కూర్మ మహా పురాణము

Table of Contents

31 - వారణాశి మాహాత్మ్యము

ఋషులిట్లు పలికిరి:

గొప్ప బుద్దికల కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని దివ్యమైన వారణాశి పురిని చేరి ఏమి చేసినాడు ? అది వినుటకు మాకు చాల కుతూహలముగా ఉన్నది.

సూతుడిట్లు బదులు పలికెను :-

మహాముని యగు వ్యాసుకు వారణాశిని చేరి గంగానది యందు స్నానమాడీ, ఆచమించి విశ్వేశ్వరుడైన శివుని పూజించెను.

ఆ వారణాశిలోనివసించు మునులు తమవద్దకు వచ్చిన వ్యాసమునిని చూచి, మునులలో శ్రేష్ఠుడైన అతనిని గౌరవముతో పూజించిరి

వారందరు ఆ మునికి నమస్కరించి, పాపములను నశింపజేయునది, శివునకు సంబంధించినదియు అగుకథను, అతిపురాతనములైన మోక్ష ధర్మములను తెలుపుమని ప్రశ్నించిరి.

అన్ని విషయములు తెలిసిన మహాత్ముడగు ఆ వేదవ్యాసఋషికూడ, దేవదేవుడగు శివుని గొప్పతనమును, ధర్మయుక్తమైన దానిని వేదమంత్రప్రదర్శనపూర్వకముగా వారికి తెలిపెను.

ఆ మునిశ్రేష్ఠులలో నుండి వ్యాసుని శిష్యుడు, గొప్పమునియునగు జైమిని, వ్యాసమునిని గూర్చి అనాది సిద్ధము, రహస్యము అగు తత్త్వమును గూర్చి యిట్లు ప్రశ్నించెను.

జైమిని పలికెను :

సర్వజ్ఞుడవైన ఓ మహాత్మా ! మా సంశయమునొకదానిని నివారించదగి యున్నావు. మహర్పులగు మీకు తెలియని విషయమేదియులేదు కదా !

కొంతమంది ధ్యానమును గొప్పదని పొగడుదురు. మరి కొందరు ధర్మమే శ్రేష్ఠమందురు. ఇతరులు సాంఖ్యము, యోగము, తపస్సు గొప్పవని వేరువేరుగా ఆయాఋషులు చెప్పుచున్నారు.

ఇతరులగు మహరులు బ్రహ్మచర్యమే నిశ్చయముగా గొప్పదని చెప్పుదురు. కొందరు అహింసను, ఇతరులు సత్యమును, మరికొందరు సన్న్యాసమును శ్రేష్ఠముగా గుర్తించుదురు.

కొంతమంది దయను ప్రశంసింతురు, దానమును, వేదాధ్యయనమును, తీర్ధయాత్రను, ఇంద్రియనిగ్రహమును ఉత్తమధర్మములుగా ఆయా పండితులు చెప్పుచున్నారు.

ఓ మునీశ్వరా ! పైన తెలిపిన వానిలో ఏది ఎక్కువశ్రేయస్కరమో తెలుపుము. ఇవి కాక మరేదైన రహస్య తత్త్వమున్నచో దానిని మాకు దయతో తెలుపుము

జైమిని యెక్క మాటనువిని కృష్ణద్వైపాయనుడగు వ్యాసమహాముని వృషభధ్వజుడైన శివునకు మనస్సులో నమస్కరించి గంభీరమైన కంఠధ్వనితో ఇట్లు పలికెను.

మహాత్ముడగు వ్యాసుడిట్లు పలికెను. ఓ మహానుభావా ! నీచేత అడుగబడిన విషయము చాలబాగున్నది. రహస్యములన్నింటిలో మిక్కిలి రహస్యమైన ఆ విషయమును చెప్పుదును. ఇతర మహర్షులుకూడ విందురుగాక.

ఈ అతిపురాతనమైన జ్ఞానమార్గము పూర్వము ఈశ్వరుని చేత చెప్పబడినది. ఇది చాల రహస్యమైనది. బుద్ధిమంతులు కానివారి చేత ద్వేషింపబడినది. సూక్ష్మదృష్టి కలవారిచేత సేవింపబడినది.

జ్ఞానములన్నిటిలో ఉత్తమ జ్ఞానమైన ఊరహస్యమును శ్రద్ధలేని వారికీయదగదు. శివుని యందు భక్తిలేనిపోనీకుపదేశింపదగదు. వేదములను తెలియనివానికీయదగదు.

