అధ్యాయము - 13

భూమి:

ఏతత్‌ తన్మహ దాశ్చర్యం దృష్ట్వా గౌరముఖో మునిః,

తే చాపి మణిజాః ప్రాప్తాః కిం ఫలం తు వరం గురోః.

భూమి:

ఈ గొప్ప అచ్చెరువును గాంచి గౌరముఖుడే ఫలము పొందెను? మణి నుండి పుట్టిన ఆ నాయకు లే ఫలము పొందిరి?

కోసౌ గౌరముఖః శ్రీమాన్‌ మనిః పరమధార్మికః,

కిం చకార హరేః కర్మ దృష్ట్వాసౌ మునిపుంగవః.

పరమ ధార్మికుడగు ఈ గౌరముఖ ముని యెవ్వడు? హరి విలాసమును గాంచి ఆ మునివరు డేమి చేసెను?

శ్రీవరాహ దేవుడు:

నిమిషేణ కృతం కర్మ దృష్ట్వా భగవతో మునిః,

ఆరిరాధయిషు ర్దేవం తమేవ ప్రయయౌ వనమ్‌,

ప్రభాసం నామ సౌమస్య తీర్థం పరమ దుర్లభమ్‌.

శ్రీవరాహ దేవుడు:

రెప్ప పాటు కాలములో చేసిన భగవంతుని ఆ అద్భుత కార్యమును చూచి ఆ ముని ఆ దేవుని ఆరాధింప గోరిన వాడై ఇతరులు పొంద జాలని ప్రభాసమను సోమ తీర్థమున కరిగెను.

తత్ర దైత్యాంతకృద్‌ దేవః ప్రోచ్యతే తీర్థచింతకైః,

ఆరాధయామాస హరిం దైత్యసూదన సంజ్ఞితమ్‌.

తీర్థములను గూర్చి చక్కగా భావించు వారు అచటి దేవుని దైత్య సంహారకు డందురు. అట్టి హరిని ఆగౌరముఖుడు ఆరాధించెను.

తస్యారాధయతో దేవం హరిం నారాయణం ప్రభుమ్‌.

ఆజగామ మహాయోగీ మార్కండేయో మహామునిః.

ప్రభువైన నారాయణ దేవుని ఆతడు అర్చించు చుండగా మహా మునియు, మహా యోగియు నైన మార్కండేయ డచటకు వచ్చెను.

తం దృష్ట్వా భ్యాగతం దూరా దర్ఘ్యపాద్యేన సో మునిః,

అర్చయామాస తం భక్త్యా ముదా పరమయా యుతః.

అట్లు అభ్యాగతుడై వచ్చిన మహర్షిని దవ్వులనే కాంచి అర్ఘ్య పాద్యములతో ఎదుర్కొని భక్తితో, పరమానందముతో అర్చించెను.

కౌశ్యాం వృష్యాం తదాసీనం పప్రచ్ఛేదం ముని స్తదా,

శాధి మాం మునిశార్దూల కింకరోమి మహావ్రత.

పవిత్రమగు దర్భాసనమున కూర్చున్న ఆ మునిని గాంచి గౌరముఖుడు, ‘మహర్షీ! మహావ్రతా! నన్నేమి చేయు మందురో సెలవిండు’ అని యడిగెను.

ఏవ ముక్తః స విప్రేంద్రో మర్కండేయో మహాతపాః,

ఉవాచ శ్లక్షయా వాచా మునిం గౌరముఖం తదా.

గౌరముఖు డిట్లు పలుకగా మహా తపస్వియగు మార్కండేయుడు తీయని మాటలతో ఆతని కిట్లనెను.

మార్కండేయుడు:

ఏతదేవ మహత్కృత్యం యత్సతాం సంగమో భవేత్‌,

యత్తు సాందేహికం కార్యం తత్పృచ్ఛస్వ మహామునే.

మార్కండేయుడు:

మహా మునీ! సత్పురుషులను కలియుటయే ఘన కార్యము, నీకేదైన సందియములు గలవని యున్నచో నన్నడుగుము.

