అధ్యాయము - 38

శ్రీవరాహ దేవుడు:

సశుభం శోభనం మార్గ మాస్థాయ వ్యాధ సత్తమః,

తపస్తేపే నిరాహార స్తం గురుం మనసా స్మరన్‌.

శ్రీవరాహ దేవుడు:

ఆ కిరాతుడు మంగళ మైన మార్గము నవలంబించి ఆహారము వదలి, ఆ గురువును మనసులో స్మరించుచు తపస్సు చేసెను.

భిక్షాకాలే తు సంప్రాప్తే శీర్ణ పర్ణాస్య భక్షయత్‌,

స కదాచిత్‌ క్షుధావిష్టో వృక్షమూలం సమాశ్రితః.

భోజన సమయము రాగా రాలిన ఆకులను తిను చుండెను. ఆతడొక నాడు ఆకలిపై కొనగా ఒక చెట్టు మొదటికి చేరుకొన్న వాడాయెను.

బుభుక్షిత స్తరోః పర్ణ మైచ్ఛద్‌ భక్షితు మన్తికాత్‌,

ఇత్యేవం కుర్వతో వ్యోమ్ని వాగువాచాశరీరిణీ.

ఆకలి గొన్న వాడై దగ్గరగా నున్న ఆకును తిన గోరెను. ఇట్లు చేయు చుండగా ఆకాశమున అశరీర వాణి విన వచ్చెను.

మా భక్షయస్వ సకట ముచ్చైరేవం ప్రభాషితే,

తతోసౌ తం విహాయాన్యద్‌ వార్షం పతిత మగ్రహీత్‌.

‘అపవిత్ర మైన దానిని తినకు’ అని బిగ్గరగా అశరీర వాణి పలుకగా అంత నాతడు దానిని వదలి వైచి రాలిన మరియొక చెట్టు ఆకును కైకొనెను.

తమప్యేకం నిషిద్ధం స్యా దన్యదేవ తథైవచ,

ఏవం స సకటం మత్వా వ్యాధః కించిన్న భక్షయత్‌.

దాని విషయమున కూడ ఇట్లే నిషేధము విన వచ్చెను. మరొక దాని యెడలను అట్లే యాయెను. ఇట్లతడు అంతయు అపవిత్రమే అని తలచి ఏమియు తిన కుండెను.

నిరాహార స్తపస్తేపే స్మరన్‌ గురు మతన్ద్రితః,

తస్యాథ బహునా కాలే గతే ఋషి వరోభ్యగాత్‌.

ఏ ఆహారము లేని వాడై, గురువును స్మరించుచు, మెలకువతో ఆతడు తప మొనర్చెను. ఇట్లు పెక్కు కాలము గడువగా ఒకనాడాతని కడకు ఋషివరు డరుదెంచెను.

దుర్వాసాః శంసితాత్మా వై కించిత్ర్పాణ మపశ్యత,

వ్యాధం తపోత్థతేజోభి ర్జ్వలమానం హవిర్యథా.

ఆతడు దొడ్డ బుద్ధి గల దుర్వాసుడు. ఆతడు తపము వలన పైకి లేచిన వచ్చెడు తేజస్సులతో జ్వలించు చున్న హవిస్సు వలె ఉన్న వాడును ప్రాణములు కడ బట్టిన వాడును అగు ఆ బోయ వానిని చూచెను.

సోపి వ్యాధస్తు తం సత్వా శిరసాథ మహామునిమ్‌,

ఉవాచ స కృతార్థోస్మి భగవన్‌ దర్శనాత్‌ తవ.

ఆ వ్యాధుడును ఆ మహా మునికి తలతో నమస్కరించి ‘భగవానుడా! నీ దర్శనము వలన కృతార్థుడ నయితిని.’

ఇదానీం శ్రాద్ధకాలం మే ప్రాప్తం త్వ మవధారయ,

శీర్ణవర్ణాని భక్షయన్‌ వై తై రేవాహం మహామునే,

భవన్తం ప్రీణయామీతి వ్యాధ స్తం వాక్యమబ్రవీత్‌.

