అధ్యాయము - 71

అగస్త్యుడు:

ఏవముక్తా స్తతో దేవా ఋషయశ్చ పినాకినా,

అహం చ నృపతే తస్య దేవస్య ప్రణతోభవమ్‌.

అగస్త్యుడు:

ఆ పినాకి ఇట్లు చెప్పగా దేవతలు, ఋషులు, నేనును ఆ దేవునకు ప్రణమిల్లితిమి.

ప్రణమ్య శిరసా దేవం యావత్‌ పశ్యామహే నృప,

తావత్‌ తస్యైవ రుద్రస్య దేహస్తం కమలాసనమ్‌.

నారాయణం చ హృదయే త్రసరేణు సుసూక్ష్మకమ్‌,

జ్వలద్భాస్కరవర్ణాభం పశ్యామ భవదేహతః.

శిరస్సుతో ప్రణమిల్లి ఆ దేవుని చూచు నంతలో ఆతని దేహమున నున్న బ్రహ్మను హృదయమున సన్నని దుమ్ము కణమంత సూక్ష్మ రూపుడగు నారాయణుని కను గొంటిమి. ఆ నారాయణుడు జ్వలించు చున్న సూర్యుని వన్నెతో ప్రకాశించు చుండెను.

తం దృష్ట్వా విస్మితాః సర్వే యాజకా ఋషయో మమ,

జయశబ్దరవాం శ్చక్రుః సామఋగ్యజుషాం స్వనమ్‌.

అతనిని దర్శించు కొని అందరు విస్మితులై యాజకులగు ఋషు లందరు సామము, ఋక్కు, యజస్సులతో జయ జయ ధ్వనులను గావించిరి.

కృత్వోచుస్తే తదా దేవం కిమిదం పరమేశ్వర!

ఏకస్యా మేవ మూర్తౌ తే లక్ష్యన్తే చ త్రిమూర్తయః.

కావించి వారు ఆ దేవునితో నిట్లనిరి. పరమేశ్వరా! ఇదియేమి? నీ ఒక్క మూర్తి యందే త్రి మూర్తులును గాన వచ్చు చున్నారు.

రుద్రుడు:

యజ్ఞేస్మిన్‌ యద్ధుతం హవ్యం మాముద్దిశ్య మహర్షయః,

తేత్రయోపి వయం భాగం గృహ్ణీమః కవిసత్తమాః.

రుద్రుడు:

ఓ మేధావులారా! ఈ యజ్ఞము నందు మహర్షులు నన్నుద్దేశించి దేనిని హుతము చేయుదురో దానిని మేము మువ్వురమును గ్రహింతుము.

నాస్మాకం వివిధో భావో వర్తతే ముని సత్తమాః,

సమ్యగ్దృశః ప్రపశ్యన్తి విపరీతే హ్యనేకశః.

ముని వరులారా! మాకు వేర్వేరు భావములు లేవు. పెక్కు విధములైన వాని యందును, చక్కని చూపు గలవారు దీనిని చక్కగా దర్శింతురు.

ఏవ ముక్తే తు రుద్రేణ సర్వే తే మునయో నృప,

పప్రచ్ఛుః శంకరం దేవం మోహశాస్త్ర ప్రయోజనమ్‌.

రుద్రు డిట్లు పలుకగా ఆ మును లందరు శంకరుని మోహ శాస్త్ర ప్రయోజనమును గూర్చి యిట్లడిగిరి.

ఋషులు:

మోహనార్థం తు లోకానాం త్వయా శాస్త్రం పృథక్‌ కృతమ్‌,

తత్‌ త్వయా హేతునా కేన కృతం దేవ వదస్వ నః.

ఋషులు:

దేవా! లోకములను మోహ పెట్టుటకై నీవు విడిగా ఒక శాస్త్రమును చేసితివి. అది చేయుటకు కారణమేమి? మాకు చెప్పుము.

రుద్రుడు:

అస్తి భారత వర్షేణ వనం దండకసంజ్ఞితమ్‌,

తత్ర తీవ్ర తపోఘోరం గౌతమో నామ వై ద్విజః.

