కూర్మ మహా పురాణము

Table of Contents

15 - దక్షయజ్ఞ విధ్వంసనము

నైమిశేయ మునులు పలికిరి :-

ఓ సూతుడా వైవస్వతమన్వంతరములోని దేవతల యొక్క దానవులయొక్క గంధర్వుల, నాగుల, రాక్షసుల యొక్క పుట్టుకను గూర్చి విపులముగా చెప్పుము.

శివునిచేత పూర్వము శపించబడిన దక్షుడు ప్రాచేతసుడను రాజుగా పుట్టి ఏమిచేసినాడు? గొప్ప బుద్దికల సూతుడా మేము దానిని ఇప్పుడు విన గోరుచున్నాము. సూతుడిట్లు చెప్పెను :

నారాయణునిచేత చెప్పబడినది, పూర్వకల్పమునకు సంబంధించినది, మూడు కాలములతో సంబంధము కలది, పాపములను నశింప జేయునది అగు ప్రజసృష్టి యొక్క విస్తరమును చెప్పుదును.

పూర్వము శివునిచేత శపించబడిన దక్షుడు ప్రాచేతసరాజుగా పుట్టి పూర్వపు విరోధ భావముతో శంకరుని దూషించి గంగా ద్వారమను ప్రదేశములో యజ్ఞమును చేసెను.

ఆ యజ్ఞములో భాగమును స్వీకరించుటకుగాను విష్ణువుతో సహ దేవతలందరు ఆహ్వానింపబడిరి. అందరు మునులతో కూడి మునీ శ్రేష్ఠులు అక్కడికి వచ్చిరి.

శివుడు లేకుండా అక్కడికి వచ్చిన సమస్త దేవతాసమూహమును చూచి దధీచుడను పేరుగల బ్రాహ్మణముని ప్రాచేతసుని గూర్చి ఇట్లు పలికెను.

దధీచుడిట్లనెను :-

బ్రహ్మ మొదలుకొని పిశాచముల వరకు కలవారందరు ఎవని ఆజ్ఞననుసరించి ప్రవర్తింతురో, అటువంటి భగవంతుడైన రుద్రుడు ఎందుకు శాస్త్ర విధితో పూజింపబడడు? దక్షుడు పలికెను :

అన్ని యజ్ఞములందు కూడా శివునికి భాగము కల్పించబడలేదు. భార్యతో కూడియున్న వానికి ఇవ్వదగిన యజ్ఞభాగము భార్యలేని శంకరున కీయదగదని అతనిని పూజించలేదు.

ఆ మాటలకు దధీచుడు కోపించి నవ్వుచూ, అందరు దేవతలు వినుచుండగా సమస్త జ్ఞానమయుడై ఈ మాటలు పలికెను.

ప్రపంచమే తన స్వరూపముగా కలవాడు, పరమేశ్వరుడైనవాడు, ఎవనివలన విశ్వము ప్రవర్తించుచున్నదో, అది తెలిసి సమస్త యజ్ఞముల చేత శంకరుడు పూజింపబడుట లేదా?

దానికి దక్షుడిట్లు బదులిచ్చెను. ఈ రుద్రుడు శంకరుడు కాడు. ప్రపంచమును నశింపజేయు తామసుడైన హరుడు. ఇంకను దిగంబరుడు, కపాలమును ధరించువాడు. ఇతడు విశ్వాత్ముడనుట పొసగదు.

లోకములను సృజించినవాడు ప్రభువైన నారాయణుడే ఈశ్వరుడు. అతడు సత్త్వగుణ ప్రధానుడు. అన్ని కర్మలయందు ఆ భగవంతుడు పూజింపబడును. దధీచుడిట్లు పలికెను :

సహస్ర కిరణములు కల భగవంతుడగు ఈ దేవుడు నీకు కన్పించుట లేదా? సమస్త లోకములను సంహరించుపోడు, కాల స్వరూపుడైన పరమేశ్వరుడీతడు. ఈ విశ్వములో పండితులు, ధార్మికులు, బ్రహ్మమును గూర్చి బోధించువారు ఎవనిని స్వీకరింతురో, అట్టి యితడు సర్వసాక్షి, తీవ్రమైన ప్రకాశము కలపోడు, కాల స్వరూపమైన శంకర సంబంధీ శరీర భేదము మాత్రమే.

