కూర్మ మహా పురాణము

Table of Contents

4 - అథ ప్రాకృతసర్గః

ప్రాకృత సర్గము -

సూతుడిట్లుపలికెను - సంపూర్ణమైన ఆశ్రమ విధానమునువిని సంతోషించిన మనస్సులుగల ఋషులు, నారాయణునికి నమస్కరించి మరల ఈ మాటలు పలికిరి.

నీచేత ఉత్తమమైన నాలుగు ఆశ్రమాల వివరమంతయు చెప్పబడినది. ఇప్పుడిక ప్రపంచము యొక్క ఉత్పత్తి విధానమును వినుటకు కోరుతున్నాము.

ఈ సమస్తము దేనినుండి పుట్టినది? దేనిలో నాశము పొందగలదు? ఈ యన్నిటిని నియమించు వాడెవడు? ఓ పురుషోత్తమా! మాకు తెల్పుము.

కూర్మరూపమును ధరించిన నారాయణుడు ఋషుల మాటనువిని, భూతములకు మూలకారణము, నాశములేనివాడు అగు అతడు గంభీరమైన వాక్కుతో ఇట్లు పలికెను.  

కూర్మస్వామి పలికెను :-

పరమేశ్వరుడు, పరమపురుషుడు, వ్యక్తముకానివాడు, నాలుగు వ్యూహములుకలవాడు, సనాతనుడు, అంతములేనివాడు, కొలుచుటకు శక్యముకానివాడు, అంతట వ్యాపించినపొడు, నియమించువాడు కూడ.  

   వ్యక్తరూపముకానీ కారణమేదో అది, నిత్యము, సత్తు అసత్తు రూపాలలో ఉండునది, దేనిని తత్త్వవేత్తలు ప్రధానమని, ప్రకృతి అని వ్యవహరింతురో;  వాసన, రంగు, రుచిలేని, ధ్వని, స్పర్శలచే విడువబడినది, ముసలితనము, తరుగుదల లేనిది, శాశ్వతము, ఆత్మయందే నిలిచిఉన్నది;  ప్రపంచమునకు మూలకారణము, మహాభూతస్వరూపము, అతిపురాతనము, పరబ్రహ్మరూపము, సమస్తభూతములకు మూర్తీవంటిది, ఆత్మచే అధిష్టించబడినది మహత్తత్వము.

ఆది, అంతములేనిది, పుట్టుకలేనిది, సూక్ష్మరూపము, త్రిగుణాత్మకము, ఉత్పత్తికారణము, నాశములేనిది, ఏకాంతము, తెలియరానిది అగు బ్రహ్మరూపము ముందుగా ఆవిర్భవించెను.

ఆత్మరూపుడైన ఆపురుషునియందు సత్త్వాది త్రిగుణముల సామ్యము సంభవించునప్పుడు, మరల విశ్వసృష్టిజరుగు పర్యంతము ప్రాకృత ప్రళయమని తెలియవలెను.

ఇది బ్రాహ్మీరాత్రి అనిచెప్పబడినది. ఇనుము మయమైన సృష్టిగా పేర్కొనబడినది. దానికి వ్యవహారరీత్యాపగలుకాని, రాత్రీకాని లేదు.

రాత్రి ముగిసిన తరువాత, లోకాలకు ఆదిపురుషుడు, మొదలులేనివాడు, సమస్తభూతమయుడు, అన్నీటియందు వ్యాపించిఉన్న పరమపురు షుడైన ఈశ్వరుడు మేల్కొన్నాడు.

మహేశ్వరుడు ప్రకృతిని, పురుషునిగూడ ప్రవేశించి శీఘ్రముగా తనశ్రేష్టమైన యోగబలముతో కలతచెందించెను.

పురుషులకు స్త్రీలకు మదము ఎట్లో, వసంతకాలపు మలయమారుతము ఎట్లో, యోగమూర్తినిధరించిన పరమేశ్వరుడు కూడ అట్లే ప్రవేశించి క్షోభమును కలిగించేను.

ఓ బ్రాహ్మణులారా! క్షోభింపజేయువాడు అతడే, క్షోభకుగురి అయ్యే పరమేశ్వరుడు కూడ అతడే. సంకోచ వికాసములనే కర్మల ద్వారా అతడు ప్రధాన కారకుడుగా నిలిచి ఉన్నాడు.

క్షోభింపజేయబడిన ప్రధాన తత్త్వమునుండి, పురాతనుడైన పురుషుని నుండి, ప్రధాన పురుష స్వరూపమైన గొప్ప బీజము ప్రాదుర్భ వించినది.

