వరాహ మహా పురాణము
అధ్యాయము - 108
హోత:
అధాతః సంప్రవక్ష్యామి ధేనుం కార్పాసమయీం నృప.
యత్ర్పదానాన్నరోయాతి ఐన్ద్రం లోక మునుత్తమమ్.
హోత:
రాజా! ప్రత్తి ఆవును గూర్చి వివరించెదను. దాని నిచ్చుట వలన నరుడు మిక్కిలి శ్రేష్ఠమగు ఇంద్ర లోకమున కరుగును.
విషువే త్వయనే పుణ్యే యుగాదిగ్రహణే తథా,
సర్వాసు గ్రహపీడాసు దుఃస్వప్నా ద్భూతదర్శనే.
పుణ్యే చాయతనే రాజన్ శుచిదేశే గవాంగణే.
విషువము, అయనము, సంక్రాంతి పుణ్య కాలము, సంవత్సరాది, గ్రహణము అను సమయములలో, గ్రహ పీడలు సంభవించి నపుడు, పీడ కలలు, దయ్యములు కనబడి నపుడును పుణ్య స్థలము నందును, ఆవుల మందలున్న చోటను, పవిత్ర స్థలము నందును దీనిని చేయ నగును.
గోమయేనానులిప్తాయాం దర్భా నాస్తీర్య వై తిలాన్,
తన్మధ్యే స్థాపయేద్ ధేనుం వస్త్రమాల్యానులేపనైః,
నైవేద్య ధూపదీపాద్యైః పూజయేచ్చ విమత్సరః.
ఆవు పేడతో అలికిన భూమి యందు దర్భలను పరచి దానిపై తిలలను ఉంచి ఆ నడుమ ధేనువును నిలుప వలయును. వస్త్రములు, మాల్యములు, గందపు పూతలు, నైవేద్యము, ధూపము, దీపము మొదలగు వానితో పొగరు లేనివాడై పూజింప వలయును.
ఉత్తమా చతుర్భి ర్భారై స్తదర్ధేన తు మధ్యమా,
భారేణ అధమా ప్రోక్తా విత్తశాఠ్యం వివర్జయేత్,
చతుర్ధాంశేన కృత్వా వై వత్సంతు పరికల్పయేత్.
నాలుగు బారువుల పత్తితో చేయుట ఉత్తమ పద్ధతి. అందులో సగముతో మధ్యమ పద్ధతి. ఒక బారువుతో చేయుట అధమ పద్ధతి. ధన విషయములో వంచన పనికి రాదు. నాలుగవ భాగముతో దూడను చేయ వలయును.
కర్తవ్యా రుక్మశృఙ్గై స్తు రాజతం ఖురసంయుతమ్,
నానాఫలమయా దన్తా రత్నగర్భ సమన్తితాః.
బంగారు కొమ్ములతో, వెండి గొరిజలతో, పెక్కు పండ్ల దంతములతో రత్నములు కడుపున ఉండు నట్లుగా ధేనువును తీర్ప వలయును.
ఇత్యేవం సర్వసంపూర్ణం కృత్వా శ్రద్ధయాన్వితః,
పూర్వోక్తస్తు విధిః కార్యో దానమంత్ర పురస్సరః.
ఇట్లు అన్నియు నిండుగా నుండునట్లు ఆవును రూపొందించి శ్రద్ధతో కూడిన వాడై ఆ కార్పాస ధేనువును మంత్రములతో ఆవాహనము చేయ వలయును.
దద్యాదథ దర్భపాణిః ప్రయతః శ్రద్ధయాన్వితః,
పూర్వోక్తస్తు విధిః కార్యో దానమంత్ర పురస్సరః.
దర్భలు చేతదాల్చి పవిత్రుడై శ్రద్ధ గలవాడై దాన మంత్రములతో పాటు మునుపటి విధానమును చేయ వలయును.
యథా దేవగణాః సర్వే త్వయా హీనా నవర్తతే,
తథా మాముద్దరేద్ దేవి పాహి సంసారసాగరాత్.
దేవీ! నీవు లేక దేవ గణములు లేవు. నన్నీ సంసార మనెడు సముద్రము నుండి ఉద్ధరింపుము అని పలుక వలయును.