ఇప్పుడు నాకు శ్రాద్ధ కాలము. నీవు అనుగ్రహింపుము. రాలిన ఆకులను పుచ్చు కొనుము. నేను వాని తోడనే శ్రాద్ధమును నిర్వహింతును. వాని తోడనే నీకు ప్రీతి కలిగింతునని పలికెను.

దుర్వాసా అపి తం శుద్ధం శుద్ధభావం జితేంద్రియమ్‌,

జిజ్ఞాసు స్తత్తపో వాక్యమిద ముచ్చై రువాచ హ.

పరిశుద్ధుడు, ఇంద్రియము లను గెలిచిన వాడును, శుద్ధమైన భావములు కల వాడును అగు అతని తపస్సును పరీక్షింప గోరి దుర్వాసుడును పెద్దగా ఇట్లు పలికెను.

యవగోధూమా శాలీనా మన్నం చైవ సుసంస్కృతమ్‌,

దీయతాం మే క్షుధార్తాయ త్వాముద్దిశ్యాగతాయచ.

ఆకలితో నుండి, నీ కడకు వచ్చిన నాకు యవలు, గోధుమలు, సన్న బియ్యముల అన్నమును చక్కగా వండిన దానిని పెట్టుము.

ఇత్యుక్తేన త్వసౌ వ్యాధ శ్చిన్తాం పరమికాం గతః,

క్వ సంభవిష్యతే మహ్య మితి చిన్తాపరోభవత్‌.

ఆముని యిట్లు పలుకగా ఆ వ్యాధుడు పెద్ద ఆలోచనలో పడెను. నాకిట్టిది ఎక్కడ దొరకును? అని విచారించెను.

తస్య చిన్తయతః పాత్ర మాకాశాత్‌ పతితం శుభమ్‌,

సౌవర్ణం సిద్ధిసంయుక్తం తజ్జగ్రాహ కరేణ సః.

అట్లు చింతించుండగా ఆకాశము నుండి బంగారు పాత్ర శుభమై నది, సిద్ధులతో కూడినది ఒకటి పడెను. దాని నాతడు చేతితో గ్రహించెను.

తద్గృహీత్వా మునిం ప్రాహ దుర్వాసాఖ్యం ససాధ్వసః,

అత్రైవ స్థీయతాం బ్రహ్మన్‌ యావద్‌ భిక్షాటనం త్వహమ్‌.

కరోమి మత్ర్పసాదోయం క్రియతాం బ్రహ్మవిత్తమ.

అది కైకొని వెరగు పడుచు ఆ వ్యాధుడు దుర్వాసునితో ఇట్లు పలికెను. ‘మహర్షీ! నేను బిచ్చమెత్తి వచ్చు వరకు నీవు ఇచటనే నిలువుము. నా యందు అనుగ్రహము చూపుము.’

ఏవముక్త్వా తతో భిక్షా మటనం వ్యాధ సత్తమః,

నాతిదూరేణ నగరం ధనయోష సమన్వితమ్‌.

ఇట్లు పలికి ఆ మంచి బోయ చేరువలో నున్నదియు ధనములు మంచి యిల్లాండ్రు గలదియు నగు నగరమునకు భిక్ష మెత్తుటకై యరిగెను.

తస్య తత్ర ప్రయాతస్య అగ్రతః సర్వశోభనాః,

వృక్షేభ్యోనిర్యయు శ్చాన్యా హేమపాత్రాగ్రపాణయః,

వివిధాన్నాని తస్యాశు దత్త్వా పాత్రం ప్రపూరితమ్‌.

అతడిట్లు బయలు దేరి నంతనే వృక్షముల నుండి వెలువడి బంగారు పాత్రలు చేత ధరించిన సుందర వనితలు పెక్కు విధముల అన్నములను అతనికి అందించిరి. ఆతని పాత్ర పూర్తిగా నిండి పోయెను.

స చ భూతార్థ మాత్మానం మత్వా పున రథాశ్రమమ్‌,

ఆజగామ తతోపశ్యత్‌ తమృషిం జపతాం పరమ్‌.