మహత్తత్వము, బుద్ధి, బ్రహ్మ ప్రబుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, ధృతి, స్మృతి, సంవిత్తు అనునవి యీప్రధాన పురుష బీజము నుండి కలిగినవి.

వికారజన్యమైనదీ, తేజస్సంబంధి, తామసమైన భూతాదీకము అని మూడు విధములైన అహంకారము మహత్తు నుండి ఆవిర్భవించినది.

అహంకారము, అభిమానము అనబడు ఈతత్త్వము కర్తగా, ఆలోచించునదిగా పేర్కొనబడినది. ఆత్మమత్పరమైన జీవుడని, దానివలన ప్రవృత్తులు జరగునని తెలియవలెను.

అహంకారము నుండి పంచభూతములు, తన్మాత్రలు కూడ జనించినవి. అన్ని ఇంద్రియములు, లోకమంతయుదానినుండి కలిగినదే.

మనస్సు అవ్యక్తతత్త్వము నుండి పుట్టినది. ఇది మొదటి వికారమని చెప్పబడినది. దానిచేత కర్తయగు పురుషుడు కలిగి భూతములు మొదలగు వానిని చూచుచున్నాడు.

వికారజన్యమైన అహంకారమునుండి వైకారిక సర్గము జరిగినది. ఇంద్రియములు తేజస్సునుండి జనించినవి. ఓ దేవతలారా! ఇవీ పది వికార జన్యములైన సర్గములు.

మనస్సు పదునొకండవది. అది తన స్వభావముచేత ఉభయ విధమైనది. బ్రాహ్మణులారా! పంచభూతములు, దానితన్మాత్రముల యొక్క సృష్టియైన యీ మనస్సు భూతాదుల నుండి పుట్టినది.

వికారమును పొందుచున్న భూతాదీకము మొట్టమొదట శబ్దమును మాత్రము సృష్టించెను. ఆశబ్దమునుండి ఆకాశముపుట్టుచున్నది. శబ్దము ఆకాశగుణమని గుర్తించబడినది.

ఆకాశము కూడ వికారమును చెందుచు స్పర్శమును మాత్రము సృష్టించెను. ఆస్పర్శనుండి వాయువు పుట్టినది. స్పర్శము వాయుగుణమని తెలియుదురు.

వాయువుకూడ వికారమును చెందుచు రూపమను తన్మాత్రను సృజించినది. పాయువువలన తేజస్సు పుట్టుచున్నది. అది రూపము గుణముగా కలదని చెప్పబడినది.

తేజస్సు కూడ వికారమును చెంది రసమను తన్మాత్రను సృజించినది. దాని నుండి జలములు పుట్టినవి. రసమునీటియొక్క గుణమే యున్నది.

జలములు కూడ వికారము పొంది గంధతన్మాత్రను సృష్టించినవి. గంధము నుండి సంఘాతము జనించినది. దానీకి గంధము గుణముగా గుర్తింపబడినది.

ఆకాశము శబ్దమాత్రను, స్పర్శమాత్రను ఆవరించెను. దానికి రెండురెట్లుగా వాయువు శబ్దస్పర్శాత్మకమైనది.

అట్లే శబ్దస్పర్శగుణములు రెండు, రూపము కూడ కలిగియున్న త్రిగుణాత్మకుడు అగ్ని అయినాడు.

శబ్దము, స్పర్శము, రూపము కూడ రసమను తస్మాత్రలో చేరగా జలములు శబ్దస్పర్శరూపరసములను నాలుగు గుణములు కలవైనవి.

శబ్దము, స్పర్శము, రూపము, రసము కలిసి గంధమునుచేరగా, భూమి శబ్దాది పంచగుణములు కలదిగా, భూతములన్నిటి యందు స్థూలమైనదిగా చెప్పబడుచున్నది.

ఆ పంచభూతములు శాంతములు, ఘోరములు, మూఢములు అని మూడు విశేషములు కలిగి యున్నవి. అవి ఒకదానిలో మరొకటి ప్రవేశించుటవలన పరస్పరము ఆధారమగుచున్నవి.

ఈయేడుగురు మహాత్ములు పరస్పరము ఆశ్రయించుకొని యుండుటవలన సంపూర్ణముగా మీలితము కాకుండా ప్రజలను సృజించుట కసమర్థులైరి.

పురుషునిచేత అధిష్ఠింపబడి యుండుటవలన, అవ్యక్తతత్వముయొక్క అనుగ్రహముచేతను మహత్తునుండి విశేషమువరకు గల తత్వములు బ్రహ్మాండమును పుట్టించుచున్నవి.