గౌరముఖుడు:

ఏ తే హి పితరో నామ ప్రోచ్యంతే వేదవాదిభిః,

సర్వవర్ణేషు సామాన్యా ఉతాహోస్విత్‌ పృథక్‌ పృథక్‌.

గౌరముఖుడు:

మహర్షీ! వేద వేత్తలు పితరులని చెప్పు చుందురే వారు అన్ని వర్ణముల వారికి సమానులుగా నుందురా? లేక ఆయా వర్ణములకు వేరు వేరుగా నుందురా?

మర్కండేయుడు:

సర్వేషా మేవ దేవానా మాద్యో నారాయణో గురుః,

తస్మాద్‌ బ్రహ్మా సముత్పన్నః సోపి సప్తాసృజన్మునీన్‌.

మర్కండేయుడు:

దేవత లందరికి మొదటి వాడు గురువైన నారాయణుడు. ఆతని వలన బ్రహ్మ పుట్టెను. అతడు ఏడుగురు మునులను సృజించెను.

మా యజంతేతి తేనోక్తా స్తదా తే పరమేష్ఠినా,

ఆత్మనాత్మాన మేవాగ్రే అయజంత ఇతి శ్రుతిః.

ఆ పరమేష్ఠి నన్ను పూజింపుడని వారితో పలికెను. వారు తమ్ము తామే అర్చించు కొనిరని వేదము చెప్పు చున్నది.

తేషాం వై బ్రహ్మ జాతానాం మహా వైకారి కర్మణామ్‌,

అశపద్‌ వ్యభిచారో హి మహానేష కృతో యతః,

ప్రభ్రష్ట జ్ఞానిసః సర్వే భవిష్యథ స సంశయః.

అట్లు గొప్ప వికారపు పని చేసిన కుమారులను బ్రహ్మ యిట్ల శపించెను. ఇది మహా దోషము. నా ఆజ్ఞను మీరు మీరితిరి. “ఈ కారణమున మీరందరు జ్ఞానము మొత్తము కోల్పోవుదురు. ఇందు సంశయము లేదు”.

ఏవం శప్తా స్తతస్తే వై బ్రహ్మణాత్మసముద్భవాః,

సద్యోవంశకరాన్‌ పుత్రా నుత్పాద్య త్రిదివం యయుః.

బ్రహ్మ యిట్లు శపింపగా ఆతని ఆ పుత్రులు అక్కడి కక్కడ వంశమును వృద్ధి పొందించు కుమారులను పొంది స్వర్గమున కరిగిరి.

తతస్తేషు ప్రయాతేషు త్రిదివం బ్రహ్మవాదిషు,

తత్సుతాః శ్రాద్ధదానేన తర్పయామాసు రంజసా.

బ్రహ్మము నెరిగిన ఆ బ్రహ్మ కుమారు లట్లు స్వర్గమున కరుగు చుండగా వారి పుత్రులు వారికి శ్రాద్ధములు పెట్టి తర్పణము గావించిరి.

తే చ వైమానికాః సర్వే బ్రహ్మణః సప్త మనసాః,

తత్‌ పిండ దానం మంత్రోక్తం ప్రపశ్యశ్యంతో వ్యవస్థితాః.

బ్రహ్మ సంకల్పము వలన పుట్టిన ఆ యేడుగురును విమానముల నధివసించి, మంత్ర పూర్వకముగా చేసిన ఆ పిండ దానమును చూచుచు నిలిచి యుండిరి.

గౌరముఖుడు:

యే చ తే పితరో బ్రహ్మన్‌ యంచ కాలం సమాసతే,

కిం యతో వై పితృగణా స్తస్మిన్‌లోకే వ్యవస్థితాః.

గౌరముఖుడు:

బ్రాహ్మణోత్తమా! ఈ పితృ దేవత లెవ్వరు? ఎంత కాల ముందురు. ఆ లోకమున నెలకొన్న పితృ గణము లేవి?

