అధ్యాయము – 1

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌,

దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్‌.

శ్రీమన్నారాయణునకు, నరులలో శ్రేష్ఠుడగు నరునకు, సరస్వతీ దేవికి మ్రొక్కులిడి జయమును పఠింప వలయును.

నమ స్తస్మై వరాహాయ లీల యోద్దరతే మహీమ్‌,

ఖురమధ్యగతో యస్య మేరుః ఖణఖణాయతే.

విలాసముగా భూమి నుద్ధరించు చున్న వరాహ దేవుని కాలి గిట్టల నడుమ చిక్కుకున్న మేరు పర్వతము ఖణ ఖణ లాడినది. అట్టి శ్రీవరాహ దేవునకు నమస్కారము.

దంష్ట్రాగ్రేణోద్ధృతా గౌరుదధిపరివృతా పర్వతైర్నిమ్నగాభిః

సాకంమృత్పిణ్డవత్‌ ప్రాగ్బృహదురువపుషా నన్తరూపేణ యేన,

సోయం కంసాసురారి ర్మురనరక దశాస్యాన్తకృత్‌ సర్వసంస్థః

కృష్ణో విష్ణుః సురేశో నుదతు మమ రిపూ నాదిదేవో వరాహః.

తొల్లి ఈ వరాహదేవుడు విశాలమైన అంతులేని పెను దేహముతో పర్వతములతో నదులతో సముద్రములతో కూడిన భూమి నంతటిని కోర అంచుతో మట్టి బెడ్డను వలె పైకెత్తెను. కంసుడు, మురుడు, నరకుడు, రావణుడు అను రక్కసుల అంతు చూచిన వాడు, నల్లని వన్నె గలవాడు, అంతట వ్యాపించిన వాడు, దేవతలకును ప్రభువు, అన్నింట నెలకొని యుండువాడు, తొలి దైవము నగు ఆ శ్రీవరాహ దేవుడు నా పగ వారిని పారద్రోలు గాక!

యః సంసారార్ణవే నౌరివ మరణజరా వ్యాధి నక్రోర్మిభీమే

భక్తానాం భీతిహర్తా మురనరకదశాస్యాన్తకృత్‌ కోలరూపీ,

విష్ణుః సర్వేశ్వరోయం య మిహ కృతధియో లీలయో ప్రాప్నువన్తి

ముక్తాత్మానో న పాపం భవతు ప్రణుదితా రాతిపక్షః క్షితీశః.

చావు, ముదిమి, రోగము అను మొసళ్ళతో, అలలతో భయంకరమైన సంసారమను సముద్రమున భక్తుల భయమును రూపు మాపు వాడును తాల్చిన వాడును, సర్వ లోకములకు ప్రభువును, భూదేవికి నాథుడును, శత్రువులను నుగ్గునూచగా గొట్టిన వాడును, బుద్ధి పండిన వారు, ముక్తి నందిన వారునగు పుణ్యాత్ములకు మాత్రమే లీలగా దొరకు వాడునగు విష్ణువు అందరకూ సుఖ స్వరూపుడగు గాక!

సూతుడు:

యస్మిన్‌ కాలే క్షితిః పూర్వం వరాహవపుషా తు సా,

ఉద్ధృతా విష్ణునా భక్త్యా పప్రచ్ఛ పరమేశ్వరమ్‌.

సూతుడు:

మునుపు విష్ణువు వరాహ దేహముతో తన్నుద్ధరించిన నాడు, భూదేవి భక్తితో పరమేశ్వరుని ఇట్లడిగెను.

భూదేవి:

కల్పే కల్పే భవా నేవ మాం సముద్ధరతే విభో,

న చాహం వేద తే మూర్తిం నాదిసర్గం చ కేశవ.

భూదేవి:

ప్రభూ! కేశవా! ప్రతి కల్పము నందును నీవు నన్ను ఉద్దరించు చున్నావు. కాని నేను నీ మూర్తి యెట్టిదో, నీ తోలి సృష్టి యెట్టిదో యెరుగా కున్నాను.

వేదేషు చైవ నష్టేషు మత్స్యో భూత్వా రసాతలమ్‌,

ప్రవిశ్య తా నపాకృష్య బ్రహ్మణే దత్తవా నసి.

మున్ను వేదములు నష్టము కాగా నీవు చేపవై రసాతలమున చొరబారి వానిని పైకి తెచ్చి బ్రహ్మ కొసగితివి.

అన్యత్‌ సురాసురమయం త్వం సముద్రస్య మన్థనే,

ధృతవా నసి కౌర్మ్యేణ మన్దరం మధుసూదన.

పిదప ఓ మధుసూదనా! దేవతలు రాక్షసులు కూడి సముద్రమును చిలికి నపుడు నీవు తాబేటి రూపముతో మందరమును మోసితివి గదా!

పున ర్వరాహరూపేణ మాం గచ్ఛన్తీం రసాతలమ్‌,

ఉజ్జహా రైకదంష్ట్రేణ భగవాన్‌ వై మహార్ణవాత్‌.

