వరాహ మహా పురాణము
అధ్యాయము - 22
మహాతపుడు:
తస్మిన్ నివసత స్తస్య రుద్రస్య పరమేష్ఠినః,
చుకోప గౌరీ దేవస్య పితు ర్వైర మనుస్మరన్.
మహాతపుడు:
అట్లు పరమేశ్వరుడగు రుద్రుడా కైలాస గిరి యందు నివసించు చుండగా ఒకప్పుడు గౌరీ దేవి తండ్రి పగ మదిలో మెదలగా రుద్రునిపై కోపించెను.
చింతయామాస దక్షస్య అనేనాపకృతం పురా,
యజ్ఞో విధ్వంసితో యస్మాత్ తస్మాచ్ఛాన్యాం తనూ మహమ్.
ఈతడు మునుపు దక్షున కపకార మొనర్చెను. అతని యజ్ఞమును పాడు చేసెను. కావున నేను మరియొక దేహమును తాల్తును.
ఆరాధ్య తపసా తస్య గృహే భూత్వా వ్రజామ్యహమ్,
కథం గచ్ఛామి పితరం దక్షం క్షపిత బాంధవమ్.
తపస్సుతో అతని నారాధించి మరల అతని గృహమును జేరు కొందును. అట్లు గాక బంధువు లందఱు నశించిన నా తండ్రి కడ కెట్లరుగుదును.
భవపత్నీ చ దుహితా ఏవం సంచింత్య సుందరీ,
జగామ తపసే శైలం హిమవంతం మహాగిరిమ్.
భవుని యిల్లాలు, దక్షుని కూతురు అగు ఆ సుందరి యిట్లు తలపోసి తపస్సునకై హిమవంతమను మహా పర్వతమున కరిగెను.
తత్ర కాలేన మహతా క్షపయంతీ కలేవరమ్,
స్వశరీరాగ్నినా దగ్ధ్వా తతః శైలసుతా భవత్.
అంత పెద్ద కాలమునకు దేహమును కృశింప జేసి, తన శరీరాగ్నితో దానిని కాల్చి వైచి యాయమ కొండ కూతురాయెను.
ఉమానామేతి మహతీ కృష్ణా చేత్యభిధానతః,
అబ్ధ్వాతు శోభనాం మూర్తిం హిమవంత గృహే శుభా.
ఆ దొడ్డ వనిత ఉమయను పేరు తాల్చి, ‘కృష్ణ’ యనియు వ్యవహారము గలిగి మిక్కిలి చక్కనైన రూపము తాల్చి హిమవంతుని గృహమున ఉదయించెను.
పున స్తపశ్చకారోగ్రం స్మృత్వా త్రిలోచనమ్,
అసా వేవ పతి ర్మహ్య మిత్యుక్త్వా తపసి స్థితా.
ఆ త్రిలోచనుడే నాకు భర్త కావలయు నని పరమేశ్వరునే తలచుచు గొప్ప తనమున నిలిచి యాయమ తపము చేసెను.
కుర్వంతా తత్ తప శ్చోగ్రం హిమవంతే మహాగిరౌ,
కాలేన మహతా దేవ స్తపసారాధిత స్తయా.
ఆజగా మాశ్రమం తస్యా విప్రో భూత్వా మహేశ్వరః,
వృద్ధః శిధిలసర్వాంగః స్ఖలంశ్చైవ పదే పదే.
హిమవత్పర్వతమున అట్లు తన్ను గూర్చి ఘోర తపము చేయు చున్న, ఆమె ఆశ్రమమునకు మహేశ్వరుడు ముదుసలి, అవయవముల పట్టు సడలిన వాడు, అడు గడుగునకు తొట్రు పడుచున్న వాడు నగు బ్రాహ్మణుని రూపము తాల్చి వచ్చెను.
కృచ్ఛ్రాత్ తస్యాః సమీపం తు ఆగత్య ద్విజ సత్తమః,
బుభుక్షితోస్మి మే దేహి భద్రే భోజ్యం ద్విజస్యతు.
ఆ విప్ర వరుడు అతి కష్టమున ఆమె దరికి వచ్చి మంచిదానా! బాపడను, ఆకలి వేయు చున్నది. నాకు తినుట కేదైన పెట్టుము, అని అడిగెను.