ఈ రుద్రుడు మహాదేవుడు, కపాలమును ధరించువాడు, దయాశీలుడగు హరుడు. ఇతడే ఆదిత్యుడు, భగవంతుడగు సూర్యుడు, నల్లని కంఠము కలవాడు, విలోహితుడు.

సహస్ర కిరణములు కల సూర్యరూపుడగు దేవుడు సామ, యజుస్సులచేత ఋకూక్తములచేత స్తోత్రము చేయబడుచున్నాడు. విశ్వకర్మ, వేదత్రయరూపుడు, రుద్రరూపములోనున్న ఇతనిని చూడుము.

దక్షుడిట్లనెను.

ఈ పండ్రెండుమంది ఆదిత్యులు ఎవరైతే యజ్ఞములో భాగమును పొందుటకు వచ్చినారో, వారందరు సూర్యులని తెలియవలెను. వీరుకాక మరొక రవి లేడు.

దక్షుడిట్లుచెప్పగా, మునులందరు చూడగోరినవారై అక్కడికి వచ్చిరి. వారు అతనికి సహాయము చేయువారై దక్షునితో “అట్లే యని అంగీకారమును తెలిపేది.

వారందరు తమోగుణము ఆవరించీన మనస్సుకలవారై, వృషభధ్వజుడైన శివుని గమనించక, వందలు, వేలమార్లు మరల మరల సమస్త భూతపతి యైనశివుని, వైదిక మంత్రములను నిందించుచు, విష్ణువు యొక్క మాయ చేత మోహమును పొందినవారై దక్షుని వాక్యమును గౌరవించిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలందరు యజ్ఞభాగమునకు వచ్చినవారై నారాయణుడైన హరిని తప్ప, మహేశ్వరదేవుని చూడకపోయిరి.

హిరణ్యగర్భుడు, భగవంతుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అయిన బ్రహ్మదేవుడు అందరు చూచుచుండగనే క్షణకాలములో అంతర్ధానమాయెను. భగవంతుడైన బ్రహ్మ అదృశ్యముకాగా అప్పుడు దక్షుడు లోకములను రక్షించువాడు, దేవదేవుడైన నారాయణరూపియగు హరిని స్వయముగా శరణు పొందెను.

తరువాత ఆ దక్షుడు భయరహితుడై ఆ యజ్ఞమును కొనసాగించెను. శరణు పొందినవారిని కాపాడువాడు, భగవంతుడగు విష్ణువు యజ్ఞమునకు రక్షకుడుగా ఉండెను.

పూజ్యుడైన దధీచుడను ఋషి మరల ఆ దక్షునితో అక్కడ ఉన్న ఋషిగణాలను, దేవతలను, శివుని ద్వేషించు అందరినీ చూచుచు ఇట్లు పలికెను.

పూజింపదగని వారిని పూజించుట, పూజ్యులైన వారిని పూజింపకుండుట అను పనుల వలన మనుష్యుడు గొప్ప పాపమును పొందును. ఇందులో సందేహములేదు

ఎక్కడనైతే దుర్జనులను స్వీకరించి సాధువులను అవమానించుట జరుగునో, అక్కడ దైవముచేత చేయబడు శిక్ష భయంకరమైనదిగా ప్రవర్తించును.

ఇట్లు పలికి ఆ బ్రాహ్మణ ఋషి శివద్వేషులైన వారిని ఆ యజ్ఞమునకు వచ్చిన బ్రాహ్మణులను, దక్షునికి సహాయము చేయుచున్న వారిని ఇట్లుశపించెను.

