కూర్మ మహా పురాణము

Table of Contents

13వ అధ్యాయము

వ్యాసుడు చెప్పెను.

భోజనముచేసి, నీరుత్రాగి, పడుకొనీ లేచి, స్నానముచేసి, దారిలోనడచి, రోమములు లేని పేదవిని తాకి, వస్త్రమును ధరించినపుడు రేతస్సు, మూత్రము, పురీషము విడచినపుడు, అయుక్తముగా మాట్లాడినపుడు, నిఫ్టీవనము చేసినపుడు, అధ్యయనారంభమున, దగ్గువచ్చినపుడు, ఆయాసము వచ్చినపుడు, సొల్లుదారుల కూడలినిగాని, స్మశానమునుగాని చేరినపుడు, ఉభయ సంధ్యలలోను మొదట ఆచమనము చేసియున్నను మరల ఆచమించవలయును. చండాలురతో, మ్లేచ్చులతో మాట్లాడినపుడు, స్త్రీలతో, శూద్రులతో, ఉచ్చిష్ట ముఖము గలవారితో మాట్లాడినప్పుడు, ఉచ్చిష్టుడైన పురుషునీ, ఉచ్చిష్టమైన భోజనము స్పృశించినపుడు, కన్నీరుగానీ, రక్తము గాని స్రవించినపుడు ఆచమించవలెను. భోజన సమయమున, రెండు సంధ్యలలో స్నానము చేసిన పిదప, మూత్ర పురీష ఉత్సర్గము తరువాత, నిదురించి లేచిన తరువాత, ఆచమనము చేసియున్నను మరల ఆచమించవలయును. ఇట్లే ఇతర సమయములలో కూడా ఆచమించవలయును.  

అగ్నిని గోవును స్పృశించినపుడు, పరిశ్రమ చేయుచున్నవానిని, స్త్రీని స్పృశించినపుడు, తనను తాను అవసరము లేనిచోట స్పృశించినపుడు, కటివస్త్రము ధరించినపుడు తన కేశములను స్పృశించినపుడు, ఉదకని వస్త్రములు స్పృశించినపుడు, జలమునుగాని, తృణమునుగాని, భూమినిగాని స్పృశించ వలయును.  

వేడిలేని, నురుగులేని, దోషములేని, జలముతో ధర్మానుసారి అయినవాడును. ప్రాజ్ముఖముగాగాని, ఉదఙ్ముఖముగా గానీ కూర్చుని ఆచమనము చేయవలయును. తలనుగానీ, కంఠమునుగాని, వంకరగా త్రిప్పినపుడు, శీఖోబంధము, కచ్ఛము వీడినపుడు పాద ప్రక్షాళనము చేయక ఆచమనము చేసినను అశుచియే యగును. పాదరక్షలు ధరించినవాడు, నీటిలో ఉన్నవాడు, తలపాగ ధరించి ఆచమనము చేయరాదు.న రధారలతోగానీ, నిలబడిగాని, తానుగా బయటికి తెచ్చిన జలముతో గాని, ఒక హస్తముతో అర్పీంచిన జలముతో గాని, యజ్ఞోపవీతము లేకుండగా గాని, పాదుకాసనమున కూర్చుండిగాని, మోకాళ్ల ముందరికి చేతులు వుంచిగానీ ఆచమనము చేయరాదు.

మాటలాడుచు, నవ్వుచు, ఇతరుల వంక చూచుచు, పడుకోని, వంగి ఆచమనము చేయరాదు. నీటిని చక్కగా చూచి, నురుగు మొదలగు దోషములు లేని వాటితో, శూద్రులు అపవిత్రులు కాని వారితో తెచ్చినవి, ఉప్పునీరు కాని పోటీతో ఆచమనము చేయవలెను. ప్రేళ్లతో శబ్దము చేయుచు, అన్య మనస్కముగా నుండి, వర్ణరస దుష్టములగు జలముతో, చిన్న మడుగులోని జలముతో, చేతులుంచి కలచిన నీటితో కక్షభ్రంశముతో, ఆచమనము చేయరాదు.