ఏవ ముక్తా తదా కన్యా ఉమా శైలసుతా శుభా,
ఉవాచ బ్రాహ్మణం భోజ్యం దద్మి విప్ర ఫలాదికమ్,
కురుస్నానం ద్రుతం విప్ర భుఞ్జస్వాన్నం యదృచ్ఛయా.
అతడిట్లు పలుకగా శైలకన్య ఉమ ఆ బ్రాహ్మణునితో ‘ఓయీ! విప్ర నీకు తినుటకు పండ్లు మొదలగునవి యిత్తును. వేగము స్నానము చేయుము. నీ యిచ్చ వచ్చినట్లు అన్నము తినుము’ అని పలికెను.
ఏవ ముక్త స్తదా విప్ర స్తస్య పార్శ్వే మహానదీమ్,
గంగాం జగామ స్నానార్థీ స్నానం కర్తు మవాతరత్.
అట్లు ఆమె పలుకగా ఆ విప్రుడు ఆ ఆశ్రమమునకు ప్రక్క నున్న మహా నదియగు గంగకు స్నానము చేయ గోరి యరిగెను. స్నానము చేయుటకై దిగెను.
స్నానం తు కుర్వతా తేన రుద్రేణ ద్విజరూపిణా,
భూత్వామాయామయం భీయం మకరం భయదర్శనమ్,
గ్రాహితస్తు తదా విప్ర స్తేన దుష్టేన మద్గునా.
బ్రాహ్మణ వేషము తాల్చిన రుద్రుడు స్నానము చేయు చుండగా నొక భయంకరమగు మొసలి మాయ వలన నేర్పడెను. అప్పుడా విప్రుని ఆ చెడ్డ మొసలి పట్టు కొనెను.
దృష్ట్వా ధృత మథాత్మానం మకరేణ బలీయసా,
వృద్ధ మాత్మాన మన్యం తాం దర్శయన్ వాక్యమబ్రవీత్.
మిక్కిలి బలము గల ఆ మొసలికి పట్టు పడిన ఆ ముదుసలి తన్ను తాను మరియొక విషముగా ఆమెకు కన్పట్ట జేయుచు నిట్లు పలికెను.
అబ్రమ్మణ్యం గతం కన్యే ధావస్వానయ మాంరుషః,
యావన్నాయాతి వికృతిం తావన్మాం త్రాతు మర్హసి.
‘బాలా! చచ్చితిని. పరుగున వచ్చి నన్ను ఈ క్రూర మృగము బారి నుండి లాగికొని పొమ్ము. ఏదో కీడు మూడక ముందే నన్ను రక్షింప వలయును.’
ఏవ ముక్తా తదా కన్యా చింతయామాస పార్వతీ,
పితృభావేన శైలేంద్రం భర్తృభావేన శంకరమ్,
స్పృశామి తపసా పూతా కథం విప్రం స్పృశామ్యహమ్.
అతడట్లు పలుకగా పార్వతి యిట్లు తల పోసేను. తండ్రియని హిమవంతుని మగడని శంకరుని తాక జాలుదును. తపస్సు చేత పవిత్రత నొందిన నేను ఇప్పుడీ బ్రాహ్మణుని ఎట్లు తాక జాలుదును?
యద్యేనం నాపకర్షామి మకరేణ జలే ధృతమ్,
తదానీం బ్రహ్మవధ్యా మే భవతీతి న సంశయః.
ఇప్పుడు నీటిలో మొసలికి చిక్కిన ఈతనిని ఈ వలకు లాగ కుందునేని నాకు బ్రహ్మ హత్య చుట్టుకొను ననుటలో సందియము లేదు.
అన్యవ్యతిక్రమే ధర్మ మపనేతుం చ శక్యతే,
బ్రహ్మవధ్యా పునర్నైవ మేవముక్త్వా గతా త్వరమ్.
ఇతరమైన తప్పిదము అధర్మమును పోగొట్టు కొన వచ్చును. బ్రహ్మ హత్యా దోషము మాత్రము అట్లు పోగొట్టు కొనరానిది. అని తలచి ఆమె వడిగా నరిగెను.
సా గత్వా త్వరితం భీరు ర్గృహీత్వా పాణినా ద్విజమ్,
చకర్షాంత ర్జలాత్ తావత్ స్వయం భూతపతి ర్హరః.
యమారాధ్య తపశ్చర్తు మారబ్ధం శైలపుత్రయా,
స ఏవ భగవాన్ రుద్ర స్తస్యాః పాణౌ విలంబత.
