వరాహ మహా పురాణము
అధ్యాయము - 8
శ్రీవరాహ దేవుడు:
యోసౌ వసోః శరీరే తు వ్యాధో భూత్వా నృపస్య హ,
స స్వవృత్త్యాం స్థితః కాలం చతుర్వర్ష సహస్రకమ్.
శ్రీవరాహ దేవుడు:
ఆ వసురాజు దేహమున పుట్టిన వ్యాదు డుండెనే అతడు తన వృత్తితో నాలుగు వేల సంవత్సరముల కాలము గడపెను.
ఏకైకం స్వకుటుంబర్థే హత్వా వనచరం మృగమ్,
భృత్యాతిథిహుతాశానాం ప్రీణనం కురుతే సదా.
తన కుటుంబము కొఱకు దినమున కొక్కటి చొప్పున అడవి మృగమున చంపి పని వారలను, అతిథులను, అగ్నిని తృప్తి పరచెడివాడు.
మిథిలాయాం వరారోహే సదా పర్వణి పర్వణి,
పితౄణాం కురుతే శ్రాద్ధం స్వాచారేణ విచక్షణః
ఓ సుందరీ! అతడు ప్రతి అమావాస్య నాడును మిథిల యందు పితృ దేవుల నుద్దేశించి తన ఆచారమును బట్టి వివేకముతో శ్రాద్దకర్మ మొనర్చెడి వాడు.
అగ్నిం పరిచరన్ నిత్యం వదన్ సత్యం సుభాషితమ్.
ప్రాణయాత్రానుసక్తస్తు యోసౌ జీవం న పాతయేత్.
ప్రతి దినము అగ్ని నర్చించు చుండెడి వాడు. సత్యమునే చక్కగా పలుకుచు జీవయాత్ర సాగించుచు నతడు ఏ జంతువును కూలనేయ లేదు.
ఏవం తు వసత స్తస్య ధర్మబుద్ధి ర్మహాతపాః,
పుత్ర స్త్వర్జునకో నామ బభూవ మునివ ద్వశీ.
ఇట్లు జీవించు చుండగా అతనికి ధర్మ బుద్దియు, గొప్ప తపస్సు చేయు వాడును, ముని వంటి వాడును, ఇంద్రియముల పై అదుపు గలవాడును అగు అర్జునకుడను కొడకు పుట్టెను.
తస్య కాలేన మహతా చారిత్రేణ చ ధీమతః,
బభూ వార్జునకీ నామ కన్యా చ వరవర్ణినీ.
పెద్ద కాలము గడచిన పిదప సత్ర్పవర్తనతో బుద్ది మంతుడుగా మెలగిన ఆతనికి చక్కని రూపు రేఖలు గల ‘అర్జునకి’ యను కూతురును పుట్టెను.
తస్యా యౌవనకాలే తు చిన్తయామాస ధర్మనిత్,
కస్యేయం దీయతే కన్యా కో వా యోగ్యశ్చ వై పుమాన్.
ఆమెకు పెండ్లియీడు రాగా ఆ ధర్మాత్ముడు ఈమె నేవని కొసగుదును? అన్ని విధముల తగిన పురుషు డెవ్వడు? అని ఆలోచించెను.
ఇతి చిన్తయత స్తస్య మతంగస్య సుతం ప్రతి,
ధర్మవ్యాధస్య సువ్యక్తం ప్రసన్నాఖ్యం ప్రతిబ్రువన్.
ఇట్లు చింతించు చుండగా ఆతనికి మతంగుని కొడుకు, చక్కని తీరు తెన్నులు గలవాడు అగు ప్రసన్నుడను వాడు మదిలో మెదలెను.
ఏవం సంచిన్త్య మాతంగం ప్రసన్నం ప్రతి సోద్యతః,
ఉవాచ తస్య పితరం ప్రసన్నాయార్జునీం భవాన్,
గృహాణ తపతాం శ్రేష్ఠ స్వయం దత్తాం మహాత్మనే.
ఇట్లు తలపోసి ఆతడు మతంగుని కొడుకగు ప్రసన్నుని గూర్చి నిశ్చయించు కొని ఆతని తండ్రితో ‘తాపస వరేణ్యా! మహాత్ముడగు ప్రసన్నునకు నా బిడ్డ నిచ్చితిని. నీవు దయతో స్వీకరింప వలయును’ అని పలికెను.
