అధ్యాయము - 136

దీప స్పర్శనాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

దీప స్పర్శన దోష ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

దీపం స్పృష్ట్వా తు యో దేవి మమ కర్మాణి కారయేత్‌,

తస్యాపరాధాద్‌ వై భూమి పాతం ప్రాప్నోతి మానవాః.

శ్రీవరాహ దేవుడు:

దేవీ! దీపము ముట్టుకొని నా పూజలు చేయుట అను దోషము వలన మానవుడు పాటు నొందును.

తచ్ఛ్రుణుష్వ మహాభాగే కథ్యమానం మయానఘే,

జాయతే షష్టివర్షాణి కుష్ఠీ గాత్ర పరిప్లుతః,

చాణ్డాలస్య గృహే తత్ర ఏవ మేత న్న సంశయః.

పుణ్యాత్ములారా! దానిని గూర్చి చెప్పు చున్నాను. వినుము. అట్టివాడు అరువది యేండ్లు కుష్ఠ రోగియై చండాలుని యింట ఉండును. ఇందు సంశయము లేదు.

ఏవం భుక్త్వా తు తత్కర్మ మమ క్షేత్రే మృతో యది,

మద్భక్త శ్చైవ జాయేత శుద్ధే భాగవతే గృహే.

ఇట్లు ఆ కర్మ ఫలము ననుభవించి నా క్షేత్రమున మరణించె నేని నా భక్తుడై పవిత్రమగు భాగవతుని యింట జన్మించును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి దీపస్య స్పర్శనాద్‌ భువి,

తరన్తి మనుజా యేన కష్టచండాల యోనిషు.

దీపమును తాకిన దానికి ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దీనితో మానవులు నీచములగు చండాల యోనుల నుండి బయట పడుదురు.

యస్య కస్యాపి మాసస్య శుక్లపక్షే చ ద్వాదశీమ్‌,

చతుర్థభక్త మాహార మాకాశశయనే స్వపేత్‌.

ఏదో ఒక మాసమున శుక్లపక్ష ద్వాదశి నాడు నాలుగవ కాలమున ఆహారమును కొనుటయు, ఆరు బయలున నిద్రించుటయు చేయ వలయును.

దీపం దత్వాపరాధాత్‌ వై తరన్తి మనుజా భువి,

శుచి ర్భూత్వా యథాన్యాయం మమ కర్మపథే స్థితాః.

విధి ననుసరించి నాకు దోష పరిహారముగా దీపము నొసగి పవిత్రులై నా పూజా మార్గమున నిలుతురు.

ఏతత్‌ తే కథితం దేవి స్పర్శనాత్‌ దీపకస్య తు,

సంసారశోధనం చైవ యత్‌ కృత్వా లభతే శుభమ్‌.

దీపము తాకుట అను దోషము నుండి శుద్ధి కలిగించు విధానమును నీకు చెప్పితిని. దీని వలన నరుడు శుభమును పొందును.

శ్మశాన ప్రవేశాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

శ్మశాన ప్రవేశ దోషపు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

శ్మశానం యో నరో గత్వా అస్నాత్వైవతు మాం స్పృశేత్‌,

మమ దోషాపరాధం చ శృణు తత్త్వేన నిష్కలమ్‌.

శ్రీవరాహ దేవుడు:

నరుడు వల్లకాటికి వెళ్ళి స్నానము చేయకయే నన్ను తాకినచో అట్టి దోషము ఫలమును స్పష్టముగా చెప్పెదను. వినుము.

జమ్బుకో జాయతే భూమౌ వర్షాణాం నవ పఞ్చ చ,

గృధ్రస్తు సప్తవర్షాణి జాయతే ఖచరేశ్వరః,

చరన్తౌ మానుషం మాంసముభౌ తౌ గృధ్రజంబుకౌ.

పదు నాలుగేండ్లు భూమిపై నక్క యగును. ఏడేండ్లు పక్షి రాజగు గ్రద్ద యగును. అవి రెండును మనుష్య మాంసమును తిను చుండును.

పిశాచో జాయతే తత్ర వర్షాణి నవ పఞ్చ చ,

తతస్తు కుణపోచ్ఛిష్టం త్రింశద్వర్షాణి ఖాదతి.

పిదప పదు నాలుగేండ్లు పిశాచ మగును. అటుపై ముప్పది యేండ్లు శవముల ఎంగిలిని తిను చుండును.

తతో నారాయణా చ్ఛ్రుత్వా ధరణీ వాక్య మబ్రవీత్‌,

ఏత న్మే పరమం గుహ్యం లోకనాథ జనార్దన,

పరం కౌతూహలం దేవ నిఖిలం వక్తు మర్హసి.

నారాయణుని వలన అట్టి మాట విని ధరణి యిట్లు పలికెను. లోకనాథా! జనార్దనా! నాకు మిక్కిలి ఉత్కంఠ కలుగు చున్నది. ఈ రహస్యమును మొత్తముగా చెప్ప దగును.

శ్మశానం పుణ్డరీకాక్ష ఈశ్వరేణ ప్రశంసితమ్‌,

కిం తత్ర విగుణం దేవ పవిత్రే శివభాషితే.

పుండరీకాక్షా! వల్లకాడు ఈశ్వరుని మెప్పు పొంది నట్టిది. అట్టి పవిత్రము, శివుడు మెచ్చినది యగు వల్లకాటి యందలి దోషమేమి?

స తత్ర రమతే నిత్యం భగవాం స్తు మహాద్యుతిః,

కపాలం గృహ్య దేవోత్ర దీప్తమన్తం మహౌజసమ్‌.

గొప్ప తేజస్సు గల భగవానుడు శివ దేవుడు కాంతులు చిమ్మునది, గొప్ప శక్తి కలదియు నగు పుఱ్ఱను చేత బట్టి అందు ప్రతి దినము క్రీడించు చుండును.

ప్రశంసితం చ రుద్రేణ భవతా కించ నిన్దితమ్‌,

శ్మశానం పద్మపత్రాక్ష రుద్రస్య చ నిశి ప్రియమ్‌.

రుద్రుడు మెచ్చినది, రాత్రుల యందు ఆతనికి ప్రియమైనది అగు శ్మశానమును నీవు నిందింపనేల?

శ్రీవరాహ దేవుడు:

శృణు తత్త్వేన మే దేవి ఇద మాఖ్యాన ముత్తమమ్‌,

అద్యాపి తే న జానన్తి హ్యనఘే సంశితవ్రతాః,

కృత్వా సుదుష్కరం కర్మ సర్వభూతపతిం హరమ్‌.