ఏ కారణము వలన మీ చేత పరమేశ్వరుడైన శివుడు వేద సమ్మతమైన యజ్ఞమునుండి దూరము చేయబడినాడో, లోకముచే పూజింపబడు మహాదేవుడగు శంకరుడు మీ చేత దూషింపబడినాడో ;

ఆ కారణము వలన మీరందరూ వేదత్రయమునకు దూరులై, దుష్టములైన శాస్త్రములందోసక్తిగల మనస్సుతో కూడిన వారై ఈశ్వర సంబంధి మార్గమును నిందించిన శివద్వేషులుగా మీరు పుట్టగలరు.

అసత్యమైన సమాచారమును అధ్యయనముచేసినవారుగా, అయధార్థజ్ఞానమును గూర్చి మాట్లాడు వారుగా, భయంకరమైన కలియుగమును పొంది, కలి జన్యములైన దోషములచేత పీడింపబడు వారుకాగలరు.

మీరు తపస్సుచేత సంపాదించిన బలమును పూర్తిగా వదులుకొని నరకలోకములకు వెళ్లుడు. మీచేత ఆశ్రయింపబడిన ఆ విష్ణువుకూడ మీకు వ్యతిరేకుడు కాగలడు.

ఇట్లు పలికి బ్రాహ్మణ ఋషి అగు తపోనిధీ దధీచుడు చాలించేను. తరువాత సమస్త పాపములను నశింపజేయునట్టి రుద్రుని, మనస్సుతో చేరుకొనెను.

ఈ లోపల మహాదేవి, సమగ్రదృష్టి కలదై మహేశ్వరుడైన మహాదేవుని, పశుపతిగా, ప్రభువైన దేవునిగా తెలిసికొని యిట్లుపలికెను.

ఓ శంకరా!  పూర్వజన్మలో నాకు తండ్రియగు దక్షుడు, మీ గొప్పతనమును నిందించి, నన్నుగూడ దూషించి యజ్ఞముతో దేవతలను పూజించినాడు.

ఆ యజ్ఞములో దేవతలు, మహర్షులు కూడ అతనికి సహాయకారులుగా ఉండిరి. ఆ యజ్ఞమును శీఘ్రముగా నశింపజేయుము. నేనీ వరమును కోరుకొనుచున్నాను.

ఈవిధంగా దేవిచేత విన్నవింపబడిన దేవదేవుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞమును నశింపజేయు కోరికతో వెంటనే రుద్రుని సృజించెను. ఆ రుద్రుడు వేయితలలు కలిగి, కోపముతో కూడిన వాడై, వేయికన్నులు కలిగి, గొప్పభుజములు వేయి చేతులు కలిగి, ఇతరులచేత ఎదిరించశక్యముకానివాడు, ప్రళయకాలపు అగ్నితో సమానుడైయుండెను.

కోరలతో భయంకరుడై, చూచుటకు శక్యముకానీవాడుగా, శంఖమును చక్రమును ధరించినవాడు, ప్రభువు,చేతియందు దండముకలవాడు, పెద్ద ధ్వనిచేయువాడు, శార్ఙ్ఞమును ధరించినవాడు, భస్మము అలంకారముగా కలవాడుగా ఆ రుద్రుడుండెను.

దేవదేవుడైన ఈశ్వరునితో కూడి వీరభద్రుడని ప్రసిద్ధుడైన రుద్రుని సృజించగా, అతడు పుట్టిన వెంటనే, చేతులు జోడించినవాడై దేవతలకు ప్రభువైన పరమేశ్వరుని వద్దకు చేరెను. పరమశివుడు ఆ వీరభద్రునితో ఇట్లనెను. “నీవువెళ్లి దక్షుడు చేయు యజ్ఞమును భంగము చేయుము, నీకు శుభముకలుగుతుంది. ఓ గణేశ్వరా  ఆదక్షుడు నన్ను దూషించి గంగానదీ ముఖప్రాంతములో యజ్ఞము చేయుచున్నాడు.

