వరాహ మహా పురాణము
అధ్యాయము - 40
దుర్వాసుడు:
తథైవ పౌషమాసే తు అమృతం మథితం సురైః,
తత్రకూర్మో భవేద్దేవః స్వయమేవ జనార్దనః.
దుర్వాసుడు:
అట్లే పౌష మాసమున దేవతలు సముద్రమును చిలికిరి. అప్పుడు స్వయముగా జనార్దనుడే తాబేలుగా ఆయెను.
తస్యేయం తిథి రుద్దిష్టా హరే ర్వై కూర్మరూపిణః,
పుష్యమాసస్య యా శుద్దా ద్వాదశీ శుక్లపక్షతః.
కూర్మ రూపము గల ఆ హరి నుద్దేశించి పుష్యమాస శుద్ధ ద్వాదశి ఏర్పడినది.
తస్యాం ప్రాగేవ సంకల్ప్య ప్రాగ్వత్ స్నానాదికాః క్రియాః,
నిర్వర్త్యారాధయేద్ రాత్ర్యా మేకాదశ్యాం జనార్దనమ్,
పృథజ్మన్తై ర్మునిశ్రేష్ఠ దేవదేవం జనార్దనమ్.
ఏకాదశి నాటి రాత్రియే ముందుగా సంకల్పించి స్నానము మొదలగు పనులు ముందు వలెనే ఆచరించి మునిశ్రేష్ఠా! వేర్వేరు మంత్రములతో దేవ దేవుడగు జనార్దనుని ఆరాధింప వలయును.
ఓం కూర్మాయ పాదౌ ప్రథమం ప్రపూజ్య నారాయణాయేతి హరేః కటించ,
సంకర్షణాయే త్యుదరం విశోకే త్యురోభవాయేతి తథైవ కంఠమ్.
“ఓం కూర్మాయ నమః” అని పాదములను మొదట పూజించి “నారాయణాయ నమః” అని హరి నడుమును, “సంకర్షణాయ నమః” అని ఉదరమును, “విశోకాయ” “ఉరోభవాయ నమః” అని కంఠమును పూజింప వలయును.
సుబాహవేత్యేవ భుజౌ శిరశ్చ,
నమో విశాలాయ రథాంగసారమ్.
“ఓం నమః సుబాహవే” యని భుజములను. “నమో విశాలాయ” అని శిరస్సును, చక్రమును పూజింప వలయును.
స్వనామమంత్రేణ సుగంధపుష్పై ర్నానా నివేద్యై ర్వివిధైః ఫలైశ్చ,
అభ్యర్చ్యదేవం కలశం తదగ్రే సంస్థాప్య మాల్యైః సితకంఠదామ.
తన పేరు పేర్కొనుచు, మంచి వాసన గల పూవులతో పెక్కు విధములగు పండ్లతో చక్కగా పూజించి ఆతని ముందు మాలలు కట్టిన మెడ గల కలశమును స్థాపించ వలయును.
తం రత్న గర్భంతు పురేవకృత్వా స్వశక్తితో హేమమయం తు దేవమ్,
సమన్దరం కూర్మరూపేణ కృత్వా సంస్థాప్య తామ్రే ఘృత పూర్ణపాత్రే,
పూర్ణే ఘటస్యోపరి సంనివేశ్య శ్వో బ్రాహ్మణాయైవ మేవంతు దద్యాత్.
తన శక్తి ననుసరించి లోపల రత్నములు గల బంగారు కలశమును ముందు వలెనే చేసి మందర పర్వతముతో కూడిన కూర్మ రూపుడగు విష్ణువును నేతితో నిండిన రాగి పాత్ర యందుంచి దానిని కలశము పైనిడి మరునాడు బ్రాహ్మణున కొసగ వలయును.
శ్వో బ్రాహ్మణాన్ భోజ్య సదక్షిణాంశ్చ యథాశక్త్యా ప్రీణయేద్ దేవదేవమ్,
నారాయణం కూర్మరూపేణ పశ్చాత్ తతా స్వయం భుఞ్జీత సభృత్యవర్గః.
చక్కని దక్షిణలతో మరునాడు బ్రాహ్మణులకు శక్తిని బట్టి భోజనము పెట్టి కూర్మ రూపముతో దేవ దేవుడగు నారాయణుని తృప్తి పరుప వలయును. పిదప తన అనుచరులతో భుజింప వలయును.
ఏవం కృతే విప్ర సమస్త తాపం వినశ్యతే నాత్ర కుర్యాద్ విచారమ్,
సంసారచక్రం తు విహాయ శుద్ధం ప్రాప్నోతి లోకం చ హరేః పురాణమ్,
ప్రయాంతి పాపాని వినాశ మాశు శ్రీమాం స్తథా జాయతే సత్యధర్మః.
విప్రా! ఇట్లు చేసినచో అన్ని తాపములను రూపుమాసి పోవును. విచారము చేయ వలదు. అట్టి సత్య ధర్ముడు సంసార చక్రమును వదలి వైచి నిర్మలము, సనాతనము అగు హరి లోకమును పొందును. అక్కడి కక్కడ పాపము లన్నియు నశించి పోవును. వాడు శ్రీమంతుడగును.
అనేక జన్మాంతర సంచితాని నశ్యన్తి పాపాని సరస్య భక్త్యా,
ప్రాగుక్తరూపం తు ఫలం లభేత నారాయణ స్తుష్టి మాయాతి సద్యః.
భక్తితో ఇట్లు చేసిన నరుని పెక్కు తొలి జన్మముల పాపము లన్నియు పటా పంచలగును. మున్ను చెప్పిన ఫలము నతడు పొందును. వెను వెంటనే నారాయణుడు తుష్టి పొందును.