కూర్మ మహా పురాణము

Table of Contents

45 - అథభువనకోశే పర్వతాది సంఖ్యా

సూతుడిట్లు పలికెను.

పదునాల్గు విధములైన యీ గోప్ప బ్రహ్మాండమును గూర్చినాచేత చెప్పబడినది. ఇకముందు ఈ భూలోకముయొక్క వివరమును చెప్పబోవు చున్నాను.

ఈ జంబూద్వీపము ప్రధానమైనది. మరియు ప్లక్షము, శాల్మలి, కుశము, క్రౌంచము, శాకము, పుష్కరము అని మొత్తము ఏడు ద్వీపములు కలవు.

ఈయేడు మహాద్వీపములు సప్తసముద్రములచేత ఆవరింపబడియున్నవి. ఒక ద్వీపముకంటే మరొకద్వీపము, ఒక సముద్రము కంటే మరొకటి గొప్పవని చెప్పబడినది.

లవణ సముద్రము, ఇక్షు, సురా, ఘృత సముద్రములు, దధి, క్షీర, శుద్దోదకసముద్రములని ఇవి యేడు సముద్రములు ప్రసిద్దములు

ఏబదికోట్ల యోజనముల విస్తీర్ణము కలదిగా సముద్రసహితమైన భూమి పేర్కొనబడినది. యోజనవ్యాప్తి కల ద్వీపములతో అన్నివైపుల వ్యాపించి ఉన్నదీ. భూమి.

జంబూద్వీపము అన్ని ద్వీపములకు మధ్యభాగములో నున్నది. దాని మధ్యలో బంగారుకాంతి గల మహామేరుపర్వతము నిలిచియున్నది.

దానియొక్క వైశాల్యము ఎనుబది నాలుగువేల యోజనముల పరిమాణము కలది. క్రింది భాగము పదునారు యోజనాలు భూమి లోపలికి ప్రవేశించి, ముప్పది రెండు యోజనాలు శిఖర భాగములో విస్తరించి యున్నది.

దానిమూలభాగంలో పదునారువేల విస్తారము అన్నివైపుల కలిగి ఉన్నది. ఈభూమి అనే పదానికి ఈపర్వతము కర్ణికవలె ఉన్నది.

దీనికి దక్షిణ దిక్కున హిమవత్పర్వతము, హేమకూటము, నిషధము ఉన్నవి. ఉత్తరదిక్కున నీలము, శ్వేతము, శృంగీ అనే వర్షపర్వతా లున్నవి.

లక్ష యోజనముల ప్రమాణముకలవి రెండు మధ్యభాగములలో, తక్కినవి పది యోజనములు తక్కువగా కలిగినవి. రెండువేల యోజనముల వైశాల్యము కలిగి విస్తరించి ఉన్నవి ఆ పర్వతములు.

భారతవర్షము మొదటిది, దానితరువాత కింపురుష వరము కలదు. విప్రులారా హరివరమును మరొకటి ఈ మూడుకూడ మేరువు దక్షిణముగా ఉన్నవి.  

ఉత్తరదిక్కున రమ్యకవర్షము, దానివెంబడి హిరణ్మయవర్షము, ఉత్తర కురుభూములు కలవు. ఈభారతవర్షము వలెనే ఇవి కూడ నిలిచి యున్నవి.

బ్రాహ్మణశ్రేష్ఠులారా వీటిలో ఒక్కోక్కటి తొమ్మిదివేల యోజనోల పరిమాణం కలది. వాని మధ్యలో ఇలావృతవర్షము, దాని మధ్యలో మేరు పర్వతము ఎత్తుగా నిలిచి ఉన్నది.

మేరువుకు నాలుగుదిక్కుల తొమ్మిదివేల యోజనాల విస్తారము కలిగి ఇలావృత వర్షము వ్యాపించి ఉన్నది. అక్కడ నాలుగు పర్వతాలు న్నవి.

ఆ నాలుగు పర్వతాలు యోజనము ఎత్తువరకు నీలిచి మేరువుకు గడియకొయ్యలుగా చేయబడినవి. తూర్పుదిక్కున మందర పర్వతము, దక్షిణములో గంధమాదన పర్వతము, పడమటివైపున విపులము, ఉత్తర దిక్కున సుపార్శ్వపర్వతము కలవు. ఆపర్వతముల యందు కడిమిచెట్టు, నేరేడు చెట్టు, రావి చెట్టు, మట్టిచెట్టు అనే వృక్షజాతులు ఎక్కువగా ఉండును.

 మహరులారా ఆ జంబూవృక్షము, జంబూద్వీప నామధేయానికి కారణమైనది. ఆ వృక్షము యొక్క పండ్లు పెద్దయేనుగు ఆకారమంత పరిమాణం కలిగి ఉండును.