మతంగుడు:
ప్రసన్నోయం మమ సుతః సర్వశాస్త్ర విశారదః,
గృహ్ణామ్యర్జునకీం కన్యాం త్వత్సుతాం వ్యాధ సత్తమ.
మతంగుడు:
అయ్యా! వ్యాధవరేణ్యా! ఈ నా కుమారుడు ప్రసన్నుడు అన్ని శాస్త్రములలో ఆరితేరిన వాడు. నీ బిడ్డను అర్జునకిని నేను కోడలుగా కైకొందును.
ఏవ ముక్తే తదా కన్యాం దర్మవ్యాధో మహాతపాః,
మతఙ్గపుత్రాయ దదౌ ప్రసన్నాయ చ ధీమతే.
మతంగు డిట్లనగా మహా తపస్వియగు ధర్మ వ్యాధుడు ప్రసన్నునకు కన్య నర్పించెను.
దర్మవ్యాధ స్తదా కన్యాం దత్త్వా స్వగృహ మియివాన్,
సాపి శ్వశురయో ర్భర్తుః శుశ్రూషణపరాభవత్.
దర్మవ్యాధుడు అంత కన్య నొసగి తన యింటి కేగెను. ఆమెయు అత్త మామలకును భర్తకును సేవలు చేయుటలో ఆసక్తి కలదాయెను.
అథ కాలేన మహతా సా కన్యార్జునకీ శుభా,
ఉక్తా శ్వశ్వ్రా సుతా పుత్రి జీవహస్తు స్త్వమీదృశీ.
అంత పెద్ద కాలము గడచిన పిమ్మట ఉత్తము రాలగు ఆ అర్జునకితో అత్త, బిడ్డా! ప్రాణి హత్య గావించు వానికి బిడ్డవు. నీవును అట్టి దానవే.
న జానాసి తపశ్చర్తుం భర్తు రారాధనం తథా.
తపస్సు చేయుట యెట్లో భర్తను కొలుచుట యెట్లో ఎరుగవు, అని పలికెను.
సాపి స్వల్పాపరాధేన భర్త్సితా తనుమధ్యమా,
పితు ర్వేశ్మగతా బాలా రోదమానా ముహుర్ముహుః.
ఆమెయు చిన్న తప్పునకు అత్త తన్నిట్టు తిట్టగా తండ్రి యింటికి పోయి మాటిమాటికి ఏడ్వ దొడగెను.
పిత్రా పృష్టా కిమేతత్ పుత్రి రోదనకారణమ్,
ఏవ ముక్తా తదా సా తు కథయామాస భామినీ.
తండ్రి ‘బిడ్డా! ఏడ్చుటకు కారణమేమి’ యని అడుగగా ఆమె ఇట్లు చెప్పెను.
శ్వశ్వ్రాహ ముక్తా తీవ్రేణ కోపేన మహతా పితః,
జీవహన్తుః సుతేత్యుచ్ఛై రసకృద్ వ్యాధజేతి చ.
నాయనా! మాయత్త మిక్కిలి తీవ్రమైన కోపముతో జీవ హింస చేయువాని కూతురవు. కటిక వాని బిడ్డవు అని పలుమారులు పెద్దగా తిట్టెను.
ఏవం శ్రుత్వా స ధర్మాత్మా ధర్మవ్యాధో రుషాన్వితః,
మతఙ్గస్య గృహం సోథ గత్వా జనపదై ర్వృతమ్.
ఇది విని ధర్మాత్ముడగు ధర్మవ్యాధుడు కోపముతో పల్లె జనులతో నిండిన మతంగుని యింటి కరిగెను.
తస్యాగతస్య సంబన్ధీ మతజ్గో జయతాంవరః,
ఆసనాద్యర్ఘ్య పాద్యేన పూజయి త్వేద మబ్రవీత్,
కిమాగమన కృత్యం తే కిం కరోమ్యాగత క్రియామ్.
అట్లు వచ్చిన అతనికి వియ్యంకుడగు మతంగుడు కూర్చుండుటకు పీట వెట్టించి కాళ్ళకు నీరిచ్చి పూజా ద్రవ్యములను ఒసగి మన్నించి ‘నీ రాకకు కారణ మేమి? నేను నీకేమి చేయుదును? అని పలికెను.
వ్యాధుడు:
భోజనం కించి దిచ్ఛామి భోక్తుం చైతన్యవర్జితమ్,
కౌతూహలేన యేనాహ మాగతో భవతో గృహమ్.