మార్కండేయుడు:

ప్రవర్తంతే వరాః కేచిద్‌ దేవానాం సోమవర్ధనాః,

తే మరీచ్యాదయః సప్త స్వర్గే తే పితరః స్మృతాః.

మార్కండేయుడు:

దేవతలకు సోమ రసమును పెంపొందించుచు వారిలో కొందరు శ్రేష్ఠులు మరీచి మొదలగు నేడుగురు స్వర్గమున నుండిరి. వారినే పితృ దేవత లందురు.

చత్వారో మూర్తిమంతో వై త్రయస్త్వన్యే హ్యమూర్తయః,

తేషాం లోకనిసర్గం చ కీర్తయిష్యామి తచ్ఛ్రుణు.

అందులో నలుగురు ఆకారము కలవారు. మువ్వురు లేనివారు. వారు సృజించిన లోకములను చెప్పెదను వినుము.

ప్రభావం చ మహర్ధించ విస్తరేణ నిబోధ మే,

ధర్మమూర్తి ధరాస్తేషాం త్రయోన్యే పరమా గుణాః,

తేషాం నామాని లోకాంశ్చ కీర్తయిష్యామి తచ్ఛ్రుణు.

వారి ప్రభావమును, మహిమను విస్తరించి చెప్పెదను. ఆ యేడుగురిలో మువ్వురు ధర్మ రూపమగు ఆకారము ధరించిన వారు. వారి నామములను, లోకములను వర్ణించెదను. వినుము.

లోకాః సంతానకా నామ యత్ర తిష్ఠంతి భాస్వరాః,

అమూర్తయః పితృగణా స్తే వైపుత్రాః ప్రజాపతేః.

ఆ కాంతి స్వరూపులు నివసించు లోకములకు సంతానకము లని పేరు. వారు మూర్తి లేని పితృ సముదాయము లైరి. వారు ప్రజాపతి పుత్రులు.

విరాజస్య ప్రజాశ్రేష్ఠా వైరాజా ఇతి తేస్మృతాః,

దేవానాం పితరస్తే హి తాన్‌ యజంతీ హ దేవతాః.

విరాజుని పుత్రులకు వైరాజులని పేరు. వారు దేవతలకు పూర్వులు. దేవతలు వారిని పూజింతురు.

ఏతే వై లోకవిభ్రష్ట లోకాన్‌ ప్రాప్య సనాతనాన్‌,

పునర్యుగశతాంతేషు జాయంతే బ్రహ్మవాదినః.

వీరు తమ లోకము నుండి జారి మరల సనాతన లోకము లను పొంది నూరు యుగములు గడచిన పిమ్మట బ్రహ్మ వేత్తలుగా పుట్టుదురు.

తేప్రాప్య తాం స్మృతిం భూయః సాధ్యయోగ మనుత్తమమ్‌,

చింత్య యోగగతిం శుద్ధాం పునరావృత్తి దుర్లభామ్‌.

ఈ పితృ దేవతలు పూర్వస్మృతి పొంది మిక్కిలి శ్రేష్ఠమగు యోగమును సాధించి, శుద్ధమగు ఆ యోగ మార్గము నందే మనసు నిలిపి పునర్జన్మము లేని స్థితి పొందుదురు.

ఏ తే స్మ పితరః శ్రాద్ధే యోగినాం యోగవర్ధనాః,

ఆప్యాయితాస్తు తే పూర్వం యోగం యోగ బలే రతాః.

ఈ పితృ దేవతలు శ్రాద్ధ క్రియ యందు ముందు ప్రీతి నొందిన వారై యోగుల యోగమును వృద్ధి పొందింతురు.

తస్మా చ్ఛ్రాద్దాని దేయాని యోగినాం యోగిసత్తమ,

ఏ ష వై ప్రథమః సర్గః సోమసానా మనుత్తమః.

యోగివరా! కావుననే యోగులకు శ్రద్ధా పూర్వకమగు పూజలు చేయ వలయును. ఇది సోమపులను వారి ఉత్తమ మగు మొదటి సృష్టి.