అది నీటి బుడగ వలె ఏకకాలములో సంభవించినది. విశేషములనుండి అండము కలిగినది. అది బృహద్రూపమై నీటిలో వసించును.

దానియందు పరమేష్టియొక్క కార్యము, కరణముకూడ సిద్దమైయుండును. ఆ అండము వృద్ధిపొందగా బ్రహ్మసంజ్ఞకలిగిన క్షేత్రజ్ఞుడు మొదటి శరీరధారిగా, పురుషుడుగా చెప్పబడువాడు, ప్రాణుల సృష్టికర్తయగు ఆ బ్రహ్మ అట్లు ప్రాదుర్భవించెను.

ఎవనిని ప్రధానముకంటే పరముగా నున్న పురుషుడని, హంసుడని, హిరణ్యగర్భుడు, కపిలుడు, ఛందోమూర్తీ, సనాతనుడు అని అందురో, అతడే ఆ బ్రహ్మ.

ఆ పరమాత్మకు మేరువు మావిగాను, పర్వతములు జరాయువుగాను, సముద్రములు గర్భోదకములుగాను ఆయెను.

ఆ అండంలో దేవతలు, అసురులు, మనుష్యులతోకూడిన ప్రపంచము, నక్షత్రాలతో కూడ సూర్యచంద్రులు, ఇతరగ్రహాలు, వాయువుకూడ ప్రభవించాయి.

పదిరెట్లు పరిమాణం కల నీళ్లచేత అండం ఆవరించబడింది. దానికి పదిరెట్ల పరిమాణపు తేజస్సుచేత వెలుపలి నుండి నీళ్లు కప్పబడ్డాయి. దానికి పదిరెట్ల వాయువుచేత తేజస్సుకప్పబడింది. ఆ వాయువు ఆకాశంచేత, ఆకాశము భూతములు మొదలగు వానిచేత ఆవరించబడ్డాయి.

దానివలెనే భూతాదులు మహత్తుచేత, మహత్తు అవ్యక్తముచేత ఆవరింపబడ్డాయి. ఓ మహాత్ములారా! ఈలోకాలు అన్నీ తత్త్వాన్ని అభిమానించేవి. దానిలో పురుషులు తత్స్వరూపులుగా నివసిస్తారు. యోగ స్వభావులు, తత్త్వచింతకులైన ఇతరులు కూడ నీయతులై ఉంటారు.

సర్వజ్ఞులు, రజోగుణము తొలగినవారు, ఎల్లప్పుడు సంతుష్టచిత్తము కలవారు, ఈశ్వరులగుపొరు ఆఅవ్యక్తతత్వంలో నివసిస్తారు. ఆ అండము ప్రాకృతములైన ఈఏడు ఆవరణాలతో కూడి ఉంటుంది.

ఓ బ్రాహ్మణులారా! ఇంతవరకే చెప్పుటకు వీలవుతుంది. ఈ మాయా స్వరూపము గహనమైనది. నాచేత బీజమని చెప్పబడినది యీ మాయ ప్రధానంగాకల కార్యరూపము.

ఈసమస్త బ్రహ్మాండము, సప్తలోక బలములతోకూడినది. సృష్టికర్త ప్రజాపతి యొక్క “పరామూర్తి” అని వేదములో వర్ణించబడినది.

ఆ దేవునియొక్క రెండవ శరీరభాగము, హిరణ్యగర్భుడుగా సువర్ణపు అండము నుండి పుట్టిన భగవంతుడగు బ్రహ్మదేవుడు.

వేదార్థము తెలిసిన పండితులు, రజోగుణమయమైన మరొకరూపము ఆ ధీమంతుడైన దేవుని మూడవరూపముగా చెప్పుదురు.

భగవంతుడైన చతుర్ముఖబ్రహ్మ లోకాలను సృష్టించుటలో నిమగ్నుడై ఉన్నాడు. అతనిచే సృజించబడిన సమస్త విశ్వాన్ని విశ్వరూపుడు, విశ్వవ్యాప్తుడు అయినట్టి విశ్వేశ్వరుడగు విష్ణువు సత్వగుణాన్నాశ్రయించి స్వయంగా కాపాడుతాడు. కల్పాంతంలో సర్వాత్ముడైన పరమేశ్వరుడు స్వయముగా తమోగుణాన్నాశ్రయించి రుద్రరూపుడై జగత్తును సంహరిస్తాడు. ఆమహాదేవు డొక్కడే అయినప్పటికి మూడు భిన్నప్రకారాలతో ఉంటాడు.

