కూర్మ మహా పురాణము

Table of Contents

34వ అధ్యాయము

ఋషులు ఇట్లనిరి.

రోమహర్షణా నీవిపుడు మాకు ఈ లోకమందలి ప్రఖ్యాతినొందినవి, విశేషమైనవియగు తీర్థములేవియో వానినీ గురించి తెలుపుము.

రోమహర్షణుడు పలికెను.

మునిశ్రేష్ఠులారా పురాణములలో, బ్రహ్మవిదులగు మునులచే చెప్పబడిన (వివరింపబడిన) వివిధములగు తీర్థముల గురించి తెలుపుదును. వినుడు. ఈ తీర్థములందు ఒక్కసారైనను జపము, హోమము, శ్రాద్ధము, దాసొదులు ఏ ఒకటి ఆచరించినను, అట్లు ఆచరించినవానీకి వంశమున ఏడు తరములు పవిత్రమగును.

పరమేష్టియగు చతుర్ముఖ బ్రహ్మకు సంబంధించిన ప్రయాగలను తీర్థము, ప్రసిద్ధికెక్కెను, ఐదు యోజనములు విస్తీర్ణము కల ఈ తీర్థము మాహాత్మ్యము ముందే తెలిపితిని. మరొక తీర్థము దేవతలు కూడ నమస్కరించెడి కురుక్షేత్రము, అదీ ఋషి ఆశ్రమములతో నిండియున్నది. అది సర్వపాపములను క్షాళన చేయగలది. అందుస్నానమాచరించి దంభము, మాత్సర్యము విడచి, విశుద్దమైన అంతఃకరణముతో ఏమాత్రమైనను దానముచేసిన, అది ఉభయ తల్లి - తండ్రుల) కులములు పవిత్రము చేయును.

ఇంక పితృదేవతలకు అత్యంత ప్రియమగునదీ, వైభవము కలదియగు తీర్థము గయ. అచట పిండ ప్రదానము చేసినయెడల నరునకు మరు జన్మము లేదు. ఒక్కసారైనను అచట పిండ ప్రదానము చేసిన, ఆతని పితృదేవతలు నరకాదీ దుఃఖకరమగు లోకములను తరించి, పరమపదముచేరుదురు. అచ్చటనే సర్వలోక హితమునుకోరి, రుద్రుడు తన పాదముద్రలను అచటి శిలాతలమున ఉంచెను. ఆస్థానముందు పితృదేవతలను ప్రసన్నము చేసుకొనవలెను. వెళ్లగలవాడైనను గయకు వెళ్లనివాని పితృదేవతలు, అతనిగురించి దుఃఖము పొందుదురు. అతని ఇతర ధార్మికకర్మలు అన్నియు వ్యర్థములే యగును.

ఏఒక్కడైనను గయకు వెళ్లుట సంభవించిన, ఇతడు మమ్ములను తరింపచేయును (సద్గతి కలిగించును?” అనుచు అతని పితృదేవతలు అతని గాధను గానము చేయుదురు. మహర్పులు అతనిని కీర్తింతురు. మావంశమునందు పరమ పాపాత్ముడైనను, స్వధర్మములు వదలినవాడైనను, ఒకసారి గయా యాత్రచేసిన యెడల మమ్ములను తరింపచేయును. శీలవంతులు, గుణవంతులగు పుత్రులు చాలమంది జనింతురుగాకయని కోరుకొనవలెను. వారిలో ఒకడైనను గయాయాత్ర జేయునుగదా అందువలన తప్పనిసరిగా ప్రతియొక్కడు, విశేషించి బ్రాహ్మణుడు గయా తీర్థము చేరి, ఏకాగ్ర బుద్ధియై, విధి పూర్వకముగా పిండ ప్రదానము చేయవలెను. గయా క్షేత్రమునందు పిండ ప్రదానము చేయు మానవులు మిక్కిలి ధన్యులు. వారివలన వారి తల్లితండ్రుల వంశములు రెండును ఏడుతరములు తరింపబడుటేకాక స్వయముగా వారును సద్దతీ పొందుదురు.