శ్రీవరాహ దేవుడు:

దేవీ! ఈ కథను శ్రేష్ఠమైన దానిని బాగుగా వినుము. ఉత్తమములగు వ్రతములు కలవారు కూడ సర్వ భూతములకు నాథుడైన శంకరుని, ఆతడొ నర్చిన మిక్కిలి దుష్కరమైన కార్యమును ఎరుగ కున్నారు.

హత్వా చ బాలవృద్ధాని త్రిపురే రూపిణీః స్త్రియః,

తేన పాపేన సంబద్ధో న శక్నోతి విచేష్టితుమ్‌.

త్రిపురాసుర సంహార సమయమున పసి వారిని, ముదుసలులను, ఆడువారిని చంపి ఆ పాపము చేత కట్టువడి శివుడు కాలు చేతు లాడని దశలో నుండెను.

ప్రణష్టే మానసైశ్వర్యే న స్వమాయా చ యోగినః,

వివర్ణవదనో భూత్వా తిష్ఠతే స మహేశ్వరః,

తత్ర స్థానేశ్వరో భూమి గణైః సర్వైః సమావృతః.

మనస్సు మహిమ చెడిపోగా, తనదగు యోగమాయ పనికిమాలినది కాగా ఆ మహేశ్వరుడు తన ప్రమథ గణములు చుట్టి యుండగా మొగము వెలవెల పోయి అచట స్థానేశ్వరుడై నిలిచి పోయెను.

నష్టమాయం తతో దేవి చిన్తయామి వసుంధరే,

తతో ధ్యాతో మయా దేవి ఈశ్వరః పున రేష్యతి.

వసుంధరా! అట్లు మాయ నశించిన ఈశ్వరుని నేను ధ్యానించితిని. ఈశ్వరుడు మరల తన శక్తిని పొంద వలయునని నా భావన.

యావత్‌ పశ్యామి తం దేవం దేవి దివ్యేన చక్షుషా,

నష్టమాయాబలం రుద్రం సర్వభూతమహేశ్వరమ్‌.

నేను దివ్యమగు చూపుతో ఆ దేవుని చూచునంతలో ఆ సర్వభూత మహేశ్వరుడు నశించిన మాయా బలము కలవాడై యుండెను.

తతోహం తత్ర గత్వాతు యష్టుకామం త్రియంబకమ్‌,

నష్టసంజ్ఞో హతజ్ఞానో నష్టయోగ బలోబలః.

నేనందు పోయి యజించు కోరిక గల ముక్కంటిని చూడగా అతడు చైతన్యము లేనివాడు, జ్ఞానము కోల్పోయిన వాడు, యోగ బలము నశించిన వాడు, జ్ఞానము లేని వాడునై కన్పట్టెను.

తత ఈశో మయా చోక్తో వాక్య మేవ సుఖావహమ్‌,

కిమిదం తిష్ఠతే రుద్ర కశ్మలేన సమావృతః.

అప్పుడు నేను సుఖమును గూర్చు పలుకు నిట్లు పలికితిని. రుద్రా! ఇదియేమి? ఇట్లు పాప భావము చుట్టుకొని యున్నావు?

త్వం కర్తా చ వికర్తా చ వికారాకార ఏవ చ,

త్వం వై సాంఖ్యం చ యోగం చ త్వం యోని స్త్వం పరాయణమ్‌.

నీవు కర్తవు. వికర్తవు. వికారమైన ఆకారము కలవాడవు. సాంఖ్యము, మోగము నీవే. లోకముల పుట్టుకకు పరమ గతికి కారణమవు నీవే. (సాంఖ్యము = జ్ఞాన మార్గము = యోని = పుట్టుక స్థానము. పరాయణమ్‌ = పరమ గతి)

త్వముగ్ర దేవదేవాది స్త్వం సోమ స్త్వం తధా దిశః,

కింన బుద్ధ్యసి చాత్మానం గణైః పరివృతో భవాన్‌.

ఓయి ఉగ్రా! నీవు దేవ దేవుడవు, మొదటి వాడవు, సోముడవు. దిక్కు లన్నియు నీవే. ఈ ప్రమథ గణములు చుట్టుకొని యుండగా నిన్ను నీవేల తెలియ కున్నావు.

కిమిదం దేవదేవేశ వివర్ణం పృథులోచనః,

త న్మమాచక్ష్వ తత్త్వేన ఏష యత్పృచ్ఛితో భవాన్‌.

దేవదేవా! ఈశా! ఇదియేమి? పాలి పోయితివి. మిడి గ్రుడ్లవాడ వైతివి. నిజమున కిది యేమో, అడుగు చున్నాను. చెప్పుము.

స్మర యోగం చ మాయాం చ పశ్య విష్ణో ర్మహాత్మనః,

తవ చైవ ప్రియార్థాయ యేనా హ మిద మాగతః.

నీ యోగమును, మాయను గుర్తు తెచ్చు కొనుము. మహాత్ముడగు విష్ణువును నన్ను చూడుము. నీ ప్రియము కొరకే ఇదిగో నేను ఇచటికి వచ్చితిని.

తతో మమ వచః శ్రుత్వా లబ్ధసంజ్ఞో మహేశ్వరః,

ఉవాచ మధురం వాక్యం పాపసంతప్త లోచనః.

అంత నా మాటవిని మహేశ్వరుడు కొంత తెలివిని పొందెను. పాపముతో వేడెక్కిన కనులు కలవాడై తీయగా ఇట్లు పలికెను.

శృణు తత్త్వేన మే దేవ కోన్యోప్యేవం కరిష్యతి,

అన్యో నారాయణం చైకం సర్వలోకవరం శుభమ్‌.

దేవా! ఉన్న దున్నట్లు చెప్పెదను. వినుము. సర్వ లోకములలో శ్రేష్ఠుడు, మంగళుడు అయిన నారాయణుడు కాక మరి యింకొకడు ఇట్లు చేయ గలడా?

హే విష్ణో త్వత్ర్పసాదేన పావనం చైవ మాధవ,

లబ్ధం యోగం చ సాంఖ్య చ జాతోస్మి విగతజ్వరః,

త్వత్ర్పసాదేన జాతోస్మి పూర్ణేన్దు రివ నిర్మలః.