అట్లామె వడివడిగా నరిగి ఆ పాఱుని చేతితో పట్టుకొని నీటి నుండి లాగెను. ఇంతలో తన తపస్సునకు లక్ష్యమైన ఆ రుద్రుడే ఆమె చేతికి చిక్కెను.
తం దృష్ట్యా లజ్జితా దేవీ పూర్వత్యాగ మనుస్మరన్,
న కించి దుత్తరం సుభ్రూ ర్వదతి స్మ సులజ్జితా.
అతనిని చూచినంత ఆ దేవి మిక్కిలి సిగ్గు పడెను. పూర్వము తన్ను వదలిన విషయమున తల పోయుచు ఆ సుందరి సిగ్గుతో ఒక్క పలుకేని పలుక కుండెను.
తూష్ణీం భూతాం తు తాందృష్ట్వా గౌరీం రుద్రోహసన్నివ,
పాణౌ గృహీత్వా మాం భద్రే కథం త్యక్తు మిహార్హసి.
అట్లు పలుక కున్న ఆ గౌరిని గాంచి రుద్రుడు మెల్లగా నవ్వుచు ఇట్లు పలికెను. ఓ కాంతా!
నన్ను చేపట్టితివి. ఇప్పుడు ఎట్లు వదల గలవు?
మత్పాణిగ్రహణం భద్రో వృథా యది కరిష్యసి,
తదానీం బ్రహ్మణః పుత్ర్యామాహారార్థం బ్రవీమ్యహమ్.
నా పాణి గ్రహణమును నీవు వ్యర్థము చేసినచో నేను బ్రహ్మ పుత్రికను ఆహారము కొఱకు వేడు కొందును.
న భవేత్ పరిహాసోయ ముక్తా దేవీ పరాపరా,
లజ్జమానా తదా వాక్యం వదతి స్మిత పూర్వకమ్.
‘ఇది పరిహాసము కాదు’ అని పలుకగా అతని యందు అనన్య భావము గల ఆ దేవి సిగ్గు పడుచు చిరునగవుతో ఇట్లు పలికెను.
దేవ దేవ త్రిలోకేశ త్వదర్థోయం సముద్యమః,
ప్రాగ్జన్మారాధితో భర్తా భవాన్ దేవో మహేశ్వరః.
దేవదేవా! త్రిలోకేశా! ఈ ప్రయత్న మంతయు నిన్ను పొందుటకే. పూర్వ జన్మములలో నేనారాధించిన దేవుడవు, మహేశ్వరుడవు, భర్తవు నీవే.
ఇదానీం మే భవాన్ దేవః పతి ర్నాన్యో భవిష్యతి,
కింతు స్వామి పితా మహ్యం శైలేంద్రోమే వ్రజామి తమ్,
అనుజ్ఞాప్య విధానేన తతః పాణిం గ్రహీష్యసి.
ఇప్పుడును ఆ మహేశ్వర దేవుడవగు నీవే నాకు పతివి. మరియొకడు కాజాలడు. కానీ నన్నిచ్చుటకు ప్రభువు మా నాయన కలడు. నేనాతని కడ కరుగుదును. అతని యనుమతి గొని నన్ను నీవు పాణి గ్రహణము చేయ నగును.
ఏవ ముక్త్వా తదా దేవీ పితరం ప్రతిభమినీ,
కృతాంజలిపుటా భూత్వా హిమవంత మువాచహ.
ఇట్లు పలికి ఆ దేవి తండ్రి కడ కరిగి చేతులు దోయిలించి హిమవంతునితో నిట్లు పలికెను.
అతోన్య జన్మభర్తా మే రుద్రో దక్షమఖాంతకః,
ఇదానీం తపసా సైవ ధ్యాతోభూద్ గతిభావనః.
ఇప్పటికి వెనుకటి నా పుట్టువున దక్షుని యజ్ఞమును నాశన మొనర్చిన శంకరుడు నా భర్త. నేనతనినే సర్వ గతులలో భావన చేయుచు తపస్సుతో మనసున ధ్యానించు చున్న దానను.
సచ విశ్వపతి ర్భూత్వా బ్రాహ్మణో మే తపోవనమ్,
ఆగత్య భోజనార్థాయ యాచయామాస శంకరః,
మయా స్నాతుం వ్రజస్వేతి చోదితో జాహ్నవీం గతః.
