వరాహ మహా పురాణము
అధ్యాయము - 99
హోత:
జలధేనుం ప్రవక్ష్యామి పుణ్యేహ్ని విధిపూర్వకమ్,
గోమయే మండలం కృత్వా గోచర్మ తదనన్తరమ్.
తత్ర మధ్యే చ రాజేన్ధ్ర పూర్ణకుంభంతు విన్యసేత్,
జలపూర్ణం సుగంధాడ్యం కర్పూరాగురు చన్దనైః,
వాపితం గంధతోయేన తాం ధేనుం పరికల్పయేత్.
హోత:
రాజా! జల ధేనువును గూర్చి చెప్పెదను పుణ్య దినమున విధి పూర్వకముగా గోమయముతో మండలము చేసి దానిపై గోవు చర్మమును ఉంచి దాని నడుమ పూర్ణ కుంభమును ఉంచ వలయును. గంధముతో, కర్పూరము, అగురు, చందనము అనువాని సువాసన గల నీరు నింపి ఆ ధేనువును ఏర్పరుప వలయును.
వత్సం తథాపరం కల్ప్య ఘృతేన పరిపూరితమ్,
వర్ధనీకం మహారాజ పత్ర పుష్ఫైః సమన్వితమ్,
దుర్వాఙ్కురై రుపస్తీర్య స్రగ్దామైశ్చ విభూషితమ్.
అట్లే మరియొక కుంభమును నేతితో నింపి ఆకులతో పూవులతో అలంకరింప వలయును. గరిక మొలకలను క్రింద నుంచ వలయును. పూల మాలలతో అలంకరింప వలయును.
పఞ్చరత్నాని నిక్షిప్య తస్మిన్ కుంభే నరాధిప,
మాంసీ ముశీరం కుష్ఠంచ తథాశైలేయ వాలుకమ్.
అయిదు రత్నములను ఆ కుంభమున నుంచ వలయును. అట్లే మాంసి, ఉశీరము, కుష్ఠము, కొండ మట్టి అను వానిని అందు నిలుప వలయును. (మాంసి = జటామాంసి అను మూలిక; ఉశీరము = వట్టివేరు; కుష్ఠము = చెంగల్వకోష్టు; శైలేయవాలుకము = కొండ ఏటి లోని ఇసుక).
ఆమలాః సర్షపాః శ్వేతాః సర్వధాన్యాని పార్థివ,
చతు ర్దిక్ష్వపి పాత్రాణి చత్వార్యేవ ప్రకల్పయేత్.
దానిలో ఆమలములు, తెల్ల నువ్వులు, సర్వ ధాన్యములు ఉంచ వలయును. నాలుగు దిక్కు లందును నాలుగు పాత్రలను పెట్ట వలయును. (ఆమలము = ఉసిరిక కాయ)
ఏకం ఘృతమయం పాత్రం ద్వితీయం దధిపూరితమ్,
తృతీయం మధునశ్చైవ చతుర్థం శర్కరావృతమ్.
ఒకటి నేతి పాత్ర, రెండవది పెరుగు పాత్ర, మూడవది తేనె పాత్ర, నాలుగవది చక్కెర గిన్నె.
సువర్ణముఖచక్షూంషి శృజ్గాః కృష్ణాగురేషు చ,
ప్రశస్త పత్ర శ్రవణాం ముక్తాఫలమయేక్షణామ్.
తామ్రపృష్ఠాం కాంస్యదోహాం దర్భరోమసమన్వితామ్,
పుచ్ఛం సూత్రమయం కృత్వా కృష్ణాభరణ ఘంటికామ్.
బంగారు మొగము, నల్లని అగురుతో చేసిన కొమ్ములు, మేలైన ఆకుల చెవులు, ముత్యములతో చేసిన చూపులు, ఎఱ్ఱని పిరుదు, కంచు పాత్ర దర్భలే వెండ్రుకలు, త్రాటితో తోక, నల్లని ఆభరణములు, గంటలు కలిగిన ఆవును చేయ వలయును.
కంబలే పుష్పమాలాం చ గుడాస్యాం శుక్తిదన్తికామ్,
జిహ్వాం శర్కరయా కృత్వా నవనీతేన చ స్తనమ్,
ఇక్షుపాదాం తు రాజేన్ధ్ర గంధపుష్పోపశోభితామ్.
గంగడోలు నందు పూల మాల నుంచ వలయును. బెల్లపు మొగము, ముత్యపు చిప్పల దంతములు, చక్కెరతో నాలుక, వెన్నతో పొదుగు, చెరకు గడలతో కాళ్లు కల ఆవును చేసి సర్వా భరణములతో అలంకరింప వలయును.