అతడును తన్ను కృతార్థునిగా భావించుచు తిరిగి ఆశ్రమ మునకు వచ్చి మహర్షి శ్రేష్ఠుడగు ఆ దుర్వాసుని కాంచెను.

తం దృష్ట్వా స్థాప్య తాం భిక్షాం శుచౌ దేశే ప్రసన్నధీః,

ప్రణమ్య తమృషిం వాక్యమువాచ వ్యాధసత్తమః.

కాంచి ఆ భిక్షను శుచి యైన తావున ఉంచి ప్రసన్న బుద్ధియై ప్రణమిల్లి ఆ ఋషితో ఇట్లు పలికెను.

భగవన్‌ క్షాళనం పద్భ్యాం క్రియతాం ఋషిపుంగవ,

యది త్వహమనుగ్రాహ్య స్తదేవం కర్తు మర్హసి.

పూజ్యుడా! ఋషివరా! కాళ్ళు కడుగు కొనుము. నన్న నుగ్రహింతు వేని ఇట్లు చేయ దగును.

ఏవముక్తః స జిజ్ఞాసు స్తపోవీర్యం శుభం మునిః,

నదీం గన్తుం న శక్నోమి జలపాత్రం చ నాస్తిమే.

అతడట్లు పలుకగా ఆముని శుభమైన ఆతని తపో బలము నెరుగ గోరి ‘ఓయీ! నేను నదికి పోజాలను. నా కడ జల పాత్రయు లేదు’.

కథం ప్రక్షాళయా మ్యాశు వ్యాధ పాదౌ మహామతే,

ఇత్యేతన్మునినా వ్యాధః శ్రుత్వా చిన్తాపరోభవత్‌,

కిం కరోమి కథం చాస్యభోజనం వై భవిష్యతి.

ఓ మహామతీ! నేను కాళ్ళెట్లు కడుగు కొందును? అని పలుకగా వ్యాధుడు అది విని మరల ఏమి చేయుదును? ఈతనికి భోజనము ఎట్లు అగును? అని విచారించెను.

ఏవం సంచిన్త్య మనసా గురుం స్మృత్వా విచక్షణః,

జగామ శరణం తాం తు సరితం దేవికాం సుధీః.

మనసులో చక్కగా ఆలోచించి ఆ వివేకి గురువును స్మరించి ఆ బుద్ధి మంతుడు ఆ దేవికా నదిని శరణు చొచ్చెను.

వ్యాధుడు:

వ్యాధోస్మి పాపకర్మాస్మి బ్రహ్మహాస్మి సరిద్వరే,

తథాపి సంస్మృతా దేవి పాహి మాం శరణం గతమ్‌.

వ్యాధుడు:

అమ్మా! నదీమతల్లీ! నేను కిరాతకుడను. పాప కర్ముడను బ్రహ్మ హత్యలు చేసిన వాడను. అయినను నిన్ను భావించితిని. శరణు జొచ్చిన నన్ను కాపాడుము.

దేవతాం నైవ జానామి న మన్త్రం న తథార్చనమ్‌,

గురుపాదౌ పరం ధ్యాత్వా పశ్యామి సతతం శుభే.

దేవత నెరుగను. మంత్రము నెరుగను. అట్లే పూజించు పద్ధతి నెరుగను. గురు పాదములను శ్రద్ధతో ధ్యానించి శుభమును గాంచు చున్నాను.

ఏవం విధస్య మే దేవి దయాం కురు సరిద్వరే,

ఋషేః క్షాళార్థ సలిలం సమీపం కురు మాచిరమ్‌.

ఓ పుణ్యనదీ! ఇట్టి నా యెడల దయ చూపుము. ఋషి పాదములు గడుగు కొనుటకు నీటిని దగ్గరకు తెమ్ము. ఆలసింపకుము.

ఏవ ముక్త్వాథ వ్యాధేన దేవికా పాపనాశినీ,

ఆ జగామ యత స్తస్థౌ దుర్వాసాః సంశితవ్రతః.