వ్యాధుడు:
ప్రాణము లేని బోజనము కొంత తిన గోరుదును. ఆ కోరికతో నేను నీ యింటికి వచ్చితిని.
మతంగుడు:
గోధూమా వ్రీహయ శ్చైవ సంస్కృతా మమ వేశ్వని,
భుజ్యతాం ధర్మవిచ్ఛ్రేష్ఠ యథాకామం తపోధన.
మతంగుడు:
తపోధనా! ధర్మములు తెలిసిన వారిలో ఉత్తముడవు. గోధుమలు, ఇతర ధాన్యములు వండిన పదార్దములు మా యింట గలవు. ఇచ్చ వచ్చినట్లు భుజింపుము.
వ్యాధుడు:
పశ్యామి కీదృశా స్తే హి గోధూమా వ్రీహయో యవాః,
స్వరూపేణ చ సన్త్యేతే యేన వో వేద్మి సత్తమ.
వ్యాధుడు:
పుణ్యాత్ముడా! ఆ గోధుమలు, ఆ బియ్యము, ఆ యవలు ఎట్టివో చూచెదను. అవి వాని స్వరూపము తోడనే యున్నవేమో నేను చూడ వలయును.
శ్రీవరాహ దేవుడు:
ఏవ ముక్తే మతంగేన శూర్పం గోధూమ పూరితమ్,
ఆపరం తత్ర వ్రీహిణాం ధర్మవ్యాధాయ దర్శితమ్.
శ్రీవరాహ దేవుడు:
ఇట్లనగా మతంగుడు ధర్మ వ్యాధునకు గోదుమలతో నిండిన చేట నొక దానిని, బియ్యముతో నిండిన చేట నొక దానిని చూపెను.
దృష్ట్వా వ్రీహీన్ సగోధూమాన్ దర్మవ్యాధో వరాసనాత్,
ఉత్థాయ గస్తు మారేభే మతజ్గేన నివారితః
ఆ గోధుమలను, వరి ధాన్యమును గాంచి ధర్మవ్యాధుడు ఆసనము నుండి లేచి పోవ దొడగెను. మతంగు డాతని నాపెను.
కిమతర్థం గన్తు మారబ్ధం త్వయా వద మహామతే,
ఆభుక్తే నైవ సంసిద్ధం మద్గృహే చాన్న ముత్తమమ్,
పాచయిత్వా స్వయం చైవ కస్మాత్ త్త్వం నాద్యభుంజసే.
ఓయీ! మహామతీ! భోజనము చేయకయే బయలు దేరితివేల? మా యింట మంచి అన్నము వండించి సిద్దముగా నుంచితిని. నీవు ఏల భుజింపవు?
వ్యాధుడు:
సహస్రశః కోటిశశ్చ జీవాన్ హంసి దినేదినే.
అథేదృశస్య పాపస్య కోన్నం భుంజతి సత్పుమాన్.
వ్యాధుడు:
ప్రతి దినము వేలకొలది, కోట్ల కొలది జీవులను చంపు చున్నావు, ఇట్టి పాపాత్ముని కూడు సత్పురుషు డెవ్వడు తినును?
ఆచైతన్యం యది గృహే విద్యతేన్నం సుసంస్కృతమ్,
ఇదానీ మత్ర సందృష్టా ఏతే తు జలజన్తవః
(ఉప్తాః సహస్రతాం యాన్తి ప్రతిసంవత్సరం మునే)
ప్రాణ శక్తి లేని పదార్థమేమైన నీ యింట నున్నచో వండి యా యన్నము చూపుము. ఇప్పుడిట నేను చూచిన పదార్థములు నీటి జంతువులే కదా! (వీరిని నాటినచో ఏడాదికి వేల కొలది గింజలగును కదా!)
అహమేకం కుటుంబార్థే హన్మ్యరణ్య పశుం దినే,
తం చేత్ పితృభ్యః సంస్కృత్య దత్వా భుంజమి సానుగః
నేనునా సంసారమునకై దినమున కొక్కటి చొప్పున అడవి లోని పశువులను చంపుదును. దానిని వండి పితృ దేవతల కర్పించి నావారితో పాటు తిందును.
