కూర్మ మహా పురాణము

Table of Contents

39 - ప్రయాగ మహాత్త్యము

మార్కండేయముని యిట్లు చెప్పెను.

సూర్య భగవానుని పుత్రిక, ముల్లోకముల యందు ప్రసిద్ధ అగు మహాత్మురాలైన యమునా నది ఆ ప్రయాగలో గంగా నదితో సమాగమము పొందుచున్నది.

ఏ మార్గము ద్వారా గంగానది ప్రవహించుచున్నదో, అదే మార్గములో వేల యోజనముల దూరము. యమునా నది ప్రవహించుచున్నది. ఆ నది కీర్తించిన వారికి పాపములను నశింపజేయుమ.

  యమునా నది ఎక్కడ ప్రవహించునో, అక్కడ స్నానము చేసి, దాని జలమును త్రాగి మనుష్యుడు అన్ని పాపముల నుండి దూరుడై తన వంశము ఏడు తరముల వరకు పవిత్రము చేయును.

యమునా నది దక్షిణ తీరములో అగ్ని తీర్థమను పేరు కల పుణ్య స్థలము కలదు. అక్కడ ప్రాణములను విడిచిన మనుష్యుడు ఉత్తమ లోకములను పొందును.

యమునకు పడమటి దిశలో నరక నివారకమైన ధర్మ రాజతీర్థము కలదు. అక్కడ స్నానము చేసిన స్వర్గమును పొందుదురు. మరణించిన వారికి పునర్జన్మలేదు.  

కృష్ణ పక్షములో చతుర్దశినాడు స్నానముచేసి, పరిశుద్ధుడై యమధర్మరాజును తృప్తి పొందించిన యెడల పెద్దపాపముల నుండి కూడ వీడువబడుననుటలో సందేహము లేదు.

పదివేల పుణ్యతీర్థములు, ఇతరములైన పదికోట్ల సంఖ్యగల తీర్థములు ప్రయాగ క్షేత్రములో నిలిచి యున్నవని విద్వాంసులైన వారు చెప్పుదురు.

మూడున్నరకోట్ల తీర్థస్థానములిక్కడ కలవని వాయుదేవుడు చెప్పెను. స్వర్గమునందు, భూమిమీద, ఆకాశములో కూడా అంతటను జాహ్నవి గంగ వ్యాపించియున్నది.

ఎక్కడనైతే పవిత్రమైన గంగానది ప్రవహించుచున్నదో, ఆ ప్రదేశము తపోవనము వంటిది. గంగానది యొక్క తీరము నాశ్రయించియున్న స్థలమును సిద్ధ క్షేత్రముగా తెలియవలసియున్నది.

ఎక్కడనైతే మహాదేవుడగు మహేశ్వరుడు విష్ణుమూర్తితో కూడా కలిసి నివసించుచున్నాడో ఆ ప్రదేశము తీర్థ స్థలము, అది తపోవనమని తెలియవలెను.

ఈ యధార్థమైన విషయమును బ్రాహ్మణులకు, సజ్జనులకు తన కుమారునకు, మిత్రులకు, తన ననుసరించి వర్తించు శిష్యునికి గూడ చెవిలో ఉపదేశించవలెను.

ఈ క్షేత్రము ధన్యమైనది, ఇది స్వర్గమునకు సాధనమైనది. ఇది పవిత్రము మరియు మంగళకరమైనది. ఈ స్థలము పుణ్యదాయకము, మనోహరమైనది, తరింపజేయునది, శ్రేష్ఠమైన ధర్మ సాధనోపాయము.

మహర్షులకు సంబంధించిన యీ క్షేత్ర రహస్యము అన్ని పాపముల నుండి విముక్తులను చేయును. ఇక్కడ బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేసి నిర్మలత్వమును పొందగలడు.

ఎవడు ఈ పుణ్యమైన తీర్థమును గూర్చి ఎల్లప్పుడు శుచియై వినునో, అతడు పూర్వజన్మస్మృతిని పొందును. నీచ విషయముల యందభిరుచిని కలిగియుండడు.

శిష్టుల నాశ్రయించి జ్ఞానమును పొందిన వారిచేత, ఉత్తములచేత ఆ తీర్ధములు పొందబడును. ఓ యుధిష్ఠిరా! ఆ తీర్థములందు స్నానము చేయుము. విపరీత బుద్ధి కలవాడవు కావలదు.  

 పరమ పూజ్యుడైన ఆ మార్కండేయ మహాముని, ఈ విధముగా పలికి, భూమి మీద ఉన్నటువంటి మరికొన్ని తీర్థ విశేషములను గూర్చి చెప్పెను.

భూమి, సముద్రము మొదలగు వాని ఉనికి, గ్రహముల, నక్షత్రముల యొక్క స్థితిని, అతనిచే అడుగబడి సంపూర్ణముగా చెప్పి, మార్కండేయుముని వెడలిపోయెను.

సూతుడిట్లు చెప్పెను.

ఎవడు ఈ ప్రయాగ తీర్థ మాహాత్మ్యమును ప్రాతః కాలమున లేచి చదువునో లేదా వినునో వాడు అన్ని పాపముల నుండి విముక్తుడై రుద్ర లోకమును పొందును.

శ్రీ కూర్మపురాణములో ప్రయాగ మాహాత్మమను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.