త్రిపురాసురులకు శత్రువు, మహాదేవుడు అగు శివుడు మేరు పర్వత శిఖరమందుండగా, దేవాసనమునధిష్టించి యున్నపార్వతీదేవి శివుని ఇట్లు ప్రశ్నించేను.

దేవతలకు దేవుడవైన ఓ మహాదేవా ! భక్తుల బాధలను నశింపజేయువోడా ! లోకములో మనుష్యుడు నిన్ను శీఘకాలములో ఎట్లు దర్శింపగలడు ?

సాంఖ్యయోగము, తపస్సు, ధ్యానము, వేదప్రతిపాదితమైన కర్మయోగము కూడ అధిక శ్రమచేత సాధ్యములనిచెప్పుదురు. ఓ శంకరా ! ఇతరములైన ఉపాయములు కూడ అటువంటివే

యే ఉపాయముచేత భ్రాంతికి లోనైన మనస్సులు కల జ్ఞానవంతులైన యోగులకు, ఇతర సమస్త ప్రాణులకు గూడ సూక్ష్మరూపుడైన భగవంతుడు సాక్షాత్కరించునో, అటువంటి మిక్కిలి రహస్యమైనది, గూఢమైనదీ, బ్రహ్మమొదలగు వారిచేత సేవింపబడునది అగు జ్ఞానమును ఓ మన్మథ సంహారకా ! సమస్త భక్తుల యొక్క మేలు కొరకు మాకు బోధింపుము

ఈశ్వరుడిట్లు చెప్పెను.

ఈ జ్ఞానము, గూఢమైన అర్ధము కలది, అజ్ఞానుల చేత దూరము చేయబడినది; అందరికీనీ చెప్పదగనిది. దానిని నీకు, మహరులు, ప్రతి పాదించిన రీతిలో యధాతథముగా చెప్పుదును.

ఈ వారణాశి పట్టణము మిక్కిలి రహస్యమైన మహిమగలక్షేత్రము. ఇది నా నివాసస్థానము. సమస్త ప్రాణులను సంసారసముద్రము నుండి దాటించునది యీ క్షేత్రము.

ఓ మహాదేవీ! సో యొక్క భక్తులు, ఆ క్షేత్రమునందు నా వ్రతమునవలంబించిన మహానుభావులు, గోప్పనియమములను పాటించువారై వసింతురు.

సమస్తతీర్థములలో శ్రేష్టమైనది, ప్రదేశములన్నింటిలో ఉత్తమమైనది, జ్ఞానములలో శ్రేష్ఠమైన జ్ఞానస్వరూపము అయిన అవిముక్త క్షేత్రము నాకు చాలో ప్రియమైనది.

ఇతర స్థలములలో పవిత్రములైన తీర్థములు, స్థలములు ఆకాశమందలివి, భూమిపైనున్నవి అన్నియును శ్మశానరూపమైన అవిముక్త క్షేత్రములోనున్నవియే.

భూలోకముతో సంబంధములేక, అంతరిక్షములోనున్న నా నివాసస్థానము ముక్తులు కానివారు చూడలేరు. మోక్షమును పొందినవారు మనోదృష్టితో చూడగలరు.

ఈ అవిముక్తక్షేత్రము శ్మశాన మనుపేరుతో ప్రసిద్ధమైయున్నది. ఓ దేవీ! నేను ఇక్కడ కాలరూపుడుగ్గా మారి ప్రళయకాలములో ఈ లోకమును నశింపజేయుదును.

ఓదేవీ! ఈస్థలము అన్ని తత్త్వరహస్యములకు ఆధారము. ఇది నాకు చాల ప్రియమైనది. నా భక్తులు ఎక్కడికి వెళ్లినను వారు నన్నే చేరుకొందురు.

ఈ క్షేత్రములో చేసినదానము, జపము, హొమము, తపస్సు, ఇతరమైన పుణ్యకర్మ, ధ్యానము, చదువు, జ్ఞానము. అన్నియు నాశరహితములై యుండును.

పూర్వపు వేలకొలదీ జన్మలయందు చేయబడిన పాపము ఏదికలదో, అదియంతయు అవిముక్తక్షేత్రములో ప్రవేశించిన వానికి పూర్తిగా నశించును.