త్వం తు జీవాన్ బహూన్ హత్వా స్వకుటుంబేన సానుగః,
భుంజ న్నేతేన సతత మభోజ్యం తన్మతం మమ,
ఇక నీవో జీవులను పెక్కింటిని చంపి నీ వారితో కలిసి తిను చున్నావు. ఇది తినరాని తిండి యని నా నిశ్చయము.
బ్రహ్మణా తు పురా సృష్టా ఓషధ్యః సర్వవీరుధః,
యజ్ఞార్థం తత్తు భూతానాం భక్ష్య మిత్యేవ వై శ్రుతిః,
తొలత బ్రహ్మ చెట్టు చేమలను, తీగలను యజ్ఞము కొఱకు పుట్టించెను. అదియే ప్రాణులకు ఆహారమయ్యె నని శ్రుతి.
దివ్యో భౌత స్తథా పైత్రో మానుషో బ్రాహ్మ ఏవ చ,
ఏతే పంచ మహాయజ్ఞా బ్రహ్మణా నిర్మితాః పురా.
దేవ యజ్ఞము, భూత యజ్ఞము, పితృ యజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము అను నవి అయిదు మహా యజ్ఞములు, బ్రహ్మ తొలుత వీనిని ఏర్పరచెను.
బ్రాహ్మణానాం హితార్థాయ ఇతరేషాం చ తన్ముఖమ్,
ఇతరేషాం తు వర్ణానాం బ్రాహ్మణౖః కారితాః శుభాః
బ్రాహ్మణులకు, వారి ద్వారమున ఇతరులకు మేలు జరుగుటకై ఈ యజ్ఞము లేర్పడెను. ఇతర వర్ణముల వారికై బ్రాహ్మణులు వీనిని రూపొందించిరి.
ఏవం యది విభాగః స్యాద్ వరాన్నం తద్ విశుధ్యతి,
అన్యథా వ్రీహయోప్యేతే ఏకైకే మృగపక్షిణః,
మన్త్యవా దాతృభోక్తౄణాం మహామాంసం తు తత్‌స్మృతమ్.
ఇట్లు పై యజ్ఞములకు ఏర్పరిచిన అన్నము ఉత్తమమగు అన్నమగును. అది పవిత్రమైన దగును. అట్లు కానిచో ధాన్యముల ఒక్కొక్క గింజయు మృగముల, పక్షుల వంటివే యగును. అట్టి ధాన్యపు గింజలు పెట్టు వానికి, తిను వానికి అది మహా మాంసముగా లెక్కకు వచ్చును.
మయా తే దుహితా దత్తా పుత్రార్థే దేవరూపిణీ,
సా చ త్వద్భార్యయా ప్రోక్తా దుహితా జన్తుఘాతినః.
దేవత వంటి రూపము గల నా బిడ్డను నీ పుత్రునకు సమర్పించితిని. ఆమెను నీ భార్య జంతువులను చంపు వాని బిడ్డ వని నొక్కి పలికినది.
అతోర్థమాగతోహం తే గృహం ప్రతి సమీక్షితుమ్,
ఆచారం దేవపూజాం చ అతిథీనాం చ తర్పణమ్.
కావున నేను నీ యింటిని, నీ ఆచారమును, దేవ పూజను, అతిథుల నాదరించుటను పరికించుటకై వచ్చితిని.
ఏతేషా మేక మప్యత్ర కుర్వన్నపి సదృశ్యతే,
తద్ గృహం గన్తు మిచ్చామి పితౄణాం శ్రాద్ధకామ్యయా.
వీనిలో నే యొక్కటియు నీవు చేయు చున్నది కానరాదు. కావున పితృ దేవతలకు శ్రాద్ధము పెట్టు కోరికతో మా యింటికి పోగోరు చున్నాను.
స్వగృహే నైవ భూజ్ఞామి పితౄణాం కార్య మిత్యుత,
అహం వ్యాధో జీవఘాతీ న తు త్వం లోకహింసకః
పితృ కార్యము కనుక నేను నా యింటను భోజనము చేయను. ఇట్టి నేను ప్రాణిహింస చేయు వాడను! నీవు మాత్రము లోకమును హింసింపని వాడవు! (ఇది నెక్కిరింత)
మత్సుతా జీవఘాతస్య యదోఢా త్వత్సుతేవ చ ,
తన్మహత్వం చ సంజాతం ప్రాయశ్చిత్తం తపోధన.
