అధ్యాయము - 59

అగస్త్యుడు:

అథావిఘ్నకరం రాజన్‌ కథయామి శృణుష్వ మే,

యేన సమ్యక్‌ కృతేనాపి న విఘ్న ముపజాయతే.

అగస్త్యుడు:

రాజా! నీకు అవిఘ్నకరమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది చక్కగా చేసినచో విఘ్నము అనునది కలుగదు.

చతుర్థ్యాం ఫాల్గునే మాసి గ్రహీతవ్యం వ్రతం త్విదమ్‌.

నక్తాహారేణ రాజేన్ధ్ర తిలాన్నం సారణం స్మృతమ్‌,

తదే వాగ్నౌచ హోతవ్యం బ్రాహ్మణాయ చ తద్భవేత్‌.

రాజా! ఫాల్గున మాసమున చవితి నాడు ఈ వ్రతమును చేపట్ట వలయును. రాత్రి పూట నువ్వులు కలిపిన భోజనము చేయ వలయును. దానినే హోమము చేసి బ్రాహ్మణునకును ముందు సమర్పింప వలయును.

చాతుర్మాస్యం వ్రతం చైతత్‌ కృత్వా వై పంచయే తథా,

సౌవర్ణం గజవక్త్రం తు కృత్వా విప్రాయ దాపయేత్‌.

పాయసైః పంచభిః పాత్రై రుపేతం తు తిలైస్తథా,

ఏవం కృత్వా వ్రతం చైతత్‌ సర్వవిఘ్నై ర్విముచ్యతే.

ఈ వ్రతమును కూడ నాలుగు మాసముల కాలము చేయ వలయును. అయిదవ నెలలో సువర్ణముతో విఘ్నేశ్వరుని ప్రతిమను చేయించి అయిదు పాత్రల యందు నువ్వులతో కూడిన పాయసముతో పాటు దానము చేయ వలయును. ఇట్లు ఈ వ్రతమును చేసిన వాడు అన్ని విఘ్నముల నుండియు విడివడును.

హయమేధస్య విఘ్నేతు సంజాతే సగరః పురా,

ఏతదేవ చరిత్వా తు హయమేధం సమాప్తవాన్‌.

మునుపు సగరుడు తన అశ్వమేధ యాగమునకు విఘ్నము కలుగగా దీనినే ఆచరించి ఆ యజ్ఞము సమాప్తి చేసికొనెను.

తథా రుద్రేణ దేవేన త్రిపురం నిఘ్నతా పురా,

ఏత దేవ కృతం తస్మాత్‌ త్రిపురం తేన పాతితమ్‌,

మయా సముద్రం పిబతా ఏత దేవకృతం వ్రతమ్‌.

అన్యైరపి మహీపాలై రేతదేవ కృతం పురా,

తపోర్థిభి ర్జానకృతై ర్నిర్విఘ్నూర్థే పరంతప.

త్రిపురాసురులను వధించునపుడు రుద్ర దేవుడు దీని నాచరించియే వారి సంహారము గావించెను. నేనును సముద్రమును త్రావునపుడు ఈ వ్రతము నాచరించితిని. మరియు పెక్కండ్రు రాజులు, తాపసులు, జ్ఞానవంతులు విఘ్నములు లేకుండుటకై ఈ వ్రతమును చేసి యున్నారు.

శూరాయ ధీరాయ గజాననాయ లంబోదరా యైక దంష్ట్రాయ చైవ,

ఏవం పూజ్య స్తద్దినే తత్‌ పునశ్చ హోమం కుర్యాద్‌ విఘ్నవినాశ హేతోః.

‘శూరుడు, ధీరుడు, గజముఖుడు, లంబోదరుడు, ఏక దంతుడు అగు దేవునకు నమస్కారము’ అనుచు ఆ దినమున పూజింప వలయును. విఘ్నములు నశించుటకై తిరిగి హోమము నాచరించ వలయును.

అనేక కృతమాత్రేణ సర్వవిఘ్నై ర్విముచ్యతే,

వినాయకస్య కృపయా కృతకృత్యో నరో భవేత్‌.

ఈ వ్రతము నాచరించిన మాత్రమున నరుడు, నెరవేరిన ప్రయోజనములు కలవాడై వినాయకుని కృప చేత సర్వ విఘ్నముల నుండియు ముక్తుడగును.