మరొక ఉత్తమ తీర్థము ప్రభోసమను పేరుతో విఖ్యాతమైనది. అది సిద్ధపురుషుల ఆవాసస్థలము. అచట భగవంతుడు శంకరుడు నిలిచి యున్నాడు. అచట స్నానము, తపము, శ్రాద్ధము, బ్రాహ్మణారాధన చేయుటచే, శాశ్వతము ఉత్తమమగు బ్రహ్మలోకమును పొందుదురు. శ్రియంబకమను తీర్థము సర్వదేవతలచే పూజింపబడినది. అచట రుద్రుని పూజించి, జ్యోతిష్ణోమఫలమును పొందును. బంగారుపన్నెగల కన్నుల మహాదేవుని, కపర్దిని శివుని బాగుగా అర్చించి, బ్రాహ్మణులను పూజించినయెడల గాణాపత్యము (ప్రమధగణములలో ప్రధానత్వము) లభించును. ఇది ధ్రువము, భక్తులననుగ్రహించు రుద్రునీ సోమేశ్వరమను ఉత్తమ తీర్ధము సకలవ్యాధులను నివారించును. పుణ్యప్రదము. ఇదీ రుద్ర సాలోక్యమును కలిగించుటకు ఉత్తమ సాధనము.

అన్ని తీర్థములలో ఉత్తమమైనది, శుభకరమైనది విజయనామకతీర్థము. అచ్చటి శివలింగము 'విజయ'నామముతో ప్రసిద్ధము. అచట ఆరుమాసముల పర్యంతము, నియతాహారుడై, బ్రహ్మచర్యమును పాటించుచు, ఏకాగ్రబుద్దితో, గడి పెడి ఉత్తమవిప్రుడు పరమపదమును తప్పక చేరును. తూర్పుదిక్కున అత్యంతరమణీయమైన ఉత్తమ తీర్థము మరియొకటి గలదు. అది ఏకామతీర్థము. దేవదేవుడు శివుడున్నతీర్థము. అది గోణాపత్యస్థలప్రదమగు తీర్థము. అచట, శివభక్తులగువారికి ఏకొంచెమైనను స్థిరమగు భూఖండము దానము చేసినవాడు, సార్వభౌమాధికారము పోందగలడు. మోక్షార్గెమోక్షమునే పొందును. పవిత్రమగు, సర్వపాపవినాశకమగు అచ్చటి మహానదీజలమున గ్రహణకాలమున స్నాన జపాదులు నిర్వర్తించినవాడు సర్వపాపములనుండి, వెంటనే ముక్తుడగును.

మూడు లోకములలో ప్రసిద్ధి పొందిన విరజయను మరొక నది కలదు. ఈనదిలో స్నానము చేసిన విప్రుడు బ్రహ్మలోకమున మన్ననలందును. శ్రీమన్నారాయణుని పురుషోత్తమమను ఇంకోక తీర్థము గలదు. అచట పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు వసించును. ఆ తీర్ధమున స్నానము చేసిన ద్విజోత్తముడు శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులను పూజించుచో, విష్ణులోకమును చేరును. అన్నీ తీర్థములలో పరమ తీర్థము గోకర్ణమనునదీ సుప్రసిద్ధము. ఇది సర్వపాపహారము. పరమేష్ఠిఅయిన శంకరుని నివాసస్థానము. గోకర్ణక్షేత్రమును అచటి పరమోత్తమమగు, ఈశ్వరుని లింగమును దర్శించి సకలాభీష్టములు పొందును. రుద్రునికి ప్రీతి పాత్రుడగును. ఉత్తర గోకర్ణమునగూడ, త్రిశూలధారియగు శంకరుని లింగము గలదు. ఆ లింగమును అర్చించినవారు శివ సాయుజ్యమును పొందుదురు.

ఉత్తరగోకర్ణమున మహాదేవుడు స్థాణువను పేరుతో ప్రసిద్ధుడు. ఆ స్థాణువును దర్శించినవారు ఆక్షణములోనే అన్ని పాపములనుండి విముక్తులగుదురు. మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు వసించు దివ్యక్షేత్రము కుబ్జమమనుదీ కలదు. అచట శ్రీ మహావిష్ణువును పూజించినవారు శ్వేతద్వీమును పొందుదురు. ఇచట త్రిపురారియగు రుద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసి, దక్షుని వధించి, ఆదోష పరిహారమునకై శ్రీ మన్నారాయణుని ప్రతిష్ఠించెను. ఈ క్షేత్రమున ఒక యోజనపర్యంతము సిద్ధగణము, ఋషిగణము సేవించుచుండును. ఇచట శ్రీ మహా విష్ణువునకు పరమ పావనమైన ఆలయము గలదు. కోకాముఖమను మరియొక విష్ణుక్షేత్రము గలదు. ఈక్షేత్రమున మరణించినవాడు విష్ణు సారూప్యమును పొందును. శ్రీ మహావిష్ణువు మరియొక పవిత్రక్షేత్రము సాలగ్రామముగలది. ఈ క్షేత్రము విష్ణువుకు ప్రీతిని పెంచునది. పరమ పావనము, సీదులకు నివాసము, సుప్రసిద్ధమునగు అశ్వతీర్థమను మరియొక విష్ణుక్షేత్రము గలదు. ఇచట శ్రీమన్నారాయణుడు హయశీలుడను పేర విరాజిల్లుచున్నాడు.