రుద్రుడు:

భారత వర్షమున దండకమను పేరు గల వనము కలదు. అందు గౌతముడను బ్రాహ్మణుడు ఘోరమగు తప మొనరించెను.

చకార తస్య బ్రహ్మాతు పరితోషం గతః ప్రభుః,

ఉవాచ తం మునిం బ్రహ్మా వరం బ్రూహి తపోధన.

బ్రహ్మ దానికి నిండు సంతోషము పొంది ఆ మునితో, తపోధనా! వరము కోరు కొనుమని పలికెను.

ఏవముక్త స్తదాతేన బ్రహ్మణా లోకకర్తృణా,

ఉవాచ సద్యః పంక్తిం మే ధాన్యానాం దేహి పద్మజ.

లోకములకు కర్తయగు బ్రహ్మ అట్లు పలుకగా ఆతడు ‘పద్మ సంభవా! నాకు వెను వెంటనే కొన్ని ధాన్యపు గింజల నొసగుము’ అని పలికెను.

ఏవ ముక్తో దదౌ తస్య తమేవార్థం పితామహః,

లబ్ధ్వాతు తం వరం విప్రః శతశృంగే మహాశ్రమమ్‌.

చకార తస్యోషసి చ పాకాంతే శాలయో ద్విజః,

లూయన్తే తేన మునినా మధ్యాహ్నే పచ్యతే తథా,

సర్వాతిథ్య మసౌ విప్రో బ్రాహ్మణేభ్యో దదాత్యలమ్‌.

ఇట్లనగా బ్రహ్మ ఆతడు కోరిన వరము నిచ్చెను. అతడును ఆ వరమును కైకొని శత శృంగమున ఒక పెద్ద ఆశ్రమమును నిర్మించు కొనెను. అందు ఆ ధాన్యపు గింజలు ఉషః కాలమున మొలకెత్తి మధ్యాహ్న మునకు పండు చుండగా వానితో ఆ విప్రుడు బ్రాహ్మణులకు తగినంత ఆతిథ్యము చేయు చుండెను.

కస్యచిత్‌ త్వథ కాలస్య మహతీ ద్వాదశాబ్దికా,

అనావృష్టి ర్ద్విజవరా అభవల్లోమహర్షణీ.

అంత కొంత కాలమునకు పండ్రెండేండ్ల పెనుకరవు (అనావృష్టి) ఒడలికి గగుర్పాటు కలిగించుచు ఏర్పడినది.

తాం దృష్ట్వా మునయః సర్వే అనావృష్టిం వనేచరాః,

క్షుధయా పీడ్యమానాస్తు ప్రయయు ర్గౌతమం తదా.

ఆ దండకమున నున్న మహర్షు లందరు ఆ అనావృష్టిని చూచి దప్పికతో బాధ పడుచున్న వారై గౌతముని కడ కరిగిరి.

అథ తానాగతాన్‌ దృష్ట్వా గౌతమః శిరసా నతః,

ఉవాచ స్థీయతాం మహ్యం గృహే మునివరాత్మజాః.

అట్లు వచ్చిన వారిని గాంచి గౌతముడు తలతో మ్రొక్కి ఓ మునివర పుత్రులారా! మీరందరు మా యింట నిలువుడని పలికెను.

ఏవ ముక్తాస్తు తే తేన తస్థు ర్వివిధ భోజనమ్‌,

భుఞ్జమానా అనావృష్టి ర్యావత్‌ సా నివృతాభవత్‌.

అట్లు పలుకగా వారందరు ఆ కరవంతయు పూర్తిగా పోవు వరకు అతని ఆశ్రమము నందే భుజించుచు నిలిచిరి.

నివృత్తాయాం తు వై తస్యా మనావృష్ట్యాంతు తే ద్విజాః,

తీర్థయాత్రా నిమిత్తం తు ప్రయాతుమనసోభవన్‌.