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వర్ణసంకరముకలవారు, స్త్రీలు, మ్లేచ్ఛులు, ఇంకను ఇతరులైన సంకీర్ణజాతులు, పాపకర్ములు ఎవరు కలరో, కీటకములు, చీమలు, ఇతరములైన మృగములు, పక్షులు అవీముక్తక్షేత్రములో అవసానకాలములో ప్రాణములు విడువగా;

ఓదేవీ! అక్కడ మంగళకరమైన నాపట్టణమందు అర్థచంద్రులు తలయందుకలవారు, మూడుకన్నులుకలవారు, గొప్పఎద్దు వాహనముగా కలవారును అగు మనుష్యులు జన్మింతురు.

అవిముక్తక్షేత్రములో మరణించిన యే పాపాత్ముడు కూడ నరకమునకు వెళ్లడు. అక్కడ మరణించిన అందరు కూడ ఈశ్వరుని అనుగ్రహమును పొంది మోక్షపదమును పొందుదురు.

మోక్షము మిక్కిలి కష్టముతో పొందదగినదని, సంసారము పోల భయంకరమైనదని తెలుసుకొని మనుష్యుడు తన పాదములను శీలతో ఖండించుకోని కాశీలో నివసించవలెను.

ఓ పరమేశ్వరీ! ప్రపంచములో ప్రాణికీ తపస్సుచేయు అవకాశము దుర్లభమైనది. అటువంటి లోకములో ఆపదను పొందినవానికి సంసారబంధమునుండి విడిపించు ఉపాయమైనది కాశీపట్టణవాసము.

పర్వతరాజపుత్రీ! సో అనుగ్రహమువలన మానవుల పాపమునశించును. ఈ విషయమును పండితులు కానివారు నామాయచే మోహితులై తెలిసికొనజాలరు.

తమోగుణముచే ఆవరింపబడిన యే అజ్ఞానులు అవిముక్తక్షేత్రమును చూడరో, వారు మలమూత్రములు, శుక్రముల మధ్య మాటిమాటికి ప్రవేశింతురు.

ఓదేవీ! ఎవడు వందల కొలదీ ఆటంకములచేత బాధింపబడుచు గూడ అవిముక్తమును ప్రవేశించునో, అట్టిపాడు దుఃఖమున కవకాశములేని పరమపదమును పొందును.

పుట్టుక, మరణము, ముసలితనములులేని శ్రేష్టమైన శివసాయుజ్యమును చేరును. మోక్షమును కోరుచున్న వారికి జననమరణములులేని గమ్యస్థానము అదియేకదా!

పండితుడైనవాడు అటువంటి అవిముక్తక్షేత్రమునుచేరి కృతార్థుడనైతినని తలచును. దానములచేతగాని, తపస్సులచేతకాని, యజ్ఞములచేత, పాండిత్యముచేతకాని;

అవిముక్తక్షేత్రములో వసించుటవలన కలుగునటువంటి శ్రేష్ఠమైన ముక్తిపదము లభించదు. అనేక వర్ణములవారు, వర్ణహీనులు, అసహ్యించు కొనబడు చండాలురు మొదలగువారు;

పాపములతో నిండిన శరీరములు కలవారు, బాధను కలిగించు గొప్ప రోగాదులతో కూడినవారెవరో, అట్టివారికి అవిముక్తము ఉత్త మౌషధమని పండితులు తెలిసికొందురు.

అవిముక్త క్షేత్రము గొప్ప జ్ఞాన రూపమైనది. అది సర్వశ్రేష్టమైన స్థానము. అవిముక్తము శ్రేష్ఠమైన తత్వ స్వరూపము, అది పరమ మంగళదాయకమైనదీ.

నిష్ఠతో కూడిన దీక్షను ధరించి ఎవరైతే అవిముక్త క్షేత్రములో నివసింతురో అటువంటి వారికి శ్రేష్ఠమైన ఆత్మజ్ఞానమును కలిగించి, చివరకు వారికి మోక్ష పదము ననుగ్రహింతును.

ప్రయాగక్షేత్రము, నైమిషారణ్యము, శ్రీశైలము, హిమాలయ పర్వతము, కేదారము, భద్రకర్ణము, గయ మరియు పుష్కరక్షేత్రము;

కురుక్షేత్రము, రుద్రకోటి, నర్మదానదీ, హాటకేశ్వరము, శాలిగ్రామము, పుష్పాగ్రము, వంశము మరియు కోకాముఖము కూడ

ప్రభాస తీర్ధము, విజయేశానము, గోకర్ణక్షేత్రము, శంకుకర్ణము అనునవి ముల్లోకములలో ప్రసిద్ధములైన పుణ్యస్థలములు.