తరువాత వీరభద్రునీ చేత బంధనము నుండి విడువబడిన ఒక సింహముచేత విలాసముతో వలె సులభముగా దక్షుని యజ్ఞము నాశము పొందెను.

శివుని పత్నియగు ఉమచేతకూడ క్రోధముతో మహేశ్వరి అను భద్రకాళి సృష్టించబడినది. ఆమెతో కూడ కలసి వీరభద్రుని గణము ఎద్దునెక్కి వెళ్ళెను.

బుద్ధిమంతుడైన వీరభద్రునిచేత, తనకు సహాయము చేయువారుగా రోమజులు అను పేరుతో ప్రసిద్ధులైన ఇతరరుద్రులు వేలకొలది సృజింపబడిరి.

ఆ రుద్రులు శూలము, శక్తి గద అను ఆయుధోలను చేతులలో ధరించినవారు, కట్టలు, శిలలు చేతులందు కలవారు, ప్రళయకాలమందలి అగ్నితో సమానులు, పది దిక్కులయందు ధ్వనులను నింపుచున్నవాడు అయి ఉండిరి.

వారందరు తమభార్యలతో కూడి వృషభమునెక్కి యుండిరి. మిక్కిలి భయంకరరూపులై తమగణాధిపతి అయిన వీరభద్రుని చుట్టుచేరి దక్షుని యజ్ఞప్రదేశమును గూర్చి వెళ్లిరి.

వారందరు గంగాద్వారమను పేరుతో ప్రసిద్ధమైన ఆ ప్రదేశమును చేరుకుని, అధికమైన తేజస్సుకల దక్షుని యొక్క యజ్ఞముజరుగు చోటును చూచిరి. ఆ ప్రదేశము వేలకొలది దేవతాస్త్రీలతో నిండినది, అప్సరసల పాటలతో ధ్వనించునది, వేణుపు, వీణవంటి వాద్యముల ధ్వనితోకూడినది, వేదమంత్రోచ్చారణతో ప్రతిధ్వనించునదిగా ఉండెను.

ఋషులతో, దేవతలతో కూడ కూర్చుండియున్న దక్షప్రజాపతిని చూచి, వీరభద్రుడు రుద్రులతో గూడి నవ్వుచున్నవానివలె ఇట్లు పలికేను. మేమందరము అమీతమైన తేజస్సుకల శివుని యొక్క అనుచరులము - యజ్ఞములో భాగమును పొందు కోరికతో ఇక్కడికి వచ్చినాము. ఈ దక్షుడు మాకు కోరిన యజ్ఞభాగములనిచ్చుగాక

ఓ ముని శ్రేష్టులారా  “ఈ యజ్ఞములో భాగము మీకు మాత్రమీయదగినది, షకీయదగదు” అని ఎవరైనా మాయను ప్రయోగించినారా? తెలుపుడు.

దేవా ఊచుః-

ఎవడు ఆ విధముగా ఆజ్ఞాపించుచున్నాడో అతనిని గూర్చి మాకు తెలుపుడు. మేము అతనివలన విషయము తెలిసికొందుము. ఈ రీతిగా - గణనాధుడైన వీరభద్రునిచేత పలుకబడిన బ్రహ్మ మొదలగు దేవతలు ఇట్లు చెప్పిరి.

“యజ్ఞములో మీకు భాగమిచ్చువిషయములో ప్రమాణములైన మంత్రమును మేమెరుగము”. అని దేవతలనగా, మంత్రములు "దేవతలగు మీరు తమోగుణముచేత నష్టమైన మనస్సుకలవారు “యజ్ఞమునకు ప్రభువైన మహేశ్వరుని మీరు పూజింపరు - ఆయీశ్వరుడు సమస్త ప్రాణులకు అధిపతి. అందరు దేవతలు తన శరీరముగా కలవాడు హరుడు ”.