దాని పండ్లు మేరు పర్వతము పైన రాలి పడుచుండును ఆపండ్ల రసముతో ప్రసిద్ధమైన జంబూనది పర్వతము పై ప్రవహించును.  ఆనదీజలము అక్కడనివసించుజనులచేత త్రాగబడును. అక్కడివారికి చెమట, చెడువాసన, ముసలితనము, ఇంద్రియక్షయము కలుగదు.

నిర్మలమైన మనస్సు కలవారికి అక్కడ తాపముకానీ, అసుఖంకాని కలుగదు. ఆనదీతీరమున మృత్తిక జంబూరసాన్నీ పొందే గాలిచేత బాగుగా ఎండి జాంబూనదమనుపేర సువర్ణముగా మారును. అది సిద్దులకు భూషణము. మేరువుకు పడమట భద్రాశ్వము, కేతుమాలము అను పర్వతాలు కలవు. ఆ రెండింటి మధ్య ఇలావృతవర్షము చైత్రరధమను వనము తూర్పున, దక్షిణములో గంధమాదనము కలవు.

పడమటి దిక్కున వైభ్రాజము, ఉత్తరమున సవితృవనము కలవని తెలియవలెను. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము,  అను ఈ నాలుగు సరస్సులు, ఎల్లప్పుడు దేవతలకు అనుభవయోగ్యాలు. సితాంతము, కుముద్వంతము, కురరి, మాల్యవంతము,వైకంకము, మణీశైలము, వృక్షవంతమను పర్వతరాజును,మహానీలము, రుచకము, బిందువు, మందరము, వేణుచుంతము, మేఘము, నీషధము, దేవపర్వతము - అనునవి దేవతలచే నిర్మింపబడి సిద్ధులకు నివాసాలుగా ప్రసిద్ధములైన పర్వతాలు.

అరుణోదమను సరస్సుకు తూర్పుదిక్కున కేసరాచలము, త్రికూటము, సశిరము, పతంగము, రుచకము,  నిషధము, వసుధారము, కలింగము, త్రిశిఖము, సమూలము, వసువేది, కురురువు అను పర్వతములు కలవు.  

తామ్రాతము, విశాలము, కుముదము, వేణుపర్వతము, ఏకశృంగము, మహాశైలము, గజశైలము, పింజకము, పంచశైలము, కైలాసము, పర్వతశ్రేష్టమైన హిమవంతము - ఇవి అన్నియు దేవతల సంచారమునకు యోగ్యములైన శ్రేష్ఠములైన పర్వతరాజములు.

మహాభద్రమను సరస్సుకు దక్షిణ దిక్కున కేసరపర్వతము, శిఖివాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జారుధి, సురాంబవు, సర్వగంధపర్వతము, సుపార్శ్వము, సుపక్షము, కంకము, కపిల పర్వతము, విరజము, భద్రజాలము, సుసకము, మహాబలము, అంజనము, మధుమంతము, చిత్రశృంగము, మహాలయము, కుముదము, ముకుటము, పాండురము, కృష్ణము, పొరీజాతమను పెద్ద పర్వతము, కపిలాచలము కలవు.

సుషేణము, పుండరీకము, మహామేఘము అనునవి సిద్దులచేత, గంధర్వులచేత సేవింపబడుచున్న పర్వతరాజములు.

అసితోదమనుపేరుగల సరస్సుకు పడమటి దిక్కున కేసర పర్వతము కలదు. మరియు శంఖకూటము, వృషభము, హంసము, సోగము, కాలాంజనము, శుక్రము, నీలము, పారిజాతమను మహాశైలము, కనకశైలము పుష్పకము, సుమేఘము, వారాహము, విరజసము, మయూరము, కపిలము మరియు మహాకపిలము - అనునీపర్వతములు దేవతలచే, గంధర్వులచే, సిద్ధులచే, యక్షులచేసేవింపబడుచుండును. మానస సరస్సుకు ఉత్తరదిక్కున కేసర పర్వతము కలదు.

. ఈ పర్వతముల మధ్యగల భూభాగములందు క్రమముగా సరస్సులు, వనములు, జలాశయములు ఉండును.

ఆ ప్రదేశములో, మునులు, బ్రహ్మజ్ఞానముకల సిద్ధులు నిర్మలచిత్తులు, రజోగుణము తొలగినపొరు, అన్నిదుఃఖములచే విడువబడినవారై ఉందురు.

శ్రీ కూర్మపురాణములో భువనకోశములో పర్వతసంఖ్యానము నందు నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.