ఏ తే త ఏకతనవో వర్తంతే ద్విజసత్తమాః,

భూలోక వాసినాం యాజ్యాః స్వర్గలోకనివాసినః,

బ్రహ్మపుత్రా మరీచ్యాద్యా స్తే షాం యాజ్యా మహద్గతాః.

స్వర్గ లోకమున నివసించు ఈ బ్రహ్మణ వరేణ్యలు, బ్రహ్మ పుత్రులగు మరీచి మొదలగు వారు భూలోకమున నివసించు వారికి పూజ్యులు. ఆ మరీచి మొదలగు వారికి మహల్లోక వాసులు అర్చింపదగిన వారు.

కల్ప వాసిక సంజ్ఞానాం తేషా మపి జనే గతాః,

సనకాద్యా స్తత స్తేషాం వైరాజాంతవసి స్థితాః,

తేషాం సత్యగతా ముక్తా ఇత్యేషా పితృ సంతతిః.

ఆ మహర్లోక వాసులు కల్ప వాసికులను పేరు గలవారు. వారికి జనలోక వాసులగు సనకాదులు అర్చింపదగిన వారు. వారికి తపో లోకమున నున్న వైరాజులు మాన్యులు. వారికి సత్య లోక వాసులగు ముక్తులు మన్నింప దగిన వారు. ఇది పితృ దేవతల వరుస.

అగ్నిష్వాత్తేతి మారీచ్యా వైరాజ బర్హిసంజ్ఞితాః,

సుకాలేయాపి పితరో వసిష్ఠస్య ప్రజాపతేః,

తేపి యాజ్యా స్త్రిభి ర్వర్ణైర్న శూద్రేణ పృథక్కృతమ్‌.

మరీచి సంతతి వారైన అగ్నిష్వాత్తులు, విరాజుని సంతతి వారగు బర్హులు, వసిష్ఠుని సంతతి వారగు సుకాలేయులు మూడు వర్ణముల వారికి అర్చింప దగిన వారు. శూద్రులకు వేరుగా పితృ దేవతలు లేరు.

వర్ణత్రయాభ్యనుజ్ఞాతః శూద్రః సర్వాన్‌ పితౄన్‌ యజేత్‌,

నతు తస్య పృథక్‌ సన్తి పితరః శూద్రజాతయః.

పై మూడు వర్ణముల వారి అనుమతి గొని శూద్రుడు పితృ దేవత లందరిని అర్చింప వలయును. అంతేకాని శూద్ర జాతికి చెందిన పితృ దేవతలు వేరుగా లేరు.

ముక్త శ్చేతనకో బ్రహ్మన్‌ నను విప్రేషు దృశ్యతే,

విశేషశాస్త్రదృష్ట్యా తు పురాణానాం చ దర్శనాత్‌.

విశేషమైన శాస్త్ర దృష్టి చేతను, పురాణములను చక్కగా ఎరిగిన కారణమునను సర్వ విద్యావేత్తలగు విప్రుల యందు ముక్త చేతన కలవాడు కానవచ్చు చున్నాడు. (మహాతత్వ వేత్తయే ముక్తి నొందుట కర్హుడని భావము - విప్రుడనగా విద్యా సంపద పరి పూర్ణముగా గలవాడు)

ఏవం ఋషిస్తుతైః శాస్త్రైః జ్ఞాత్వా యాజ్యాన్‌స్వ సంభవాన్‌.

స్వయం సృష్ట్యాం స్మృతిర్లబ్ధా పుత్రాణాం బ్రహ్మణా తతః.

పరం నిర్వాణ మాపన్నా స్తేపి జ్ఞానేన ఏవచ.

ఇట్లు ఋషులు స్తుతించిన శాస్త్రముల ద్వారమున తన వలన పుట్టిన పూజ్యులను గూర్చి తెలిసి కొని బ్రహ్మ సృష్టికి సంబంధించిన స్మృతిని, పుత్రుల స్మృతిని పొందెను. వారు కూడ ఆ జ్ఞానముతో పరమ నిర్వాణమును పొందిరి.

