వరాహ మహా పురాణము
అధ్యాయము - 54
భద్రాశ్యుడు:
విజ్ఞానోత్పత్తికామస్య క ఆరాధ్యో భవేద్ద్విజ,
కధం చారాధ్యతే సౌ హి ఏతదాఖ్యాహి మే ద్విజ.
భద్రాశ్యుడు:
బ్రాహ్మణోత్తమా! విజ్ఞానము ఉత్పత్తిని కోరు వానికి ఆరాధ్యుడెవరు? (ఎవని నారాధింప వలయును) ఆతని నారాధించు విధ మెట్టిది? దీనిని నాకు ఉపదేశింపుము.
అగస్త్యుడు:
విష్ణురేవ సదారాధ్యః సర్వదేవై రపిప్రభుః,
తస్యోపాయం ప్రవక్ష్యామి యేనాసౌ వరదోభవేత్.
అగస్త్యుడు:
సర్వ దేవతలకును, సర్వ కాలముల యందు ఆరాధింప దగిన వాడు ప్రభువగు విష్ణువే. అతడు వరదు డగుటకు ఉపాయమును చెప్పెదను.
రహస్యం సర్వదేవానాం మునీనాం మనుజాంస్తథా,
నారాయణః పరో దేవ స్తం ప్రణమ్య స సీదతి.
సర్వ దేవతలకు, మునులకు, నరులకు పర దైవము నారాయణుడే. ఇది రహస్యము. అతనికి ప్రణమిల్లిన వాడు ఎన్నటికిని చెడడు.
శ్రూయతే చ పురా రాజన్ నారదేన మహాత్మనా,
కథితం తుష్టిదం విష్ణో ర్వ్రత మప్సరసాం తథా.
ఇది వినవచ్చు చున్నది. పూర్వము మహాత్ముడగు నారదుడు తుష్టి నిచ్చెడు విష్ణు వ్రతమును అప్సరసలకు చెప్పెనట.
నారదస్తు పురాకత్పే గతవాన్ మానసం సరః,
స్నానార్థం తత్ర చాపశ్యత్ సర్వ మప్సరసాం గణమ్.
పూర్వ కల్పమున ఒకప్పుడు నారదుడు స్నానము కొరకు మానస సరస్సున కరిగెను. అందు అప్సరసల గణమును చూచెను.
తాస్తం దృష్ట్వా విలాసిన్యో జటాముకుట ధారిణమ్,
అస్థిచర్మావశేషం తు ఛత్రదండ కపాలినమ్.
దేవాసురమనుష్యాణాం దిదృక్షుం కలహప్రియమ్,
బ్రహ్మయుక్తం తపోయుక్తం పప్రచ్ఛు స్తావరాంగనాః.
ఆ వరాంగనలు విలాసినులు అప్సరసలు జడలే కిరీటముగా గలవాడు, ఎముకలు తోలు మాత్రమే మిగిలిన వాడు, గొడుగు, దండము, పుఱ్ఱ అను వానిని తాల్చిన వాడు, దేవతలను రక్కసులను, నరులను చూడ గోరువాడు, కలహ ప్రియుడు, వేద నాదము కలవాడు, తపస్సుతో కూడిన వాడునగు నాతనిని చూచి ఇట్లు అడిగిరి.
అప్సరసలు:
భగవన్ బ్రహ్మతనయ భర్తృకామా వయం ద్విజ,
నారాయణశ్చ భర్తా నో యథాస్యాత్ తత్ప్రచక్ష్వ నః.
అప్సరసలు:
పూజ్యుడా! బ్రహ్మ కుమారా! మేము భర్తను కోరుచున్న వారము. మాకు నారాయణుడు భర్త యెట్లగునో దానిని ఉపదేశింపుము.
నారదుడు:
ప్రణామ పూర్వకః ప్రశ్నః సర్వత్ర విహితః శుభః,
సచమే న కృతో గర్వాద్ యుష్మాభిర్యౌవనస్మయాత్.
నారదుడు:
ప్రశ్నము ఎప్పుడును ప్రణామ పూర్వకముగా నుండ వలయును. అదియే శుభము నొసగును. మీరు వయసు పొగరున నన్ను ఆ విధముగా అడుగ రైతిరి.
తథాపి దేవదేవస్య విష్ణో ర్యన్నమ కీర్తితమ్,
భవతీభి స్తథా భర్తా భవత్వితి హరిః కృతః,
తన్నామోచ్చారణా దేవ కృతం సర్వం న సంశయః,
అయినను మీరు దేవ దేవుడగు విష్ణువు నామమును కొనియాడితిరి. మాకు హరి మగడెట్లగు నంటిరి. అతని నామమును పలుకుట చేతనే సర్వము సిద్దించినది. సంశయము లేదు.
ఇదానీం కథయా మ్యాశు వ్రతం యేన హరిః స్వయమ్,
వరదత్వ మావాప్నోతి భర్తృత్వం చ నియచ్ఛతి.
హరి స్వయముగా వరదుడగు వ్రతమును, భర్త యగుటను ప్రసాదించు దానిని చెప్పెదను వినుడు.
నారదుడు:
వసన్తే శుక్లపక్షస్య ద్వాదశీ యా భవేచ్చుభా,
తస్యా ముపోష్య విధివ న్నిశాయాం హరి మర్చయేత్.