ఓ విష్ణూ! నీ అనుగ్రహము వలన నేను పవిత్రుడ నైతిని. నా యోగము, నా జ్ఞానము నాకు లభించినవి. మాధవా! నా జబ్బు పోయినది. నీ దయ వలన నేను నిండు చందురుని వలె నిర్మలుడ నైతిని.

అహం త్వా తు విజానామి మమ త్వం తు విజానతః,

అన్యః కశ్చి న్న జానాతి తే మే చైవ మనన్తరమ్‌.

నీవు నన్నెరుగుదువు. నేను నిన్నెరుగుదును. మన యిరువురను మరియొక్క డెవ్వడును ఎరుగడు.

బ్రహ్మా తద్వ న్న జానాతి లిప్యమానోపి నిత్యశః,

సాధు విష్ణో మహాభాగ సర్వమాయా కరణ్డక.

ఎల్లప్పుడు అంటి పెట్టుకొని యుండు వాడే అయినను బ్రహ్మయు ఆ విధముగా మనల నెరుగడు. మేలు! విష్ణూ! మహాత్మా! నీవు మాయ లన్నింటికి పెట్టెవు.

ఏవం మహ్యం హరో వాక్య ముక్త్వా భూతమహేశ్వరః,

ముహూర్తం ధ్యాన మాస్థాయ పునః ప్రోవాచ మాం వచః.

ఆ హరుడు నాతో ఇట్లు పలికి ఒక్క క్షణ కాలము ధ్యానము న నిలిచి మరల నాతో ఇట్లనెను.

తవ విష్ణో ప్రసాదేన మయా తత్‌ త్రిపురం హతమ్‌,

నిహతా దానవా స్తత్ర గర్భిణ్యశ్చ నిపాతితాః.

విష్ణుదేవా! నీ దయ వలన నేను త్రిపురములను కూల్చి వైచితిని. ఆ రక్కసులను చంపి వైచితిని. గర్భవతులగు స్త్రీలును నా చేత మడిసిరి.

బాలవృద్ధా హతా స్తత్ర విస్ఫురన్తో దిశో దశ,

తస్య పాపస్య దోషేణ న శక్నోమి విచేష్టితుమ్‌.

బాలురు, వృద్ధులను పది దిక్కులకు పరువులు తీయుచు నా వలన చచ్చిరి. ఆ పాపము వలన నేను కాలు చేతులాడింప జాల కున్నాను.

నష్టం యోగం చ మాయాం చ నష్టైశ్వర్యస్య మే భవాన్‌,

కిం మయా కృష్ణ కర్తవ్యం ఏనోవస్థేన మాధవ.

నా యోగము, నా మాయ, నా ఐశ్వర్యము అన్నియు చెడి పోయినవి. కృష్ణా! మాధవా! ఇట్టి పాప దశలో ఉన్న నాకు ఇప్పుడు కర్తవ్యమేమి?

విష్ణో తత్త్వేన మే బ్రూహి శోధనం పాపనాశనమ్‌,

యేన వై కృతమాత్రేణ శీఘ్రం ముచ్యేత కిల్బిషాత్‌.

విష్ణూ! నిక్కముగా నా పాపమును పరిమార్చు ప్రాయశ్చిత్త మెట్టిది? ఏది చేసినంత నేను దోషము నుండి ముక్తి పొందుదునో దానిని నాకు చెప్పుము.

ఏవం చిన్తాత్మన స్తత్ర మయా రుద్రశ్చ భాషితః,

కపాల మాలాం గృహీత్వా త్వం సమలం గచ్ఛ శంకర.

ఇట్లు చింత పైకొన్న మనసు గల శివునితో నేనిట్లంటిని. శంకరా! పుఱ్ఱల మాలను చేతబట్టి నీవు ‘సమల’ అను చోటికి అరుగుము.

మమైవ వచనం శ్రుత్వా భగవాన్‌ పరమేశ్వరః,

ఉవాచ మాం పునర్వ్యక్తం మాం బోధయ జగత్పతే,

కీదృశః సమలో విష్ణో యత్ర గచ్ఛామహే వయమ్‌.

నా మాట విని భగవానుడగు పరమేశ్వరుడు నాతో ఇట్లు పలికెను. జగత్పతీ! మరల నాకు చక్కగా తెలియ జెప్పుము. నేను పోవలసిన ఆ ‘సమల’ ఎట్టిది?

తత స్తస్య వచః శ్రుత్వా శంకరస్య యశస్విని,

తత్పాపశోధనార్థాయ మయా వాక్యం ప్రభాషితమ్‌.

అంత ఆ శంకరుని పలుకు విని ఆతని పాపము శుద్ధి యగుటకై నేనిట్లు పలికితిని.

శ్మశానం సమలో రుద్ర పూతికో వ్రణగన్ధికః,

స్వయం తిష్ఠన్తి వై తత్ర మనుజా విగత స్పృహాః.

రుద్రా! శ్మశానమే సమల. కుళ్ళుతో నిండినది. గాయముల చెడు వాసనతో కూడి యుండును. అందు మనుజులు చైతన్యము లేనివారై పడి యుందురు.

యత్ర గృహ్య కపాలాని రమ తత్రైవ శంకర,

తత్ర వర్షసహస్రాణి దివ్యాన్యేన దృఢవ్రతః.

శంకరా! అచట పుఱ్ఱలను గైకొని వేల కొలది దివ్యములగు ఏండ్లు చెడని వత్రము కలవాడవై విహరింపుము.

తతో భక్షయ మాంసాని పాపక్షయ చికీర్ష భోః,

హింసమానాని భోజ్యాని యేచ భోజ్యా స్తవ ప్రియాః.

పిమ్మట మాంసములను తిను చుండుము. పాపక్షయము కలుగు పనులను జేయ గోరుము. హింసించు స్వభావము గలవాని నంజుడులు నీకు ప్రియమైన భోజనము లగును.

ఏవం సర్వైర్గణైః సార్థం వస తత్ర సునిశ్చితం,

పూర్ణే వర్షసహస్రేతు స్థిత్వా త్వం సమలే పునః,

గచ్ఛాశ్రమపదం పశ్చాద్‌ గౌతమస్య మహామునేః.

నీ ప్రమథ గణము లన్నింటితో పాటు అచట చెదరని నిశ్చయము కలవాడవై నిండుగా వేయి యేండ్లు నిండిన పిదప గౌతమ మహాముని ఆశ్రమమున కరుగుము.

తత్ర జ్ఞాస్యసి చాత్మాన మాశ్రమే విధిసంస్థితే,

ప్రసాదాత్‌ గౌతమ మునే ర్భవితా గతకిల్బిషః.