వస్వాదీనాం కశ్యపాద్యా వర్ణానాం వసవాదయః.

అవిశేషేణ విజ్ఞేయా గంధర్వాద్యా అపి ధ్రువమ్‌.

వసువు మొదలగు వారికి కశ్యపుడు మొదలగు వారు, వర్ణముల వారికి వసువు మొదలగు వారు యాజ్యులు (యజింప దగిన వారు), గంధర్వుడు మొదలగు వారు సామాన్యముగా పూజ్యులని తెలియ దగును.

ఏష తే పైతృకః సర్గ ఉద్దేశేన మహామునే,

కథితో నాంత ఏవాస్య వర్షకోట్యాహి దృశ్యతే.

మహామునీ! ఇట్లు నీకు పితృ దేవతల సృష్టిని గూర్చి స్థూలముగా చెప్పితిని. కోటి సంవత్సరములు చెప్పినను దీని కంతము కానరాదు.

శ్రాద్ధస్య కాలా న్వక్ష్యామి తాంచ్రుణుష్వ ద్విజోత్తమ.

బ్రాహ్మణోత్తమా! శ్రాద్దమునకు తగిన కాలములను తెలిపెదను. వానిని గూర్చి వినుము.

శ్రాద్ధార్హమాగతం ద్రవ్యం విశిష్ట మథవా ద్విజమ్‌,

శ్రాద్ధం కర్వీత విజ్ఞాయ వ్యతిపాతేయనే తథా.

శ్రాద్ధము కొఱకు ఉత్తమ పదార్థము, సర్వ విద్యలు గల ఉత్తమ ద్విజుడు దొరకి నపుడు శ్రాద్ధ కర్మము చేయ వలయును. అట్లే వ్యతీపాత యోగము నందును, అయన సమయము లందును చేయ వలయును.

విషువే చైవ సంప్రాప్తే గ్రహణే శశిసూర్యయోః,

సమస్తే ష్వేవ విప్రేన్ధ్ర రాశిష్వర్కేతి గచ్ఛతి.

విషువము వచ్చి నపుడు, సూర్య చంద్రుల గ్రహణముల యందును, ఆయా రాశుల యందు సూర్యుడు ప్రవేశించు నపుడును శ్రాద్ధము పెట్ట వలయును. (విషువ మనగా రాత్రి కాలము, పగటి కాలము సమానముగా నున్న దినము)

నక్షత్ర గ్రతహపీడాసు దష్టస్వప్నావలోకనే,

ఇచ్ఛాశ్రాద్ధాని కుర్వీత నవసస్యాగమే తథా.

నక్షత్రములను బట్టి, గ్రహములను బట్టియు పీడలు సంభవించి నపుడును, చెడు కలలు వచ్చిన పుడును, క్రొత్త పంటలు వచ్చు కాలము లందును ఇష్టమును బట్టి శ్రాద్ధములు చేయనగును.

అమావాస్యా యదా ఆర్ద్రా విశాఖాస్వాతి యోగినీ,

శ్రాద్ధైః పితృగణ స్తృప్తిం తదా ప్నోత్యష్టవార్షికీ.

ఆర్ద్రా, విశాఖా స్వాతి నక్షత్రముల యందు అమావాస్య సంభవించి నపుడు చేసిన శ్రాద్ధములతో పితృ దేవతలు ఎనిమిది సంవత్సరములకు సరిపడు తృప్తి పొందెదరు.

అమావాస్య యదా పుష్యే రౌద్రేరేక్షచ పునర్వసౌ,

ద్వాదశాబ్దం తథా తృప్తిం ప్రయాంతి పితరోర్చితాః.