“అన్నివిధముల అభ్యుదయమును, కార్యసిద్ధిని కలిగించు ఆ శివుడు అన్ని యజ్ఞములందు పూజింపబడుచున్నాడు”. అని పలికి ఆ మంత్రములు మహేశ్వరుని మాయచేత చైతన్యమును కోల్పోయినవి.

ఆ మంత్రములు దేవతలను విడిచి తనస్థానములకు వెళ్లినవి, తరువాత పూజ్యుడగు ఆ భద్రుడు, భార్యతో, గణేశ్వరునితో కూడినవాడై.

బ్రాహ్మణ మునియగు దధీచుని తనచేతితో తాకుచు ఇట్లు పలికెను. బలముతో గర్వించిన మీచేత మంత్రములు ప్రమాణముగా గ్రహించబడలేదు.

ఏకారణముచే మీరట్లు చేసితిరో, అందువలన గర్వముకల మిమ్ములను బలాత్కారముగ నశింపజేయుదును. ఇట్లుపలికి ఆ గణ(శ్రేష్టుడు దక్షుని యజ్ఞశాలను కాల్చివేసెను.

ఇతర గణపతులు కూడ కోపించినవారై యూపస్తంభాలనుపెకిలించి విసరివేసిరి. ప్రస్తోత, హోతలతో కూడ యజ్ఞాశ్వమును గూడ,

వశము చేసుకొని, భయంకరరూపులై గంగాప్రవాహములోపడవైచిరి. వీరభద్రుడు కూడ మండుచున్న హృదయము కలవాడై, ఇంద్రుని యొక్క ఎత్తబడినచేతిని,

స్తంభింపజేసెను. ఇతరదేవతలు పోరుటకు పైకెత్తిని చేతులను గూడఅట్లే కదలకుండ చేసెను. ఆ వీరభద్రుడు తనచేతికొనతో సులభముగా భగునికన్నులను పెరికివైచి ;

పూష యొక్క దంతములను తన పిడికిలితో కొట్టి అతనిని పడవేసెను. అదేవిధముగా చంద్రదేవుని తనకాలిబొటనవేలితో విలాసముగా;

బలవంతుడైన ఆ గణాధిపతి నవ్వుచు బెదిరించెను. అగ్నిహోత్రుని రెండుచేతులను నరికి, నాలుకను విలాసముతో పెకలించీ ; ఓ మునీశ్వరులారా  అతడు మునులనుగూడ తనకాలితో శిరస్సులపై కొట్టేను. అట్లే గరుత్మంతునితో కూడ వచ్చుచున్న విష్ణువును గొప్పబలముకల అతడు ;

విష్ణువు చక్రమును స్తంభింప జేసి వాడీబాణములతో బాధించెను. గొప్పభుజములు కల గరుడుడు వచ్చి ఆ వీరభద్రుని గణమును చూచి;

తనరెక్కలతో అకస్మాత్తుగా కొట్టేను. తరువాత సముద్రము వలే ధ్వని చేసెను. తరువాత రుద్రుడు స్వయముగా వేలకొలది గరుడులను సృజించెను.

గరుత్మంతునికంటే అధికబలవంతులను సృజింపగా వారు గరుత్మంతుని తరిమివేసిరి. వారిని చూచి బుద్ధిమంతుడైన గరుడుడు గొప్పవేగముకలవాడై పారిపోయెను.

నారాయణుని - వీడిచి అతడు వెళ్లగా అది ఆశ్చర్య కరమాయెను. వినతా పుత్రుడైన గరుత్మంతుడు అదృశ్యముకాగా భగవంతుడైన బ్రహ్మదేవుడు ;

వచ్చి వీరభద్రుని, విష్ణువును గూడ పోరాటమునుండి విరమింపజేసెను. పరమేష్టియగు బ్రహ్మయందలి గౌరవభావము వలన, అతనిని ప్రసన్నునిగా చేసెను.