విశ్వపతి యగు శంకరుడు బ్రాహ్మణుడై భోజనము కొఱకు నా తపో వనమున కరుదెంచి అన్న మడిగెను. నేను స్నానము చేసి రమ్మనగా గంగ కరిగెను.
తత్రాసౌ వృద్ధకాయేన ద్విజరూపేణ శంకరః,
మకరేణ ధృతస్తూర్ణ మబ్రహ్మణ్య మువాచ హ.
అందీ శంకరుడు పెద్ద దేహము, బాపని ఆకారము గలవాడై మొసలికి చిక్కి అయ్యో! కాపాడు! అని అరచెను.
బ్రహ్మహత్యాభయాత్ తాత మయా పాణౌ ధృతస్తతః,
ధృతమాత్రః స్వకం దేహం దర్శయామాస శంకరః.
నాయనా! బ్రహ్మ హత్యకు భయపడి నేనాతనిని చేతితో పట్టు కొంటిని. పట్టుకొని నంత మాత్రమున ఆ శంకరుడు తన నిజ దేహమును చూపెను.
తతో మామబ్రవీద్ దేవః పాణిగ్రహణ మాగతామ్,
భవతీ దేవి మాం కించిద్ విచారయ తపోధనే.
అంతనా దేవుడు అట్లు చేయి పట్టిన నన్ను ‘దేవీ! తపోధనా! నీవేమియు విచారింపకుము’ అని పలికెను.
ఏవ ముక్తా త్వహం తేన శంకరేణ మహాత్మనా,
తదనుజ్ఞాప్య దేవేశం భవన్తం ప్రష్టు మాగతా,
ఇదానీం యత్ క్షమం కార్యం తచ్ఛీఘ్రం సంవిధీయతామ్.
మహాత్ముడగు ఆ శంకరు డట్లు పలుకగా నేను అతని అనుమతిని నిన్నడుగా వచ్చితిని. ఇప్పుడు తగిన కార్యమును నీవు వేగము చేయ దగును.
ఏవం శ్రుత్వా తదా వాక్యం శైలరాజో ముదాయుతః,
ఊచే దుహితరం ధన్యాం తస్మిన్ కాలే వరాననామ్.
అంత పర్వత రాజు ఆ మాట విని పరమ ఆనందముతో ఆ సమయమున విప్పారిన మోము గల ధన్యయగు తన బిడ్డతో ఇట్లు పలికెను.
పుత్రి ధన్యోస్మ్యహం లోకే యస్య రుద్రః స్వయం హరః,
జామాతా భవితా దేవి త్వయాపత్యవతామహమ్,
స్థాపితో మూర్థ్ని దేవానామపి పుత్రి త్వయా హ్యహమ్.
బిడ్డా! లోకమున నేను ధన్యుడను. ఏలనన రుద్రుడు తానై నాకల్లుడు కానున్నాడు. సంతానము గల దేవులందరిలో నేను, నీ వలన సర్వ శ్రేష్ఠుడ నయితిని.
స్థీయతాం క్షణమేకం తు యాపదాగమనం మమ,
ఏవముక్త్వా గతో రాజా శైలానాం బ్రహ్మణోన్తికమ్.
‘నేను వచ్చు నంత వరకు ఒక్క క్షణము నిలువుము’ అని పలికి కొండల రేడగు హిమవంతుడు బ్రహ్మ దేవుని కడకు కరిగెను.
తత్ర దృష్ట్వా మహాత్మానం సర్వదేవ పితామహమ్,
ఉవాచ ప్రణతో భూత్వా బ్రహ్మాణం శైలరాట్ తతః
అచట సర్వ దేవతలకు పితామహుడు, మహాత్ముడు నగు బ్రహ్మ దేవుని గాంచి పర్వత రాజు ప్రణమిల్లి యిట్లు పలికెను.
దేవోమా దుహితా మహ్యం తాం రుద్రాయ దదా మ్యహమ్,
త్వయా దేవ అనుజ్ఞాత స్తత్కరోమి ప్రశాధి మామ్.
దేవా! నా బిడ్డ ఉమను రుద్రున కొసగెదను. నీవవు అనుమతించినచో ఆ పని చేయుదును. నాకానతిమ్ము.
తతో బ్రహ్మా ప్రీతమనా యాహి రుద్రాయ తాం శుభామ్,
ప్రయచ్ఛోవాచ దేవానాం తదా లోకపితామహః.