చక్కని విధులతో నెలకొన్న ఆ ఆశ్రమమున నిన్ను నీవు తెలిసికొన గలవు. గౌతమ ముని దయ వలన నీవు పాపములు పోయిన వాడ వగుదువు.

సతతం పాపసంపన్నం కపాలం శిరసి స్థితమ్‌,

ఋషిః పాతయితుం శక్త స్త్వత్ప సాదా న్న సంశయః.

పాపముల పుట్ట అయిన నెత్తిని నున్న పుఱ్ఱను ఋషి పడగొట్టుటకు సమర్థు డగును. సంశయము లేదు.

ఏవం తస్య వరం దత్వా తత్రై వాన్త రధీయత,

రుద్రోపి భ్రమతే తత్ర శ్మశానే పాపసంవృతే.

ఇట్లతనికి వరమిచ్చి నేనచట అంతర్ధానము చెందితిని. రుద్రుడును పాపములు చుట్టు ముట్టిన ఆ శ్మశానమున తిరుగు చుండెను.

అతో నరోచతే భూమి శ్మశానం మే కదాచన,

యత్ర రుద్రకృతం పాపం తిష్ఠతే చ యశస్విని,

ఏతత్తే కథితం భద్రే శ్మశానస్య జుగుప్సితమ్‌.

భూమీ! అందు వలననే వల్లకాడన్న నా కిష్ట ముండదు. రుద్రుడు చేసిన పాపమున్న తావు కదా! దానికి సంబంధించిన రోత పనిని గూర్చి నీకు చెప్పితిని.

వినాపి కృతసంస్కారో మమ కర్మపరాయణః,

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి యేన శుద్ధ్యతి కిల్బిషాత్‌.

సంస్కారము పొందకున్నను నా పూజా కార్యముల యందు శ్రద్ధ కలవాడు పాపము నుండి విడివడు ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

కృత్వా చతుర్థభక్షం తు దినాని దశ పఞ్చ చ,

ఆకాశ శయనం కుర్యా దేకవస్త్రః కుశాస్త రే.

పదునైదు దినములు దినము నాలుగవ భాగమున భోజనము చేయుచుండ వలయును. ఒక్క వస్త్రమును తాల్చి దర్భల చాప పై బయలున నిద్రించు చుండ వలయును.

ప్రభాతే పఞ్చగవ్యం తు పాతవ్యం కర్మ కారణాత్‌,

విముక్తః సర్వపాపేభ్యో మమ లోకాయ గచ్ఛతి.

తెల్లవారు జామున పంచగవ్యమును త్రావ వలయును. ఇట్లు చేసి అన్ని పాపముల నుండియు విడివడి నా లోకమున కరుగును.

పిణ్యాకభక్షణ ప్రాయశ్చిత్తమ్‌

తెలక పిండి తిన్న దానికి ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

పిణ్యాకం భక్షయిత్వా తు యో వై మాముపసర్పతి,

తస్య వై శృణు సుశ్రోణి హ్యపరాధం మహౌజసమ్‌.

శ్రీవరాహ దేవుడు:

సుశ్రోణీ! తెలక పిండి తిని నన్ను సమీపించు వాని ఆ గొప్ప పాతకమును గూర్చి చెప్పెదను. వినుము.

ఉలూకో దశవర్షాణి కచ్ఛపస్తు సమాస్త్రయః,

జాయతే మానవ స్తత్ర మమ కర్మపరాయణః.

పదియేండ్లు గుడ్ల గూబయు, మూడేండ్లు తాబేలును అయి నా పూజా పరాయణుడు మరల మానవుడుగా పుట్టును.

తస్య వక్ష్యామి సుశ్రోణి ప్రాయశ్చిత్తం మహౌజసమ్‌,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత సంసారాన్తం చ గచ్ఛతి.

గొప్ప శక్తి గల ప్రాయశ్చిత్తమును అట్టి వానికి చెప్పెదను. దాని చేత అతడు ఆ పాపము నుండి ముక్తుడై మోక్షమునకు అరుగును.

యావకేన దినైకం తు తక్రేణ సహ కారయేత్‌,

ఏకపిండ విమిశ్రేణ ఉదకేన సహ పిబేత్‌.

యవల పిండిని మజ్జిగతో కలిపి ఒక్క ముద్దను ఒక దినమునకు చొప్పున నీటితో కలిపి తీసికొన వలయును.

ఏవం తతో విధిం కుర్యాన్‌ మమ కర్మపరాయణః,

రాత్రౌ వీరాసనం కుర్యా దాకాశశయనే వసేత్‌.

నా పూజల యందు ఆసక్తి కల నరుడు ఇట్లా విధి నాచరింప వలయును. రాత్రి యందు బయలున వీరాసనము వేసికొని యుండ వలయును.

ఆకాశశయనం కృత్వా ప్రభాతే చైవ సాధకః,

పంచగవ్యం తతః పీత్వా శీఘ్రం పాపాత్‌ ప్రముచ్యతే.

ఆరు బయలున నిద్రించి వేకువ జామున ఆ సాధకుడు పంచగవ్యమును సేవింప వలయును. ఇట్లాతడు ఆ పాపము నుండి విముక్తుడగును.

య ఏతేన విధానేన వసుధే కర్మ కారయత్‌,

న స గచ్ఛతి సంసారం మమ లోకాయ గచ్ఛతి.

భూదేవీ! ఇట్టి పద్ధతితో ప్రాయశ్చిత్త కర్మము లాచరించు వాడు మరల సంసారమున పొందడు. నా లోకమున కరుగును.

 వారాహమాంస ప్రాపణాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

పందిమాంసపు నివేదన తప్పునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

వరాహ మాంసేన తు యో మమ కుర్వీత ప్రాపణమ్‌,

మూర్ఖా స్తే పాపకర్మాణో మమ కర్మ పరాయణాః.

శ్రీవరాహ దేవుడు:

పంది మాంసముతో నాకు నివేదన మిడువారు మూర్ఖులు. పాప కర్ములు. వారు నా అర్చకు లైనను వారి గతి అట్టిదియే.

యాంస్తు దోషాన్‌ ప్రపద్యన్తే సంసారం చ వసుంధరే,

తాని తే కథయిష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే.

ఓ భూదేవీ! ఎట్టి దోషములను చేసి సంసారమున చిక్కు కొందురో వానిని తెలిపెదను. వినుము.

