కూర్మ మహా పురాణము
3 – అథ వర్ణాశ్రమ క్రమవర్ణనమ్ -
ఋషులిట్లు పలికిరి :-
భగవంతునిచేత ఏర్పరచబడిన నాలుగు వర్ణాలు, ఆశ్రమాలు వివరించబడ్డాయి. మహాత్మా! ఇప్పుడు మాకు ఆశ్రమాల క్రమాన్ని గురించి చెప్పుము. కూర్మస్వామీ ఇట్లనెను.
బ్రహ్మచారి, గృహస్తుడు, వానప్రస్థుడు, సన్యాసి అనినాలుగు ఆశ్రమభేదాలు చెప్పబడ్డాయి. అవి క్రమంగా ఒకదాని తరువాత మరొకటి ప్రవర్తిస్తాయి. ప్రత్యేక కారణమున్నప్పుడు క్రమంలో భంగం రావచ్చును.
ఉత్కృష్టమైన జ్ఞాన విజ్ఞానములు కలిగి, గొప్ప వైరాగ్యమును పొందిన యెడల బ్రహ్మచర్యాశ్రమం నుండి మోక్షకామనతో సన్న్యాసాన్ని స్వీకరించవచ్చును.
శాస్త్ర ప్రకారము వివాహమాడి వివిధములైన యజ్ఞములతో దేవతలను పూజించి సంతానమును పొందవలెను. వైరాగ్యము కలిగినచో సన్న్యసించవలెను. విధి ప్రకారము యజ్ఞములు చేయక, పుత్రులను పొందక గృహస్థుడు తన ఆశ్రమాన్ని వదలి సన్యసించకూడదు.
ఒకవేళ వైరాగ్యబలముచేత గృహస్థుడుగా ఉండదలచనట్లయితే యాగాదులు చేయకున్నప్పటికి బ్రాహ్మణశ్రేష్ఠుడు కుటుంబ జీవనము నుండి సన్యసించవచ్చును. .
అదే విధంగా వివిధములైన యజ్ఞాలనుచేసి, తరువాత వానప్రస్థాన్ని స్వీకరించి, తపస్సుచేసి దానివలన వైరాగ్యాన్ని పొంది తరువాత సన్యాసాశ్రమము స్వీకరించవచ్చును.
పొనప్రస్థానికి వెళ్లిన తరువాత మరల తన పూర్వపు ఇంటీలో ప్రవేశించకూడదు. సన్యాసి మరల వానప్రస్థాన్నికాని, సాధకుడు తిరిగి బ్రహ్మచర్యాన్ని కాని స్వీకరించరాదు. .
విద్వాంసుడైన గృహస్థుడు ప్రాజాపత్యము లేక ఆగ్నేయి అనే ఇష్టిని ఆచరించి కుటుంబము నుండి సన్న్యసించవచ్చును. వేద వాక్యము ననుసరించి వాన ప్రస్థాశ్రమం నుండి కాని సన్న్యాసి కోదగును. .
యజ్ఞాది కర్మలను చేయుటకు శక్తి చాలనివాడు కూడ, హేమము చేయుచు క్రియలనాచరించును. గ్రుడ్డివాడు, కుంటివాడు, దరిద్రుడైనను బ్రాహ్మణుడు విరక్తుడైన సన్యసించవలెను.
అందరికి కూడ వైరాగ్యమే సన్న్యసించటానికి ముఖ్యకారణముగా చెప్పబడినది. విరక్తుడు కాకుండా ఎవడు సన్యసించునో వాడు తప్పక పతనము చెందును.
అట్లు కానిచో ఒక ఆశ్రమమునందే జీవితకాలపర్యంతము ఉండదగును. ఆశ్రమమునందు శ్రద్ధకలిగి వర్తించువాడు అమృతత్వమును పొందజాలును.
న్యాయమార్గంలో ధనము సంపాదించుపోడు, శాంతుడు, వేదాంత విద్యయందాసక్తి కలవాడు, ఎల్లప్పుడు స్వధర్మానుష్టానము చేయువాడు, పరమాత్మసాయుజ్యానికి తగి ఉంటాడు.