ఆచమన జలము హృదయము వరకు చేరినపుడు బ్రాహ్మణుడు, కంఠమున చేరినప్పుడు క్షత్రియుడు, నోటిలో పడగానే వైశ్యుడు, తాకినంత మాత్రమున స్త్రీలు శూద్రులు పవిత్రులగుదురు.  

అంగుష్ఠమూలమున రేఖలో ఉన్న జలమును బ్రహ్మ తీర్థమందురు. తర్జనీ అంగుష్ఠ మధ్య భాగమున ఉన్నదానిని పితృతీర్థమని, కనిష్ఠికా మూలమున ఉన్న తీర్థమును ప్రాజాపత్యమని యందురు. అంగుళి అగ్ర భాగమున ఉన్నదీ దైవ తీర్థము, ఋషి తీర్ధము అందురు. అంగుష్ఠ మూలమున ఉన్నను దైవము ఆర్షము అనవచ్చును. అంగుష్ఠ మధ్యమున ఉన్నచో అగ్ని తీర్థమందురు. దీనినే సౌమిక తీర్ఘమని కూడా అందురు. ఈ విధీ తెలిసినవాడు మోహమును చెందడు. ద్విజుడు బ్రహ్మ తీర్థముతోనే ఆచమనము చేయవలయును లేదా ప్రాజాపత్య తీర్థము, దైవ తీర్దముతోను చేయ వచ్చును. కాని పితృతీర్థముతో చేయరాదు. బ్రాహ్మణుడు సావధానుడై మొదట మూడుసార్లు ఆచమనము చేయవలయును. తరువాత అంగుష్ఠమూలముతో ముఖమును స్పృశించవలయును.

అంగుష్ఠ అనామికలతో నేత్రద్వయమును స్పృశించవలయును. తర్జనీ అంగుష్ఠములతో నాసికాపుటములను స్పృశించవలయును. కనిష్ఠికా అంగుష్ఠములు చెవులను స్పృశించవలెను. అన్ని ప్రేళ్లతోగాని, అరచేతితోగానీ హృదయమును స్పృశించవలెను. అట్లే శిరమును కూడా స్పృశించవలేను లేదా అంగుష్ఠముతో, రెండు వ్రేళ్లతో గాని స్పృశించవచ్చును. మూడు మారులు జలప్రాశనము చేసిన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సంప్రీతులగుదురు. పరిసర్జనము వలన గంగా యమునలు ప్రీతి చెందుదురు, నేత్రములను స్పృశించుట వలన సూర్య చంద్రులు ప్రీతులగుదురు.

నాసా పుటములు స్పృశించిన అశ్వినీ దేవతలు ప్రీతి చేందుదురు. కర్ణములు స్పృశించుటతో అగ్ని వాయువులు ప్రీతి చెందుదురు. హృదయమును స్పృశించుట వలన సర్వదేవతలు సంప్రీతులగుదురు. శిరస్సును స్పృశించుట వలన పురుషోత్తముడగు విష్ణువు ప్రసన్నుడగును.

 ఆచమన సమయమున శరీరమున పడు జలకణములతో శరీరము ఉచ్ఛిష్టము కాజాలదు. దంతముల మధ్యనున్న పదార్థములు దంతములకు సమానమగును. కానీ జిహ్వతో స్పృశించినపుడు మాత్రము అశుచియగును. ఆచమనము చేయించునపుడు పాదములపై పడిన జలబిందువులు భూమిమీద పడినట్లు భావించవలెను. వానితో అశుచికాజోలదు. మధుపర్కము గ్రహించినపుడు, సోమపానమున, తాంబూల భక్షణమున, ఫలమూల ఇక్షుదండ భక్షణమున (ఎవరి నుండి గ్రహించినా) దోషము లేదని మనువు చెప్పెను. మార్గమున నడుచుచున్నపుడు, ఉచ్చిష్ట స్పర్శచే దూషితమగు వస్తువు మనచేతిలో ఉన్నను, అట్లే అన్న భక్షణమున, పానీయ సమయమున ఆ వస్తువుతో జలమును స్వీకరించిన (ఆచమనము చేసిన) తరువాత భూమిపై ఉంచి, ఆ వస్తువులను ప్రోక్షించి తీసుకొని వెళ్ళవలయును.  