యావద్‌ రోమా వరాహస్య మమ గాత్రేషు సంస్థితాః,

తావద్‌ వర్ష సహస్రాణి నరకే పతతే భువి.

వరాహ రూపుడనగు నా అంగముల యందు ఎన్ని రోమములు కలవో అన్నివేల యేండ్లు నరకమున పడుదురు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

వారాహేణ తు మాంసేన యస్తు కుర్వీత ప్రాపణమ్‌.

యావత్‌ తత్ర చ సిక్థాని భాజనేషు ప్రతిష్ఠితాః,

తావత్స పతతే దేవి శౌకరీం యోని మాస్థితః,

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. వినుము. పంది మాంసముతో నాకు నివేదనము చేయువాడు, ఆ పాత్రల యందు ఎన్ని మెతుకు లుండునో అన్ని వేల యేండ్లు పంది కడుపున పడి యుండును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

యాం గతిం సంప్రపద్యన్తే మమ కర్మపరాయణాః.

నా ఆరాధన యందు శ్రద్ధ కలవారు ఇట్టి దోషము చేత ఎట్టి గతిని పొందుదురో తెలియ జెప్పెదను. చక్కగా వినుము.

అన్ధో భూత్వా తతో దేవి జన్మ చైకంతు తిష్ఠతి,

ఏవం గత్వా తు సంసారం వారాహామిష ప్రాపణాత్‌.

అట్టివారు ఒక జన్మము కాలము గ్రుడ్డివారై ఉందురు. పంది మాంసమును నివేదన మిడిన పాపము వలన ఇట్టివారై మరల సంసారమును పొందుదురు.

జాయతే విపులే శుద్ధే కులే భాగవతే శుచిః,

వినీతః కృతసంస్కారో మమ కర్మపరాయణః,

ద్రవ్యవాన్‌ గుణవాం శ్చైవ రూపవా ఞ్ఛీల వా ఞ్ఛుచిః.

అపుడతడు పెద్దది, శుద్ధము, భగవద్భక్తి కలది అగు కులమున పవిత్రుడై జన్మించును. వినయము కలవాడగును. సంస్కారము పొందిన వాడగును. ధనవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, శీలవంతుడు, శుచియు నగును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి తస్య కాయవిశోధనమ్‌,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత మమ కర్మపరాయణః.

అతని శరీరమును శుద్ధి యొనరించు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. దాని వలన ఆ నా అర్చకుడు పాపము నుండి విడివడును.

ఫలాహారో దినాన్‌ సప్త సప్త మూలాశన స్తథా,

దినాని సప్త తిష్ఠేత సప్త వై పాయసేన చ.

ఏడు రోజులు పండ్లు, ఏడు రోజులు దుంపలు తినువాడు కావలయును. ఏడు రోజులు ఏమియు తినకుండ వలయును. మరల ఏడు రోజులు పాయసముతో గడుప వలయును.

తక్రేణ సప్త దివసాన్‌ సప్త యావకభోజనః,

దధ్యాహారో దినాన్‌ సప్త దినే హఙ్కార వర్జితః.

ఏడు దినములు మజ్జిగతో, ఏడు దినములు జావతో ఏడు దినములు పెరుగుతో గడుప వలయును. ప్రతి దినము అహంకారము లేక మెలగ వలయును.

కరోతి యస్తు వై భూమే మయోక్తం కర్మసంసది,

ప్రాయశ్చిత్తం మహాభాగ మమ లోకాయ గచ్ఛతి.

ఇట్టి నేను చెప్పిన కర్మ పద్ధతిలో ప్రాయశ్చిత్తమును ఆచరించు వాడు ఓ పుణ్యశీలా! నా లోకమున కరుగును.

మద్యపానాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

మద్యపాన దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

మద్యం పీత్వా వరారోహే యస్తు మా ముపసర్పతి,

తత్ర దోషం ప్రవక్ష్యామి శృణు సుందరి తత్త్వతః.

శ్రీవరాహ దేవుడు:

ఓ వరారోహా! మద్యము త్రావి నా కడకు అరుదెంచు వాని దుర్గతిని తెలిపెదను. సుందరీ! దానిని తత్త్వముతో వినుము.

దశవర్ష సహస్రాణి దరిద్రో జాయతే పునః,

మానవశ్చ భవే త్తత్ర మద్భ క్తశ్చ న సంశయః.

అట్టివాడు పది వేల యేండ్లు దరిద్రుడై పుట్టును. మరల ఆతడు సాధారణ మానవుడై నా భక్తుడగును. సంశయము లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణోహి వసుంధరే,

అగ్నివర్ణాం సురాం పీత్వా యేన ముచ్యన్తి కిల్బిషాత్‌.

ఓ వసుంధరా! నీకొక్క విషయమును చెప్పెదను. నిప్పురంగు గల మద్యమును త్రావినచో అట్టివాడీ పాపము నుండి ముక్తుడగును. (అగ్ని వర్ణ మద్యము = ప్రాయశ్చిత్తమునకై ఏర్పరచిన పవిత్ర వస్తువులతో కూడిన ద్రవ పదార్థము.)

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న స లిప్యతి పాపేన సంసారం న చ గచ్ఛతి.

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము నాచరించు వానికి పాప మంటదు. మరల సంసారమున పడడు.

కుసుంభశాఖ భక్షణ ప్రాపణకయోః ప్రాయశ్చిత్తమ్‌

కుసుమల ఆకు తిన్నదానికి, నివేదనమిడు దానికి ప్రాయశ్చిత్తము.

 శ్రీవరాహ దేవుడు:

కౌసుంభం చైవ యః శాకం భక్ష యే న్మమ పూజకః,

నరకే పచ్యతే ఘోరే దశ పఞ్చ చ సూకరః.

నా పూజకుడు కుసుమ ఆకుల కూరను తిని పదునైదేండ్లు ఘోరమగు నరకమున పందియై మ్రగ్గి పోవును.

తతో గచ్ఛే చ్ఛ్వయోనౌ చ త్రీణి వర్షాణి జబ్బుకః,

వర్ష మేకం తతః శుద్ధ్యే న్మత్కర్మణి రతః శుచిః,

మమ లోక మవా ప్నోతి శుద్ధో భూత్వా వసుంధరే.

పిదప మూడేండ్లు కుక్క కడుపునను, ఒక యేడు నక్క కడుపునను పుట్టును. పిదప పరిశుద్ధుడై నా కర్మముల యందు ప్రీతిగల వాడగును. నా లోకము నందు కొనును.