పుష్యమి, మఘ, పునర్వసు అను నక్షత్రముల యందు అమావాస్య వచ్చి నపుడు పూజ లొందిన పితృ దేవతలు పండ్రెండేండ్లు తృప్తి పొందెదరు. (రౌద్ర నక్షత్ర మనగా రుద్రుడు దేవతగా గల నక్షత్రము - మఘ)

వాసవాజైక పాదరేక్ష పితౄణాం తృప్తి మిచ్ఛతామ్‌,

వారుణే చాప్యమావాస్యా దేవానామపి దుర్లభా.

పితృ దేవతల తృప్తిని కాంక్షించు వారు ధనిష్ఠ, పూర్వాభాద్ర, శతభిష నక్షత్రముల యందు, అమావాస్య వచ్చినపుడు శ్రాద్ధములు చేయ వలయును. ఇట్టి సమయము దేవతలకును దుర్లభ మైనది. ( వాస్తవ నక్షత్ర మనగా ధనిష్ఠ, అజైకపాద మనగా పూర్వాభాద్ర, వారుణము - శతభిషము)

నవస్వరేక్ష ష్వమావాస్యా యదా తేషు ద్విజోత్తమ,

తదా శ్రాద్ధాని దేయాని అక్షయ్య ఫలమిచ్ఛతామ్‌,

అపికోటి సహస్రేణ పుణ్య స్యాంతోన విద్యతే.

ఇట్లు పైని చెప్పిన తొమ్మిది నక్షత్రముల యందు అక్షయ పుణ్య ఫలము గోరు వారు శ్రాద్ధ కర్మము లాచరింప వలయును, వేల కోటులు ఏండ్ల కైనను ఆ పుణ్యము తరుగదు.

అథా పరం పితరః శ్రాద్ధకాలం రహస్య మస్మాన్‌ ప్రవదంతి పుణ్యమ్‌,

వైశాఖమాసస్య తు యా తృతీయా నవమ్య సౌ కార్తికశుక్లపక్షే.

పితృ దేవతలు శ్రాద్దమునకు మిక్కిలి పవిత్ర మగు కాలములు కూడా మాకు రహస్యముగా చెప్పిరి. అవి వైశాఖ మాసము శుక్ల పక్ష తృతీయా తిథియు, కార్తీక శుక్ల పక్షమున నవమీ తిథియు.

నభస్యమాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే,

ఉపప్లవే చంద్రమసో రవేశ్చ తథాష్టకా స్వప్యయన ద్వయేచ.

భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, మాఘమాస అమావాస్య, సూర్య చంద్రుల గ్రహణ సమయము, అష్టక దినములు రెండు అయనములు శ్రాద్ధమునకు మంచివి. (పూర్ణిమ తరువాత వచ్చు సప్తమి- అష్టమి- నవమీ తిధులను అష్టకము లందురు)

పానీయ మప్యత్ర తిలై ర్విమిశ్రం దద్యా త్పితృభ్యః ప్రయతో మనుష్యః,

శ్రాద్ధం కృతం తేన సమాసహస్రం రహస్య మేతత్పితరో వదంతి.

నువ్వులతో కలసిన నీటిని పితృ దేవతలకు భక్తి పూర్వకముగా పెట్టిన శ్రాద్ధము వేయి ఏండ్లకు సరి పడినదను రహస్యమును పితృ దేవతలు చెప్పుదురు.

మాఘసితే పంచదశీ కదాచిదుపేతి యోగం యది వారుణేన,

ఋక్షేణ కాలః పరమః పితౄణాం న త్వల్పపుణ్యౖ ర్ద్విజ లబ్యతేసౌ.

మాఘ మాసము కృష్ణ పక్ష అమావాస్య శతభిషా నక్షత్ర యుక్త మైనచో అది పితృ దేవతలకు మిక్కిలి ప్రీతి కరమైన కాలము. అట్టి మహా భాగ్యము అల్ప పుణ్యులకు లభింపదు.

కాలే ధనిష్ఠా యది నామ తస్మిన్‌ లభ్యేత విప్రేంద్ర యదా పితృభ్యః,

దత్తం జలాన్నం ప్రదదాతి తృప్తిం వర్షాయుతం తత్కులజై ర్మనుష్యైః.

