కూర్మ మహా పురాణము
51 - అధ మన్వన్తరకీర్తనే విష్ణుమహాత్యమ్
ఋషులిట్లుపలికిరి :
గడచినవీ, రానున్నవి అగుయేమన్వంతరములు కలవో వానిని, ద్వాపరయుగములో వ్యాసునిగూర్చికూడ నీవు మాకుతెలుపుము.
వేదశాఖలయందు అనురాగము కలవారు, ధర్మార్దములను గూర్చిప్రవచించువారు, దేవదేవుడు, బుద్ధిమంతుడు అగు వ్యాసభగవానునకీ కలియుగములో ఎందరు శిష్యులుకలరు? ఓ సూతుడూ ఈ విషయములన్నిటినీ సంగ్రహముగా చెప్పుటకు తగుదువు.
సూతు డీట్లుపలికెను :
మొదట స్వాయంభువమనువు, తరువాత స్వారోచిషుడు, అనంతరము ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అనువారు క్రమముగా మనువులుగా అవతరించిరి.
ఈ యారుగురు మనువులు గతించినారు. ప్రస్తుతము సూర్యునీకుమారుడగు వైవస్వతుడు మనువుగా ఉన్నాడు. ఇది యేడవ మన్వంతర కాలము జరుగుచున్నది.
కల్పముయొక్క ఆదియందున్న స్వాయంభువ మన్వంతరమును గూర్చినాచేతచెప్పబడినది. దానితరువాత స్వారోచిష మనువుయొక్క వృత్తాంతమును చెప్పుదును తెలిసికొనుడు.
స్వారోచిషమన్వంతరములో దేవతలు పార్వతులు, తుషితులు అనువారుండిరి. రాక్షసులను మర్ధించిన విపశ్చిత్ అనువాడు దేవతల కింద్రుడుగా నుండెను.
ఊర్జుడు స్తంభుడు, ప్రాణుడు, దాంతుడు, ఋషభుడు, తిమిరుడు, అర్వరీవంతుడు అను ఏడుగురు సప్తర్పులుగా నుండిరి.
స్వారోచిషమనువుకు చైత్రకింపురుషాదులు పుత్రులుగా జనించిరి. రెండవ మన్వంతర వృత్తమిది తెలుపబడినది. ఇక ఉత్తముని గూర్చి వినుము.
మూడవ అంతరములో ఉత్తముడనువాడు మనువుగా నుండెను. శత్రువులను నిగ్రహించిన సుశాంతి అనువాడు ఆమన్వంతరములో దేవేంద్రుడుగా ఉండెను.
సుధ, మానము, సత్యము, శివము మరియు ప్రతర్దనము అను అయిదు వశవర్తులైన గణములు ద్వాదశకములని పేర్కొనబడినవి. రజస్సు, గాత్రుడు, ఊర్ధ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శకుడు అనువారు సప్తర్షులుగా నుండిరి.
తామసమన్వంతరములో దేవతలందరు దేవతల కష్టములను తొలగించువారుగా నుండిరి. సత్యశీలురు, మంచి బుద్ధి కలవారు ఇరువది యేడు గణములుగా నుండిరి.
నూరు యజ్ఞములు గుర్తుగా కల శిబి అనువాడు ఇంద్రుడుగా నుండెను. అతడు శంకరుని యందు భక్తి కలవాడు, మహాదేవుని పూజించుట యందు శ్రద్ద కలవాడుగా నుండెను.
జ్యోతిస్సు, ధాముడు, పృధక్కు కల్పుడు, చైత్రుడు, అగ్ని వసనుడు,పీవరుడు అనుపోరు ఆ మన్వంతరములో ఋషులుగా నుండిరి.
అయిదవ మన్వంతరములో రైవతుడనువాడు మనువుగా నుండెను. దానిలో రాక్షస నాశకుడైన విభుడను వాడు దేవేంద్రుడయ్యెను.
అక్కడ అమితములైన ఐశ్వర్యములు వైకుంఠ నాములైన దేవతా శ్రేష్ఠులు ఉందురు. ఈ దేవగణములక్కడ పదునాల్గు, పదునాల్గు చొప్పున వసింతురు.
హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధ్వబాహువు, వేదబాహువు, సుబాహువు, పర్జన్యుడు, మహాముని అను ఈ ఏడుగురు సప్తర్వులుగా ఆరైవత మన్వంతరములో వ్యవహరింపబడిరి. స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను నీ నలుగురు ప్రియవ్రతునకు సంబంధించిన మనువులుగా పేర్కొనబడినారు ఆరవ మన్వంతరములో చాక్షుషుడనువడు మనువుగా ఉండెను. ఓ బ్రాహ్మణులారా వినుడు.
అట్లే ఆ కాలములో మనోజవుడు ఇంద్రుడుగా నుండెను. అప్పటి దేవతలను గూర్చి వినుడు, ప్రభూత భవ్యులు, ప్రధనులు, దివోకసులు, మహానుభావులు, లేఖ్యులు అని అయిదు దేవగణములుండెను. విరజసుడు, హవీష్మంతుడు, సోముడు మనుసముడు, స్మృతుడు.
అవినాముడు, విష్ణువు అను ఏడుగురు అప్పుడు ఋషులుగా నుండిరి. సూర్యుని యొక్క కుమారుడు, గొప్పతేజస్సుకలవాడగు శ్రాద్ధదేవుడు అగుసంవర్తనుడు ప్రస్తుతము ఏడవమన్వంతరములో మనువుగా ఉన్నాడు. ఆ మన్వంతరములో ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, మరుద్గణములు దేవతలుగా సున్నారు.
శత్రువీరులను వధించు పురందరుడు ఇంద్రుడుగా నుండెను. వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు అను ఏడుగురు ఈమన్వంతరములో సప్తర్పులుగా ఉన్నారు. సాటిలేని విష్ణువుయొక్క శక్తి సత్త్వగుణముచే పెంపొందించబడినదై స్థితి కార్యమునందు నిమగ్నమైనది.
స్వర్గలోక నివాసులగు దేవతలందరు, భూమిమీది రాజులు కూడ ఆవిష్ణువు అంశము కలవారు. పూర్వకాలములో స్వాయంభువ మన్వంతరములో ప్రకృతి యందు సంకల్పమువలన జన్మించిన కుమారుడు
ప్రజాపతివలన రుచియందు అతని అంశతో జన్మించెను. తరువాత స్వారోచిష మన్వంతరము సంభవించగా మరల ఈదేవుడు తుషితయందు సంతోషించిన దేవతలతోకూడ ఉద్భవించెను. ఉత్తమ మన్వంతరములో దేవతా శ్రేష్టుడగు విష్ణువు సత్యులతోకూడ, సత్యరూపుడుగా సత్యయందు జన్మించెను. మరల తొమసుని మన్వంతరము సంప్రాప్తముకాగా విష్ణువు హరులనబడుదేవతలతోకూడ హర్యను స్త్రీయందు హారిగా జన్మించెను. దైవతమన్వంతరములో సంకల్పబలమువలన మానసుడగుహరి, మనసులైన దేవతలతో కూడ గొప్పతేజస్సు కలవాడుగా జన్మించెను. చాక్షుష మన్వంతరములో కూడ పురుషోత్తముడైన విష్ణువు, వైకుంఠులనబడుదేవతలతో గూడ వికుంఠయందు జన్మించెను. తరువాత వైవస్వతమన్వంతరము సంప్రాప్తముకాగా;
కశ్యపప్రజాపతివలన అదితియందు విష్ణువు వామనుడుగా జన్మించేను. ఏ మహాత్మునిచేత మూడడుగుల కోలతతో మూడు లోకములను జయించి, కంటకముల వంటి శత్రువులు లేకుండా ఇంద్రునికి అందజేయబడినదో, ఆ విష్ణువుయొక్క ఏడు మన్వంతరాలలో ధరింపబడిన శరీరములు ఈ విధముగా తెలుపబడినవి.