ఆ కరవు మరలి పోగా ఆ బ్రాహ్మణు లందరు తీర్థయాత్రపై మనసు పెట్టిరి.

తత్ర శాండిల్య నామానం తాపసం మునిసత్తమమ్‌,

ప్రత్యువాచేతి సంచిన్త్య మారీచః పరమో మునిః.

అచట మారీచుడను పరమ ముని శాండిల్యుడను ముని సత్తముని చూచి చక్కగా ఆలోచించి యిట్లు పలికెను.

మారీచుడు:

శాండిల్య శోభనం వక్ష్యే పితా తే గౌతమో మునిః,

తమనుక్త్వా న గచ్ఛామ స్తప శ్చర్తుం తపోవనమ్‌.

మారీచుడు:

శాండిల్య! నీకొక మంచి మాట చెప్పెదను. నీ తండ్రి గౌతమ మహర్షి. అతనికి చెప్పక మనము తపో వనమునకు తప మాచరించుటకు పోజాలము.

ఏవ ముక్తేథ జహసుః సర్వే తే మునయ స్తదా,

కి మస్మాభిః స్వకో దేహో విక్రీతోస్యాన్న భక్షణాత్‌.

అట్లు పలుకగా ఆ మును లందరు నవ్విరి. ఏమయ్యా! ఈయన అన్నము తిన్నంత మాత్రమున మనము మన దేహములను అమ్మితిమా! ఏమి?

ఏవముక్త్వా పునశ్చోచుః సోపాధిగమనం ప్రతి,

కృత్వా మాయామయీం గాంతు తచ్ఛాలాయాం వ్యసర్జయన్‌

ఇట్లు పలికి మరల అట నుండి వెడలి పోవుటకొక నిమిత్తము నాలోచించిరి. ఒక మాయ గోవును సృజించి ఆ శాలయందు వదిలిరి.

తాం చరన్తీం తతో దృష్ట్వా శాలాయాం గౌతమో మునిః,

గృహీత్వా సలిలం పాణౌ యాహి రుద్రేత్యభాషత.

అంత నా శాలయందు తిరుగుచున్న ఆ గోవును చూచి గౌతమ ముని చేతి యందు నీటిని గ్రహించి రుద్రా! పొమ్ము అని పలికెను.

తతో మాయామయీ సా గౌః పపాత జలబింధుభిః.

నిహతాం తాం తతో దృష్ట్వా మునీన్‌ జిగమిషూంస్తదా,

ఉవాచ గౌతమో ధీమాం స్తాన్‌ మునీన్‌ ప్రణతః స్థితః.

అపుడు మాయామయి అగు ఆ ఆవు నీటి బిందువులతో అట క్రింద పడెను. చని పోయిన ఆ ఆవును, వెడల గోరుచున్న ఆ మునులను గాంచి నమస్కరించి ఆ గౌతము డిట్లు పలికెను.

కిమర్థం గమ్యతే విప్రాః సాధు శంసత మాచిరమ్‌,

మాం విహాయ సదా భక్తం ప్రణతం చ విశేషతః.

విప్రులారా! మీ యందు భక్తుడను. విశేషించి మీకు మ్రొక్కిన వాడనునగు నన్ను వదలి మీరేల పోవలయును. చెప్పుడు ఆలసింపకుడు.

ఋషులు:

గోపధ్యేయ మిహ బ్రహ్మన్‌ యావత్‌ తవ శరీరగా,

తాపదన్నం స భూఞ్జామో భవతోన్నం మహామునే.

ఋషులు:

బ్రాహ్మణా! నీ దేహమందు ఈ గోహత్యా పాప మున్నంత వరకు నీ అన్నమును మేము తినము.

ఏవముక్తో గౌతమోథ తాన్‌ మునీన్‌ ప్రాహ ధర్మవిత్‌,

ప్రాయశ్చిత్తం గోవధ్యాయా దీయతాం మే తపోధనాః.

వారట్లనగా ధర్మమెరిగి గౌతముడు ఆ మునులతో ఓ తపోధనులారా! ఈ గోవధకు ప్రాయశ్చిత్తమును సెలవిండు అని పలికెను.