మాఘమాస కృష్ణ పక్ష అమావాస్య ధనిష్టతో కూడిన వేళ పితృ దేవతల కిడిన జలము, అన్నము ఆ వంశము వారికి పదివేల సంవత్సరములు తృప్తి నొసగును.

తత్రైవ చేద్భాద్రపదాతు పూర్వా కాలే తదా యైః క్రియతే పితృభ్యః,

శ్రాద్ధం పరాం తృప్తి ముపై త్యనేన యుగం సమగ్రం పితరః స్వపంతి.

మాఘ మాస కృష్ణ పక్ష అమావాస్య పూర్వాభాద్ర నక్షత్రముతో కూడిన సమయమున పితృ దేవతలకు శ్రాద్ధము పెట్టినచో పరమ తృప్తి కలుగును. పితృ దేవత లోక నిండు యుగము సుఖముగా నిద్రింతురు.

గంగాం శతద్రూ మథవా విపాశాం సరస్వతీం నైమిషగోమతీం వా,

తతో గవాద్యర్చన మాదరేణ కృత్వా పితౄణా మహితాని హంతి.

గంగ, శతద్రువు, విపాశ, సరస్వతి, నైమిశారణ్యము లోని గోమతి అను నదులలో తీర్తమాడి ఆదరముతో పితృ దేవతల నుద్దేశించి గోపూజ మొదలగునవి చేసినచో పాపము లన్నియు పటా పంచలగును.

గాయంతి చైత త్పితరః కదా తు త్రయోదశీ యుక్తమఘాసు భూయః,

మాఘా సితాంతే శుభతీర్థతోయైర్యాస్యామ తృప్తిం తనయాది దత్తైః.

మాఘమాస కృష్ణ పక్షము తుది దినములలో త్రయోదశిలో కూడిన మఘా నక్షత్రమున్న రోజులలో కొడుకు లిచ్చు పుణ్య నదుల జలములతో తృప్తి పొందుట ఎన్నడో కదా! యని పితృ దేవతలు గొంతెత్తి పలుకు చుందురు.

చిత్తం చ విత్తంచ నృణాం విశుద్ధం శస్తశ్చ కాలః కథితో విధిశ్చ,

పాత్రం యథోక్తం పరమా చ భక్తిర్నృణాం ప్రయచ్ఛ స్త్యభివాంచితాని.

చిత్తము, విత్తము పవిత్రము లైనచో, కాలము ప్రశస్త మయినచో, క్రియ శాస్త్రము ప్రకారము జరిగినచో సరియగు వ్యక్తి దొరికినచో గొప్ప భక్తి సమకూడినచో శ్రాద్ధములు నరులకు కోరిన కోర్కెల నన్నింటిని తీర్చును.

పితృ గీతాం స్తథైవాత్ర శ్లోకాంస్తాం చ్ఛ్రుణు సత్తమ,

శ్రుత్వా తథైవ భవితా భావ్యం తత్ర విధాత్మనా.

ఇచట పితృ దేవతలు పాడిన శ్లోకములు కొన్ని కలవు. ఉత్తమా! వానిని వినుము. విని వానిని చక్కగా భావించి అట్లా చరింపుము.

అపి ధన్యః కులే జాయా దస్మాకం మతిమాన్నరః,

అకుర్వన్‌ విత్తశాఠ్యం యః పిండాన్నో నిర్వపిష్యతి.

ధనము విషయమున కక్కుర్తి పడక మాకు పిండములను పెట్టు పుణ్యాత్ముడు బుద్ధి మంతుడు మా కులమున పుట్టు గాక!

రత్న వస్త్ర మహాయానం సర్వతోయాదికం వసు,

విభవే సతు విప్రేభ్యో అస్మానుద్దిశ్య దాస్యతి.

రత్నములు, వస్త్రములు, గొప్ప వాహనములు, నీరు, ధనము అను వానిని మమ్ముల నుద్దేశించి విద్య పుష్కలముగా గల వారికి విభవము ననుసరించి అతడు ఒసగు గాక!

