణమును పారద్రోలేను. అట్లు తొలగించబడీన తమోగుణము స్త్రీ పురుషుల జంటగా ఏర్పడెను.
బ్రాహ్మణులారా! అశుభలక్షణమైన హింస, అధర్మము యొక్క ఆచరణమునుచూచి బ్రహ్మ ప్రకాశవంతమైన ఆశరీరమును వదిలిపెట్టెను.
మరల తనదేహమును రెండు భాగాలుగా విభజించెను. ఒకసగముతో పురుషుడుగా ఆయెను. మరియొక సగముతో స్త్రీరూపమును పొందెను. ఈ విధముగా ప్రభువు విరాట్పురుషుని సృజించెను.
శతరూప అనుపేరు గల యోగిని అగు మంగళకర స్త్రీని సృజించెను. ఆయోగిని తన మహిమచేత భూమిని ఆకాశమును కూడ వ్యాపించి నిలిచినది.
యోగబలము, ఐశ్వర్యబలముతోకూడినది, జ్ఞానవిజ్ఞానములు. కలిగియున్నదిగా ఆమె ఉండెను. అవ్యక్తమైన జన్మముకల పురుషుని నుండీ విరాడ్రూపుడైన ఏకుమారుడు కలిగెనో, అతడు స్వాయంభువమనువు, దేవతారూపుడు, ముని అగుపురుషుడు. శతరూప అను పేరు గల ఆదేవి మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును చేసి; ప్రకాశించు కీర్తి కలిగిన మనువునే పతిగా పొందినది. అతని వలన ఆశతరూప ఇద్దరు కుమారులను కనెను.
వారు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనుపేరు కలవారు. శ్రేష్ఠులైన ఇద్దరు కన్యలను గూడ ఆమె పొందెను. మనువు వారిద్దరిలో ప్రసూతి అనుకన్యను దక్షునికి వివాహము చేసెను.
రెండవ కన్యను ఆహుతిని మానసపుత్రుడైన రుచి అనువాడుపత్నిగా స్వీకరించెను. ఆరుచికి ఆకూతి వలన మంగళకరమైన శిశుద్వయము కలిగెను.
యజ్ఞునికి దక్షిణ అను కన్యను అర్పించెను. వారిద్దరిచేత ప్రపంచము పెంపొందించబడినది. ఆయజ్ఞ పురుషునికి దక్షిణయందు పండ్రెండు మంది కుమారులు కలిగిరి.
వారు యాములు అని పిలువబడు దేవతలు. స్వాయంభువ మన్వంతరములో వారు కలిగిరి. దక్షుడు ప్రసూతి యందు ఇరువది నాలుగు మంది కన్యలను; పొందెను. వారి పేర్లను చక్కగా తెలిసికొనుడు. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ;
బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి - అను ఈపదమూడు మందిని దక్ష పుత్రికలను ధర్ముడు భార్యలుగా స్వీకరించెను.
వారు కాక మిగిలిన పదునొకండుగురు చిన్నవారు వరుసగా ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షము, సంతతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వథా అసువారు కలరు. వారిని క్రమముగా భృగువు ఖ్యాతిని, శివుడు సతిని, మరీచి సంభూతిని, అంగిరసుడు స్మృతిని. పులస్త్యుడు ప్రీతిని, పులహుడు క్షమను, క్రతువు సంతతినీ, గొప్ప ధర్మములు తెలిసిన అత్రి అనసూయను, వసిష్ఠుడు ఊర్జను, అగ్నిహోత్రుడు స్వాహాదేవిని, పితృదేవతలు స్వధను; జ్ఞాన వరిష్టులైన పూర్వోత్తమునులు ఆయా కన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి. శ్రద్ధయొక్క పుత్రుడు కాముడు, లక్ష్మీ సుతుడు దర్పుడు అని పేర్కొనబడినారు.
ధృతియొక్క కుమారుడు నియముడు, తుష్టికి సంతోషుడను పుత్రుడు, పుష్టికి లాభుడను సుతుడు, మేధకు శముడను కుమారుడును కలిగిరి.
క్రియకు దండుడు, నయుడు అను కుమారులు కలిగిరి. అదేవిధముగా బుద్ధి అనునామెకు బోధుడు, ప్రమాదుడు అనువారు పుత్రులుగా జన్మించిరి.
లజ్జకు వినయుడను పుత్రుడు కలిగెను. వపుస్సుకు వ్యవసాయకుడనువాడు, శాంతికి క్షేముడు పుత్రుడు, సిద్ధికి సిద్ధుడను కొడుకు కలిగీరీ.
కీర్తికి యశుడను పుత్రుడు - ఈవిధముగా వీరందరు ధర్ముని కుమారులు. కామునికి పరుడను కుమారుడు, దేవానందుడను వాడు కూడ జన్మించిరి.
ఈ విధముగా సుఖమైన భవిష్యత్తు కలిగిన ధర్ముని సర్గము తెలుపబడినది. అధర్మునివలన హింసజనించెను. నీకృతి అనుకుమారుని కూడ అధర్ముడు పొందెను.
నికృతికి భయము, నరకము అనుకుమారులు కలిగిరి. మాయ, వేదన అనువారు వీరికి భార్యలుగా రెండు జంటలేర్పడినవి.
భయమునుండి మాయవలన ప్రాణులను నశింపజేయు మృత్యువు జనించెను. నరకము నుండి వేదన అను భార్య దుఃఖమును పుత్రునిగా కనెను.
మృత్యువునకు వ్యాధి, జర, శోకము, తృష్ణ, క్రోధము అనునవి సంతానముగా కలిగేను. ఇవి అన్నియు అధర్మలక్షణము కలిగిన దుఃఖ పరిణామము కలవిగా చెప్పబడినవి.
వీనికి భార్యకాని, కుమారుడు కాలేరు. ఇవి అన్నియు ఊర్థ్వరేతస్సు కలిగినవి. ఈరీతిగా తమోగుణము ప్రధానముగా కల సర్గము ఏర్పడినది. మునిశ్రేష్ఠులారా! ఈ సృష్టి క్రమము నాచేత సంగ్రహముగా తెలుపబడినది.
శ్రీ కూర్మపురాణములో ముఖ్యాది సర్గకథనమను అష్టమాధ్యాయము సమాప్తము.