కాశియందు మరణించిన వారు మోక్షమును పొందినట్లు పూర్వోక్త క్షేత్రములలో గూడ ముక్తిని పొందుదురు. వారణసి యందు విశేషముగా మూడు మార్గముల ప్రవహించునదగు గంగ కలదు.

గంగలో మునిగినంతనే వందల పూర్వజన్మలలో చేసిన పాపములను నశింపజేయును. గంగానది ఇతర స్థలములలో సులభముగా అందును. శ్రాద్ధము, దానము, జపము కూడా.

వ్రతములు, ఇవి అన్నియూ ఇతరత్ర పొందవచ్చును. వారణాసీ యందు పొందుట మిక్కిలి కష్టము. యాగము, హోమము ఎల్లప్పుడు చేయవలెను. దానము చేయుట, ఇతరులను పూజించుట;

వాయుభక్షణము చేయుచూ ఎల్లప్పుడు వారణాశి యందు నివసించు మనుష్యుడు, పాపాత్ముడైనను, మొండి వాడైనను అధార్మికు డైనప్పటికిని;

అతడు వారణాశిని చేరుకొని మూడు వంశములను పవిత్రము చేయును. ఎవరైతే పోరణాసీ యందు మహాదేవుడగు శివుని స్తోత్రము చేయుదురో, పూజింతురో;

వారు అన్ని పాపముల నుండి విడుదల పొందినవారై గణేశ్వరులగుదురని తెలియవలెను, ఇతర విధాల యాగము వలన కానీ, జ్ఞాన యోగము వలన, సస్యాసము వలన, మరే ఉపాయము వలన కాని;

పరమమైన ఆ స్థానము పొందబడదు, వేయి జన్మలతో గూడా అది సాధ్యము కాదు. ఎవరు మహాదేవుని యందు భక్తి కలవారై వారణాశి యందు నివసింతురో;

వారు ఒక్క జన్మముతోనే పరమమైన మోక్ష పదమును పొందుదురు. ఎక్కడ ఒక్క జన్మచేతనే యోగము, జ్ఞానము, మోక్షము లభించునో అది అవిముక్తము;

అవిముక్త క్షేత్రమును చేరి మరల ఇంకొక తపోవనమునకు వెళ్ళరాదు. అందువలన నాచేత అది విడువబడనిదై అవిముక్తమని ప్రసిద్ధమైనది.

అదియే రహస్యములలో మిక్కిలి రహస్యమైనది. దీనిని తెలిసికొని ముక్తిని పొందవచ్చును. సర్వోత్తమమైన ఆనందమును కోరుచు, జ్ఞానము నందు, ధ్యానము నందు నిమగ్నులైనవారికీ;

ఓదేవీ! ఏ పుణ్యగతి చెప్పబడినదో, అది అవిముక్త క్షేత్రములో మరణించిన వానికి లభించును. ఏవైతే అవిముక్త స్థలములుగా దేవతలచేత నిత్యముగా తెలుపబడినవో;

పొనిలో అన్నిటికంటే వారణాశి పట్టణము ఎక్కువ శుభదాయకమైనది. అచ్చట సాక్షాత్తుగా మహాదేవుడు నివసించుచున్నాడు. దేహావసానము కలిగినప్పుడు నేశరహితమైన స్థానమున ఈశ్వరుడు ఎచట తారక బ్రహ్మమును ఉపదేశించునో, అట్లే అవిముక్త క్షేత్రమును గూర్చి, అది అన్నిటి కంటే ఉత్తమమైన తత్త్వ స్వరూపము కావున అవిముక్తమని చెప్పబడుచున్నది;

దేవీ! ఒక్క జన్మతోనే వారణాశి యందు అది పొందబడును. కనుబొమ్మల మధ్య యందు, నాభి మధ్య భాగములో, రొమ్మునందు, శిరస్సు నందు కూడా;

సూర్యమండలము నందు ఉన్నట్లుగానే పొరాణసియను అవిముక్త క్షేత్రమందు ఆ పరతత్వము నీలిచియున్నది. వరణ మరియు అసి అనునదుల మధ్య వారణాశి అను పట్టణమున్నది.

అక్కడనే పరతత్త్వమైన అవిముక్తకము నెలకొని ఉన్నది. వారాణసీ కంటే శ్రేష్ఠమైన స్థానము ఇంతకు పూర్వము లేదు, ఇక ముందు ఉండబోదు.