అంత దేవతలకు, లోకములకు పితా మహుడగు ఆ బ్రహ్మ ఆనందమంది ‘వెళ్ళు, రుద్రునకు నీ కన్య నిమ్ము’ అని పలికెను.
ఏవ ముక్తః శైలరాజః స్వవేశ్మాగమ్య సత్వరమ్,
దేవా నృషీన్ సిద్ధసంఘాన్ చామంత్రయత సత్వరమ్.
అంత హిమ వంతుడు వడివడిగా తన యింటి కరుదెంచి వేగమే దేవతలను, ఋషులను, సిద్ధ సంఘములను అహ్వానించెను.
తుంబురుం నారదం చైవ హాహాహూహూం తథైవచ,
స గత్వా కిన్నరాంశ్చైవ అసురాన్ రాక్షసానపి.
తుంబురుని, నారదుని, హాహా హూహూవును, కిన్నరులను, అసురులను, రక్కసులను పిలిపించెను.
పర్వతాః సరితః శైలా వృక్షా ఓషధయ స్తథా,
ఆగతా మూర్తిమంతో వై పర్వతాః సంగమోపలాః,
హిమవద్దుహితు ర్ద్రష్టుం వివాహం శంకరేణ హ.
పర్వతములు, నదులు, చిరు కొండలు, ఓషదులు, రాలకుప్పలు, ఈ అన్నియు ప్రాణుల ఆకారములు ధరించి హిమవంతుని బిడ్డకు శంకరునితో జరుగు వివాహమును జూడ వచ్చెను.
తత్ర వేదిః క్షితి శ్చాసీత్ కలశాః సప్తసాగరాః,
సూర్యోదీప స్తథా సోమః సరితో వవహు ర్జలమ్.
అందు భూమియే పెండ్లి అరుగు, ఏడు సముద్రములే కలషములు, సూర్య చంద్రులే దీపములు, నదులే జలము లాయెను.
ఏవం వివాహ సామగ్రీం కృత్వా శైలవరాధిపః,
ప్రేషయామాస రుద్రాయ సమీపం మందరం గిరిమ్.
ఇట్లు పెండ్లి వస్తువుల నన్నింటిని సమకూర్చు కొని పర్వత రాజు మందర పర్వతమును రుద్రుని కడ పంపెను.
స తదా మందరోక్తస్తు శంకరోద్రుత మాయయౌ,
విధినా సోమయా పాణిం జగ్రాహ పరమేశ్వరః.
మందరుడు వచ్చి చెప్పగా శంకరుడు శీఘ్రముగా హిమవంతుని కడకు వచ్చెను. యథా విధిగా పరమేశ్వరుడు ఉమా దేవిని పాణి గ్రహణము గావించెను.
తత్రోత్సవే పర్వతనారదౌ ద్యౌ జగుశ్చసిద్ధా ననృతు ర్వనప్పతీః,
పుష్పాణ్యనేకానీ విచిక్షిపుః శుభాః ననర్తు రుచ్ఛైః సురయోషితో భృశమ్.
ఆ వేడుక యందు పర్వత నారదు లిద్దరు పాటలు పాడిరి. సిద్ధులు నాట్య మాడిరి. మంచి వృక్షములు పెక్కు పూవులను చల్లెను. దేవ కాంతలు పెద్దగ నృత్యములు చేసిరి.
తస్మిన్ వివాహే సలిల ప్రవాహే చతుర్ముఖో లోకపరః స్వసంస్థః
ఉవాచ కన్యాం భవపుత్రి లోకే నారీ ప్రభర్తా తవ చాన్య పుంసామ్,
ఇత్యేవ ముక్త్వా సఉమాం సరుద్రాం పితామహః స్వం పుర మాజగామ.
మంగళ జలములు ప్రవహించిన ఆ పెండ్లి యందు, లోకేశుడగు బ్రహ్మ చక్కని స్థితి కలవాడై ‘బిడ్డా! లోకమున నీ మగడు తక్కిన పురుషు లందరిలో గొప్పవాడు. నీవు స్త్రీ లందరి కంటె మిన్న యైన దానవు’ అని రుద్రునితో కూడిన ఉమా దేవిని ప్రశంసించి తన పురమున కరిగెను.
జామాతరం పర్వతరాట్ సుపూజ్య విసర్జయామాస విభుం స సోమమ్
దేవాంశ్చ దైత్యాన్ వివిధా నృషీంశ్చ, సంపూజ్య సర్వాన్ వివిధైస్తు వస్తుభిః
విభూషణౖ ర్వస్త్రవరాన్నదానై ర్విసర్జయామస తదాద్రిముఖ్యాన్.