కృష్ణాజినోపరి స్థాప్య వస్త్రై రాచ్ఛాదితం తు తామ్,
గంధపుష్ఫైః సమభ్యర్చ్య విప్రాయ వినివేదయేత్.
నల్లని లేడి చర్మము పైనుండి వస్త్రములతో కప్పి గంధ పుష్పములతో చక్కగా పూజ చేసి దానిని విప్రునకు సమర్పింప వలయును.
ఏవం ధేనుం తదా దత్వా బ్రాహ్మణే వేదపారగే,
సాధు విప్రాయ రాజేన్ద్ర శ్రోత్రియా యాహితాగ్నయే,
తపోవృద్ధే వయోవృద్ధే దాతవ్యం చ కుటుంబినే.
వేదము తుదిదాక అధ్యయనము చేసిన వాడు, సాధువు, శ్రోత్రియుడు, ఆహితాగ్ని, తపస్సు చేతను, వయస్సు చేతను పెద్దవాడు, కుటుంబము కలవాడు అగు బ్రాహ్మణునకు ఆ ధేనువును దానము చేయ వలయును.
యో దదాతి నరో రాజన్ పశ్యతి చ శృణోతి చ,
ప్రతిగృహ్ణాతి యో విప్రః సర్వే తరన్తి దుష్కృతమ్.
రాజా! ఇట్లు దానము చేయువాడు, చూచువాడు, వినువాడు, పుచ్చుకొను వాడగు విప్రుడు, వీరందరు పాపము నుండి దాటుదురు.
బ్రహ్మహా దన్యుహా గోఘ్నః సురాపో గురుతల్పగః,
విముక్తః సర్వపాపైస్తు విష్ణులోకం స గచ్ఛతి.
బ్రహ్మ హత్య, క్రూర హత్య, గోహత్య అనునవి చేసిన వాడు, మద్యము త్రావు వాడు గురు పత్నిని చెరచిన వాడును సర్వ పాపముల నుండియు దీని వలన విముక్తు డగును. విష్ణు లోకమున కరుగును.
యోశ్వమేధేన యజతే సమాప్త వరదక్షిణః,
జలధేనుం చ యో దద్యాత్ సమమేత న్నరాధిప.
రాజా! అశ్వమేధ యాగమును, శ్రేష్ఠమగు దక్షిణలతో పూర్తి చేసిన వాడును, జల ధేనువును దాన మొసగిన వాడును సమానులే.
జలాహారస్త్వేకదినం తిష్ఠేచ్చ జలధేనుదః,
అథ పయోవ్రత స్తిష్ఠే దేకాహం వ్రతమాస్థితః,
గ్రాహకోపి త్రిరాత్రం వై తిష్ఠే దేవం న సంశయః.
ఈ జలధేను దానము చేయువాడు ఒక దినము జలాహారము. ఒకదినము పాల ఆహారమును మాత్రమే పుచ్చుకొని వ్రత మాచరింప వలయును. దానము పుచ్చు కొనువాడు గూడ మూడు రాత్రులు ఇట్లే ఉండ వలయును.
యత్ర క్షీరవహా సద్యో మధుపాయస కర్దమాః,
యత్ర చాప్సరసాం గీతం తత్ర యాన్తి జలప్రదాః.
ఈ జలధేను దానము చేయువారు పాలతో ప్రవహించు నదులు, తేనె, పాయసముల సమృద్ధి, అప్సరసల పాటలు గల పుణ్య లోకముల కరుగుదురు.
దాతా చ దాపక శ్చైవ ప్రతిగ్రాహీ చ యో ద్విజః,
సర్వ పాపవినిర్ముక్తో విష్ణుమేతి న సంశయః.
ఇచ్చువాడు, ఇప్పించు వాడు, పుచ్చుకొను బ్రాహ్మణుడును అన్ని పాపములను రూపు మాపుకొని విష్ణు లోకమున కరుగుదురు. సంశయము లేదు.
జలధేను విధానం యః శృణుయాత్ కీర్తయేత వా,
సర్వపాప వినిర్ముక్తః స్వర్గ మేతి జితేన్ధ్రియః.
ఈ జలధేను విధానమును గూర్చి విన్న వాడును, పలికిన వాడును, పాపము లన్నింటిని పోగొట్టు కొని ఇంద్రియములను గెలిచిన వాడై స్వర్గమున కరుగును.