పరమేష్ఠియగు బ్రహ్మతీర్థము మూడులోకములలో సుప్రసిద్ధము. సర్వపాపహరము పుష్కరమను తీర్థము. ఇచట మరణించినవారికి బ్రహ్మలోకము లభించును. ఈ పుష్కరతీర్థమును మనసులో స్మరించిన ద్విజునకు సకల పాపవిముక్తి గలిగి యింద్రునితో స్వర్గపోసము లభించును. ఈ తీర్థమున గంధర్వులు, యక్ష ఉరగరాక్షసులు, దేవతలు, సిద్ధ సంఘములు బ్రహ్మను సేవించుచుందురు. ఇచట స్నానము చేసి పరిశుద్ధుడై బ్రహ్మను పూజించి, బ్రాహ్మణులను పూజించి, బ్రహ్మ సాక్షాత్కారము పొందును. తరువాత బ్రహ్మకు నమస్కరించి, ఇంద్రలోకమునకు వెళ్లి, ఇంద్రుని దర్శించి ఇంద్రుని వంటి సౌందర్యము పొంది, సకలాభీష్టములు నెరవేర్చుకొనును.

బ్రహ్మాది దేవతలచే సేవింపబడిన సప్తసారస్వతమను ఉత్తమ తీర్థమొకటి కలదు. ఆ తీర్థమున శంకరుని పూజించి అశ్వమేధ ఫలమును పొందును. ఈ క్షేత్రమున మంకణకుడను శివభక్తుడు శివుని శరణుచేరి పంచాక్షరిని జపించుచు హరుని ఆరాధించుచుండెను. ఉత్తమమగు 'నమళ్ళీవాయ' అను పంచాక్షరమును జపించుచు తపస్సుతో ప్రజ్వలించేను. రుద్రుడువచ్చేనని తెలిసి ఆనందముతో నర్తించెను. ఆమునిని

రుద్రుడు నీవెందుకు నర్తనము గావించితివి అని అడిగేను. శంకరునిచూచి అతని మాటను వినికూడా మాటిమాటికి నృత్యము చేయుచుండెను. ఈశ్వరుడగు. శంకరుడు గర్వముతో నిండిన మంకణమునినీచూచి అతని గర్వము శమించుటకు తన శరీరమును చీల్చి భస్మరాశిని చూడుము. ఇది తపః ప్రభావము. నీలాంటి వారు ఇతరులు కూడా కలరు. నీవు తపోగర్వముచే ఇట్లు నృత్యము చేయుట తగదు. నేను నీకంటే తపస్సులో నృత్యములో కూడా అధికుడను. ఇట్లు ఆమునితో పలికి విశ్వద్రష్టయగు శంకరుడు పరమభావమున నిలిచి జగత్సంహారకుడగు రుద్రుడు నృత్యము చేసెను. అచట రుద్రుడు సహస్రశీరుడు సహస్రాక్షుడు, సహస్రపాదుడు, దంష్ట్రాకరాలవదనుడు, జ్వాలామాలి భయంకరుడుగా మారెను. మంకణకముని విరాట్రూపుని పార్వమున సుందరమగు విలాసము కలది. విశాలలోచన, పదివేలసూర్యుల సమానకాంతిగలది, ప్రసన్నవదన యగు సుందరియగు పార్వతిని చూచేను. శంకరుని చిరునవ్వుతో చూచుచు నిలుచున్నది. అద్బుత తేజోవంతురాలు. అట్లు శివుని విరాట్ రూపమును పార్వతిని చూచి భయముతో నిండిన మనసు కలవాడై వణుకుచు మునీశ్వరుడు మనోనియంత్రణముతో రుద్రాధ్యాయమును జపించుచు శిరసువంచి నమస్కరించెను.

అంత భక్తవత్సలుడు త్ర్యంబకుడగు ఈశ్వరుడు అతనికి ప్రసన్నుడై పూర్వరూపమును దొల్చెను. పార్వతీదేవి అంతర్ధానము చెందేసు. దేవదేవుడగు శివుడు భక్తుడగు మంకణమునిని స్వయముగా ఆలింగనము చేసుకొని నీవు భయపడవలదు, నీకేమీయవలయును అని పలికెను.