భక్షణే తు కృతే కుర్యా చ్చాంద్రాయణ మతన్ద్రితః,

ప్రాపణే తు కృతే కుర్యా ద్ద్వాదశాహం పయోవ్రతమ్‌.

కుసుమలను తిన్నచో చాంద్రాయణ వ్రతమును శ్రద్ధతో చేయ వలయును. నివేదనము చేసినచో పండ్రెండు దినములు పాలు మాత్రమును పుచ్చుకొను వ్రతము నాచరింప వలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న స లిప్యేత పాపేన మమ లోకం చ గచ్ఛతి.

ఈ పద్దతితో ప్రాయశ్చిత్తము నాచరించువాడు పాపము అంటనివాడై నా లోకమున కరుగును.

పరకీయ వస్త్రాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

ఇతరుల వస్త్రములను తాల్చుట అను దోషపు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

యః పారక్యేణ వస్త్రేణ నావధౌతేన మాధవి,

ప్రాయశ్చిత్తీ పుమాన్‌ మూర్ఖో మమ కర్మపరాయణః.

శ్రీవరాహ దేవుడు:

మాధవీ! చక్కగా ఉదుకని, ఇతరుని వస్త్రము ధరించి నా పూజ చేయు మూర్ఖుడు ప్రాయశ్చిత్తమును పొంద వలయును.

కరోతి మమ కర్మాణి స్పృశతే మాం తమః స్థితః,

మృగో జాయేత సుశ్రోణి వర్షాణి త్రీణి సప్తచ.

అంధకారమున మునిగి ఆ విధముగా నా పూజలు ఆచరించు వాడు పదియేండ్లు మృగమై పోవును.

హీనపాదేన జాయేత చైకజన్మ వసుంధరే,

మూర్ఖశ్చ క్రోధన శ్చైవ జాయతే తస్య కర్మణః.

ఒక జన్మము కాళ్ళు లేని వాడై, మూర్ఖుడై, కోపము గలవాడై యుండును.

తస్య వక్ష్యామి సుశ్రోణి ప్రాయశ్చిత్తం మహౌజసమ్‌,

యేన గచ్ఛతి సంసారం మమ భక్త్యా వ్యవస్థితః.

నా భక్తి యందు నిలుకడ కలవడగు అట్టి వానికి మిక్కిలి శక్తి గల ప్రాయశ్చిత్తమును తెలిపెదను.

అష్టభక్షం తతః కృత్వా మమ కర్మపరాయణః,

మాఘ స్యైవ తు మాసస్య శుక్ల పక్షస్య ద్వాదశీమ్‌.

తిష్ఠే జ్జలాశయే తత్ర క్షాన్తో దాన్తో జితేన్ద్రియః,

అనన్య మానసో భూత్వా మమ చిన్తా పరాయణః.

మాఘ మాసశుక్ల పక్ష ద్వాదశి నాడు నా పూజల యందు ఆసక్తి కలవాడై ఎనిమిది కాలముల తరువాత భుజించి (రెండు రోజులు ఉపవాస ముండి అని తాత్పర్యము) లోని యింద్రియ ములను, వెలుపలి యింద్రియ ములను అదుపున నుంచుకొని కొలనులో నిలిచి యుండి చెదరని మనస్సుతో నా భావనయే చేయుచు ఉండ వలయును.

ప్రభాతాయాం తు శర్వర్యా ముదితే త దివాకరే,

పఞ్చగవ్యం తతః పీత్వా మమ కర్మాణి కారయేత్‌.

ప్రాతః కాలమున సూర్యుడు దయించిన తరువాత పంచ గవ్యమును (ఆవు పాలు, నెయ్యి, వెన్న, మూత్రము, పేడలద కలిపిన పదార్థమును) త్రావి నా పూజలు కావింప వలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

సర్వపాపవినిర్ముక్తో మమ లోకాయ గచ్ఛతి.

ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొని వాడు, పాపము లన్నింటి నుండి విడివడి నా లోకమున కరుగును.

నవాన్నభక్షణాపరాధప్రాయశ్చిత్తమ్‌

కొత్త ధాన్యముల అన్నమును తిను దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

అదత్వా యో నవాన్నాని మమ కర్మపరాయణః,

భుఞ్జేద్‌ లోభేన చేచ్ఛామి న చ రాగేణ సుందరి,

అవశ్యమేవ కర్తవ్యం మమ కర్మ పరాయణైః.

నా అర్చనలు చేయువాడు క్రొత్త భోజనములను తనవి కాని, ఇతరు లిచ్చినవి కాని, నాకు సమర్పింపక తినునేని అట్టి వానిని నేను ఇష్టపడను. అట్లు ముందుగా నాకు సమర్పించుట ఆతనికి కర్తవ్యము. దీనిని నేను లోభము తోడనో, రాగము తోడనో చెప్పుట లేదు.

తతో భాగవతో భూత్వా నవాన్నం యో న కరాయేత్‌,

పితర స్తస్య నాశ్నన్తి వర్షాణి దశ పఞ్చ చ.

భగవంతుని భక్తుడై క్రొత్త ధాన్యముల అన్నములను నాకు సమర్పణము చేయని వాని పితృ దేవతలు పదునైదేండ్లు వాని అన్నమును తినరు.

అదత్వా యస్తు భుఞ్జీత నవాన్నాని కదాచన,

న తస్య ధర్మో విద్యేత ఏవ మేత న్న సంశయః.

క్రొత్త అన్నములను నా కర్పింపక ఎన్నడు గాని తిను నరునకు ధర్మము కలుగదు. ఇందు సంశయము లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి యేన తత్ర ప్రముచ్యతే,

ప్రాయశ్చిత్తం మహాభాగే మమ భక్త సుఖావహమ్‌.

ఆ పాపము నుండి ముక్తి పొంది నా భక్తుడు సుఖముగా నుండెడు ప్రాయశ్చిత్తమును, ఓ మహాభాగా! తెలిపెదను.

ఉపవాసం త్రిరాత్రంతు తేన చైవ తు కారయేత్‌,

ఆకాశశయనం కృత్వా చతుర్థేహని శుద్ధ్యతి.

మూడు రాత్రులు ఉపవాసము చేయ వలయును. ఆరు బయలున నిద్రింప వలయును. నాలుగవ రోజున ఆతడు శుద్ధుడగును.