భగవంతుడగు శంభుడు స్వయముగా అక్కడికి వచ్చెను. దేవాధిదేవుడైన యీశ్వరుని సమస్తగుణములతో కూడి యున్న పార్వతిని చూచి భగవంతుడగు బ్రహ్మదేవుడు, దక్షుడు, దేవతలందరు ఈశ్వరుని అర్ధశరీరమును ధరించిన పార్వతీదేవిని విశేషముగా స్తుతించిరి.

దక్షుడు అనేక విధములైన స్తోత్రములతో, దోసిలి పట్టి నమస్కరించెను. తరువాత పూజ్యురాలైన దేవి నవ్వుచున్నదై, మహేశ్వరుడగు;  రుద్రుని గూర్చి ప్రసన్నమైన మనస్సుతో, దయకునిధివంటిది కాపున, “నీవే యీ లోకమునకు సృష్టికర్తవు, కాపాడువాడవు, శాసించువాడవు కూడ;

పూజ్యుడవైన నీచేత దక్షుడు మరియు దేవతలు కూడ దయ చూపబడదగినవారు.” అనిదేవి పలుకగా భగవంతుడు, జటాజూటము కలవాడు, నీలలోహితుడును అగు శివుడు నవ్వీ;

తనకు నమస్కరించుచున్న దేవతలను గూర్చీ , ప్రాచేతసుని గూర్చి కూడ ఇట్లు పలికెను. " దేవతలు మీరందరు వెళ్లుడు. మీకు నేను , ప్రసన్నుడనైనాను.

అన్ని యజ్ఞములయందును పూజింపదగిన నేను, విశేషముగా దూషింపబడుటకు తగను. దక్షుడా  నీవుకూడ, అందరినీ రక్షించగలనామాటను వినుము.  

లోకాధిపత్యముపై ఈ కోరికను వదిలి ప్రయత్నపూర్వకముగా నాభక్తుడవు కమ్ము. ఈ కల్పము యొక్క సమాప్తి కాగా నీవు నా దయవలన గణాధిపతివి కాగలవు.

అంతవరకు నా ఆజ్ఞవలన నీ అధికారబాధ్యతలయందు సుఖముగా ఉండుము. ఇట్లు పలికి భగవంతుడగు రుద్రుడు భార్యతో, అనుచరులతో కూడినవాడై ;

అధికమైన తేజస్సుకల దక్షునీకీ అదృశ్యుడాయెను. మహాదేవుడైన శివుడు అంతర్థానము చెందగా కమలసంభవుడైన బ్రహ్మ;

దక్షునుద్దేశించి, సమస్తలోకములకు మేలుకలిగించుమాటను స్వయముగా ఇట్లు పలికెను. వృషభధ్వజుడగు శంకరుడు నీకు ప్రసన్నుడుకోగా, ఇంక నీకీమోహమెందులకు?

ఆ దేవుడే స్వయముగా జాగరూకతతో నిన్ను రక్షించును. లోకములోని సమస్త ప్రాణులయొక్క హృదయములందు ఈ పరమేశ్వరుడు వసించుచున్నాడు.

ఎవనిని పండితులు, వేదములను ప్రవచించువారు, బ్రహ్మస్వరూపులైనవారు చూచుచున్నారో, అతడు సమస్త భూతములకు ఆత్మరూపుడు, బీజభూతుడు, ఉత్తమమైన గమ్యమైయున్నాడు.