తిరిగి, నేను రసాతలమునకు జారు చుండగా భగవంతుడవగు నీవు వరాహ రూపముతో మహా సముద్రము నుండి ఒక్క కోరతో నన్ను పైకి లాగితివి కదా!

అన్య ద్ధిరణ్యకశిపు ర్వరదానేన దర్పితః,

ఆబాధమానః పృథివీం స త్వయా వినిపాతతః,

బలిస్తు బద్ధో భగవం స్త్వయా వామనరూపిణా.

మరియొక మారు హిరణ్య కశిపుడు వరములు పొంది కన్ను గానక భూమిని బాధించు చుండగా నీవు వానిని కూల ద్రోసితివి గదా! అట్లే వామన రూపమును దాల్చి నీవు బలిని బంధించితివి గదా!

పునః నిఃక్షత్రియా త్వయా చాపి పురా కృతా,

జామదగ్న్యేన రామేణ త్వయా భూత్వాసకృత్‌ ప్రభో.

పిదప నీవు జమదగ్ని కుమారుడవగు రాముడవై పలుమార్లు భూమిపై క్షత్రియులు లేకుండ చేసితివి.

పునశ్చ రావణో రక్షః క్షపితం క్షాత్ర తేజసా,

న చ జానామ్యహం దేవ తవ క్షిఞ్చ ద్విచేష్టితమ్‌.

మరియు క్షత్రియ తేజమును దాల్చి నీవు రావణుడను రాక్షసుని మట్టు పెట్టితివి. దేవా నీ లీల యే కొంచెమును ఎరుగ కున్నాను.

ఉద్ధృత్య మాం కథం సృష్టిం సృజసే కించ సా త్వయా,

సకృద్‌ ధ్రియేత కృత్వా చ పాల్యతే చాపి కేన చ.

నన్నుద్ధరించిన పిదప ఈ విశ్వమంతయు నెట్లు సృజించెదవు? ఏల సృజించెదవు? దాని నెట్లు ఒక్క పెట్టున పట్టి యుంతువు? ఏ విధముగా దానిని పాలింతువు?

కేన వా సులభో దేవ జాయసే సతతం విభో,

కథం చ సృష్టే రాదిః స్యా దవసానం కథం భవేత్‌.

ప్రభూ! నిన్ను తేలికగా పట్టుకొను ఉపాయా మేది? ఈ సృష్టికి మొద లెట్టిది? ఇది యంత మగుట యెట్లు?

కథం యుగస్య గణనా సంఖ్యాస్యాను చతుర్యుగమ్‌,

కే వా విశేషా స్తే ష్వస్మిన్‌ కా వావస్థా మహేశ్వర.

యుగముల లెక్క యెట్లేర్పదినది? నాలుగు యుగముల వరుస యెట్లు జరిగినది? అందలి విశేషము లేవి? మహా ప్రభూ! దీని యందలి స్థితి యెట్టిది?

యజ్వాన: కే చ రాజానః కే చ సిద్ధిం పరాం గతాః,

ఏతత్సర్వం సమాసేన కథయస్వ ప్రసీద మే.

యజ్ఞములు చేసిన రాజు లెవ్వరు? పరమ సిద్ధి పొందిన వారెవ్వరు? ఇది యంతయు నాకు సంగ్రహముగా చెప్పుము. నా యందు ప్రసన్నుడవు కమ్ము.

ఇత్యుక్తః క్రోడరూపేణ జహాస పరమేశ్వరః,

హసత స్తస్య కుక్షౌ తు జగద్ధాత్రీ దదర్శ హ,

రుద్రాన్‌ దేవాన్‌ సవసవః సిద్ధ సంఘాన్‌ మహర్షిభిః.

భూదేవి యిట్లు పలుకగా వరాహ రూపముతో నున్న పరమేశ్వరుడు నవ్వెను. అట్లు నవ్వు చున్న అతని కడుపులో రుద్రులను, దేవతలను, వసువులను, సిద్దుల సముదాయము లను మహర్షులను భూదేవి గాంచెను.

సచంద్ర సూర్యగ్రహ సప్తలోకా నన్తః స్థితాం స్తావ దుపాత్తధార్మాన్‌,

ఇతీ దృశం పశ్యతి సా సమస్తం యావత్‌ క్షితి ర్వేపిత సర్వగాత్రా.

చంద్రులతో, సూర్యులతో, గ్రహములతో కూడిన సప్త లోకములను, తమతమ ధర్మములను నిర్వహించుచు ఆ కుక్షి లోపల ఉండగా, భూదేవి గాంచెను. ఇట్లు చూచు చున్న భూమి నిలువెల్లా వణకి పోయెను.

ఉన్మీలితాస్య స్తు యదా మహాత్మా దృష్టో ధరణ్యా మల సర్వ గాత్ర్యా,

తావత్‌ స్వరూపేణ చతుర్భుజేన మహోదధౌ సుప్త మథోన్వపశ్యత్‌.