ప్రాణి హింస చేయు నా బిడ్డను నీ కుమారుడు చేపట్టే ననగా అది గొప్పయే కదా! నా బిడ్డకు ప్రాయశ్చిత్త మైనట్లే కదా!
ఏవ ముక్త్వా సచోత్థాయ శస్త్వా నారీం తదా ధరే,
మాస్నుషాభిః సమం శ్వశ్వ్రా విశ్వాసో భవతు క్వచిత్.
మా చ స్నుషా కదాచిత్ స్యాద్ యా శ్వశ్రూం జీవతీ మిషేత్,
ఏవ ముక్త్వా గతో వ్యాధః స్వగృహం ప్రతి భామిని.
భూదేవీ! ఆ వ్యాధు డిట్లు పలికి అత్తకు కోడండ్రపై నమ్మకము లేకుండు గాక! కోడలు అత్త బ్రతికి యుండుటను ఇష్ట పడుకుండు గాక! అని శపించి తన యింటికి కేగెను.
తతో దేవాన్ పితౄన్ భక్త్యా పూజయిత్వా విచక్షణః,
పుత్రం చార్జునకం స్థాప్య స్వసన్తానే మహాతపాః.
ధర్మవ్యాధో జగా మాశు తీర్థం త్రైలోక్యవిశ్రుతుమ్,
పురుషోత్తమాఖ్యం చ పరం తత్ర గత్వా సమాహితః,
తప శ్చచార నియతః పఠాన్ స్తోత్ర విదం ధరే.
అటుపై ఆ బుద్దిశాలి దేవతలను, పితృ దేవతలను భక్తితో పూజించి పుత్రుడగు అర్జునకుని తన కుటుంబమునకు పెద్దగా నిలిపి ముల్లోకముల పేరు గన్న పురుషోత్తమ మను తీర్ధమున కరిగి మనస్సు చెదరకుండ చేసికొని నిష్ఠతో ఈ స్తోత్రము చదువుచు తప మొనరించెను.
నమామి విష్ణుం త్రిదశారినాశనం విశాలవక్షః స్థల సంశ్రితశ్రియమ్,
సుశాసనం నీతిమతాం పరాం గతిం త్రివిక్రమం మంధరధారిణం సదా.
దేవతల పగ వారిని రూపుమాపు వాడును, వెడద అయిన రొమ్మున లక్ష్మీ దేవిని ధరించిన వాడును, నీతి నిష్ఠలతో బ్రదుకు వారికి పరమ గతి అయిన వాడును, మూడు పాదములతో సర్వమును వ్యాపించిన వాడును, మందర పర్వతమును ధరించిన వాడును అగు విష్ణువును ఎల్లవేళల మ్రొక్కుదును.
దామోదరం రంజితబూతలం ధియా యశోంశుశుభ్రం భ్రమరాఙ్ఞ సప్రభమ్,
ధారధరం నరకరిపుం పురుష్టుతం నమామి విష్ణుం శరణం జనార్దనమ్.
దామోదరుడును, భూతలము నలరించిన వాడును, కీర్తి కాంతులతో శుభ్రమైన వాడును, తుమ్మెదల వలె నిగనిగ లాడు నల్లని దేహకాంతి గలవాడును, భూమిని తాల్చు వాడును, నరకుని నాశము చేసిన వాడును, గొప్పగా స్తుతులందు కొనువాడును. అందరకు రక్షకుడైన వాడును జనార్ధనుడును అగు విష్ణువునకు ప్రణ మిల్లుదును. (దామోదరుడనగా దమము మొదలగు సాధనముల చేత సాధించిన జ్ఞానమునకు లభించు వాడనియు, దమములనగా లోకములు అన్ని పొట్ట యందు కల వాడనియు, యశోదచే త్రాటితో నడుమున కట్ట బడిన వాడనియు నర్థములు. జనార్దను డనగా = జనులను వారి వారి కర్మములను బట్టి నరకాదులకు చేర్చు వాడు, జనులు అభ్యుదయ నిః శ్రేయసముల కొఱకు ఈతనిని యాచింతురు అని యర్ధములు).
నరం నృసింహం హరి మీశ్వరం ప్రభుం త్రిధామనామాన మనంత వర్చసమ్,
సుసంస్కృతాస్యం శరణం నరోత్తమం వ్రజామి దేవం సతతం త మచ్యుతమ్.