తైజసమును (ఘృతమును) తీసికొని బ్రాహ్మణుడు అన్నపానాదుల వలన ఉచ్చిష్టుడగుచు, ఆ ఘృతమును భూమిపై ఉంచి, ఆచమనము చేసి ప్రోక్షించవలెను. ఏదేని ఒక పాత్రను తీసికొనిన వ్యక్తి ఉచ్చిష్టుడగుచు, ఆ పాత్రను క్రింద పెట్టకనే ఆచమన మాత్రముననే శుద్దుడగును. వస్తాడుల విషయమున, స్పర్శ అయినపుడు (ఉచ్చిష్ట స్థితిలో) ఆచమనము చేయవలయును, అరణ్యమున, జలములేని ప్రాంతమున, రాత్రియందు, చోరవ్యాఘ్ర సంకుల మార్గమున ద్రవ్యహస్తుడై మూత్ర పురీష ఉత్సర్గము చేసినను అశుచి కాజాలడు. ద్రవ్యము కూడా, అపవిత్రము కాదు.

దక్షిణ కర్ణమున యజ్ఞసూత్రము ఉంచుకొని, పగలు ఉత్తరాభి ముఖముగా మూత్ర పురీష ఉత్సర్గము చేయవలయును. రాత్రీ దక్షిణాముఖముగా చేయవలయును. భూమిని కట్టెలతో, ఆకులతో, తృణములతో, మట్టిబెడ్డలతో కప్పి, శిరమునకు వస్త్రము చుట్టుకొని మలమూత్రములను విడువవలయును.  

తన నీడ పై, బావిలో, నదీలో, వాని సమీపమున, గోశాలలో, గ్రామదేవతా స్థానములలో, భస్మము పై, అగ్నిలో, స్మశానములో, మలమూత్రములు విడువరాదు. గోమయమున, దున్నిన భూమిలో, మహా వృక్ష సమీపమున, పచ్చిక పెరిగిన భూమిపై, పర్వతశిఖరముపై నిలబడిగాని, వస్త్ర రహితుడైగానీ మలమూత్ర విసర్జన చేయరాదు. జీర్ణదేవాలయమున. పుట్టపైన, ప్రాణులు చరించు బిలములలో, నడచుచు, మల మూత్ర విసర్జనము చేయరాదు. ధాన్యపు పొట్టుపై, మండుచున్న అగ్నిలో, మట్టి మూకుళ్లలో (యజ్ఞపురోడాశములు ఏర్పరచు కపాలములలో), రాజ మార్గమున, క్షేత్రమున, బిలమున, తీర్థమున, నాలుగు దారుల కూడలిలో, ఉద్యానాది సమీపము, చవుటీనేలలో, అతి అపవిత్రమగు ప్రదేశమున, మలమూత్రములను విడువరాదు. పొదరక్షలతో, ఛత్రములతో, అంతరిక్షమున, స్త్రీలకు అభిముఖముగా, గురు బ్రాహ్మణ గోవులకు అభిముఖముగా, దేవ దేవాలయ జలములకు అభిముఖముగా మల మూత్రములు వీడువరాదు.

నక్షత్రములను చూచుచు, సంధ్యాకాల సమయమున, సూర్యచంద్రాగ్నులకు అభిముఖముగా మలమూత్రములను విడువరాదు. సోమరితనము విడచి, నది నుండి గాని, చెరువు నుండిగాని మట్టిని తీసుకొని పరిశుద్ధమైన కూపాదుల నుండి తీసికొనిన జలముతో శౌచము సాచరించవలయును.

బ్రాహ్మణుడు ధూళీ నుండి, బురదనుండి, మట్టిని తీసికొనరాదు. మార్గము నుండి, చౌడు భూమీ నుండి, ఇతరులు శౌచము చేయగా మిగిలిన దాని నుండి, దేహాలయము నుండి, బావినుండి, గ్రామము నుండి, జలము నుండి, మట్టిని తీసికొన రాదు. శౌచము తరువాత పూర్వోక్త విధానము ననుసరించి ఆచమనము చేయవలయును.

ఇది కూర్మపురాణమున షట్ సాహస్ర సంహితలో ఉపరివిభాగమున పదమూడవ అధ్యాయము.