ఋషులు:

ఇయం గౌ రమృతా బ్రహ్మన్‌ మూర్ఛితేవ వ్యవస్థితా,

గంగాజలప్లుతా చేయ ముత్థాస్యతి న సంశయః.

ఋషులు:

ఆ గోవు అమృత స్వరూప. మూర్ఛిల్లినది వలె నున్నది. గంగా జలమున మునిగినచో ఇది లేచును. సంశయము లేదు.

ప్రాయశ్చిత్తం మృతాయాః స్యా దమృతాయాః కృతం త్విదమ్‌,

వ్రతం వా మాకృథాః కోప మిత్యుక్త్వా ప్రయయుస్తు తే.

మరణించిన దానికి ప్రాయశ్చిత్తము. చావని దానికై ఈ మాత్రము వ్రతము చాలును. కోపము చేయకుము. అని పలికి వారు వెడలి పోయిరి.

గతై స్తై ర్గౌతమో ధీమాన్‌ హిమవన్తం మహాగిరిమ్‌,

మామారాధయిషుః ప్రాయాత్‌ తప్తుంచాశు మహత్‌ తపః.

వారు వెడలిపోగా బుద్ధి శాలియగు గౌతముడు హిమవంతమను మహాగిరికి నన్నా రాధించుటకును, గొప్ప తపము చేయుటకును అరిగెను.

శతమేకం తు వర్షాణా మహమారాధితోభవమ్‌,

తుష్టేన చ మయా ప్రోక్తో వరం వరయ సువ్రత.

ఒక నూరేండ్లు నన్నారాధించెను. నేను తుష్టిచెంది సువ్రతుడా! వరమును కోరుకొమ్మంటిని.

సోబ్రవీ న్మాం జటాసంస్థాం దేహి గంగాం తపస్వినీమ్‌,

మయా సార్థం ప్రయాత్వేషా పుణ్యా భగీరథి నదీ.

అతడు నాతో ఇట్లనెను. నీ జటలలో ఉన్న తపస్విని ఈ గంగను నాకిమ్ము. ఈ పుణ్య భాగీరథి నాతో పాటు వచ్చుగాక!

ఏవ ముక్తే జటాఖండ మేకం స ప్రదదౌ శివః,

తాం గృహ్య గతవాన్‌ సోపి యత్రాస్తే సా తు గౌ ర్మృతా.

అతడిట్లు పలుకగా శివుడు ఒక జడముక్క నొసగెను. దానిని కైకొని ఆతడును చచ్చి పడి యున్న గోవున్న చోటి కరిగెను.

తజ్జలా ప్లావితా సా గౌ ర్గతా చోత్థాయ భామినీ,

నదీ చ మహతీ జాతా పుణ్యతోయా శుచిహ్రదా.

ఆ నీటితో తడిసిన ఆ గోవు లేచి స్త్రీయై అరిగెను. అచట పుణ్య జలములు, పవిత్రములగు పడియలు గల ఒక్క పెద్ద నది యేర్పడెను.

తం దృష్ట్వా మహదాశ్చర్యం తత్ర సప్తర్షయోమలాః,

ఆజగ్ముః ఖే విమానస్థాః సాధు సాధ్వితి వాదినః.

ఆ గొప్ప అద్భుతమును గాంచి పవిత్రులైన సప్త మహర్షులు ఆకాశమున విమానము నందున్న వారై మేలు మేలని పలుకుచు వచ్చిరి.

సాధు గౌతమ సాధూనాం కోన్యోస్తి సదృశ స్తవ,

యదేవం జాహ్నవీం దేవీం దండకే చావతారయత్‌.

గౌతమ! మేలు. మంచి వారిలో నీకు సాటియగు వాడెవ్వడు?ఈ జాహ్నవీ దేవిని దండకమున అవతరింప జేసితివి.

ఏవ ముక్త స్తదా తైస్తు గౌతమః కిమిదిం త్వితి,

గోవధ్యాకారణం మహ్యం తావత్‌ పశ్యతి గౌతమః.