నర రూపుడు, నృసింహ రూపుడు, హరి, ఈశ్వరుడు, ప్రభువు, ముగ్గురు మూర్తులకు నెలవైన వాడు, అనంతమైన దేహశక్తి కలవాడు, అతి పవిత్రమగు ముఖము కలవాడు, రక్షకుడు, పురుషోత్తముడు అగు అచ్యుత దేవుని ఎల్లవేళల శరణు పొందుదును.
త్రిధా స్థితం తిగ్మ రథాఙ్గ పాణినం నయస్థితం తృప్త మనుత్తమై ర్గుణైః,
నిఃశ్రేయసాఖ్యం క్షపితేతరం గురుం నమామి విష్ణుం పురుషోత్తమం త్వహమ్.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అను మూడు విధముల రూపములతో నుండు వాడు, వడియగు చక్రము చేత దాల్చిన వాడు, ధర్మ మార్గమున నెలకొని యుండు వాడు, మిక్కిలి యుత్తములగు గుణములతో ఆనంద స్వరూపుడై యుండు వాడు, నిశ్శ్రేయస నామము గలవాడు, తక్కిన దాని నెల్ల రూపుమాపు వాడు, గురువు అగు పురుషోత్తమునికి ప్రణ మిల్లుదును. (నిఃశ్రేయసము = పరసుఖము, మోక్షము.)
హతౌ పురాణౌ మధుకైటభా వుభౌ బిభర్తి చ క్ష్మాం శిరసా సదా హి సః,
యథా స్తుతో మే ప్రసభం సనాతనో దధాతు విష్ణుః సుఖ మూర్జితం మమ.
ప్రాత వారగు మధు కైటభులను రక్కసులను చంపిన వాడు, తలతో భూదేవిని ఎల్లవేళల తాల్చేడు వాడు అగు విష్ణువు నేను స్తుతించి నంతనే మహా సుఖమును నాకు ప్రసాదించు గాక.
మహావరాహో హవిషామ్బుభోజనో జనార్దనో మే హితకృచ్చితీ ముఖః,
క్షితీధరో మా ముదధిక్షయో మహాన్ స పాతు విష్ణుం శరణార్థినం తు మామ్.
మహా వరాహ స్వరూపుడు, హవిస్సనెడు ద్రవమే భోజనమైన వాడు, జనార్ధనుడు, నాకు మేలోనరించు వాడు, జ్ఞానముతో వెలుగొందు మోము కలవాడు, భూమి నుద్దరించు వాడు, సముద్రమే నివాసమైన వాడు నగు శ్రీ మహా విష్ణువు శరణు గోరి యున్న నన్ను కాపాడు గాక!
మాయాతతం యేన జగత్త్రయం కృతం యథాగ్ని నైకేన తతం చరాచరమ్,
చరాచరస్య స్వయ మేవ సర్వతః స మేస్తు విష్ణుః శరణం జగత్పతిః
స్థావరము (కదలనిది) జంగమము (కదలునది) అగు జగత్తు అంతయు ఒకే అగ్నితో నిండి యున్నట్లు తన మాయతో నిండిన మూడు లోకములను ఏర్పరచిన వాడు, సమస్త ప్రపంచమునకు అన్నీ యెడల తానేయైన వాడు అగు జగత్పాలకుడు విష్ణువు నాకు రక్షకుడగు గాక!
భవే భవే యశ్చ ససర్జ కం తతో జగత్ ప్రసూతం సచరాచరం త్విదమ్,
తతశ్చ రుద్రాత్మవతి ప్రలీయతే న్వతో హరి ర్విష్ణు హర స్తథోచ్యతే.
ఆ ప్రభువు ప్రతి యుగము నందును బ్రహ్మను సృజించును ఆ బ్రహ్మ వలన చరాచరమైన ఈ జగత్తు ఏర్పడును. పిదప రుద్రుడను పేరు గల వాని యందు లీనమై పోవును. ఈ మువ్వురినే వరుసగా బ్రహ్మ, విష్ణువు, హరుడు అందురు.
ఖాత్మేన్దు పృథ్వీ పవనాగ్ని భాస్కరా జలం చ యస్య ప్రభవన్తి మూర్తయః,
స సర్వదా మే భగవాన్ సనాతనో దదాతు శం విష్ణు రచిన్త్యరూపధృక్.