పర్వత రాజు హిమవంతుడు అల్లుని గొప్పగా మన్నించి సాగ నంపెను. అట్లే దేవతలను, దైత్యులను, వేరు వేరు ఋషులను ఆయా పర్వతములను వివిధములగు వస్తువులతో, ఆభరణములతో, వస్త్రములతో మేలు రకపు భోజనములతో సత్కరించి పంపెను.
స వీతశోకో విరజో విశుద్ధః శుభాననాం దేవవరాయ దత్త్వా,
ఉమాం మహాత్మా హిమవా నద్రిరాజః పైతామహే లోక ఇవాధ్వరే భాత్.
ఇట్లు చక్కని మోము గల తన బిడ్డను దేవ శ్రేష్ఠుడగు శివున కర్పించి మహాత్ముడు, పర్వత రాజు అగు హిమవంతుడు శోకము, పాపము లేనివాడై పరిశుద్ధుడై బ్రహ్మ లోకమున జరిగిన యజ్ఞము నందు వలె ప్రకాశించెను.
ఇతీరితేయం తవ రాజసత్తమ ప్రసూతి రేషా న విదు ర్యాం సురాసురాః,
స్వయంభు దక్షాద్రిరాజః త్రిజన్మభిర్గౌరీ వివాహోపి మయా సుకీర్తితః
రాజ శేఖరా! దేవ దానవులు కూడా ఎరుగని గౌరీ పుట్టుకను గూర్చి నీకు చెప్పితిని. అట్లే మూడు జన్మములలో స్వయంభువు, దక్షుడు, పర్వత రాజు అను వారికి ఆమె పుట్టిన సంగతియు, వివాహమును నీకు వర్ణించితిని.
శ్రీ వరాహ దేవుడు:
ఏవం సా గౌరినామ్నాతు కారణా న్మూర్తి మాగతా,
సంబభూవ యథాప్రోక్తం ప్రజాపాలాయ పృచ్ఛతే,
ఋషిణా మహతా పూర్వం తపసా భావితాత్మనా.
శ్రీ వరాహ దేవుడు:
ఇట్లామె గౌరియను పేరున కారణ జన్మముగా ఆకారము ధరించి పుట్టిన విషయ మంతయు తపస్సుతో పండిన బుద్ధి విశేషము గల మహర్షి తన్నడిగిన ప్రజా పాలునకు చెప్పెను.
గౌర్యా ఉత్పత్తి రేషా వై కథితా పరమర్షిణా,
వివాహశ్చ యథా వృత్త స్తత్సర్వం కథితం తప.
ఆ మహర్షి చెప్పిన గౌరీ పుట్టుక, వివాహముల కథ నీకు ఉన్నదున్నట్లు చెప్పితిని.
ఏతత్సర్వం తు గౌర్యా తై సంపన్నంతు తృతీయయా,
తస్యాం తిథౌ తృతీయాయాం లవణం వర్జయేన్నరః,
యశ్చోపోష్యతి నారీ వా సా సౌభాగ్యం తు విందతి.
పార్వతీ దేవికి, సంబధించిన ఈ వృత్తాంత మంతయు తదియ నాడు జరిగినది. కావున ఆ తదియ నాడు స్త్రీ పురుషులు ఉప్పు తినుట మాన వలయును. స్త్రీ ఆ తిథి నాడు ఉపవాసమున్నచో సౌభాగ్యము పొందును.
దుర్భగా యా తు నారీ స్యాత్ పురుష శ్చాతిదుర్భగః,
ఏతచ్ఛ్రుత్వా తృతీయాయాం లవణం తు వివర్జయేత్.
సర్వకామా నవాప్నోతి సౌభాగ్యం ద్రవ్య సంపదమ్,
ఆరోగ్యం చ సదా లోకే కాంతిం పుష్టిం చ విందతి.
దరిద్రురాలగు స్త్రీ గాని, దరిద్రుడగు పురుషుడు గాని ఈ కథ విని తదియ నాడు ఉప్పు తినుట మానినచో వారి అన్ని కోరికలు తీరును. సౌభాగ్యమును కలుగును. ద్రవ్య సంపదలు, ఆరోగ్యము, కాంతి, పుష్టి ఎల్లవేళల పొందుదురు.