తానుచేసిన కర్మలను బ్రహ్మమునందు అర్పించి, కోరికలను, ఆశలను తెంపుకొని నిర్మలమైన మనస్సుతో కర్మలనాచరించి పరమాత్మ పదమును చెందును.
ఇవ్వదగినది బ్రహ్మచేత ఈయబడును. అది మరల బ్రహ్మకు అర్పించబడును. ఆ బ్రహ్మమే ఈయబడుచున్నది, ఇదియే గొప్ప బ్రహ్మార్పణమని చెప్పదగును.
నేను కర్తను కాను. ఈ సమస్తమును పరబ్రహ్మమే ఆవిధముగా చేయును. తత్త్వదర్శనులైన ఋషులచేత ఈ విధానము బ్రహ్మార్పణమని చెప్పబడినది.
శాశ్వతుడైన, భగవంతుడగు ఈశ్వరుడు ఈ కర్మచేత సంతోషించును గాక. అని ఎల్లప్పుడు బుద్దీపూర్వకముగా శ్రేష్టమైన యీ బ్రహ్మార్పణమును చేయవలెను. లేదా పరమేశ్వరుని యందు కర్మలఫలముల నర్పించవలెను. ఈ పద్ధతినిగూడ శ్రేష్ఠమైన బ్రహ్మార్పణమని చెప్పుదురు. ఫలాపేక్ష లేకుండ, కేవలకర్తవ్యతాబుద్దితో ఏ కర్మ నియతముగా పండితునిచేత చేయబడునో, అదీకూడ మోక్షదాయక మగును.
అట్లుకాక ద్వీజుడు నిత్యములైన కర్మలను గూడ ఫలత్యాగము చేయక ఆచరించినచో, దాని ఫలముతో అతడు బంధింపబడుచున్నాడు.
అందువలన సమస్తప్రయత్నముతో, కర్మకు సంబంధించిన ఫలమును విడిచి పెట్టి పండితుడుకాని వాడు కూడ కర్మను చేయవలెను. చాలా కాలమునకు పుణ్యపదమును పొందగలడు.
కర్మచేత ఇహలోకమునకు సంబంధించినదీ, పూర్వజన్మకు సంబంధించినది అగు పాపము నశించును. మనస్సు నిర్మలమై మనుష్యుడు బ్రహ్మజ్ఞానము కలవాడగుచున్నాడు.
కర్మయోగముతో కూడినజ్ఞానముచేత చక్కని యోగము సిద్ధించును. కర్మతో కూడిన జ్ఞానము దోషములు లేని శుద్దమైనదగును.
అందువలన ఏ ఆశ్రమమందున్నప్పటికి అన్ని విధముల ప్రయత్నముచేత ఈశ్వరుని సంతోషముకొరకు కర్మలను చేయవలెను. అట్లయినచో కర్మరాహిత్యమును పొందగలడు నరుడు.
ఉత్తమమైన జ్ఞానమును, కర్మరాహిత్యమును ఆయీశ్వరుని అనుగ్రహమువలన పొంది, ఓంటరివాడై, మమకారముక్తుడు, శాంతుడును అయి జీవితకాలములో ముక్తుడగును (జీవన్ముక్తుడు)
అటువంటివాడు పరమాత్మను దర్శించును. మహేశ్వరరూపియైన పరబ్రహ్మనుచూచి, శాశ్వతానందముకలవాడై, మాయ తొలగినవాడై ఆపరమాత్మయందే లీనమగును.
అందువలన నిర్మలబుద్ధికలవాడై, పరమేశ్వరుని తృప్తి కొరకు ఎల్లప్పుడు కర్మయోగమును సేవించవలేను. దాని వలన శాశ్వతమైన బ్రహ్మ పదమును పొందుచున్నాడు.
నాలుగు ఆశ్రమములకు సంబంధించిన, శ్రేష్ఠమైన యీ విషయమంతయు మీ కొరకు నాచేత చెప్పబడినది. మనుష్యుడు ఈ ధర్మమునతి క్రమించి మోక్షమును పొందజాలడు. శ్రీ కూర్మపురాణములో చాతురాశ్రమకధనము అనబడు తృతీయాధ్యాయము సమాప్తము.