దేవతలకు దేవుడైన ఆ మహేశ్వరుడు వేదసంబంధములైన మంత్రములచే కొనియాడబడుచున్నాడు. సనాతనుడైన రుద్రుని ఎవరైతే తమ హృదయపూర్వకముగా పూజింతురో;

శ్రద్ధాభావముతో కూడిన మనస్సుతో అర్చించుపొరు శ్రేష్టమైన పరమాత్మస్థానమును పొందుదురు. అందువలన ఆది మధ్యాంతములు లేని పరమేశ్వరుని గూర్చి తెలుసుకొని;

మనస్సుతో, కర్మతో, వాక్కుతో గూడ ప్రయత్నపూర్వకముగా పూజింపుము. ఆత్మవినాశనమును కలిగించు ఈశ్వరుని నిందను ప్రయత్న పూర్వకముగా విడిచిపెట్టుము.

ఈశ్వరనిందకుడైన వాని ఆక్రియలు సమస్తదోషములకు కారణములగుచున్నవి. గొప్ప యోగీశ్వరుడగు, రక్షకుడైన, నాశరహితుడైన యీ విష్ణువు; 

భగవంతుడైన రుద్రుడు, మహాదేవుడు. దానిలో సందేహములేదు - ఎవరైతే జగత్తునకు కారణభూతుడైన విష్ణువును ఈశ్వరుని కంటే వేరైన వానిగా తలతురో;

మోహమువలన, వేదమునందు విశ్వాసములేనందువలన అటువంటి మనుష్యులు నరకమునకు వెళ్లుదురు. వేదమార్గముననుసరించు వారు దేవుడైనశివుని, అట్లే నారాయణుని గూడ;

అభేదభావముతో చూతురు. అట్టివారు మోక్షమును పొందుదురు. ఎవరు విష్ణువో, అతడు స్వయముగా రుద్రుడే. ఎవడు శివుడో అతడు జనార్దనుడగు విష్ణువే.

అని తలచి ఆదేవుని సేవించవలెను. అట్టి వాడు ఉన్నతమైన గతిని పొందగలడు. ఈలోకమునంతటిని విష్ణువు సృజించుచున్నాడు. దానిని ఈశ్వరుడు కాపాడుచున్నాడు.

ఈవిధముగా ఈప్రపంచమంతయు శివనారాయణుల వలన పుట్టినది. అందువలన విష్ణువుయొక్క నిందను విడిచి శివునియందు కూడ శ్రద్దకలవాడవై;

బ్రహ్మవాదులైన వారికి శరణుపొందదగినపోడగు మహాదేవునాశ్రయింపుము, అప్పుడు. బ్రహ్మదేవుని మాటనువిని దక్షప్రజాపతి  గోవులకు ప్రభువు, చర్మమువస్త్రముగా ధరించిన ఈశ్వరదేవుని శరణుపొందెను. దధీచుని శాపాగ్ని చేత కాల్చివేయబడినయే ఇతర మహరులు కలరో;  మోహవశులై శివుని ద్వేషించుచు కలియుగమునందు జన్మించినవారై, బ్రాహ్మణకులములో జన్మించి, సమస్తమైన తపోబలమును విడిచిపెట్టిరి;  పూర్వజన్మ సంస్కారము గొప్పతనమువలన, బ్రహ్మదేవునిమాటవలన, శాపము నుండి విముక్తులై అందరు కల్పాంత కాలములో గౌరవము మొదలుగా గల నరకములయందు;  త్రోయబడుచు కొంతకాలముగడువగా, సూర్యునివంటి తేజస్సుకలిగిన, లోకములకు ప్రభువైన బ్రహ్మనుచేరి ఆబ్రహ్మదేవునిచే అనుజ్ఞపొందినవారై; .

దేవతలకు ప్రభువైన ఈశానుని పూజించి, తపశ్శక్తివలన శంకరుని అనుగ్రహమువలన మరల పూర్వము వలె అగుదురు.

దక్షయజ్ఞవినాశనముకు సంబంధించిన యీవిషయనుంతయు మీకు చెప్పబడినది. ఇక దక్షపుత్రికలందరి యొక్క సంతాన వివరములను వినుడు.

శ్రీ కూర్మపురాణములో దక్షయజ్ఞ విధ్వంసమను పదునైదవ అధ్యాయము సమాప్తము.