వరాహ మహా పురాణము
అధ్యాయము - 84
రుద్రుడు:
ఉత్తరాణాం చ వర్షాణాం దక్షిణానాం చ సర్వశః,
ఆచక్షతే యథాన్యాయం యేచ పర్వతవాసినః,
తచ్ఛ్రుణుధ్వం మయా విప్రాః కీర్త్యమానం సమాహితాః
రుద్రుడు:
విప్రులారా! ఉత్తర దేశము లయు, దక్షిణ దేశము లయు పర్వతము లందు నివసించు వారి వివరములను చెప్పు చున్నాను. చెదరని మనస్సులతో వినుడు.
దక్షిణేన తు శ్వేతస్య నీలస్య చోత్తరేణ చ,
వాయవ్యాం రమ్యకం నామ జాయన్తే తత్ర మానవాః,
మతి ప్రధానా విమలా జరాదౌర్గన్ధ్య వర్జితాః.
శ్వేత పర్వతమునకు దక్షిణముగా, నీలమునకు ఉత్తరముగా, వాయవ్య దిశలో రమ్యకమను దేశము కలదు. అందు బుద్ధి విశేషము కలవారు, స్వచ్ఛ జీవనము కలవారు, ముసలి తనమును దుర్వాసన లేనివారు అయిన జనులు ఉందురు.
తత్రాపి సుమహాన్ వృక్షో న్యగ్రోధో రోహితః స్మృతః,
తత్ఫలాద్ రసపానాద్ధి దశవర్షసహస్రిణః,
ఆయుషా సర్వమనుజా జాయన్తే దేవరూపిణః.
అందును ఒక పెద్ద రావి చెట్టు ‘రోహితము’ అనునది కలదు. దాని పండు వలనను, దాని రసమును త్రావుట వలనను అందలి మనుజు లందరు దేవ రూపులై పది వేల సంవత్సరములు ఆయువు కల వారగుదురు.
ఉత్తరేణ చ శ్వేతస్య త్రిశృంగస్య చ దక్షిణే,
వర్షం హిరణ్మయం నామ తత్ర హైరణ్వతీ నదీ,
యక్షా వసన్తి తత్రైవ బలినః కామరూపిణః.
శ్వేత పర్వతమునకు ఉత్తరముగా, త్రిశృంగమునకు దక్షిణముగా హిరణ్మయము అను దేశము కలదు. అచట హైరణ్వతి అనునది కలదు. ఆ దేశమున బలవంతులు, కామ రూపులు అగు యక్షులు నివసింతురు.
ఏకాదశసహస్రాణి సమానాం తేన జీవతే,
శతా న్యన్యాని జీవన్తే వర్షాణాం దశపఞ్చచ.
అందలి జనులు పదు నొకండు వేల యేండ్లు జీవింతురు. మరియు వందల కొలదిగా ఇతరులు పదునైదు వేల యేండ్లు బ్రదుకుదురు.
లకుచాః క్షుద్రసా వృక్షా స్తస్మిన్ దేశే వ్యవస్థితాః,
తత్ఫల ప్రాశమానా హి తేన జీవన్తి మానవాః.
ఆ దేశమున చిన్నవియగు గజ నిమ్మ వృక్షము లుండును. ఆ పండ్లను తినుచు అచటి మానవులు జీవింతురు.
తథా త్రిశృంగే చ మణికాంచన సర్వరత్న శిఖరాను
క్రమేణ తస్య చోత్తరశృంగా ద్దక్షిణసముద్రాన్తే
చోత్తరకురవః. వస్త్రాణ్యా భరణాని చ వృక్షేష్వేవ జాయన్తే.
క్షీరవృక్షాః క్షీరాసవాః సన్తి. మణి భూమిః సువర్ణవాలుకా.
తస్మిన్ స్వర్గచ్యుతాశ్చ పురుషా వసన్తి త్రయోదశవర్ష సహస్రాయుషః.