అన్నేన వా యథాశక్త్యా కాలేస్మిన్‌ భక్తినమ్రధీః,

భోజయిష్యతి విప్రాగ్ర్యాం స్తన్మాత్రవిభవో నరః.

తనకు గలిగి నంతలో శ్రాద్ధ కాలమున భక్తితో నిండిన బుద్ధి కలవాడై తన సంపాదకు లోటు రాని విధమున విప్రవరులకు భోజనము పెట్ట వలయును.

అసమర్థోన్నదానస్య వన్యశాకం స్వశక్తితః,

ప్రదాస్యతి ద్విజాగ్ర్యేభ్యః స్వల్పాం యోవాపి దక్షిణామ్‌.

అన్న దానము చేయ జాలని వాడినచో అడవి కూర నైనను తన శక్తితో సాధించి స్వల్పమగు దక్షిణగా బ్రాహ్మణ ప్రవరులకు ఇచ్చు గాక!

తత్రా ప్యసామర్థ్యయుతః కరై ర్గృహాన్‌ సితాంస్తిలాన్‌,

ప్రణమ్య ద్విజముఖ్యాయ కస్మైచిదపి దాస్యతి.

దానికిని శక్తి చాలనిచో చేతులతో కొన్ని నువ్వులను పట్టుకొని ఒక్క బ్రాహ్మణ శ్రేష్ఠున కైనను ప్రణమిల్లి ఇచ్చుగాక!

తిలైః సప్తాష్టభి ర్వాపి సమవేతాం జలాంజలిమ్‌,

భక్తనమ్రః సముద్దిశ్చ యోస్మాకం సంప్రదాస్యతి.

కనీసము ఏడెనిమిది నువ్వు గింజలతో దోసిలి నిండా నీరు గొని మమ్ము భావించి భక్తి నిండిన హృదయముతో ఇచ్చు గాక.

యతః కుతశ్చిత్సంప్రాప్య గోభ్యో వాపి గవాహ్నికమ్‌,

అభావే ప్రీణయేత్తస్మా ద్భక్త్యాయుక్తః ప్రదాస్యతి.

అదియు దొరకనిచో ఏదో విధముగా ఆవుల నుండి ఒక్క చుక్క పాలైనను సంపాదించి భక్తితో మాకు తర్పణము చేయు గాక!

సర్వాభావే వనం గత్వా కక్షమూల ప్రదర్శకః,

సూర్యాదిలోక పాలానా మిదముచ్చైః పఠిష్యతి.

ఏమియు లేని యెడల అడవి కరిగి చేతులు పైకెత్తి సూర్యుడు మొదలగు లోక పాలుర నుద్దేశించి పెద్దగా ఇట్లు పలుక వలయును.

నమేస్తి విత్తం న ధనం న చాన్యచ్ఛ్రాద్ధస్య యోగ్యం స్వపితౄన్నతోస్మి,

తృప్యన్తు భక్త్యా పితరో మ యైతౌ భుజౌ తతౌ వర్త్మని మారుతస్య.

నాకు సొమ్ములు లేవు, ధనము లేదు, శ్రాద్ధమునకు యోగ్యమైన దేదియు నాకు లేదు. నా పితృ దేవతల కొక్క నమస్కారము చేయు చున్నాను. దీనితో పితరులు తృప్తి పొంద దగును. వాయు మార్గమున నా చేతులు చాపి యుంచితిని.

ఇత్యేవ పితృభి ర్గీతం భావాభావ ప్రయోజనమ్‌,

కృతం తేన భవేచ్ఛ్రాద్ధం య ఏవం కురుతే ద్విజః.

ఉన్న వారిని, లేని వారిని ఉద్దేశించి పితృ దేవతలు పాడిన గీతిని నీకు వినిపించితిని. ఇట్లిట్లు చేసిన మనుజుడు భక్తితో శ్రాద్ధము పెట్టిన వాడగును.