వారట్లు పలుకగా గౌతముడు ఇదియేమి? నాకీ గోహత్యా పాపమెట్లు కలిగించెనని పరికించెను.

ఋషీణాం మాయయా సర్వ మిదం జాతం విచిన్త్యవై,

శశాప తాన్‌ జటాభస్మ మిథ్యా వ్రతధరా స్తథా,

భవిష్యథ త్రయీబాహ్యా వేదకర్మబహిష్కృతాః.

ఇది యంతయు ఋషుల మాయ చేత కలిగెనని తెలిసికొని మీరందరు జడలు, బూడిద, తప్పుడు వ్రతములు తాల్చిన వారు, వేదములకు వెలియైన వారు, వేద కర్మముల నుండి భ్రష్టులైన వారు అగుడని శపించెను.

తచ్ఛ్రుత్వా క్రూరవచనం గౌతమస్య మహామునేః,

ఊచుః సప్తర్షయో మైవం సర్వకాలం ద్విజోత్తమాః,

భవన్తు కింతు తే వాక్యం మోఘం నాస్త్యత్ర సంశయః.

మహాముని యగు ఆ గౌతముని క్రూర వచనము విని సప్తర్షులు ఇట్లనిరి: ఉత్తమ బ్రాహ్మణులు సర్వ కాలము ఇట్లు కాకుందురు గాక! నీ పలుకు పొల్లును కారాదు. సంశయము లేదు.

యది నామ కలౌ సర్వే భవిష్యన్తి ద్విజోత్తమాః,

ఉపకారిణి యేతే హి అపకర్తార ఏవ హి,

ఇత్థం భూతా అపి కలౌ భక్తి భాజో భవన్తు తే.

త్వద్వాక్య వహ్ని నిర్దగ్ధా దా కలియుగే ద్విజాః,

భవిష్యన్తి క్రియాహీనా వేదకర్మబహిష్కృతాః.

ఈ బ్రాహ్మణ శ్రేష్ఠు లందరు ఉపకారము చేసిన నీ యందు అపకారము చేయు వారైనను, నీ యందు భక్తి కలవారు. నీ మాటల నిప్పులో బూదియై కలి యుగమున బ్రాహ్మణులు క్రియా హీనులు, వేద కర్మముల నుండి వెలిపడిన వారు అగుదురు.

అస్యాశ్చ గౌణం నామేహ నదీ గోదావరీతి చ,

గౌర్దత్తా వరదానాచ్చ భవేద్‌ గోదావరీ నదీ.

ఈ నదికిని గోదావరియను పేరు గౌణముగా కలుగును. ‘గోవుదత్త’ ‘వరదానము వలన’ అను అర్థముతో ఇది గోదావరి యగును.

ఏతాం ప్రాప్య కలౌబ్రహ్మన్‌ గాం దదంతి జనాశ్చయే,

యథాశక్త్యాతు దానాని మోదన్తే త్రిదశైః సహ.

ఈ నది కడకు వచ్చి గోవును దాన మిచ్చిన వారు, ఇతర దానముల నొసగిన వారు దేవతలతో పాటు మోదమును పొందుదురు.

సింహస్థేచ గురౌ తత్ర యో గచ్ఛతి సమాహితః,

స్నాత్వా చ విధినా తత్ర పితౄం స్తర్పయతే తథా.

స్వర్గం గచ్ఛన్తి పితరో నిరయే పతితా అపి,

స్వర్గస్థాః పితర స్తస్య ముక్తిభాజో న సంశయః.

గురువు సింహరాశి యందున్నపుడు శ్రద్ధ గల వాడై ఈ నది కరిగి విధి పూర్వకముగా స్నానము చేసి పితృ దేవతలకు తర్పణము చేయువాని పితరులు నరకమున పడిన వారైనను స్వర్గమున కరుగుదురు. స్వర్గము నందున్న పితృ దేవతలు ముక్తి పొందుదురు. సందియము లేదు.