ఏడు మన్వంతరములలో ఏడు రూపములు ధరింపబడినవి. ఆ అవతరాములతో ప్రళయకాలములో ప్రజలు సంహరింపబడినారు. మహాత్ముడైన వామనునిచేత ఏకారణమువలన ఈ విశ్వము రక్షింపబడినదో, అందువలన దేవతలచేత అందరిలో విష్ణువు రాక్షస సంహారకుడని ప్రసిద్ధుడైనాడు. ఈ విష్ణుపు మొదట సమస్తమును సృజించును, తరువాత రక్షించును, చివరకు నశింపజేయును.
భగవంతుడగు నారాయణుడు సమస్త ప్రాణులకు అంతరాత్మయగు వాడని వేదము తెలుపుచున్నది. తనయొక్క ఒక్క అంశముతో లోకమునంతయు వ్యాపించి నారాయణుడు ఉన్నాడు.
వ్యాపకుడైన ఆ విష్ణువు గుణసహితుడుగా, నిర్గుణుడుగా కూడ నాలుగు విధముల నెలకొనిఉన్నాడు. భగవంతుని ఓకమూర్తి జ్ఞాన రూపము, మంగళకరము, నిర్మలమైనది.
ఆ మూర్తీ వాసుదేవ నామము కలది, గుణముల కతీతమైనది; మిక్కిలి భేదరహితముకూడ. రెండవమూర్తికాల సంజ్ఞ కలది, తమోగుణ సంబంధిని, శివ నామాంకితము.
అది అంతమున ప్రళయకాలములో సమస్తమును నశింపజేయు విష్ణువుయొక్క శ్రేష్ఠమైన శరీరము. సత్త్వగుణము ప్రధానముగా కల మూడవ మూర్తి ప్రద్యుమ్నసోమకమైనది మరియొకటీ కలడు.
ఆ మూర్తి నిశ్చలమైన విష్ణువు యొక్క ప్రకృతిరూపము. అది ప్రపంచమును రక్షణ ద్వారా ప్రతిష్టాపించుచుండును. వాసుదేవుని నాలుగవమూర్తి బ్రహ్మ అను సంజ్ఞకలిగి యుండును. రజోగుణ ప్రధానమైన ఆమూర్తి అనిరుధునీది. పురుషుల సృష్టి కర్మ నెరవేర్చును. సమస్తములను లయింపజేసి ప్రభువు నిద్రించును. అతడే నారాయణనాముడగు బ్రహ్మ ప్రజలను సృజించును ఈ నారాయణుని రూపము ప్రద్యుమ్ననామకము, శుభకరము.
నారాయణుడు ఆమూర్తితో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన విశ్వమును సంమోహపరుచును. అందువలన ఆరూపమే విష్ణువుయొక్క ప్రకృతి రూపమని చెప్పబడినది.
అనంతమైన ఆత్మలు కల వాసుదేవుడు, కేవలుడు, గుణరహితుడగు హరియైయున్నాడు. ప్రధానతత్త్వము, పురుషుడు, కాలము అను మూడు శ్రేష్ఠమైన సత్త్వత్రయమనబడును.
అది వాసుదేవస్వరూపము, నీత్యము కూడ. దీనిని తెలిసికొని ముక్తినిపొందును. ఈ తత్త్వము ఒక్కటైనను సోలుగు పాదములు కలది. అచ్యుతుడగు హరి మరల నాలుగు విధములుగా భిన్నరూపుడై ప్రద్యుమ్నభగవానుడు అవతారములను ధరించినాడు. కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడు స్వయముగా నారాయణ విష్ణు స్వరూపుడే.
భగవంతుడగు హరి తన ఇచ్ఛతో సంపూర్ణముగా అవతరించెను. ఆది, అంతములేని పరబ్రహ్మతత్త్వమైన నారాయణుని, దేవతలు, ఋషులు కూడ తెలియలేరు.
భగవంతుడగు సారాయణస్వరూపుడు వ్యాసమహర్షి ఒక్కడే దానిని తెలిసినవాడు. ఓ మునిశ్రేష్ఠులారా ఈ విధముగా విష్ణువుయొక్క మాహాత్మ్యము నాచేత చెప్పబడింది. ఇది సత్యము మరల మరల సత్యము దీనిని తెలిసికొని మోహమును పొందడు.
శ్రీ కూర్మపురాణములో మన్వంతరకీర్తనములో విష్ణుమాహాత్మ్యమను ఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.