అట్లే త్రిశృంగ పర్వతమును మణి కాంచనము, రత్న శిఖరము అనువాని వరుసలో దాని ఉత్తర శృంగము మొదలుకొని దక్షిణ సముద్రము తుది వరకు ఉన్నవి ఉత్తర కురు భూములు. అందలి జనులకు వస్త్రములు, ఆభరణములును చెట్టులందే కలుగును. అవి పాలను, రసములను ఇచ్చు వృక్షములు. అది యంతయు మణులు నిండిన భూమి. ఇసుక సువర్ణ మయము. అందు స్వర్గము నుండి జారిన మనుష్యులు పదుమూడు వేల యేండ్ల ఆయువు కలవారు నివసింతురు.
తస్యైవద్వీపస్య పశ్చిమేన చతుర్యోజనసహస్ర
మతిక్రమ్య దేవలోకాత్ చంద్రద్వీపో భవతి, యోజన సహస్ర పరిమండలః.
తస్య మధ్యే చంద్రకాంత సూర్యకాంతనామానౌ గిరివరౌ.
తయోశ్చ మధ్యే చంద్రావతీ నామ మహానదీ
అనేకవృక్షఫలానేకనదీ సమాకులా. ఏతత్కురువర్షం చ.
ఆ ద్వీపమునకు పడమరగా దేవ లోకము నుండి నాలుగు వేల యోజనములు దాటిన పిమ్మట చంద్ర ద్వీపము కలదు. వేయి ఆమడల వైశాల్యము కలది. దాని మధ్య చంద్రకాంత సూర్య కాంతములను గొప్ప పర్వతములు కలవు. వాని మధ్య చంద్రావతి అను మహా నది పెక్కు పండ్ల చెట్లతో పెక్కు నదులతో కూడినది కలదు. దీనినే కురు దేశము అందురు.
తస్యోత్తరపార్శ్వే సముద్రోర్మిమాలాఢ్యం
పంచయోజన సహస్ర మతిక్రమ్య దేవలోకాత్ సూర్యద్వీపో
భవతి యోజనసహస్ర పరిమండలః.
తస్య మధ్యే గిరవరః శత యోజనవిస్తీర్ణ స్తావదుచ్ఛ్రితః.
తస్మాత్ సూర్యావర్తనామా నదీ నిర్గతా.
తత్ర చ సూర్య స్యాధిష్ఠితమ్.
తత్ర సూర్యదైవత్యా స్తద్వర్ణాశ్చ ప్రజా దశవర్షసహస్రాయుషః.
దాని ఉత్తర పార్శ్వమున సముద్రపు అలల మాలలతో గొప్పదియు, దేవ లోకము నుండి అయిదు వేల యోజనముల దూరమున నున్నదియు అగు సూర్య ద్వీపము వేయి ఆమడల వైశాల్యముతో కలదు. దాని మధ్య నూరు యోజనముల విస్తీర్ణము, ఎత్తుగల గొప్ప పర్వతమున్నది. అది సూర్య దేవుని నివాస భూమి. అందు సూర్యుడు దైవముగా గలవారు, ఆ వన్నె కలవారు పదివేల సంవత్సరముల ఆయువు కలవారు అగు జను లుందురు.
తస్య చ ద్వీపస్య పశ్చిమేన చతుర్యోజన సహస్రమతి
క్రమ్య సముద్రం దశయోజన సహస్రం
పరిమండల త్వేన ద్వీపో రుద్రాకరో నామ.
తత్ర చ భద్రాసనం నామ వాయో రనేక రత్నశోభితమ్.
తత్ర విగ్రహవాన్ వాయు స్తిష్ఠతి.
తపనీయవర్ణాశ్చ ప్రజాః పంచవర్ష సహస్రాయుషః.
ఆ ద్వీపమునకు పడమరగా నాలుగు వేల యోజనములు దాటి పదివేల ఆమడల వైశాల్యము గల రుద్రాకరము అను ద్వీపము కలదు. అందు వాయు దేవుని భద్రాసనము పెక్కు రత్నములతో విరాజిల్లునది కలదు. అందు వాయు దేవుడు రూపము తాల్చి నివసించును. బంగారు వన్నె కల అచటి ప్రజలు అయిదు వేల ఏండ్ల ఆయువు కలవారు.