త్వం ఖ్యాతిం మహతీం ప్రాప్య ముక్తిం యాస్యసి శాశ్వతమ్‌,

ఏవ ముక్త్వా థ మునయో యయుః కైలాస పర్వతమ్‌,

యత్రాహ ముమయా సార్ధం సదా తిష్ఠామి సత్తమాః.

నీవును గొప్ప కీర్తిని పొంది శాశ్వత ముక్తిని పొందెదవు. అని ఆ మునులు, నేను ఉమాదేవితో పాటు శాశ్వతముగా నుండు కైలాస పర్వతమున కేగిరి.

ఊచు ర్వాం తే చ మునయో భవితా కో ద్విజోత్తమాః,

కలే త్వద్రూపిణః సర్వే జటాముకుట ధారిణః,

స్వేచ్ఛయా ప్రేతవేషాశ్చ మిథ్యాలింగధరాః ప్రభో.

తేషా మనుగ్రహార్థాయ కించిచ్ఛాస్త్రం ప్రదీయతామ్‌,

యేనాస్మ ద్వంశజాః సర్వే వర్తేయుః కలిపీడితాః.

ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులైన మునులు నాతో నిట్లనిరి. కలి యందు వీరందరు నీవంటి రూపము కలవారు. జడలే కిరీటముగా ధరించు వారు, ఇచ్చ ననుసరించి ప్రేత వేషమును తాల్చువారు. మాయ లింగములు ధరించు వారు నగుదురు. ఆ విధముగా కలి చేత పీడింప బడు మా వంశము వారందరి ననుగ్రహించుట కొరకు ఏదేని శాస్త్రమును దయతో తామొసగ వలయును.

ఏవ మభ్యర్థిత స్తైస్తు పురాహం ద్విజసత్తమాః,

వేదక్రియా సమాయుక్తాం కృతవా నస్మి సంహితామ్‌.

నిఃశ్వాసాఖ్యాం తత స్తస్యాం లీనా బాభ్రవ్యశాండిలాః,

అల్పాపరాధా చ్ఛ్రుత్రైవ గతా బైడాలికా భవన్‌.

ఇట్లు వారు ప్రశ్నింపగా ఓ బ్రాహ్మణో త్తములారా! వేద క్రియలతో కూడిన ‘నిఃశ్వాస’ అను ఒక సంహితను చేసితిని. దాని యందు బాభ్రవ్యులు, శాండిలులు ఆరితేరిన వారైరి. చిన్న తప్పు వలన నిది జరిగినదని విన్న వెంటనే వారు పిల్లి శీలములు కల వారైరి.

మయైవ మోహితాస్తే హి భవిష్యం జానతా ద్విజాః,

లౌల్యార్థినస్తు శాస్త్రాణి కరిష్యన్తి కరిష్యన్తి కలౌ నరాః.

భవిష్యత్తు ఎరిగిన నేను బ్రాహ్మణులను మోహ పెట్టితిని. కలి యందు లోభము కలవారు శాస్త్రములను నిర్మింతురు.

నిఃశ్వాస సంహితాయాం హి లక్షమాత్ర ప్రమాణతః,

సైవ పాశుపతీ దీక్షా యోగః పాశుపత స్త్విహ.

నిశ్వాస సంహిత లక్ష శ్లోకముల ప్రమాణము కలది. అదియే పాశుపత దీక్ష. దానినే పాశుపత యోగ మందురు.

ఏతస్మాద్‌ వేదమార్గాద్ధి యదస్య దిహ జాయతే,

తత్‌ క్షుద్ర కర్మ విజ్ఞేయం రౌద్రం శౌచ వివర్జితమ్‌.

ఈ వేద మార్గము కంటె వేరైనది క్షుద్ర కర్మముగా తెలియ దగినది. అది రౌద్రము. శుద్ధి లేనిది.