ఆకాశము, చంద్రుడు, భూమి, వాయువు, అగ్ని, భాస్కరుడు, నీరు అనునవి తన ఆకారములుగా పుట్టు చుండును. అట్టి సనాతనుడగు భగవంతుడు, ఊహింప నలవి కాని రూపములు ధరించు విష్ణువు నాకు సుఖమును ప్రసాదించు గాక!
ఇతీరితే తస్య సనాతనః స్వయం పురో బభూ వాద్భుత రూప దర్శనః,
వరం వృణీష్వేతి సనాతనోబ్రవీ - దనంతపాదోదర బాహు వక్త్రః.
ఇట్లా ధర్మవ్యాధుడు స్తుతింపగా సనాతనుడైన భగవంతుడు, అంతు లేని పాదములు, ఉదరములు (పొట్టలు) చేతులు, మోములు గలవాడు అచ్చెరువు గొలుపు రూపుముతో కానవచ్చి వరము కోరు కొమ్మని పలికెను.
ఇతీరితే వ్యాధవరో జగాద ప్రదీయతా మేష వరః సుతేష్వపి,
క్రియాకలాపేన తమాత్మవిద్యయా కులప్రసూతా వపి తేనుగామినః.
ఆ దైవమిట్లు పలుకగా ఉత్తమ వ్యాధుడు స్వామీ! నా పుత్రులు, నా కులమున పుట్టువారు. వారి ననుసరించి పుట్టువారు అందరు ఇట్లే సత్కర్మములతో అలరారు నట్టి వరమిమ్మని ప్రార్థించెను.
(భవేత్ తథా ధర్మయుగే సముద్భవః,
కలౌ న మే మత్ప్రభవేషు కేషుచిత్.)
(ఎల్లవేళల నాకును నా తరముల వారికిని ధర్మ యుగము నందే పుట్టువు కలుగు గాక! కలి యుగమున పుట్టుక కలుగ కుండుగాకా!)
జ్ఞానోదయ స్త్వస్య కులస్య సర్వగే,
లయ స్తథా బ్రహ్మణి మే సనాతన.
ఈ కులమునకు, ఎందున్నను, ఎందు బోయినను జ్ఞానము ఉదయించు గాక! ఓ సనాతనా! నేను బ్రహ్మము నందు లీన మగుదును గాక!
(ప్రసాద మేవం తవ దేవ సత్తమ,
ప్రాప్త స్త్వహం త్వల్లయ మేమి పశ్చాత్.)
(ప్రభూ! నీ యనుగ్రహము పొందితిని. తప్పక నేను నీలో లయ మగుదును.)
ఇతీరితే తం భగవా నువాచ హ ప్రసన్నబుద్ధి ర్భవతే మయా త్వయమ్,
వరో విసృష్టశ్చ కులస్య తే మయా లయ స్తథా బ్రహ్మణి శాశ్వతే తవ.
వ్యాధుడిట్లు పలుకగా భగవానుడు ప్రసన్న బుద్దియై ‘నీ కీ వర మిచ్చితిని. నీ కులమునకును ఒసగితిని. నీకు శాశ్వత బ్రహ్మమున లయము కలుగును’ అని పలికెను.
ఇతీరితే దేవవరేణ స క్షణాత్ స్వదేహత స్తేజ ఉదీర్ణ మైక్షత,
విసర్జయామాస కవిం సనాతనం లయం చ తత్ర ప్రతిపేదివా నసౌ.
దేవ దేవుడు ఇట్లు పలుకగా వ్యాధునకు తన దేహము నుండి వెలువడిన గొప్ప వెలు గొక్కటి కాన వచ్చెను. అంత నాతడు కవియు సనాతనుడును అగు దేవుని వీడుకొని యతనితో ఒక్కటిగా నయ్యెను.
ఇతీరితే స్తోత్రవరం ధరే నరః పఠిష్యతే యశ్చ శృణోతి మానవః,
హరిం సమభ్యర్చ్య సదా హ్యుపోషితో విశేషతో విష్ణుదినే చ మానవః,
స యాతి యత్ర స్వయ మేవ కేశవో వసేత మన్వన్తర సప్తతిం సుఖమ్.
భూదేవీ! ముఖ్యముగా ఏకాదశి నాడు ఉపవాస ముండి, హరి నారాధించి ఈ ఉత్తమ స్తోత్రమును పఠించు వాడును, విను వాడును డెబ్బది మన్వంతరముల కాలము కేశవుని కడ సుఖముగా నివసించును.