ఏవం తత్ర విధిం కృత్వా ఉదితే చ దివాకరే,

పఞ్చగవ్యం తతః పీత్వా శీఘ్రం ముచ్యేత కల్బిషాత్‌.

ఇట్లు విధిని ఆచరించి సూర్యోదయ కాలమున పంచగవ్యమును పుచ్చుకొని ఆ దోషము నుండి విడివడును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

సర్వసఙ్గం పరిత్యజ్య మమ లోకాయ గచ్ఛతి.

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము చేసికొని అన్ని తగులములను వదలి వైచి నా లోకమున కరుగును.

గన్ధమాల్యమదత్వా ధూపదానాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

గంధ మాల్యముల నొసఁగక ధూపదాన మిచ్చుట అను దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

అదత్వా గన్ధమాల్యాని యో మే ధూపం ప్రయచ్ఛతి,

కుణపో జాయతే భూమి యాతుధానో న సంశయః.

శ్రీవరాహ దేవుడు:

గంధములను, మాల్యములను ఒసగక ధూపమును నాకు అర్పించు వాడు క్రుళ్ళిన శవములను తిను రాక్షసుడై పుట్టును. సంశయము లేదు.

వర్షాణి చైకవింశాని అపస్కారనివాసకః,

తిష్ఠ త్యత్ర మహాభాగే ఏవ మేత న్న సంశయః.

ఇరువది యొక్క యేండ్లు నింద్యమైన తావులలో నివసించు చుండును. ఇందు సంశయము లేదు.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి యేన ముచ్యేత కిల్బిషాత్‌.

వసుంధరా! ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును నీకు వక్కాణించెదను. దేని వలన ఈ పాపము నుండి ముక్తుడగునో తెలిపెదను.

యస్య కస్య చిన్మాసస్య శుక్లపక్షస్య ద్వాదశీమ్‌,

ఉపోష్య చాష్టభక్తం తు దశై కాదశ మేవ చ.

ప్రభాతాయాం తు శర్వర్యా ముదితే చ దివాకరే,

పఞ్చగవ్యం తతః పీత్వా శీఘ్రం ముచ్యతి కిల్బిషాత్‌.

ఏదో ఒక నెలలో శుక్లపక్షము ద్వాదశి నాడు రెండు రోజు లుపవాస ముండి, పది పదునైదు దినము లుండ వలయును. పిదప తెల్ల వారిన పిదప సూర్యుడు దయించిన అనంతరము పంచ గవ్యమును పుచ్చుకొని ఆ పాపమును పోగొట్టు కొనును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

తాని తాని తరన్త్యేవం సర్వ ఏవ పితామహాః.

ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసికొను వాడే కాదు. ఆతని తండ్రి తాతలును పాపముల నుండి దాటుదురు.

ఉపానహాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

చెప్పులు తాల్చి దేవునారాధించిన దోషమునకు ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

వహ న్నుపాన హౌ పద్భ్యాం యస్తు మా ముపచక్రమేత్‌,

చర్మకారస్తు జాయేత వర్షాణాం తు త్రయోదశ.

శ్రీవరాహ దేవుడు:

చెప్పులు తొడిగికొని, నా దగ్గరకు వచ్చువాడు పదుమూడేండ్లు చర్మకారు డగును.

తత్ర జన్మపరిభ్రష్టః శూకరో జాయతే పునః,

శూకరాచ్చ పరిభ్రష్టః శ్వాన స్త త్రైవ జాయతే.

అందు ఆ జన్మము నుండి జారి పందియై పుట్టును. పంది జన్మము నుండియు పరిభ్రష్టుడై కుక్కయై పుట్టును.

తతః శునః పరిభ్రష్టో మానుషశ్చైవ జాయతే,

మద్భక్తశ్చ వినీతశ్చ అపరాధవివర్జితః,

ముక్త్వాతు సర్వసంసారం మమ లోకాయ గచ్ఛతి.

కుక్క జన్మమును వదలి మరల మానవుడై పుట్టును. నాకు భక్తుడు, వినయము కలవాడు, దోషములు లేనివాడు నై సంసార దోషము లన్నింటిని వదలి నా లోకమున కరుగును.

య ఏతేన విధానేన వసుధే కర్మ కారయేత్‌,

న స లిప్యతి పాపేన ఏవ మేతన్న సంశయః.

వసుధా! ఈ విధానముతో కర్మము నాచరించు వాడు పాపపు అంటు లేని వాడగును. సంశయము లేదు.

భేరీతాడనాపరాధ ప్రాయశ్చిత్తమ్‌

భేరీతాడనాపరాధ ప్రాయశ్చిత్తము.

శ్రీవరాహ దేవుడు:

భేరీశబ్ద మకృత్వా తు యస్తు మాం ప్రతిబోధయేత్‌,

బధిరో జాయతే భూమి ఏకజన్మ న సంశయః.

భూమీ! భేరీనాదము చేయక నన్ను మేల్కొలుపు వాడు ఒక జన్మ కాలము చెవిటి వాడగును. సంశయము లేదు.

తస్య వక్ష్యామి సుశ్రోణి ప్రాయశ్చిత్తం మమ ప్రియే,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత భేరీతాడవ మోహితః.

ప్రియా! ఆ భేరిని మ్రోగించు పనిలో ప్రమాద పడిన పాపము నుండి ముక్తి పొందెడు దానికి ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

యస్య కస్యచి న్మాసస్య శుక్లపక్షే తు ద్వాదశీమ్‌,

ఆకాశశయనం కృత్వా శీఘ్రం ముచ్యేత కిల్బిషాత్‌.

ఏదో ఒక నెలలో శుక్ల పక్ష ద్వాదశి నాడు ఆరు బయలున నిద్రించి వెనువెంటనే ఆ పాపము నుండి విడివడును.

య ఏతేన విధానేన వసుధే కర్మకారయేత్‌,

అపరాధం న గచ్ఛేత మమ లోకాయ గచ్ఛతి.

ఈ పద్దతితో, ఓ వసుధా! అర్చనలను చేయువాడు అపరాధమును పొందడు. నా లోకమున కరుగును.

శ్రీవరాహ దేవుడు:

అన్నం భుక్త్వా బహుతర మజీర్ణేన పరిప్లుతః,

ఉద్గారేణ సమాయుక్త అస్నాత ఉపసర్పతి.

ఏకజన్మా తథా శ్వాసౌ వానరశ్చైవ జాయతే,

శృగాల ఏకజన్మా వై ఛాగశ్చే వైకజన్మని,

ఏకజన్మా భవేదన్ధో మూషకో జాయతే పునః.