నారదుడు:
వసంత ఋతువున చైత్ర మాసమున శుక్ల పక్షమున వచ్చు ద్వాదశి నాడు ఉపవాస ముండి విధి పూర్వకముగా రాత్రి యందు హరి నర్చింప వలయును.
పర్యజ్కా స్తరణం కృత్వా నానాచిత్ర సమున్వితమ్,
తత్ర లక్ష్మ్యా యుతం రౌప్యం హరిం కృత్వా నివేశయేత్.
తెల్లని వప్త్రము కప్పిన పాన్పును, పెక్కు చిత్రములు కల దానిని ఏర్పరచి అందు లక్ష్మితో కూడిన హరిని వెండితో చేసి నిలుప వలయును.
తస్యోపరి తతఃపుష్పైః మండపం కారయేద్ బుధః,
నృత్యవాదిత్రగేయైశ్చ జాగరం తత్ర కారయేత్.
అ పాన్పు మీదుగా పూవులతో చక్కని మండపమును ఏర్పరుప వలయును. నృత్యములు, వాద్యములు, పాటలు మున్నగు వానితో అందు జాగరము చేయ వలయును.
మనోభవాయేతి శిర అనంగాయేతి వై కటిమ్,
కామాయ బాహమూలే తు సుశాస్త్రాయేతి చోదరమ్.
మన్మథాయేతి పాదౌతు హరయేతి చ సర్వతః,
పుష్పైః సంపూజ్య దేవేశం మల్లికాజాతిభి స్తథా.
‘ఓం నమో మనోభవాయ’ అని శిరస్సున, ‘నమః అనంగాయ’ అని నడుమును, ‘నమః కామాయ’ అని భుజములను, ‘నమః సుశాస్త్రాయ’ అని ఉదరమును, ‘నమో మన్మథాయ’ అని పాదములను, ‘నమో హరయే’ అని సర్వాంగములను, మల్లెలు, జాజులు మొదలగు పూవులతో చక్కగా పూజింప వలయును.
పశ్చా చ్చతుర ఆదాయ ఇక్షుదణ్డాన్ సుశోభవాన్,
చతు ర్దిక్షు న్యసేత్ తస్య దేవస్య ప్రణతో నృప.
పిదప చక్కని నాలుగు చెఱకు గడలను దేవునకు నాలగు దిక్కు లందను నిలప వలయును.
ఏవం కృత్వా ప్రభాతేతు ప్రదద్యాద్ బ్రాహ్మణాయ వై,
వేదవేదాంగయుక్తాయ సంపూర్ణాంగాయ ధీమతే.
ఇట్లొనర్చి మరునాడు తెల్లవారిన తరువాత, వేదము లందును, వేదాంగము లందను పండితుడును, బుద్ధి మంతుడును, ఏ అంగ వైకల్యము లేనివాడును అగు బ్రాహ్మణునకు దాన మీయ వలయును.
బ్రాహ్మణాంశ్చ తథా పూజ్య వ్రత మేతత్ సమాపయేత్,
ఏవం కృతే తథా విష్ణు ర్భర్తా వో భవితా ధ్రువమ్.
అట్లే బ్రాహ్మణులను పూజించి ఈ వ్రతమును సమాపనము చేయ వలయును. ఇట్లు చేసినచో మీకు తప్పక విష్ణువు భర్తయగను.
అకృత్వా మత్ప్రణాయం తు పృష్టో గర్వేణ శోభనాః,
అవమానస్య తస్యాయం విపాకో వో భవిష్యతి.
సుందరులారా! మీరు నాకు మ్రొక్కు నిడక గర్వముతో అడిగితిరి. ఈ అవమాన మునకు ఫలము మీకు తప్పక కలుగును.
ఏతస్మి న్నేవ సరసి అష్టావక్రో మహామునిః,
తస్యోపహాసం కృత్వా తు శాపం లప్స్యథ శోభనాః.
సుందరులారా! ఈ సరస్సు నందే అష్టావక్రుడను మహాముని కలడు. అతనిని వెక్కిరించి మీరాతని శాపము పొందెదరు.
వ్రతేనానేన దేవేశం పతిం లబ్ధ్వా భిమానతః
అవమానే పహరణం గోపాలై ర్వో భవిష్యతి,
పురా హర్తా చ కన్యానాం దేవో భర్తా భవిష్యతి.
ఈ వ్రతము చేత దేవ దేవుని పతిగా పొందుదురు. కాని ఈ అవమానము వలన గోపాలుర చేత మీ అపహరణము కలుగును. పూర్వము కన్యలను హరించిన ఆ దేవుడు మీకు భర్త కాగలడు.
అగస్త్యుడు:
ఏవ ముక్త్వా స దేవర్షిః ప్రయయౌ నారదః క్షణాత్,
తా అప్యేతద్ వ్రతం చక్రు స్తుష్టశ్చాసాం స్వయంహరిః
అగస్త్యుడు:
ఇట్లు పలికి ఆ దేవర్షి నారదుడు క్షణములో అట నుండి వెడలి పోయెను. వారును ఆ వ్రతము నాచరించిరి. హరి స్వయముగా వారి యెడల తుష్టు డాయెను.