ఆ బోయ అట్లు పలుకగా పాపములను నశింప జేయు దేవిక సంశిత వ్రతుడగు దుర్వాసుడున్న కడకు వచ్చెను.

తస్య పాదౌ స్వయం దేవీ క్షాళయన్తీ సరిద్వరా,

జగామ హ్రాదినీ భూత్వా వ్యాధాశ్రమ సమీపతః.

ఆ గొప్పనది దేవిక స్వయముగా ఆ ముని పాదములను కడుగుచు వ్యాధుని ఆశ్రమము కడ హ్రాదినియై ప్రవహించెను.

తం దృష్ట్వా మహదాశ్చర్యం దుర్వాసా విస్మయం యయౌ,

ప్రక్షాళ్య హస్తౌ పాదౌచ తదన్నం శ్రద్ధయాన్వితమ్‌,

బుభుజే పరమప్రీత స్తథాచమ్య విచక్షణః.

ఆ గొప్ప వింతను గాంచి దుర్వాసుడు అచ్చెరు వందెను. కాలు సేతులు కడుగు కొని ఆచమించి శ్రద్ధతో పెట్టిన ఆ అన్నమును మిక్కిలి ప్రీతుడై భుజించెను.

తమస్థిశేషం వ్యాధం తు క్షుధా దుర్బలతాం గతమ్‌,

ఉవాచ వేదాధ్యయనం సర్వేవేదాః ససంగ్రహాః,

బ్రహ్మమిద్యా పురాణాని ప్రత్యక్షాని భవన్తు తే.

ఎముకలు మాత్రము మిగిలిన వాడు, ఆకలితో అల్లాడుచున్న వాడునగు ఆ బోయతో ఆ మహర్షి వేద అధ్యయనము, సంగ్రహ గ్రంథములతో కూడిన సమస్త వేదములు, బ్రహ్మ విద్యయు, పురాణములు నీకు ప్రత్యక్షము లగుగాక అని పలికెను.

ఏవం ప్రాదాద్‌ వరం తస్య దుర్వాసా నామ చాకరోత్‌,

భవాన్‌ సత్యతపా నామ ఋషి రాద్యో భవిస్యతి.

దుర్వాసు డిట్లాతనికి వర మొసగెను. పేరు కూడ పెట్టెను. నీవు సత్య తపుడవు, ఆది ఋషి వగుదు వని పలికెను.

ఏవం దత్తవరో వ్యాధ స్తమాహ మునిసత్తమమ్‌,

వ్యాధో భూత్వా కథం బ్రహ్మన్‌ వేదానధ్యాపయా మ్యహమ్‌.

ఇట్లాతడు వర మీయగా నాతడు ఆ ముని శ్రేష్ఠునితో ఇట్లు పలికెను. స్వామీ! నేను బోయజాతి వాడనై వేదము నెట్లు చదివించెదను?

ఋషి:

ప్రాక్శరీరం గతం తేద్య నిరాహారస్య సత్తమ,

తపోమయం శరీరం తే పృథ గ్భూతం న సంశయః.

ఋషి:

ఉత్తముడా! నీ ప్రాతదేహ మిపుడు పోయినది. నీవు ఆహారము కొనవైతివి గదా! ఇప్పుడు నీది తపో మయమైన శరీరము. ఇది వేఱు. సంశయము లేదు.

ప్రాగ్విజ్ఞానం గతం నాశ మిదానీం శుద్ధ మక్షరమ్‌,

విద్ధి తం శుద్ధకాయోపి తథాన్యత్తే శరీరకమ్‌,

తేన వేదాః సమం శాస్త్రైః ప్రతిభాస్యన్తి తే మునే.

నీదగు ప్రాత విజ్ఞానము నశించి నది. ఇప్పటి నీ విజ్ఞానము శుద్ధము. అక్షరము (నశింపనిది) కావున ఓ మునీ! నీకు వేదములు శాస్త్రములతో పాటు స్పష్టముగా తెలియ వచ్చును.