కూర్మ మహా పురాణము
28వ అధ్యాయము
వ్యాస మహర్షి పలికెను.
ఇట్లు ఆయుష్యములోని మూడవ భాగమును వానప్రస్థాశ్రమమున గడిపీ నాలుగవ ఆయుర్భాగమును సన్యాసముతో గడుపవలయును, అగ్నులను తనలో ఆరోపించుకొని సన్యసించవలయును. యోగాభ్యాస రతుడు, శాంతుడు బ్రహ్మ విద్యాపరాయణుడు కావలయును. మనసులో అన్ని వస్తువుల యందు విరక్తి కలిగినచో సంస్యాసమును కోరవలయును. విరక్తి కలుగకుండగా సన్యసించినచో పతితుడగును. ప్రాజాపత్యమును కానీ ఆగ్నేయీ యాగమును కాని ఆచరించి ఇంద్రియ నిగ్రహము పరిపూర్ణ వైరాగ్యము కలిగినచో సంన్యాసమును స్వీకరించవలయును.
సన్యాసులు జ్ఞాన సంన్యాసులు, వేద సన్యాసులు కర్మ సన్యాసులు అని మూడు విధములుగా నుందురు. సర్వ సంగ నిర్ముక్తుడై శీతోషాదులను సహించువాడై భయరహితుడై ఆత్మావలోకనము కలవాడు అనగా బ్రహ్మా నిష్టుడగు సన్యాసి జ్ఞాన సంన్యాసి యనబడును, ఆశలు లేనివాడై దానమును స్వీకరించక, ఇంద్రియ నిగ్రహము కలిగి మోక్షాసక్తితో ఎల్లపుడూ వేదమును మాత్రమే అభ్యసించుచుండు వాడు వేద సంన్యాసి యనబడును. అగ్నులను తనలో ఆరోపించుకొని, తాను చేయు అన్ని పనులను బ్రహ్మార్పణము గావించుచు మహాయజ్ఞముల సోచరించువాడు, కర్మ సంన్యాసి యనబడును. ఈ మూడు విధముల సంన్యాసములలో జ్ఞాన సంన్యాసి సర్వశ్రేష్టుడు, జ్ఞాన సంన్యాసికి చేయవలసినది ఉండదు చిహ్నము ఉండదు. మమకారము భయము లేనిపోడై శాంతుడు, శీతోష్ణోదీ ద్వంద్వరహితుడు, ఆకులను మాత్రమే భుజించువాడు జీర్ణకౌపీనమును ధరించువాడు కానీ నగ్నునిగాకానీ ఉండవచ్చును. ధ్యానతత్పరుడు కావలయును.
బ్రహ్మచారి, మిత భోజనుడుగా నుండవలయును. గ్రామము నుండి అన్నమును భిక్షగా తెచ్చుకొనవలయును. ఆధ్యాత్మము నందు ఆసక్తి కలవాడు, ఇతరాపేక్ష లేనివాడు మాంసాహారమును విడిచినవాడు కావలయును. ఇతర సాయమును కోరక తనకు శ్రానుగానే అన్నీ పనులను చేసికొనుచు ఆత్మ తుష్టి కొరకు లోకమున సంచరించవలయును. జీవనమును కాని మరణమును కొని అభినందించరాదు. కాలమునకై ఎదురు చూచు చుండవలయును. స్వామీ ఆదేశమును పరిపాలించవలయును. అధ్యయనము వాచకము శ్రవణము అన్నిటిని విడిచి పరమాత్మ యందు మనసు నిలిపినపోడు బ్రహ్మ స్వరూపమును పొందును. ఒంటి వస్త్రముతో కాని కౌపీనముతో కానీ ఉండవలయును. ముంత శిరస్కుడు కానీ శిఖి కానీ త్రిదండిగా, దానము తీసుకొననివాడుగా నుండవలయును. కాషాయ వస్త్రములను ధరించిన వాడుగా ఎల్లపుడు ధ్యాన యోగ. పరాయణునిగా ఉండవలయును. గ్రామాంతమున వృక్ష మూలమున కానీ దేవాలయమునకాని నివసించవలయును, శత్రుమిత్రులలో మానవ మానములలో కాని సమానముగా నుండవలయును. ఎపుడు భైక్ష్యముతో జీవించవలయును. ఒకరి అన్నమునే ఎపుడూ భుజించరాదు. మోహముతో కానీ సోమరితనముతోకాని ఒకరి అన్నమునే తీనీన యతికి నిష్కృతి ఏ శాస్త్రములోనూ వివరించబడలేదు. రాగద్వేషములు లేనివాడై బంగారమును మట్టినీ ఒకేరీతిగా భావించువాడై ప్రాణి హింసను చేయక, మౌనమును పాటించుచు దేనియందు స్పృహనుంచక యుండ వలయును. చక్కగా చూచి అడుగు వేయవలయును. వస్త్రముతో వడబోసిన నీరు త్రాగవలయును. నిజమునే మాట్లాడవలయును. మనో నిశ్చయమును ఆచరించవలయును.
వర్షాకాలమున తప్ప ఇతర కాలములలో ఒకే చోట నుండరాదు. నిత్యము స్నానమును శౌచమును ఆచరించుచు కమండలమును ధరించువాడు కావలయును. శుచీ కావలయును. ఎప్పుడు బ్రహ్మచర్యముతో ఉండవలయును. వన వాసరతి, మోక్ష శాస్త్ర రతి, బ్రహ్మ సూత్రి, జితేంద్రియత్వముండవలయును. దంభాహంకారములు లేనివాడు నిందా పైశున్యములను విడిచినవాడు ఆత్మజ్ఞానము ఆత్మగుణములు కలవాడగు, యతి మోక్షమును పొందును. ఎప్పుడూ సనాతనమగు ప్రణవ ముఖ్యమగు వేదమును అభ్యసించవలయును. ఈ వేదాభ్యాసమును స్నానము చేసి ఆచమించి పవిత్రుడై దేవాలయములలో చేయవలయును. ఎపుడూ యజ్ఞోపవీతము కలవాడు, శాంతాత్మ, కుశపాణి సావధాని ఉతికిన కాషాయ వస్త్రమును ధరించినవాడు, భస్మమును అలదినవాడు, అధి యజ్ఞమును చేయువాడు ఆది దైవమును జూచినవాడు వేదాంతములలో చెప్పబడిన ఆధ్యాత్మికమును కూడా అనగా ప్రణవ జపమును చేయవలయును. మనన శీలుడు బ్రహ్మచారియగు యతీ పుత్రుల వద్ద ఉంటూ నిత్యము వేదమునే అభ్యసించుచు పరమగతిని పొందును.
అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, ఉత్తమ తపస్సు, క్షమ, దయ, సంతోషము సన్యాసికి విశేష వ్రతములు. వేదాంత జ్ఞాన నిష్ణుడు కాపలయును. సావధానముతో పంచయజ్ఞముల నాచరించవలయును. ప్రతి దినము మూడు మార్లు స్నానము చేయుచు భిక్షాన్నముతో యాగములను చేయవలయును. ఆయా కాలాను గుణములగు హోమ మంత్రములను జపించవలయును. ప్రతిదినము వేదాధ్యయనము రెండు సంధ్యలలో గాయత్రీ జపమును చేయవలయును. ఏకాన్తమున పరమేశ్వరుని ధ్యానించవలయును. కామమును క్రోధమును ప్రతిగ్రహము విడువవలయును.
ఇది శ్రీ కూర్మపురాణమున షట్సాహస్రి సంహితలో ఉపరి విభాగమున 28వ అధ్యాయము.
