కూర్మ మహా పురాణము
38 - ప్రయాగ మహాత్త్యము
అరువది వేల తీర్థ స్థలములు, అరువది వందల పుణ్య తీర్థములను గూర్చి గంగా యమునా నదుల సంగమ స్థలము నందు జనులు మాఘ మాసములో వెళ్ళుదురు.
లక్ష గోవులను చక్కగా, విధి ప్రకారము దానము చేసిన దానికి ఏ ఫలము కలదో, మాఘ మాసములో ప్రయాగ క్షేత్రములో మూడు రోజులు స్నానము చేసిన వానికి ఆ ఫలము కలుగును.
గంగా యమునా నదుల మధ్య భాగములో కరీషాగ్నిని సంపాదించవలెను. అంగవైకల్యము లేనివాడు, రోగము లేనివాడు, అయిదు ఇంద్రియములతో కూడియున్నవాడు
అతని శరీరావయవములందు ఎన్ని రోమ కూపములు కలవో, అన్నివేల సంవత్సరాల కాలము ఆ మనుష్యుడు స్వర్గలోకములో సుఖముగా జీవించును.
తరువాత స్వర్గమునుండి క్రిందికి వచ్చి జంబూద్వీపమునకు ప్రభువగును. అతడు అనేకములైన భోగములను చిరకాలమను భవించి మరల ఆ తీర్థ స్థలమును చేరుకొనును.
లోకములో మిక్కిలి ప్రఖ్యాతమైన గంగా యమునల సంగమ ప్రదేశంలో ఎవడు మునిగి స్నానము చేయునో, వాడు చంద్రుడు రాహు గ్రహణము నుండి విముక్తుడైనట్లు అన్ని పాపముల చేత విడువబడును.
అతడు మరణానంతరము సోమలోకమునుచేరి అక్కడ 60వేల సంవత్సరాలు మరియు ఆరువేల సంవత్సరాల కాలము సోమునితో కూడా సంతోషముగా కాలము గడుపును.
తరువాత అతడు మునులచే, గంధర్వులచేత సేవింపబడు స్వర్గలోకమును పొందును. అక్కడ కొంతకాలము ఉండి భూలోకములో మరల సమృద్ధమైన వంశములో జన్మించును.
ఓ రాజా! అక్కడి నుండి తొలగిన మనుష్యుడు నిత్యాగ్నిహెూత్రి కాగలడు. భూమిపై బహుళములైన సుఖముల ననుభవించి మరల అదే తీర్థస్థలమును చేరుకొనును.
ఎవడు తన శరీరమును ఖండించుకొని పక్షులకు ఆహారముగా ఇచ్చునో, పక్షులచేత భుజింపబడిన ఆ నరునికి ఏ ఫలము కలుగునో దానిని కూడా వినుము.
అట్టివాడు నూరువేల సంవత్సరాల కాలము సోమలోకములో పూజింపబడును. తరువాత అక్కడి నుండి విముక్తుడై ధర్మ స్వభావము గల రాజుగా జన్మించును.
అతడు గుణవంతుడు, అందము కలవాడు, పండితుడు, ప్రియముగా మాట్లాడువాడుగా ఉండి, తాను భోగముల ననుభవించి ఇతరులకు దానముచేసి మరల ఆ తీర్థమునకు చేరును.
యమునా నదికి ఉత్తర తీరములో, ప్రయాగక్షేత్రమునకు దక్షిణభాగములో ఋణ ప్రమోచనము అను పేరు గల శ్రేష్ఠమైన తీర్థ స్థలము కలదు.
అక్కడ స్నానము చేసి, ఒక్కరాత్రి నిద్రించినట్లైతే స్వర్గలోకమును పొందును. అన్ని విధముల ఋణముల నుండి విముక్తుడై శాశ్వతముగా ఋణ హీనుడగును.
శ్రీ కూర్మ మహా పురాణములో ప్రయాగ మాహాత్మ్యము అను ముప్పది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