శ్రీవరాహ దేవుడు:

పొట్ట పగులు నట్లన్నమును తిని అజీర్ణముతో అవస్థ పడుచు క్రక్కుకొనుచు స్నానము చేయక నాకడ కరుగు దెంచు వాడు ఒక జన్మమున కోతి యగును. వేరొక జన్మమున నక్క యగును. ఇంకొక జన్మమున మేక యగును. తరువాత ఒక జన్మమున గ్రుడ్డి వాడగును. మరల ఎలుక యగును.

తారితో హ్యేషసంసారే జాయతే విపులే కులే,

శుద్ధో భాగవతః శ్రేష్ఠ అపరాధవివర్జితః.

అట్టివాడు ఆ పాపము నుండి తరింప జేయ బడినవాడై గొప్ప కులమున శుద్ధుడు, శ్రేష్ఠుడు, అపరాధము లేని వాడునగు భాగవతుడై పుట్టును.

ప్రాయశ్చిత్తం ప్రవక్ష్యామి మమ భక్తసుఖావహమ్‌,

కిల్బిషాద్‌ యేన ముచ్యేత మమ కర్మపరాయణః.

నా భక్తుని సుఖమును కూర్చునది, నా కర్మమున శ్రద్ధకల వానిని ఆ పాపము నుండి విడుదల చేయునదియు నగు ప్రాయశ్చిత్తమును చెప్పెదను.

యావకేన దినత్రీణి మూలకేన దినత్రయమ్‌,

ఫలాహారో దినత్రీణి అక్షారలవణం త్రయః.

పాయసేన దినత్రీణి సాక్తవేన దినత్రయమ్‌,

వాయుభక్షో దినత్రీణి ఆకాశశయనస్త్రయః.

యవల పిండితో మూడు రోజులు, దుంపలతో మూడు దినములు, పండ్లను తినుచు మూడు రోజులు, పులుపు ఉప్పు లేని చప్పిడిని తినుచు మూడు దినములు, పాయసముతో మూడు దినములు, పేల పిండితో మూడు దినములు, గాలి తినుచు మూడు రోజులు గడుప వలయును. ఆరు బయట పండు కొని మూడు దినములు గడుప వలయును.

ప్రభాతాయాం తు శర్వర్యాం దన్తధావన బోధితః,

పఞ్చగవ్యం పిబేచ్చైవ శరీరపరిశోధనమ్‌.

తరువాత తెల్ల వారిన వెనుక పండ్లు తోముకొని పంచగవ్యమును పుచ్చుకొన వలయును. శరీరమును శుద్ధి చేసికొన వలయును.

య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్‌,

న తస్య లభతే పాపం మమలోకాయ గచ్ఛతి.

ఈ విధానముతో ప్రాయశ్చిత్తము చేసికొను వానికి పాపము ఉండదు. అతడు నా లోకమున కరుగును.

అఖ్యానానాం మహాఖ్యానం తపసాం చ పరం తపః,

అత్రాహం కీర్తయిష్యామి బ్రాహ్మణేభ్యో మహేశ్వరి.

మహేశ్వరీ! ఇది ఆఖ్యానములలో మిక్కిలి గొప్ప ఆఖ్యానము. తపస్సులలో శ్రేష్ఠమైన తపస్సు, దీనిని నేను బ్రాహ్మణులకు చెప్పు చున్నాను.

ఏష ధర్మశ్చ కీర్తిశ్చ ఆచారాణాం మహౌజసమ్‌,

గుణానాం పరమం శ్రేష్ఠం ద్యుతీనాం చ మహాద్యుతిః.

ఇది ధర్మము, ఇది కీర్తి, ఆచారములలో గొప్పశక్తి కలది. గుణములలో మిక్కిలి శ్రేష్ఠ మైనది. కాంతులలో గొప్ప కాంతి కలది.

య ఏవం పఠతే నిత్యం కల్యముత్థాయ మానవః,

స పితౄంస్తారయే జ్జన్తు ద్దశపూర్వాన్‌ దశాపరాన్‌.

ప్రాతః కాలమున నిద్రలేచి ప్రతి దినము దీనిని పఠించు వాడు ముందు పది తరముల వారిని, వెనుక పది తరముల వారిని పితృ దేవతలను తరింప జేయును.

ఆరోగ్యాణాం మహారోగ్యం మఙ్గలానాం తు మంగలమ్‌,

రత్నానాం పరమం రత్నం సర్వపాపప్రణాశనమ్‌.

ఆరోగ్యములలో, మహారోగ్యము మంగళములలో గొప్ప మంగళము. రత్నములలో పరమమైన రత్నము. అన్ని పాపములను అణగార్చునది.

యస్తు భాగవతో నిత్యం పఠతే చ దృఢవ్రతః,

కృత్వా సర్వాపరాధాని న స పాపేన లిప్యతే.

ఏ భాగవతుడు చెదరిని నిష్ఠ కలవాడై ప్రతి దినము దీనిని చదువునో ఆతడు సర్వ పాపములు చేసిన వాడైనను ఆ పాపముల అంటులేని వాడగును.

ఏష జాప్యః ప్రమాణశ్చ సంధ్యోపాసన మేవ చ,

కల్య ముత్థాయ పఠతే మమలోకాయ గచ్ఛతి.

ఇది జపింప దగినది. ప్రమాణమైనది. సంధ్యను ఉపాసించుటయే యైనది. ప్రాతః కాలమున నిద్ర లేచి దీనిని పఠించు వాడు నా లోకమున కరుగును.

న పదే న్మూర్ఖమధ్యేతు కుశిష్యాణాం తథైవ చ,

దద్యాత్‌ భాగవతే శ్రేష్ఠే మమ కర్మపరాయణః.

మూర్ఖుల నడుమ దీనిని పఠింప రాదు. చెడు శిష్యులకు దీనిని బోధింప రాదు. నా అర్చన యందు శ్రద్ధ గల భాగవత శ్రేష్ఠునికి దీనిని ఒసగ వలయును.

ఏతత్‌ తే కథితం దేవి ఆచారస్య వినిశ్చయమ్‌,

యత్‌ త్వయా పృచ్ఛితం పూర్వం కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛసి.

దేవీ! ఆచార నిశ్చయమును గూర్చి మున్ను నీవు నన్నడిగిన దానిని వివరించి చెప్పితిని. మరియు నీవు దేనిని వినగోరు చున్నావు?