కూర్మ మహా పురాణము

Table of Contents

42వ అధ్యాయము

దేవతలచేత, ఆదిత్యులచేత, మునులచేత, గంధర్వులు మరియు అప్సరసలచేత శ్రేష్ఠులైన రాక్షసులందరి చేత ఆరథము అధిష్ఠింపబడినది ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, శక్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, అంశువు అనియు,

భగుడు, త్వష్ట, విష్ణుపు అనీయును ద్వాదశాదిత్యుల పేర్లు క్రమముగా తెలియవలెను. సూర్యుడు వసంతాది ఋతువుల యందు వరుసగా తన కిరణములచేత లోకములను సంతోషపరచును.

పులస్త్యుడు, పులహుడు, అత్రి, వసిష్ఠుడు, అంగిరసుడు, భృగువు, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మరియు క్రతువు జమదగ్ని మరియు కౌశికుడు అనుబ్రహ్మవాదులైన మునులు ఆ సూర్యభగవానుని వివిధములైన ఛందోరచనలతో క్రమముగా స్తోత్రము చేయుదురు.

రథకృత్తు, రథోజుడు, సుబాహుకుడు, రథస్వనుడు మరియు వరుణుడు, సుషేణుడు, సేనజిత్తు, మరియు తార్యుడు, అరిష్టనేమి, కృతజిత్తు, సత్యజితుడు అను నీ ముఖ్యులందరు దేవదేవుడైన సూర్యభగవానుని కిరణములను సంగ్ర హింతురు.

ఇక హేతి, ప్రహేతి, పౌరుషేయుడు, వధుడు మరియు సర్పుడు, వ్యాఘుడు, ఆపుడు, వాతుడు, విద్యుత్తు, దివాకరుడు బ్రహ్మోపేతుడు మరియు యజ్ఞోపేతుడును, ఓ బ్రాహ్మణవరులారా వీరందరు రాక్షసప్రవరులు క్రమముగా భాస్కరునికి ముందు భాగమున పయనింతురు.

వాసుకి, కంకనీలుడు, సర్పశ్రేష్ఠమైన తక్షకుడు, ఏలాపుత్రుడు, శంఖపాలుడు మరియు ఐరావతనామధేయుడు;

ధనంజయుడు, మహాపద్ముడు మరియు కర్కోటకుడు, కమ్బలుడు, అశ్వతరుడు అనువీరందరు వరుసగా ఈసూర్యభగవానుని వహింతురు.

తుంబురుడు, నారదుడు, హాహాహూహూ, మరియు విశ్వావసువు, ఉగ్రసేనుడు, సురుచి, అర్వావసువు, అపరుడు;  చిత్రసేనుడు మరియు ఊర్ణాయువు, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు అను ఈ పండ్రెండు మంది శ్రేష్ఠులైన గాయకులైన గంధర్వులు.

వీరు షడ్జము మొదలగు స్వరాలతో, వివిధములైన గానములతో క్రమముగా సూర్యునిగూర్చి పాడుచుందురు. అప్సరసలలో శ్రేష్ఠురాలైన ఋతుస్థల మరియు పుంజిక స్థల అను నామెయు;

మేనక, సహజన్య, ప్రహ్లిచ అను పేరుగల అప్సరస, అనుమ్లోచ, విశ్వోచి, ఘృతాచి మరియు ఊర్వశియును

పూర్వచిత్తియనునామె, రంభ, తిలోత్తమ అనువీరందరు వసంతాది బతువులందు క్రమముగా అనేక విధములైన నృత్యములతో సూర్యుని;

భగవంతుడైన, ఆత్మస్వరూపుడు, నాశరహితుడైన భాస్కరుని సంతోషింపజేయుదురు. ఇట్లు దేవతలు సూర్యునియందు రెండేసి నెలల కొలము నివసింతురు.  

తేజస్సులకుగని యైన సూర్యభగవానుని వీరందరు తమతేజస్సుతో తృప్తినొందింతురు. మునులు తమ ఛందోబద్ధములైన వాక్కులతో సూర్యుని స్తోత్రము చేయుదురు.

గంధర్వులు, అప్సరసలు తమ నృత్యములతో, పాటలతో సూర్యుని సేవింతురు. ముఖ్యులైన యక్షులు, భూతగణము కళ్లేపుత్రాడును ధరించుచున్నవి.

సర్పములు సూర్యభగవానుని ధరించుచున్నవి. రాక్షసగణములు నడుపుచున్నవి. వాలిఖిల్యులు రవికస్తమయము కల్గించుచున్నారు. వారు ఉదయకాలము నుండి సూర్యుని చుట్టుముట్టి యుందురు.

పూర్వము చెప్పబడిన వీరందరు తపింపజేయుదురు, వర్షము కురియింతురు, ప్రకాశింతురు, సంచరింతురు, సృజింతురు. ప్రాణుల యొక్క అశుభకర్మమును నశింపజేయుదురని చెప్పబడినారు.

వీరు సూర్యునితో కలిసి అనుచరులుగా ఆకాశమందు సంచరింతురు. వాయుసమానవేగముకల, స్వేచ్ఛాగమనముకల విమానమందు కూర్చుండి ఎల్లప్పుడు చరింతురు.

వర్షము కురిపించుచు, వేడిని ప్రసరించుచు, ఆహ్లాదమును కలిగించుచు క్రమముగా వీరు యుగముల యందు ప్రాణులను రక్షించుచుందురు.

 పూర్వముచెప్పబడిన దేవజాతుల వారియొక్క పరాక్రమము, తపస్సు, యోగబలము, ఆత్మబలము అనువాని ఆధారముగా ప్రభువైన సూర్యుడు ప్రకాశించును.

పగలు, రాత్రి అనుకాలవ్యవస్థకు ఆప్రజాపతియే కారణభూతుడు. ఆ సూర్యుడు పితరులను, దేవతలను, మనుష్యులు మొద వారిని ఎల్లప్పుడు ప్రీతిని పొందించును.

అక్కడ గొప్పదేవుడైన సూర్యుడు సాక్షాత్తు మహేశ్వరుడు. నల్లని కంఠముకలవాడు, సనాతనుడు అగు ఆ భగవంతుడు వేదవేత్తలగు విద్వాంసులకు సాక్షాత్కరించును.

ఆ యీభగవంతుడైన సూర్యదేవుడు, పరమేష్ఠి, ప్రజాపతికూడ. వేదముల నెరిగినవారు, వేద శరీరులగువారు సూర్యుని యందు పరమేష్టి, స్థానమును గుర్తింతురు.

శ్రీ కూర్మపురాణములో నలుబది రెండవ అధ్యాయము సమాప్తము,