నిర్గుణుడు, నిర్వికారుడు అయినప్పటికి ఆభగవంతుడు సృష్టి, స్థితి లయములనే మూడుగుణాలతో ఒకడుగా, ఇద్దరుగా, ముగ్గురుగా, బహురూపుడుగా కూడ ఆయాగుణాలతో ఒప్పుచున్నాడు.

యోగేశ్వరుడైన ఆదేవుడు శరీరాలను సృష్టించుట, లయింపజేయుట, అనేక విధాలైన వికారాలకు గురిచేయుట అను పోటిని తనలీలలతో జరుపుతున్నాడు.

భక్తుల మేలు కొరకే ఆదేవుడు మరల లోకాలను మ్రింగుతున్నాడు. తనను మూడు ప్రకారాలుగా విభజించుకొని ముల్లోకాలలో ప్రవర్తిస్తున్నాడు.

ప్రపంచాన్ని సృజిస్తూ, దాన్ని కాపాడుతూ, చివరకు తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. సృష్టికర్మ, అనుగ్రహము, విలయము అనే మూడు కర్మలకు ప్రజలను వశం చేస్తున్నాడు.

పైమూడు విధాలైన గుణాలు కలిగిఉన్నందువల్ల ఆదేవు డొక్కడే అని చెప్పబడుతున్నాడు. మొదట అతడు సనాతనుడైన హిరణ్యగర్భుడుగా అవతరించినాడు.

ఆదిపురుషుడు కనుక ఆదిదేవుడని, జన్మలేనివాడు కనుక అజుడని, ప్రజలనందరిని రక్షిస్తున్నందువలన ప్రజాపతి అని అతడు చెప్పబడుతున్నాడు.

దేవతలలో గొప్పవాడు కనుక మహాదేవుడని, బృహత్త్వ గుణము వలన బ్రహ్మ అని, పరమ పురుషుడు కనుక పరమేశ్వరుడని పిలువబడు తున్నాడు.

తనకు తాను అధీనుడై ఉండుట, ఇతరులకు వశుడుకాకుండుటవలన ఇతడు ఈశ్వరుడని చెప్పబడుతున్నాడు. అంతట గమనం కలవాడై నందున ఋషిఅని, సమస్తమును తన అధీనంలోకి హరించేవాడు కనుక హరి అనీ చెప్పబడుతున్నాడు.

పుట్టుకలేకపోవుట, అన్నిటికి పూర్వమందే ఉండుట అనే కారణాలవలన అతడు స్వయంభువు అని చెప్పబడినాడు. మనుష్యులకు పొందదగిన మార్గస్వరూపుడు కనుక నారాయణుడుగా తలచబడుతున్నాడు.

సంసారబంధాన్ని నశింపజేసేవాడు కనుక హరుడని, అంతటా వ్యాపించి ఉన్నందువలన విష్ణువు అని చెప్పబడుతున్నాడు. సమస్త విషయ విజ్ఞానం కలవాడు కనుక భగవంతుడని, లోక రక్షణ చేయటంవలన ఓంకారస్వరూపుడని తలచబడుచున్నాడు.

సమస్త విజ్ఞానమయుడు కావున సర్వజ్ఞుడని, సర్వప్రపంచస్వరూపుడు కనుక సర్వుడని అతడు చెప్పబడుతున్నాడు. నిర్మల రూపుడైనందు వలన శ్రీవుడని, అంతటా వ్యాపించినందున విభువని పిలువబడుతున్నొడు.

సమస్త దుఃఖాలనుండి దాటించువాడు కనుక తారకుడని చెప్పబడుతున్నాడు. పెక్కు మాటలతో పనియేమి? ఈసమస్తలోకముకూడ బ్రహ్మమయమే.

ఆ పరమేశ్వరుడు అనేకాలైన భేదాలతో వేర్వేరు రూపొలతో క్రీడిస్తూ ఉంటాడు. ఈవిధంగా ప్రాకృత సృష్టి క్రమము నాచేత సంగ్రహంగా చెప్పబడింది.

ఓ బ్రాహ్మణులారా! బుద్ధిపూర్వకము కానీదానిగా ఈబ్రహ్మచేత చేయబడిన సృష్టిని తెలిసికొనండి. అవిద్యామూలమని భావము.

ఇది శ్రీకూర్మమహాపురాణంలో ప్రాకృతసర్గవర్ణన మనబడు నాలుగవ అధ్యాయము సమాప్తము.