అంతట ఆముని త్రిపురసూదనుడగు గిరీశునికి నమస్కరించి సంతోషము నిండిన మనస్సుతో అడుగదలచినవానివలె ఇట్లు విజ్ఞాపన చేసెను. మహాదేవా నీకు నమస్కారము, మహేశ్వరా నీకు నమస్కారము. సకల జగమును వ్యాపించిన భయంకరమగు నీఘోరరూపమేమిటి? తమ ప్రక్కన ప్రకాశించుచు నిలుచున్న ఆమె ఎవరు? ఎందుకంతర్ధానము చెందెను ఇది తెలియగోరుచున్నాను. ఇట్లు పలుకగా ఆ మంకణకునితో మహేశ్వరుడగు హరుడు ఇట్లు పలికెను. ఆత్మయోగమును దేవిని గూర్చి తెలిపెను.

నేను సహస్ర నేత్రుడను. సర్వరూపుడను. సర్వతోముఖుడను. సర్వపాపములను దహించువాడను. కాలాన్నీ సృజించువాడను సకల చేత నాచేతనాత్మకమగు ఈ జగత్తు నాతోనే ప్రేరేపించబడును. వారిలో అంతర్యామిని నేనే. పురుషుడను నేను. పురుషోత్తముడను నేనే. ఈ నాపరమమాయే త్రిగుణాత్మకయగు ప్రకృతి, ఈ మాయే ఋషులచే శక్తి అనీ జగద్యోని అని సనాతనీ అని చెప్పబడుచున్నది. నేనే ఆమాయతో ఈసకల జగత్తును మోహింపచేయుచున్నాను. నన్నే శ్రుతి నారాయణుడు, పరుడు, అవ్యక్తుడు, మాయారూపుడు అనును. ఈ జగత్తును ఇట్లు ఎల్లపుడు నేనే నిలుపుదును. ఈ ప్రకృతితో 25వ తత్త్వమగు పురుషుని కలుపునది నేనే.

దేవుడు కూటస్థుడు సర్వవ్యాపి పరిశుద్ధుడు ప్రకృతితో కలిసి సకల జగత్తును సృజించును. ఈపురుషుడే బ్రహ్మ విశ్వరూపుడు పితామహుడు అని పిలువబడును. ఇట్లు నేను నీకు పరమాత్మ స్రష్టత్వమును చక్కగా తెలిపితిని. నేనొక్కడనే. నేనే కొలుడను ఆదిరహితుడను. సకల జగత్తును అంతము చేయువాడను. పరమభావమును స్వీకరించిన నన్ను పండితులు రుద్రుడందురు. నా మరియొక్క శక్తియే విద్యయనబడును. నీకు నా విద్యాస్వరూపమును నాస్వరూపమును చూపితినికదా, ఇట్లు తత్త్వములు మూడు ప్రధానము పురుషుడు ఈశ్వరుడు అని. శ్రుతి వీటినే విష్ణువు బ్రహ్మ కాలరూపుడగు రుద్రుడని చెప్పినది. ఆద్యంతములు లేనీ ఈ మూడు బ్రహ్మయందుండునవే. శ్రుతి ఈమువ్వురిని తదాత్మకమని అవ్యక్తమని అక్షరమని చెప్పుచున్నది. ఆత్మానందరూపము, పరమతత్త్వము, చీన్మాత్రము, పరమ పదరూపము ఆకాశము నీష్కల బ్రహ్మము అనబడును. ఈశ్వరునికంటే భిన్నమగు పరమతత్త్వము మరియొకటిలేదు. ఇట్లు నాస్వరూపము తెలిసీ నీవు భక్తి యోగము నాశ్రయించి నన్ను పూజించుము. నమస్కరించుము. అపుడు పరమపురుష దర్శనము కాగలదు.

భగవంతుడు ఇంతమాత్రము చెప్పి అంతర్ధానము చెందెను. మంకణముని ఆక్షేత్రముననే భక్తి యోగముతో రుద్రుని ఆరాధించెను. కావున ఈ క్షేత్రము పవిత్రము సాటిలేనిది బ్రహ్మరులు సేవించినది. కావున పండితుడగు బ్రాహ్మణుడు ఈతీర్ధమును సేవించి అన్ని పాపముల నుండి విముక్తి పొందును.

ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్ర సంహితలో ఉపరివీభాగమున 34వ అధ్యాయము.