భగవంతుడగు నారాయణుడు మహాదేవుడగు ఈశ్వరుని వలన నిలిచియున్నట్లు అక్కడ గంధర్వులు, యక్షులు, నాగులు రాక్షసులతో కూడిన దేవతలు;

నన్ను ఎల్లప్పుడు సేవింతురు. దేవదేవుడగు పితామహుడు అక్కడ వసించును. గొప్ప పాపము చేసినవారు, వారికంటే అధిక పాపాత్ములు కూడా ఎవరు కలరో;

వారు వారణాశిని చేరుకొని ఉత్తమమైన ముక్తి పదమును పొందుదురు. అందువలన మోక్షమును కోరుచున్న మానవుడు నియమబద్ధుడై మరణ పర్యంతము కాశిలో నివసించవలెను.

ఓ మహాదేవీ! వారణాశి పట్టణములో మనుష్యుడు జ్ఞానమును పొంది విముక్తుడగును. కాని పాపముచేత ఆక్రమింపబడిన మనస్సు కల మానవులకు ఆటంకములు కలుగును.

అందువలన శరీరముతోకాని, మనస్సుతోకాని, మాటతోకాని పాపమును చేయనే చేయరాదు. బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఇది వేదముల, పురాణముల యొక్క సారభూతమైన రహస్యము.

జ్ఞానమనునదీ అవిముక్త స్థలము నాశ్రయించి యున్నది. దానికంటే భిన్నమైనది ఏదియు నేనెరుగను. శ్రేష్ఠులైన దేవతలు, ఋషులు వినుచుండగా;

ఈశ్వరునిచేత దేవి కొరకు, అన్నీ పాపములను నశింపజేయునదగు ఈ జ్ఞానము తెలుపబడినది. దేవతలందరిలో పురుషోత్తముడగు సొరాయణుడు ఎటుశ్రేష్ఠుడో;

ప్రభువులందరిలో పరమేశ్వరుడెట్లు శ్రేష్టుడో, అట్లే అన్ని స్థానములలో అవిముక్తము ప్రశస్తతమము. ఎవరిచేతనైతే రుద్రుడు పూర్వజన్మమందే బాగుగా పూజింపబడేనో;

అట్టివారు శివునికి నివాసమైన అవిముక్తమును గొప్ప క్షేత్రముగా తెలిసికొందురు. ఎవరి యొక్క బుద్ధి కలియుగపు పాపముల ప్రభావముచే కలుషితమైనదో,

అటువంటి వారికి పరమేశ్వరుని యొక్క అవిముక్త స్థానము చూచుటకు శక్యము కాదు. కాల రూపుడైన శివుని ఎవరు ఎల్లప్పుడు సరింతురో వారు ఈ పురమును చేరుకొందురు.

వారికి ఈ లోకములోను, పరలోకములోను సంభవించిన పాపమంతయు నశించును. ఇక్కడ నివాసమేర్పరచుకొన్న వారు కూడా ఏ పాపముల నాచరింతురో,

వానినన్నింటిని కూడా కాల స్వరూపుడైన పరమశివుడు నశింపజేయును. మోక్షమునందు కోరిక గలిగి, సేవించుట కొరకు ఈ క్షేత్రమునకు వచ్చు వారికి,

ఇక్కడ మరణించిన వారికి మరల సంసార బంధమనెడు సముద్రములో పుట్టుకలేదు. అందువలన, అన్ని విధముల ప్రయత్నముతో మనుష్యుడు వారణాశిలో నివసించవలెను.

యోగము కలవాడు కానీ, అయోగి కాని, పాపాత్ముడైనను, పుణ్యవంతులలో శ్రేష్టుడైనప్పటికీ, జనుల మాట ననుసరించియైనను, తల్లిదండ్రులు లేక గురువు యొక్క మాటవలన కాని అవిముక్త క్షేత్రపు పుణ్యగతిని గూర్చి బుద్ధిని సంశయ మార్గమునకు మరలించగూడదు.” అని చెప్పి వేద విదులలో శ్రేష్ఠుడు, భగవంతుడు అగు వేదవ్యాసుడు శిష్య సమూహముతో గూడ వారణాసీ పట్టణమునందు సంచరించెను.

శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యము అనబడు ముప్పది యొకటవ అధ్యాయము సమాప్తము.