యే రుద్ర ముపజీవన్తి కలౌ బైడాలికా నరాః,

లౌల్యార్థినః స్వశాస్త్రాణి కరిష్యన్తి కలౌ నరాః,

ఉచ్ఛుష్మరుద్రా స్తే జ్ఞేయా నాహం తేషు వ్యవస్థితః.

ఇట్టి పిల్లి శీలము గల నరులు రుద్రు నాశ్రయించి బ్రతుకు వారు చంచల స్వభావులు తమ శాస్త్రములను వేరుగా వ్రాసికొను చుందురు. అట్టి వారిని ఉచ్ఛుష్మ రుద్రు లందురు. నేను వారి యందు నిలువను.

భైరవేణ స్వరూపేణ దేవకార్యే యదా పురా,

నర్తితం తు మయా సోయం సంబంధః క్రూరకర్మణామ్‌.

పూర్వము దేవతల పని కలిగినపుడు భైరవ స్వరూపముతో నేను నర్తనము చేసితిని. ఇది క్రూరకర్ములకు నాతో సంబంధము.

క్షయం నినీషతా దైత్యా నట్టహాసో మయా కృతః,

యః పురా తత్ర యే మహ్యం పతితా అశ్రుబిన్దవః,

అసంఖ్యాతాస్తు తే రౌద్రా భవితారో మహీతలే.

మునుపు దైత్యులను నాశ మొందించు కోరికతో నేను అట్టహాసము చేసితిని. అప్పుడు లెక్క పెట్టరాని కన్నీటి బిందువులు పడినవి. అవియే భూతలమున రౌద్ర స్వరూపము లగును.

ఉచ్ఛుష్మనిరతా రౌద్రాః సురామాంసప్రియాః సదా,

స్త్రీలోలాః పాపకర్మాణః సంభూతా భూతలేషు తే.

ఉచ్ఛుష్మ పద్ధతి యందు ఆసక్తికల రుద్ర సంబంధులు మద్య మాంసముల యందు ప్రీతి కలవారు, స్త్రీలోలురు, పాప కర్ములు అయి భూలోకమున జన్మించిరి.

తేషాం గౌతమశాపాద్ది భవిష్యన్త్యన్వయే ద్విజాః,

తేషా మధ్యే సదాచారా యే మచ్ఛాసనే రతాః.

గౌతముని శాపము వలన వారి కులమున బ్రాహ్మణులు జన్మింతురు. వారిలో సదాచారులు నా శాసనమున ప్రీతికల వారగుదురు.

స్వర్గం చైవా పవర్గం చ ఇతి వై సంశయాత్‌ పురా,

బైడాలికాధో యాస్యన్తి మమ సంతతి దూషకాః.

బైడాలికులు స్వర్గమా, మోక్షమా అను సంశయము వలన నా సంతానమును చెరుచు వారగుదురు.

ప్రాగ్‌ గౌతమాగ్నినా దగ్ధాః పునర్మద్వచనాద్‌ ద్విజాః,

నరకం తు గమిష్యన్తి నాత్ర కార్యా విచారణా.

ముందు నామాట మీద గౌతముని శాపాగ్నిచే దగ్ధులైన బ్రాహ్మణులు నరకమున కరుగుదురు. ఇందు విచారణ చేయనక్కర లేదు.

రుద్రుడు:

ఏవం మయా బ్రహ్మసుతాః ప్రోక్తా జగ్ముర్యథాగతమ్‌,

గౌతమోపి స్వకం గేహం జగామాశు పరంతపః.

రుద్రుడు:

నేనిట్లు చెప్పగా ఆ బ్రహ్మ పుత్రులు తమ తావున కరిగిరి. పరంతపుడగు గౌతముడును తన గృహమున కరిగెను.

ఏతద్‌ వః కథితం విప్రా మయా ధర్మస్య లక్షణమ్‌,

ఏతస్మాద్‌ విపరీతో యః సపాషణ్డరతో భవేత్‌.

విప్రులారా! మీకు ధర్మము లక్షణమును చెప్పితిని. దీని కంటె విపరీతముగా ప్రవర్తించు వాడు పాషండుల యందు ఆసక్తి కల వాడగును.