మరల ఆ మహాత్ముడు నోరు తెరువగా నిర్మలములగు సమస్త అవయములు గల ధరణి నాలుగు భుజములు గలిగి మహా సముద్రములో నిద్రించు చున్న ఆ విష్ణుని స్వరూపమునే గాంచెను.

శేష పర్యఙ్కశయనే సుప్తం దేవం జనార్దనమ్‌,

దృష్ట్వా తన్నాభిపఙ్కస్థ మన్తఃస్థం చ చతుర్ముఖమ్‌,

కృతాఞ్జలిపుటా దేవీ స్తుతిం ధాత్రీ జగాద హ.

శేష పర్యంకమున నిద్రించి యున్న జనార్ధన దేవుని, ఆతని బొడ్డు తామరలో నున్న నలు మోముల దేవర బ్రహ్మను గాంచి చేతులు మోడ్చి భూదేవి యిట్లు స్తుతి చేసెను.

భూదేవి:

నమః కమల పత్రాక్ష నమస్తే పీతవాససే,

నమః సురారి విధ్వంసకారిణే పరమాత్మనే.

భూదేవి:

తామర రేకుల వంటి కన్నులు గల స్వామీ! పీత వస్త్రము తాల్చిన వాడా! నీకు మ్రొక్కులు. దేవతల శత్రువులను రూపు మాపునట్టి పరమాత్మా! నీకు నమస్సు.

శేషపర్యంక శయనే ధృత వక్షః స్థల శ్రియే,

నమస్తే సర్వదేవేశ నమస్తే మోక్షకారిణే.

శేషుడను పాన్పుపై పవ్వళించి హృదయమున లక్ష్మీ దేవిని తాల్చిన స్వామీ! సర్వ దేవేశా! మోక్షమొసగు దేవా! నీకు నమస్సు.

నమః శార్జ్గాసి చక్రాయ జన్మమృత్యు వివర్జితే,

నమో నాభ్యుత్థిత మహ త్కమలాసన జన్మనే.

శార్జ్గము, ఖడ్గము, చక్రము ధరించిన దేవా! నీకు కైమోడ్పు. జన్మము, మరణము లేని ప్రభూ! నమస్కారము. బొడ్డు తామర నుండి బ్రహ్మ దేవుని సృజించిన మహానుభావా! ప్రణతి.

నమో విద్రుమ రక్తాస్య పాణి వల్లవ శోభినే,

శరణం త్వాం ప్రసన్నా స్మి త్రాహి నారీ మనాగసమ్‌.

పగడముల వంటి మోము, చిగుళ్ళ వంటి చేతులు గలిగి యలరారు చున్న దేవా! నీకు నమస్కారము. నిన్ను శరణు పొందితిని. పాప మెరుగని పడతిని నన్ను కాపాడుము.

పూర్ణనీలాంజనాకారం వారాహం తే జనార్దన,

దృష్ట్వా భీతాస్మి భూయోపి జగత్‌ త్వద్దేహగోచరమ్‌,

ఇదానీం కురు మే నాథ దయాం త్రాహి మహాభయాత్‌.

జనార్ధనా! నిలువెల్ల నల్లని కాటుక వంటి ఆకారము గల నీ వరాహ రూపమును, నీ దేహమున గాన వచ్చిన జగమును గాంచి భీతి నొందితిని. నాథా! ఇపుడు నా యందు దయ చూపుము. నన్నీ మహా భయము నుండి కాపాడుము.

కేశవః పాతు మే పాదౌ జఙ్ఘే నారాయణో మమ,

మాధవో మే కటిం పాతు గోవిందో గుహ్య మేవ చ.

కేశవుడు నా పాదములను, నారాయణుడు నా పిక్కలను, మాధవుడు నా నడుమును, గోవిందుడు నా గుహ్యమును రక్షించు గాక!

నాభిం విష్ణు స్తు మే పాతు ఉదరం మధుసూదనః,

ఊరూ త్రివిక్రమః పాతు హృదయం పాతు వామనః.

విష్ణువు నా పొక్కిలిని, మధుసూదనుడు నా ఉదరమును, త్రివిక్రముడు నా తొడలను, వామనుడు నా హృదయమును కాపాడు గాక.

శ్రీధరః పాతు మే కణ్ఠం హృషీకేశో ముఖం మమ,

పద్మనాభస్తు నయనే శిరో దామోదరో మమ.

శ్రీధరుడు నా కంఠమును, హృషీకేశుడు ముఖమును, పద్మనాభుడు కన్నులను, దామోదరుడు శిరస్సును బ్రోచుగావుత.

ఏవం న్యస్య హరే ర్న్యాసనామాని జగతీ తదా,

నమస్తే భగవన్‌ విష్ణో ఇత్యుక్త్వా విరరామ హ.

ఇట్లు హరి నామములను తన అంగములపై పాదు కొలిపి జగతీ దేవి భగవానుడా! విష్ణూ! నీకు నమస్కార మని పలికి ఊర కుండెను.